Wednesday, September 6, 2023

ప్రజాయుద్ధ నౌక గద్దర్‌

 'నీ పాదం మీద పుట్టమచ్చయ్యి'...'పొడుస్తున్న పొద్దుమీద కాలమై నడిచిన'...

ప్రజాయుద్ధ నౌక గద్దర్‌


గద్దర్‌ పాటలపొద్దు గూకింది. 'అమ్మా తెలంగాణమా' అంటూ చేసిన 'ఆకలి కేకల గానం' అర్ధంతరంగా మూగ బోయింది. దగాపడిన బతుకుల పక్షాన 'మర్లవడ్డ రాగం'.. మరలిరాని లోకాలకేగింది! కష్టజీవుల కన్నీళ్ల విలువ తెలిసి, శ్రామికుల స్వేదం లెక్కగట్టలేమని పసిగట్టి, గోచీగొంగడి కట్టి, కర్రచేతబట్టి, కాలి గజ్జెకట్టి, కైగట్టి పోరుదారిలో నడిచిన పొద్దు అస్తమించింది! 'బండెనక బండిగట్టి' పాటమ్మను పల్లె పల్లెనా ఊరేగించిన ప్రజా యుద్ధనౌక అంతర్ధానమైంది. గుండెల్లో తూటాను దాచుకున్న పాట.. స్వతంత్ర పాలనకై, కుతంత్ర పాలనపై తూటాయై పేలిన పాట.. తెలంగాణ తల్లి 'పాదం మీద పుట్టమచ్చయ్యి', పొడుస్తున్న పొద్దుమీద కాలమై నడిచిన పాట.. మధ్యలోనే ఆగిపోయింది. ఆ పాట పేరు గద్దర్‌. ముందు వెనకా ఏ విశేషణాలూ అక్కర్లేని మూడు అక్షరాల 'చేతన' గద్దర్‌. అసలు పేరు గుమ్మడి విఠల్‌రావు. ఆశువుగా పదాలల్లి, పాటల ఈటెలెత్తి కోట్లమంది గొంతుకై ఊరూరా ఉద్యమాన్ని ఉరకలెత్తించిన తొలితరం ప్రజా గాయకుడు ఇక లేరన్న వార్త అభిమాన లోకాన్ని దుఃఖ సాగరంలోకి నెట్టివేసింది. గద్దర్‌గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠల్‌ రావు విప్లవ కవి. ఈయనకు గద్దర్‌ అను పేరును స్వాతంత్య్రం రాకముందు బ్రిటిష్‌ రాజ్యాన్ని వ్యతిరేకించిన ''గదర్‌ పార్టీ''కు గుర్తుగా తీసుకోవడం జరిగింది.

జీవిత విశేషాలు
గద్దర్‌ మెదక్‌ జిల్లాలోని తూప్రాన్‌ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1948లో దళిత కుటుంబంలో జన్మించాడు.విద్యాభ్యాసం నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌లో, ఇంజనీరింగ్‌ విద్య హైదరాబాద్‌లో జరిగింది. 1969 తెలంగాణ ఉద్యమం లో గద్దర్‌ చురుగ్గా పాల్గొన్నాడు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేసారు. దీనికొరకు ఆయన బుర్రకథను ఎంచుకున్నాడు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్‌ సింగ్‌ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసారు. ఆతర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చే వాడు. 1971లో సినీ దర్శకుడు ప్రోత్సాహంతో 'ఆపర రిక్షా' అనే మొదటి పాట రాశారు. అలా మొదటి ఆల్బంకు గద్దర్‌ అనే పేరు పెట్టారు. ఆ పేరే స్థిరపడి పోయింది. ఆ తర్వాత మద్యపాన నిషేధం, తునికాకు, రైతు కూలి రెట్ల పెంపు, అక్షరాస్యత, కుటుంబ నియంత్రణ, పారిశుద్ధ్యం వంటి సామాజిక అంశాలపై గద్దర్‌ బుర్రకథలు ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు. బుర్రకథ లతోపాటు పాటలు కూడా రాసి, సొంతంగా పాడారు.

