Thursday, April 14, 2016

April 2016 Dalithashakthi Monthly Magazine

April 2016 Dalithashakthi Monthly Magazine


April 2016 సంపాదకీయం

సంపాదకీయం
రోహిత్‌, కన్నయ్య సంఘటనలు దేశ రాజకీయాల్లో పెను సంచలనమైన చర్చలను లేవనెత్తాయి. రోహిత్‌ మరణం స్వాతంత్య్రం వచ్చి 70 సం||లు గడిచినా భారత గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా ఉన్నత విశ్వ విద్యాలయాల్లోనూ కుల వివక్ష అతి భయంకరంగా కొనసాగుతుందనడానికి అదొక బలమైన నిదర్శనం. ఇక కన్నయ్య విషయానికొస్తే దేశ భక్తులెవరు, దేశ ద్రోహులెవరు అనే అంశంపై మొదలై ఈ దేశంలో నిజమైన జాతీయవాదం అంటే ఏమిటి? అనే అంశాలు బలంగా చర్చకు వచ్చాయి. ఈ రెండూ సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోని కులవివక్షపై, భారత జాతీయతాపై చర్చలను లేవనెత్తాయి. ఇలాంటి సంఘనటలను ముందే ఊహించిన భారత రాజ్యాంగ పిత, పీడిత ప్రజల విముక్తి ప్రధాత అయిన డా|| బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ''కులం పునాదుల మీద ఒక జాతిని గానీ, ఒక నీతిని గానీ నిర్మించలేమని'', ''కులం ఉన్నంతకాలం భారతదేశం ఒక జాతిగా ఏర్పడదని కుల నిర్మూలనతోనే భారత్‌ను ఒకజాతిగా నిర్మించవచ్చని'' అభిప్రాయపడ్డారు. కానీ ఈ దేశాన్ని గత 70 సం||లుగా పరిపాలిస్తున్న బ్రాహ్మణ, అగ్రవర్ణ పరిపాలకులు మాత్రం కులం పునాదులమీదనే ఒక జాతిని, ఒక నీతిని నిర్మించవచ్చనే కలలు కంటున్నారు. 
అందుకు ఎవరూ అతీతులు కాదు. వాళ్ళు కేవలం కులవివక్ష గురించే మాట్లాడుతున్నారే తప్పా కులవివక్షకు కారణమైన కుల నిర్మూలన గురించి మాట్లాడడం లేదు. జాతీయ కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం కాంగ్రెస్‌, బీజేపీల లాగానే బ్రాహ్మణుల చేతుల్లో ఉన్న కారణంగా వాళ్ళు కులనిర్మూలనను తమ రాజకీయ ఎజెండాగా ఇంతవరకూ స్వీకరించలేదు. రాష్ట్ర స్థాయిలోనూ ఉన్నత కులాల నాయకత్వం కిందనే కింది కులాలు పనిచేస్తున్న పరిస్థితి కొనసాగుతున్నందువలన ఇవాళ సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక అర్హతను ఈ పార్టీలు కోల్పోయాయి. అందుకే బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 1929లోనే శ్రామికవర్గ పోరాటంలో పాల్గొంటూ భారతీయ కమ్యూనిస్టు పార్టీలు మొదట బ్రాహ్మణులుగాను, తరువాత కమ్యూనిస్టులుగాను వ్యవహరిస్తూ మార్క్సిజాన్ని ఈ దేశ సామాజిక ఆర్ధిక వ్యవస్థకు విరుద్ధంగా అన్వయిస్తూ గుడ్డిగా మార్క్సిజాన్ని అనుకరిస్తూ శ్రామికవర్గాల చేతుల్లో వుండాల్సిన నాయకత్వం అగ్రవర్ణాలు తమ గుప్పిట్లో పెట్టుకుని మార్క్సిస్టు మనువాదులుగా మిగిలిపోయారని ఆయన బాధపడ్డారు. 
