Sunday, May 14, 2017

మనుస్మృతికి బలైన మంథని మధుకర్‌ - Dalithashakthi Monthly Magazine



అదొక మారుమూల గ్రామం, కరీంనగర్‌ జిల్లాకి కూడా దూరమే, ఇప్పుడు పెద్దపల్లి జిల్లా, ఖానాపూర్‌ . దళిత యువకుడు మంథని మధుకర్‌ చేసిన ఒకే ఒక్క నేరం దగ్గరలో ఉన్న వెంకటాపురం గ్రామానికి చెందిన ఒక మున్నూరుకాపు యువతిని ప్రేమించడం. ఆ యువతీ ఎమ్మెల్యే పుట్ట మధు బంధువు కావడం ఒక మనువాద సంస్కతికి, శిక్షకి చిహ్నంగా మధుకర్‌ శరీరం అందరిని గాయ పరిచింది. పాపం మధుకర్‌ ఎన్ని చిత్ర హింసలు పడ్డాడో? ఇక్కడ ఒక చట్టం ఉంటుంది అది ఎప్పటికి దళితుల దరి చేరదు, ఇక్కడ ప్రభుత్వం ఉంటుంది దళిత వ్యతిరేకం , ఇక్కడ పోలీసులు ఉంటారు ఎప్పుడు దళితులని చంపడంలో ముందే, ఇక్కడ మీడియా ఉంటుంది అది డబ్బుకి అమ్ముడు పోతుంది, ప్రజల గొంతుక స్థితి ఎన్నడో దాటిపోయింది. మానవ హక్కుల వాదులు కులం అనే సరికి గొంతులో వెలక్కాయ పడుతుంది. ఇంకా మిగిలిన వాళ్ళు వాళ్ళ కాస్ట్‌ని బట్టి వద్దామా? వద్దా? అని ఆలోచిస్తారు. ఏమైంది ఇప్పుడు, అమ్మాయి ద్వారా శవం దొరికింది, పోలీసులు ఎవరిని అరెస్ట్‌ చేయలేదు, కొన్ని దళిత సంఘాలు ధర్నాలు చేయడంతో వార్త సామాజిక మాధ్యమంలో వచ్చింది. అదే అందరిని కదిలించింది. వందలాదిగా తరలి వచ్చిన ప్రజలు, మానవ , పౌర హక్కుల కార్యకర్తలు , స్టూడెంట్స్‌ , లాయర్లు, పార్టీలు , ఒక్కటేమిటి ప్రపంచం అంతా అక్కడ కనిపించింది. కొందరు ప్రగతిశీలురులు, తాము ఉన్న చోటు కదలకుండా ధర్నాలతోని న్యాయం జరగదని రాస్తున్నారు. శిక్షించడమే ఆయుధం అంటున్నారు కానీ యుద్ధ భూమిలో దిగితే కదా లోతు తెలిసేది . కారంచేడులో తుపాకీతో మార్పులు కనిపించిన ఉధతమైన ప్రజా ఉద్యమం దేశ వ్యాప్తంగా కదిలించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తెచ్చేటట్టు చేసిందని మరవొద్దు. అంటరాని ఉద్యమాలలో ప్రతి ఒక్క చర్య ముఖ్యమే, చిన్న రాత కావొచ్చు, పెద్ద ఎత్తున జన సమీకరణ కావొచ్చు అన్ని బలాన్ని ఇచ్చేవే కానీ బలహీన పరిచేవి కావు. అయినా ప్రభుత్వం అంగాలన్నీ కులవ్యతిరేకం అయినప్పుడు మనం చేసేది ఉదతమైన ఉద్యమమే.

No comments:

Post a Comment

Dalithashakthi - 2025 - Magazines