1975లో గద్దర్‌ బ్యాంకు రిక్రూట్‌ మెంట్‌ పరీక్షను రాసాడు. అయన కెనరా బ్యాంకులో క్లార్క్‌గా చేరాడు, తర్వాత అతను విమలను వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు, సూర్యుడు, చంద్రుడు (2003లో అనారోగ్యంతో మరణించారు), వెన్నెల. 1984లో ఆయన క్లర్కు ఉద్యోగానికి రాజీనామా చేసాడు. 1985లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడాడు. జన నాట్య మండలిలో చేరాడు. ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్ళాడు. గద్దర్‌ పాట పాడితే మారుమూల పల్లెల్లో వినిపిస్తుంది.

పాటలతోనే ప్రత్యేక గుర్తింపు...
నిజాం పాలనకు వ్యతిరేకంగా వచ్చిన మా భూమి సినిమాలో గద్దర్‌ సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించారు. 'బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి.. ఏ బండ్లే పోతవు కొడుకో నైజాము సర్కరోడా' అనే పాటను గద్దర్‌ స్వయంగా పాడి గజ్జె కట్టి ఆడారు. ఈ పాట తెలుగు జాతిని కదిలించడంతోపాటు గద్దర్‌కు విశేష గుర్తింపు తెచ్చింది. 1971లో సినీ దర్శకుడు ప్రోత్సాహంలో 'ఆపర రిక్షా' అనే మొదటి పాట రాశారు. అలా మొదటి ఆల్బంకు గద్దర్‌ అనే పేరు పెట్టారు. ఆ పేరే స్థిరపడి పోయింది. 'సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో.. లచ్చుమమ్మో..' అని దళితుల దైన్యాన్నిపాటలో వివరించారు గద్దర్‌. తన పాటలను తన బందంతో కలిసి క్యాసెట్లు, ఆల్బమ్స్‌, సీడీలుగా చేసి ప్రజలను చైతన్యం చేశారు. గద్దర్‌ గళం వినిపించిందంటే వేలాదిగా క్యాసెట్లు, సీడీలు అమ్ముడు పోయేవి. 1980 దశకంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా గద్దర్‌ పాటలే వినిపించేవంటే అతిశయోక్తి కాదు.

ఉద్యోగం వదిలి.. విప్లవం వైపు కదిలి
1984లో ఆయన క్లర్కు ఉద్యోగానికి రాజీనామా చేసాడు. 1985లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడాడు. జన నాట్య మండలిలో చేరాడు. ప్రజలపై జరుగుతున్న అకత్యాలను, అణచివేతలను ఎదుర్కొనేందుకు నక్సలైట్‌ ఉద్యమం పుట్టిందని భావించే వారు గద్దర్‌. నక్సలైట్ల ఉద్యమానికి సానుకూలంగా పాటలు పాడేవారు. 'మల్లె తీగకు పందిరి వోలె..' అంటూ సాగే ఒరేరు రిక్షా సినిమాలోని పాటకు గద్దర్‌కు రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు ప్రకటించగా గద్దర్‌ తిరస్కరించారు. గద్దర్‌ రాసిన అనేక పాటలు సినిమాల ద్వారా ప్రజలను చైతన్యం చేశాయి. ప్రత్యేకించి ఆర్‌.నారాయణ మూర్తి నిర్మించే విప్లవ నేపథ్యంలో సాగే అనేక సినిమాలకు గద్దర్‌ పాటలు రాశారు.
కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి అనేక సామాజిక విషయాల గురించి ఆయన బుర్రకథ లను తయారు చేసుకొని ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించేవాడు. ఆ తర్వాత అతను అనేక పాటలు రాసాడు. 1972లో పల్లెల్లో జరుగు తున్న ఆకత్యాలను ఎదురించేందుకు, దళితులను మేల్కొలిపేందుకు, వారిని చైతన్య పరిచేందుకు అనేక పాటలు రాసి పాడారు గద్దర్‌.
2011లో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కిన జై బోలో తెలంగాణ చిత్రంలో గద్దర్‌ రాసిన 'పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగానమా' అనే పాట ఉద్యమంలో మరింత ఊపు నిచ్చింది. అదే సినిమాలో వెండితెరపై తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూత లూగించారు. 2019లో ఓ సినిమాకు పాట రాయడంతోపాటు చివరగా ఉక్కు సత్యాగ్రహం చిత్రంలో నటించారు.