వామపక్ష పార్టీల్లోనే సామాజిక న్యాయం కరువైనపుడు బూర్జువా పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలైన ఇతర అగ్రకుల పార్టీల్లో సామాజిక న్యాయం ఎలా సాధ్యమో చెప్పాలి. అంతేకాక ఈ దేశ రాజకీయ ఎజెండాలో కులం ఉన్నంతవరకు బ్రాహ్మణ, అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతూనే వుంటుంది. అంతేగాక ఈ దేశరాజకీయాల్లో 70 ఏళ్ళుగా ఆధిపత్యం చేస్తున్న ఉత్తరాది ప్రాంతం ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజించకుండా కాంగ్రెస్‌, బీజేపీ కమ్యూనిస్టులు అడ్డుపడి దక్షిణాది రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను విభజించి శాశ్వతంగా ఈ దేశ రాజకీయాల్లో ఉత్తరాది ఆధిపత్యం దక్ష్షాణాదిపై ఉండొద్దని 1955లోనే డా||బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఫజల్‌ అలీ కమీషన్‌కు ఒక లేఖ రాస్తూ ఉత్తరాది ప్రాంతాలకు ఏవిధంగానైతే రాజధానిగా వుంటుందో దక్షిణాది ప్రాంతాలకు హైదరాబాద్‌ను రాజధానిగా చేయాలని ఎందుకంటే ఢిల్లీ దక్షిణాది ప్రాంతాలకు చాలా దూరంలో వున్నందున అంతేకాక శత్రుదేశాలకు ఢిల్లీ దగ్గరగా వుండి వాతావరణ సమతుల్యత లేని కారణంగా (అత్యంత వేడి, అత్యంత చలి వున్న కారణంగా) ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలను కలిపే సెంటర్‌ పాయింట్‌గా ఢిల్లీ లేనందున ఈ దేశాన్ని రక్షించుకోవడానికి మరో సురక్షితమైన ప్రాంతము కేవలం హైదరాబాదేనని, హైదరాబాద్‌లో దేశ రక్షణ పరిశోధన కేంద్రాలు, సమతుల్యమైన వాతావరణం వుండడమే కాకుండా ఇక్కడ రాష్ట్రపతి నిలయం ఉన్న కారణంగా ఇక్కడ సువిశాలమైన భవనాలు వున్నందున ఢిల్లీకంటే సురక్షితమైన ప్రాంతం హైదరాబాదేనని అందువల్లనే హైదరాబాద్‌ను దేశ రక్షణ దృష్ట్యా దక్షిణాది ప్రాంతాల కోరికమేరకు హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిని చేయాలని ప్రతిపాదించాడు. 2 కోట్ల జనాభా ఆధారంగా స్థానిక సంపద, భాషా, సంస్కృతి, సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాల విభజన జరగాలని ప్రతిపాదిస్తే ఉత్తరాది ఆధిపత్యాన్ని దేశ రాజకీయాల్లో కొనసాగించడానికి అశాస్త్రీయంగా 80ఎంపీలున్న ఉత్తరప్రదేశ్‌ను ఒక రాష్ట్రంగాను, 2 ఎంపీలున్న గోవాను ఒక రాష్ట్రంగానూ విభిజించిన కారణంగా స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్ళు అవుతున్నా ఇంకా దేశ రాజకీయాల్లో ఉత్తరాధి ఆధిపత్యమే కొనసాగడానికి కారణం రాష్ట్రాల విభజన అశాస్త్రీయంగా జరగడమే. ఆనాడు బ్రిటీష్‌ వాళ్ళ నుండి ఆజాదీ కావాలని కోరుకున్న ఈ ఉత్తరాది నల్లదొరలు అధికారంలోకి వచ్చారు. అవినీతిపై ఆజాదీ కావాలని పోరాటం చేసిన ఉత్తరాది నాయకుడైన కేజ్రీవాల్‌ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. 
బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ తరతరాలుగా పీడితులైన నా జాతిప్రజలు పాలక సమాజంగా మారినపుడు మాత్రమే వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశించారు. అందుకే భారత రాజ్యాంగ రచనలో భావ ప్రకటనా స్వేచ్ఛతో పాటు ఈ దేశ సార్వ భౌమాధికారాన్ని సామ్య వాదాన్ని లౌకికవాదాన్ని సంరక్షించడంతోపాటు ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్ధిక, రాజకీయాధికారం జరగాలని జనాభా దామాషా పద్ధతిలో ప్రతి వర్గానికి సంపదలో వాటా రావాలని ఆశించారు. డా||బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆశయాలు, కింది కులాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని ఆశిస్తున్నాను.
ఈదేశాన్ని 60 ఏండ్లుగా పరిపాలించిన కాంగ్రెస్‌ పార్టీ దుర్మార్గమైన పరిపాలనపై ఒక్కమాట కూడా మాట్లాడకుండా ఆ పార్టీతో అంటగాకిన బ్రాహ్మణ, అగ్రవర్ణ ఆధిపత్య కమ్యూనిస్టు పార్టీల్లోని మనువాదాన్ని ప్రశ్నించ కుండా కేవలం బీజేపీ, హిందూత్వ బ్రాహ్మణులను మాత్రమే నిందిస్తే ప్రయోజనంలేదనేది గ్రహించాలి. ఈ దేశంలో ఉగ్రవాదం, పేదరికం, నిరక్షరాస్యత, అంటరానితనం, కులవివక్ష, సామాజిక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక అసమానతలు పెరగడానికి మొదటి ముద్దాయి కాంగ్రెస్‌ పార్టీ కాగా, రెండవ ముద్దాయి కమ్యూనిస్టు పార్టీలు, మూడో ముద్దాయిగా మతతత్వాన్ని రెచ్చగొడుతూ జాతీయవాదం ముసుగులో హిందూ మతోన్మాదాన్ని అగ్రవర్ణ సంపన్న వర్గాలు కులోన్మాదాన్ని పెంచి పోషిస్తూ అన్నిరంగాల్లో ముఖ్యంగా ఉన్నత విద్యారంగాల్లో తమ కాషాయ ఎజెండాను అమలు చేయాలని చూస్తున్న ఉత్తరాది బ్రాహ్మణాధిపత్య పార్టీ అయిన బిజెపిని అడుగడుగునా అడ్డుకోవాలని, ఈదేశంలో ప్రజాస్వామిక విలువల్ని రాజ్యాంగ రక్షణలను పరిరక్షించే ప్రతి పౌరుడు అంబేడ్కర్‌ స్ఫూర్తితో మరో స్వాతంత్య్ర పోరాటానికి పున:రంకితం కావాల్సిన రోజు బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ పుట్టినరోజు. మార్క్సిస్టులు, అంబేడ్కర్‌ వాదులు, లౌకిక ప్రజాస్వామిక వర్గాలు అంతా ఏకమై నూతన నవ భారతాన్ని నిర్మించాలంటే ముందుగా ఈదేశంలో కుల నిర్మూలన జరగాలి. కులం ఉన్నంతవరకు అన్నిరంగాల్లో బ్రాహ్మణ అగ్రవర్ణ మనువాద ఆధిపత్య సంపన్న వర్గాల నుండి భారత్‌ను విముక్తి చేయాలంటే ముందుగా మనువాదాన్ని అడుగడుగునా ప్రశ్నించాలి.
మీ...
డాక్టర్‌ గాలి వినోద్‌ కుమార్‌

గౌరవ సంపాదకులు

April 2016 విషయ సూచిక

విషయ సూచిక
 సంపాదకీయం
- ప్రొ||గాలి వినోద్కుమార్
-
4
రాజనీతిజ్ఞుడు
- డా||జి.వి.రత్నాకర్
-
6
భీమ్భూమికీ జై
- ప్రొ||కంచ ఐలయ్య
-
12
అంబేడ్కర్బాటే
- డా||వై.బి.సత్యనారాయణ
-
16
సత్కరజ్ఞాని
- జ్వాలిత
-
18
మన భవిష్యత్పై
- కాన్షీరాం
-
21
ధన్యులమయ్యేదేప్పుడు?
-కూకట్లపల్లి పోలయ్య
-
23
హిందూమతం
- డా||బి.ఆర్‌.అంబేడ్కర్
-
25
ఎందుకొచ్చింది?
- కంచుల జయరాజ్
-
27
విప్లవ రథసారధి
- బి.గంగాధర్
-
29
బేబి మినిష్టర్
- జి.విఠల్
-
31
కులము
- డా||గోగు వెంకటేశ్వర్లు
-
34

Dalithashakthi - 2025 - Magazines