Monday, April 1, 2024

ప్రజల ఆక్రందన - April 2024

 


సామాన్యుల పొట్టనిండితే ఎంత? నిండకపోతే ఎంత? భజనలు చేసుకుంటే మానసిక ప్రశాంతత వస్తుందంటూ మోడీ మందిరాలు ప్రారంభిస్తూ, ప్రవచనాలు వల్లిస్తూ, కాలయాపన చేస్తున్నారేతప్ప ప్రజల బాధలను ముఖ్యంగా అన్నదాతల ఆక్రందనలను చల్లార్చే తరుణోపాయాలను అన్వేషించడం లేదు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంది. ఉద్యోగ నియమాకాల విధానాన్ని పూర్తిగా మార్చివేశారు. అదేవిధంగా దేశంలో నిరుపేదలు అత్యంత నిరుపేదలుగానే, పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదులుగా తయారు అవుతున్నారు. ''చిత్తశుద్ధిలేని శివపూజలేలా..'' అన్నట్టు సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచనే లేకుండా చర్చలు జరిపే మొక్కుబడి కార్యక్రమంగా అది మారిపోతే ఫలితం శూన్యమే కదా.

దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. మూడవసారి అధికారం కోసం మోదీ నేతృత్వంలో బిజెపి ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ 'ఇండియా' కూటమి పేరుతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. ఈ ఎన్నికలల్లో గెలవడానికి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. మూడవసారి అధికారం కోసం బిజెపి వివిధ రాజకీయ పార్టీలను తన దారి తెంచుకోవడానికి సిబిఐ, ఈడి లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా అధికార దుర్వినియోగం చేస్తున్నట్లు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములు దేశ భవిష్యత్‌ను మారుస్తాయా? సామాన్య ప్రజలకు న్యాయం దక్కుందా? మనం వేచి చూడాల్సిందే...

జూలియన్‌ అసాంజే, ఎడ్వార్డ్‌ స్నోడెన్‌ వంటి సామాజ్య్రవాద దాష్టీకానికి బలౌతున్న స్థితి నేడు మనం చూస్తున్నాం. అయినా గన్నులకు పెన్నులు వణకవని, వెనక్కి తగ్గవని రుజువవుతూనే ఉంది. రుజువు చేయడమే జర్నలిస్టు కర్తవ్యం. కర్తవ్య నిర్వహాణలో కలంవీరులపై జరిగిన/జరుగుతున్న భౌతిక దాడుల వెనుక అధికారం ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే, అయినా అధికార పక్షంలో ఉన్నప్పుడు దాడులు, అధికారం చేజారిన వెంబటే సానుభూతి ప్రయత్నాలు చేయడం దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితే, కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కొనసాగుతున్నది. 'యుద్ధ రంగంలో నిలబడి/ కవిత్వం రాయడం గొప్ప ఆనందా న్నిస్తుంది' అంటాడో కవి. నిరంకుశత్వం పెరిగేకొద్దీ జర్నలిస్టు కలం, కెమెరా కూడా తన వాడి పెంచుతుందే తప్ప వెనక్కి తగ్గదు.

సర్వోన్నత న్యాయస్థాన వజ్రోత్సవాల్లో ప్రధాని మోదీ చెప్పినట్లు సులభతర న్యాయం దేశప్రజల హక్కు. వాస్తవంలో దానికి సరైన మన్నన దక్కుతోందా అంటే, లేదన్నదే కొన్నేళ్లుగా జవాబు. సుప్రీంకోర్టులోనే పెండింగ్‌ కేసుల సంఖ్య 80వేలకు పైబడి ఉన్నావు. దేశవ్యాప్తంగా 25 హైకోర్టుల్లో దాదాపు 50 లక్షలు, జిల్లా, తాలూకా కోర్టుల్లోనైతే సుమారు 4.3కోట్లకు చేరింది. గత రెండున్నర దశాబ్దాల తరువాత పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. మధ్యవర్తిత్వ చట్టం, భవిష్యత్తులో చేపట్టనున్న ఇంకొన్ని చర్యల ద్వారా కోర్టులపై పనిభారం తగ్గుతుందని ప్రధానమంత్రి ఆశాభావం వెలి బుచ్చుతున్నా- దేశ వ్యాప్తంగా అసంఖ్యాక కక్షిదారులు నిస్సహాయంగా కుమిలిపోతున్నారు. దిగువస్థాయి న్యాయస్థానాల్లోనే 30 ఏళ్లకు పైబడి మోక్షానికి నోచని వ్యాజ్యాలు లక్షకు మించిపోయాయి. సంస్కరణలు ఖాళీల భర్తీ, మౌలిక వసతుల పరికల్పనతో మొదలై డిజిటలీకరణతో ఊపందుకోవాలి. వాయిదాల సంస్కతిని దుంపనాశనం చేయాలన్న చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ సూచన సహర్షంగా స్వాగతించదగినది. సరళమైన ప్రాంతీయ భాషలో తీర్పులివ్వాలి. జిల్లాస్థాయి వరకు అన్ని కోర్టుల్లోనూ జనం భాషలోనే కార్యకలాపాలు సాగించాలన్న ప్రతిపాదనలకూ సత్వరం దక్కుతుంది. తీర్పులివ్వడంలో జడ్జీలకు సామాజిక, రాజకీయ ఒత్తిళ్లనుంచి స్వేఛ్ఛ లభిస్తే కక్షిదారుల్లో న్యాయస్థానాల పట్ల నమ్మకం ఇనుమడిస్తుంది. రాజ్యాంగ విలువల గీటురాయిపై శాసనాల చెల్లుబాటును తీర్మానించే సుప్రీంకోర్టు ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరుస్తుందని ఆశీద్దాం. 

No comments:

Post a Comment

Dalithashakthi - 2025 - Magazines