సినిమారంగం
మాభూమి సినిమాలోని బండెనక బండి కట్టి అనే పాటను పాడడంతోపాటు పాటలో నటించాడు. ఆయన రాసిన పాటల్లో ''అమ్మ తెలంగాణమా'' అనే పాట బహుల ప్రజాదరణ పొందింది. తెలంగాణా లోని అన్ని అంశాలను స్పశిస్తూ సాగింది ఈ పాట. ఆయన రాసిన ''నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ'' అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు వచ్చింది అయితే ఆయన ఆ అవార్డును తిరస్కరించారు. ఆయన మరోసారి జై బోలో తెలంగాణా సినిమాలో తెరపైన కనిపించాడు. 'పొడుస్తున్న పొద్దూ' మీద పాట ఆయనే రాసి పాడి, అభినయించారు. ఈ పాట అద్భుత విజయం సాధించింది. ఈ పాటకు నంది అవార్డు సైతం వచ్చింది. అలాగే ఆయన రాసి పాడిన 'అమ్మా తెలంగాణ ఆకలికేకల గానమా' పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా రాష్ట్ర సర్కార్‌ ఎంపిక చేసింది. 2016 లో దండకారణ్యం మూవీ, 2022లో విడుదలైన మెగాస్టార్‌ చిరంజీవి సినిమా 'గాడ్‌ ఫాదర్‌'లో గద్దర్‌ కీలక పాత్రలో కనిపించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నేపథ్యంలో తీసిన ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాలో గద్దర్‌ కీలకపాత్ర పోషించారు. ఇదే గద్దర్‌ నటించిన చివరి సినిమా. 1995లో నంది ఉత్తమ గీత రచయితగా ఒరేరు రిక్షా సినిమాలోని ''మల్లెతీగకు పందిరి వోలె'' పాట రచన... కానీ ఆయన అవార్డును తిరస్కరించాడు. 2011లో నంది ఉత్తమ నేపథ్య గాయకులు (జై బోలో తెలంగాణ సినిమాలోని ''పొడుస్తున్న పొద్దు మీద'' పాట) ఈశ్వరీబాయి మెమోరియల్‌ సెంచరీ అవార్డు.

మాభూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించి యాదగిరి పాడిన బండెనక బండి కట్టి అనే పాటను ఆయనే పాడి, ఆడాడు. ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్ళాడు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒడిషా, బీహార్‌ రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. కింద గోచి ధోతి, పైన గొంగళి ధరించేవాడు. ఆయన పాడే పాటలకు ప్రజల్లో చైతన్యం కలిగిస్తుంటాయి. దళిత పేదలు అనుభవిస్తున్న కష్ట, నష్టాలను ఆయన, ఆయన బందం కళ్ళకు కట్టినట్టుగా పాటలు, నాటకాల రూపంలో తెలియ జెప్పేవారు. ఆయన పాటలు వందలు, వేల కాసెట్‌లుగా, సిడిలుగా రికార్డ్‌ అయ్యి అత్యధికంగా అమ్ముడు పోయాయి. 2010లో కలకత్తాలో జరిగిన ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌కు వ్యతిరేకంగా జరిగిన కార్యక్రమంలో గద్దర్‌ ప్రదర్శన మర్రి చెన్నారెడ్డి రెండవసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సలైట్స్‌పై ఆయన ఉదారంగా వ్యవహరించాడు, వారిపై నిషేధం ఎత్తి వేయబడింది. 1990 ఫిబ్రవరి 18న జన నాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్‌ హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భారి భహిరంగ సభకు 2 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు.

