సిబిఐ కోర్టు బాబా గుర్మీత్ రాం రహీం ఇన్సాన్ కేసులో ఇచ్చిన తీర్పు, రేపు పై కోర్టులోనో, లేదా సుప్రీం కోర్టులోనో కొట్టుడు పోదనే హామీ ఏమీ లేదు. మరోవైపు, బ్రాహ్మణులైన మఠాధిపతులు, స్వామీజీలు చేసిన నేరాల మీద ఎలాంటి పురోగతి లేదు. ఆశారంబాపు లాంటి వాళ్ల చేతిలో అన్యాయానికి గురైన బాధితులంతా యింకా కోర్టు చుట్టూ తిరుగుతూనే వున్నారు.
- డా. జిలుకర శ్రీనివాస్
సిబిఐ తీర్పుతో బాబా గుర్మీత్ రాంరహీం ఇన్సాన్‌కు ఇరవైయేళ్ల జైలు శిక్ష పడింది. ఆయన మీద వచ్చిన ఆరోపణలన్నీ రుజువయ్యాయని సిబిఐ కోర్టు నిర్దారించింది. బాబాలంతా కలిసి గుర్మీత్ లాంటి వాళ్లను ఉపేక్షించరాదని ప్రకటన కూడా చేశారు. గుర్మీత్ బాధితులంతా కోర్టు తీర్పుతో ఆనందించినట్టు మీడియా తెలిపింది. అయితే, గతేడాది ఇలాంటి ఆరోపణలతో అరెస్టయిన బాబా రామ్ పాల్‌ను సరైన సాక్ష్యాల్లేవని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. బాబా రాంపాల్‌ను అరెస్టు చేసే సమయంలో కూడా అనుచరుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన వచ్చింది. ఆయన సత్సంగ్ నిర్వహించే వేదిక కింద ఏకే47 లాంటి తుపాకులు, మందుగుండు సామ్రాగ్రి లభించాయని పోలీసులు ఆ రోజు చెప్పినవీ, మీడియా ప్రచారం చేసిందీ అంతా అబద్ధమని తేలిపోయింది.
సిబిఐ కోర్టు బాబా గుర్మీత్ రాం రహీం ఇన్సాన్ కేసులో ఇచ్చిన తీర్పు, రేపు పై కోర్టులోనో, లేదా సుప్రీం కోర్టులోనో కొట్టుడు పోదనే హామీ ఏమీ లేదు. మరోవైపు, బ్రాహ్మణులైన మఠాధిపతులు, స్వామీజీలు చేసిన నేరాల మీద ఎలాంటి పురోగతి లేదు. ఆశారామ్ బాపులాంటి వాళ్ల చేతిలో అన్యాయానికి గురైన బాధితులంతా యింకా కోర్టు చుట్టూ తిరుగుతూనేవున్నారు. బాబా రాందేవ్ ఆయుర్వేద ఉత్పత్తుల కోసం హరిద్వార్‌లో వేలాది ఎకరాల భూమిని రైతుల నుంచి గుంజుకున్నారనీ, మా భూమి మాక్కావాలని ఆందోళన చేసిన రైతుల మీద కాల్పులు జరిపితే చనిపోయిన రైతుల వివరాలు కూడా మీడియాలో రాలేదని విమర్శకులంటూంటారు. వెబ్‌సెట్ వార్తల్లో తప్ప ఎక్కడా ఆ దారుణం కనిపించ లేదు. కానీ, సంఘటన జరిగింది నిజం. అయినా, బాబా రాందేవ్ మీద కేసులు నమోదు కాలేదు. ఒక్క అరెస్టు కూడా జరగలేదు. అంతెందుకు, సత్యసాయి బాబా ఆశ్రమంలో ఇరవై యేళ్లకిందట కాల్పులు జరిగాయి. అవి సత్యసాయి చేయించిన హత్యలని అందరూ అన్నారు. కానీ, హతులెవ్వరో, హంతకులెవ్వరో రుజువు కాలేదు. హత్యలు జరిగిన తర్వాత కూడా దేశ ప్రధానులు, రాష్ట్రపతులు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు సత్యసాయిని దర్శించుకొని, దీవెనెలు తీసుకున్నారు. బాబా గుర్మీత్ రాంరహీం ఉదంతం నేపథ్యంలో కొన్ని విషయాలు మనం కచ్చితంగా చర్చించుకోవాలె. అఖాలీ తక్త్ అనేది సవర్ణ సిక్కుల సంస్థ. అది హింసాత్మక పద్ధతుల ద్వారా పంజాబు, హర్యానా, ఢిల్లీ, యుపి, రాజస్థాన్ జనాభాలో పెద్ద సంఖ్యలో వున్న చమార్ సిక్కులను అణచి వేయాలని చూస్తుంది. ఆ క్రమంలోనే గురు రవిదాస్ ధార్మిక ఉద్యమాన్ని ప్రపంచ స్థాయిలో నడిపిన గురు రామ్‌నాథ్‌జీని కెనడాలో కాల్చి చంపిన నేరస్తులు ఈ సంస్థకు చెందిన వాళ్లే అని అనుమానం. ఆ హత్యాకాండ ను నిరసిస్తూ చమార్ జాతి నెలరోజుల పాటు ప్రతిహింసకు దిగింది.
