అంబేద్కర్ రాజకీయ సిద్ధాంతం ఆచరణయోగ్యం
- ఎస్‌ఆర్ శంకరన్, కాన్షీరాం, బొజ్జా తారకం సంస్మరణ సభలో వక్తలు
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయ సిద్ధాంతాన్ని ఆచరించడం ద్వారానే దేశంలో బహుజనులకు రాజ్యాధికారం వస్తుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. దళిత శక్తి, మామా సమైక్య సమితి, నవ భారత్ నిర్మాణ్ ట్రస్టుల ఆధ్వర్యంలో సంయుక్తంగా హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం టీపీఎస్‌కే హాల్లో శుక్రవారం ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ అధ్యక్షతన కాన్షీరాం, ఎస్‌ఆర్ శంకరన్, బొజ్జా తారకం సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు మాట్లాడుతూ.. ఎందరో మహానుభావులు పేదల అభ్యున్నతికి ఎస్‌ఆర్ శంకరన్, కాన్షీరాంలు తమ వైవాహిక జీవితాలను కూడా త్యాగం చేశారని గుర్తుచేశారు. అధికారం చేజిక్కించుకోవాలంటే రాజకీయంగా సంఖ్యాబలాన్ని పెంచుకోవాలన్నారు. జెబి రాజు మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజకీయ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టిన మహానుభావుడు కాన్షీరాం అని, ఇటు మార్క్సిజం, అటు అంబేద్కరిజాన్ని జోడించాల్సిన అవసరాన్ని బొజ్జా తారకం నొక్కి చెప్పారని గుర్తుచేశారు. ఎస్సీ విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలను తీసుకొచ్చారన్నారు. వైసీపీ ఎస్సీసెల్ అధ్యక్షులు నల్లా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ.. రోహిత్ వేముల కేసులో కేంద్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా మంత్రులకు, వీసీ అప్పారావుకు అండదండలు అందిస్తూ క్లీన్‌చీట్ ఇచ్చిందన్నారు. ప్రొఫెసర్ వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. ఈ శతాబ్దంలో అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు. కాన్షీరాం స్ఫూర్తితో దళితులు పోరాటాలను నిర్వహించాలని సూచించారు. 2018లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి బహుజన రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తానని ప్రకటించారు. మామా సమైక్య సమితి రాష్ట్ర అధ్యక్షులు మేడే శాంతికుమార్ మాట్లాడుతూ.. అణచివేతకు గురవుతున్న మాల, మాదిగలు ఐక్యత దిశగా పయనించాలన్నారు.
గోసంరక్షణ పేరుతో బీజేపీ దళితులపై దాడులు చేస్తోందని ఆలిండియా దళిత హక్కుల ఫోరం అధ్యక్షులు ఆనంద రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ రత్నాకర్, మామా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్, దళిత శక్తి ఎడిటర్ గంగాధర్, న్యాయవాది సాయిలు తదితరు లు ప్రసంగించారు. సభ ప్రారంభానికి ముందుగా కాన్షీరాం, ఎస్‌ఆర్ శంకర న్, బొజ్జా తారకంల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

No comments:
Post a Comment