డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తితో చైతన్యవంతమవుతన్న దళిత, బహుజనులకు మనుధర్మ మరణశాసనం ద్వారా దళిత, బడుగు, బలహీన వర్గాలను మరింత అంధకారంలోకి తీసుకువెళ్ళుతున్నది. రాజ్యం మనుధర్మాన్ని అవలభించడం ద్వారా ప్రగతి పథంలో ప్రయాణించాల్సిన ఆధునిక భారతం ఆగధంలోకి వెళ్ళుతున్నా, పాలకుల పైశాచిక ఆనందం ముందు రాజ్యాంగ విలువలు మంట కలిసిపోతున్నాయి. రాజ్యాంగ సభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మాట్లడుతూ ''రాజ్యాంగ ఎంత మంచిగా ఉన్న అమలు చేసేవారు బాగా లేకపోతే, అది చేడుగానే కనిపిస్తుందని'' చెప్పిన మాటలు ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది.
సామాజికార్థిక కారణాలతో విభజితమవుతున్న సమాజాలను మతతత్వానికి లోనుకావడం సులువు. ఒకరి ప్రయోజనాలను ఒకరికి ప్రతికూలమైనవని చెప్పి ద్వేషాలను రెచ్చగొట్టడం కులతత్వ, మతతత్వశక్తులకు సులభమవుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కారంచేడు, చుండూరువంటి సంఘటనలు తెలంగాణలో లేవని ఘనంగా చెప్పుకునేవారు. కానీ స్వయం పాలిత తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిస్థితికి భిన్నంగా లేదని, మంథని మధుకర్ హత్య, ఈ మధ్య కాలంలో పెరిగిపోయిన పరువుహత్యలు గ్రామీణ వైరుధ్యాలకు సూచికలు. స్థావరాలు మార్చుకుని అహంకరి స్తున్న భూస్వామ్య విధానానికి గుర్తులుగా మిగిలిపోతున్నాయి. సామాజిక ఉద్యమాల ద్వారానే, అభివద్ధిని కోరే వర్గాల పోరాటాలకు సామాజిక కోణాన్ని జోడించడం ద్వారానే పరిష్కారం అయ్యే జాడ్యాలు ఇవి. ఇటువంటి అమానవీయమైన హత్యలు కడుపులో ఉడుకుతున్న నిప్పును చూడడానికి నిరాకరించినట్టే అవుతుంది.
దళిత, బహుజనులకు సామాజికంగా, ఆర్థికంగా కొన్ని రాయితీలు కల్పించడం ద్వారా సంతృప్తి పొందుతున్నారు. కానీ అంతిమ లక్ష్యం 'రాజ్యాధికారం' చేజిక్కించుకునేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. అందుకు ఉద్యమాల నాయకులు చొరవ, ప్రయత్న లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. కార్మికులను ఐక్యం చేసిన మేడే స్ఫూర్తితో సామాజిక శక్తులు ఐక్యమై రాజ్యాధికార సాధకకు ముందుకు కదలని ఆకాంక్షిస్తూ....