అఖాళీ తక్త్ నేతలు చమార్, ఇతర దళిత జాతులు ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఎదగ డాన్ని సహించరనే వాదనను నిరూపించే ఎన్నో ఉదంతాలున్నాయి. గురు రవి దాసు ప్రేరణతో పంజాబు, హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఎంతో మంది ఆధ్యాత్మికవేత్తలు గా, సత్సంగ్ నిర్వాహకులుగా, బాబాలుగా ఎదిగారు. ప్రత్యామ్నాయ ఆధ్యాత్మిక మార్గాన్నీ, సాంస్కృతిక రంగాలను నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కృషిని అభినందించలేని సవర్ణ ఆధిపత్యవాదులు మీడియా సహకారం, పోలీసుల అండ దండలతో అనేక కేసులు పెట్టిస్తున్నారు. అలాంటి ప్రయత్నమే గుర్మీత్ రాం రహీం సంఘటన కూడా.
గుర్మీత్ రాం రహీం ఎక్కడా తాను దైవదూతను అని గానీ, నేనే దేవున్నీ అని గానీ చెప్పుకోలేదు. కానీ, అలా చెప్పు కున్నాడని మీడియా ద్వారా బాగా ప్రచారం చేస్తున్నారు. గురు గోవింద్ సింగ్ లాగా వస్త్రధారణ చేసినందుకు సహించలేక డేరా సచ్చా సౌదా ఆధ్యాత్మిక గురువైన రాం రహీం మీద హత్యా ప్రయత్నం చేశారు. బాంబులు అమర్చి పేల్చేస్తే తప్పించు కున్నాడు. ఎన్ని కుట్రలు చేసినా వాటిని సమర్థంగా ఎదుర్కొన్నాడు. రోజు రోజుకీ తన ప్రభావం పెరిగి పోతుందని గ్రహించిన సవర్ణ దురహంకారులు అత్యాచార ఆరోపణలు చేయించారని ఒక వాదన. వాజ్‌పేయి పాలనలో మొదలైన ఈ కేసులు మోదీ కాలంలో శిక్ష ప్రకటించే దాకా పోయాయి.
దళిత, గిరిజన, బిసీ, మైనార్టీ ఆధ్యాత్మికవేత్తలను, రాజకీయ నాయకులను, లేదా ఉద్యమ నాయకులను అణచి వేయడానికి అగ్రకులాలు అమలు చేసే ఆయుధాలు రెండు. ఒకటి, అవినీతిపరుడు, అక్రమ సంపాదనా పరుడనే ఆరోపణలు. రెండు, రేపిస్టు, స్త్రీలోలుడు, వేశ్యాపరుడు, చివరికి అమ్మాయిలకు ప్రేమ అనే వల విసిరి మోసం చేసే మోసగాడనే ఆరోపణలు. వీటిని చాలా సులువుగా ప్రజలు నమ్మేలా కథనాలుంటాయి. అవి ఎంతగా మెప్పిస్తాయంటే, ప్రజాస్వామికవాదులు, ఉదార స్వభావులు, స్త్రీవాదులు, ప్రగతిశీలవాదులని అనుకునేవాళ్లను కూడా విచక్షణను కోల్పోయేలా చేసేలా వుంటాయి.
మొన్నటికి మొన్న భీమ్ ఆర్మీ నేత చంద్రశేఖర్ ఆజాద్‌ను అన్యాయంగా అరెస్టు చేశారు. మిలటరీవాళ్లు తప్ప ఆర్మీ అనే పేరు సంఘానికి వాడుకోరాదట. సేన అనే పదం సంఘానికి పెట్టుకోవటం నేరమట. మరి, శివసేన, మహారాష్ట్ర నవనిర్మాన్ సేన లాంటి పార్టీల సంగతేంటని అడిగితే అది కూడా నేరమట. చంద్రశేఖర్ ఆజాద్ మీద ఆరోపణలను నిరూపించలేక, అతని మీద నైతికపరమైన ఆరోపణలు ప్రచారం చేశారు. అతనికి ఇద్దరు ప్రియురాళ్లున్నారని ప్రచారం చేశారు. ఒక్క అమ్మాయి తోనైనా నేను అతని గర్ల్‌ఫ్రెండ్‌ను అని చెప్పించలేక పోయారు. తిరుమావళ్లువన్‌ను ఎదుర్కోలేక ఎవరో ఒక అమ్మాయితో నన్ను మోసం చేశాడని డ్రామాలు వేయించారు. ఇవేవీ పని చేయక పోతే, రోహిత్ వేముల మీద తీవ్రవాదనే ముద్ర వేసి హత్య చేశారు. కన్నయ్య కుమార్ లాంటివాడి మీద దేశానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చాడనే నేరం మోపారు.
పంజాబ్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్ దళితులు యింకా ఏమాత్రం సహించే స్థితిలో లేరు. ఆరెస్సెస్, బిజెపీ కుట్రలను వాళ్లు తిప్పి కొట్టాలనుకుంటున్నారు. రాజకీయ అవసరాల కోసం చేసే కుట్రలకు కాలం తప్పక జవాబిస్తుంది. సవర్ణ ఆధిపత్య రాజకీయలు, ఆధ్యాత్మికవాదం తప్పకుండా తగిన మూల్యం చెల్లించాల్సి వుంటుంది.