గద్దర్‌పై కాల్పులు.. శరీరంలోకి ఆరు బుల్లెట్లు..
1997 ఏప్రిల్‌ 6న ఇంట్లో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గద్దర్‌పై కాల్పులు జరిపారు. ఆయన శరీరంలోకి ఆరు బుల్లెట్లు దిగాయి. వైద్యులు ఆపరేషన్‌ చేసి తూటాలు తొలగించినా, వెన్నుపూస భాగంలో ఒక్క బుల్లెట్‌ మాత్రం అలాగే ఉన్నది. అది తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు చెప్పారు. తుదిశ్వాస విడిచే వరకు ఆయన దేహంలోనే ఆ బుల్లెట్‌ ఉండి పోయింది. తనపై జరిగిన హత్యా యత్నాన్ని వర్ణిస్తూ 'మీ పాటనై వస్తున్నానమ్మో..' అంటూ పాటకు మరణం లేదని, పోరాటమే పాట లక్ష్యమని గద్దర్‌ వర్ణించారు. విప్లవ రచయితల సంఘం ద్వారా ప్రజలను చైతన్య పరిచారు. 2002లో ప్రభుత్వంతో చర్చల సమయంలో నక్సలైట్స్‌ గద్దర్‌, వరవరరావులను తమ దూతలుగా పంపారు. నకిలీ ఎన్‌కౌంటర్‌లను ఆయన తీవ్రంగా నిరసించాడు.

తెలంగాణ ఉద్యమంలో
తెలంగాణ ఉద్యమం పునరుద్ధరించడంతో, గద్దర్‌ మరోసారి వెనుకబడిన కులాలు, నిమ్న కులాల ఉద్ధరణ ఉద్దేశంతో ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం తన మద్దతును తెలపటానికి ప్రారంభించాడు. బలమైన కమ్యూనిస్ట్‌ భావజాలం ఉన్నప్పటికీ, అతను ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని వ్యతిరేకించే భారతదేశంలోని కొన్ని కమ్యూనిస్ట్‌ పార్టీలతో తన భావాలను పంచుకోలేదు.గద్దర్‌ మొదటి నుండి తెలంగాణా వాదే. దేవేందర్‌గౌడ్‌ నవ తెలంగాణా పార్టీ పెట్టినప్పుడు ఆయనకు కూడా మద్దతు తెలిపారు గద్దర్‌. గద్దర్‌పై దాడి జరిగినప్పుడు హౌం మినిస్టర్‌ దేవేందర్‌ గౌడ్‌. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణా ప్రజా ఫ్రంట్‌ను స్థాపించాడు.

గుండెపోటు కారణంగా 2023 జూలై 20న హైదరాబాద్‌, అమీర్‌పేట్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన గద్దర్‌కు ఆగస్టు 3న వైద్యులు బైపాస్‌ సర్జరీ చేశారు. తరువాత ఆసుపత్రిలోనే చికిత్స పొందిన గద్దర్‌ ఊపిరితిత్తులు, యూరినరీ సమస్యలతో 2023, ఆగస్టు 6న మధ్యాహ్నం 3 గంటలకు మరణించాడు. గద్దర్‌ మతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతోపాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆగస్టు 6 సాయంత్రం నుండి ఆగస్టు 7 మధ్యాహ్నం వరకు ప్రజల సందర్శనార్థం గద్దర్‌ భౌతికకాయాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచబడింది. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, కవులు, కళాకారులు, వేలాదిగా అభిమానులు గద్దర్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఎల్బీ స్టేడియం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర గన్‌పార్కు నుంచి బషీర్‌బాగ్‌, లిబర్టీ, జేబీఎస్‌ మీదుగా 6 గంటలపాటు 17 కిలోమీటర్ల దూరమున్న అల్వాల్‌లోని గద్దర్‌ నివాసం వరకు కొనసాగింది. అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు గద్దర్‌ భౌతికకాయానికి నివాళ్ళు అర్పించారు. గద్దర్‌ స్థాపించిన మహాబోధి పాఠశాల ఆవరణలో అధికార లాంఛనాలతో గద్దర్‌ అంత్యక్రియలు జరిగాయి.

- బి.గంగాధర్‌
ఎడిటర్‌ & పబ్లిషర్‌,
దళితశక్తి తెలుగు మాసపత్రిక

Dalithashakthi - 2025 - Magazines