లౌకిక
చుట్టూ చింత చెట్టు నీడ.
చెట్టు ఉన్నంత నీడ ఉంది.
నీడ ఉన్నంత చెట్టు ఉంది.
చెట్టు విస్తీర్ణం తప్ప మిగతా ప్రదేశం అంతా వెన్నెల కాంతిలో జోగుతూ ఉంది.
మధ్య రాత్రి ఒంటిగంట కావస్తుంది. మేఘాలు లేని ఆకాశం చంద్రుడు తెల్లగా ఎత్తి కొడుతున్నాడు. చెట్టుకిందె బొందయ్య మామ నిద్ర పోతున్నాడు. మధ్య రాత్రి మేల్క తట్టింది. అప్పుడే అవతల నుండి చెప్పుల సప్పుడు సన్నగా వినవస్తుంది. భూ కంపనాలను బొందయ్య మామ చెవుల ద్వారా విన్నాడు. ఎవరో మధ్య రాత్రి వస్తున్నాడని పసిగట్టిండు. తనకోసమే వస్తున్నాడని భావించాడు. ఆందోళన పడ్డాడు. ఏమన్నా గాని అని గుత్ప అందుకున్నాడు సైనికుడు ఆయుధం అందుకున్నట్లు.
వాసిరెడ్డి క్రమంగా దగ్గరికి వస్తున్నాడు. మరింత దగ్గరికి వచ్చాడు. వస్తూనే వాసిరెడ్డి గట్టి మురుకోల కట్టే తెచ్చుకున్నాడు. దగ్గరికి వచ్చే వరకు చెప్పులు దూరంగా సప్పుడు రాకుండా ఇడిసిండు. వచ్చుడు వచ్చుడే వాసిరెడ్డి ఏటు ఏసిండు. యుద్ధ వాతావరణం అలుముకుని ఉంది. బొందయ మామ ఏ దిక్కు సౌండ్ వస్తుందో గమనించి అటువైపు చేతులకట్టే ఊపుతుండు. కానీ అప్పటికే ఆయం పట్ల దెబ్బలు పడ్డవి.
*** **** *****
బొందయ్య మామ సంతు జీవితాన్ని జీవిస్తాడు. అందరూ గుడ్డి బొందయ్య అంటారు. మనం భౌతిక నేత్రాలు తెరిస్తే, ఆయన మాత్రం మనోనేత్రం తెరిచిన మనిషి.
పోతులూరి వీరబ్రహ్మం గారి తత్వాన్ని జ్ఞానాన్నీ పాడుతాడు. నమ్ముతాడు 'కూడా'.
కళ్ళు లేవు గానీ దివ్యసుందరాకారుని వలె కనిపిస్తాడు. బ్రహ్మంగారు అంటే 'కాలజ్ఞానం' అని మనకు తెలుసు. కానీ ఆయన అంతకంటే ఎక్కువే అని నమ్ముతాడు.
ఉదయం మూడు గంటలకే లేచి కాల కృత్యాలు తీర్చుకొని, చల్లనీళ్లతోటి స్నానం చేస్తాడు. శివుడిని పూజిస్తాడు. నొసట విభూది రేఖలు దిద్దుకుంటాడు.... ఎందుకో విష్ణువు ఇష్టం ఉండడు. కానీ శివుడు అంటే యమ ఇష్టం.
చూసేవారికి సత్యం ఇలానే, ఈ మనిషి వలె ఉంటుంది అని అనిపిస్తుంది.
చూస్తేనే నీతి నియమాలతో జీవితము సాగుతుoది అని అనిపిస్తుంది.
శివధర్మ ఉపదేశమే బోధిస్తాడు.
బడికి పోలేదు గాని విన్నది విన్నట్లు చెప్పగలడు. వినికిడి జ్ఞానం ఎక్కువ.
చూపు లేకుండా దారులు తెలిసిన మనిషి. వినికిడి జ్ఞానంలో దిట్ట.
ఒక్కసారి వింటే మరిచిపోడు. విన్నది విన్నట్లు పూస గుచ్చినట్లు చెప్పగలడు. ఒక్కసారి స్పర్శి తగిలినా, ఆ స్పర్శతోనే మనిషిని గుర్తుపట్టగలడు. ఏకసంతాగ్రహి.
బొందయ్య మామకు సొంత ఆస్తులు లేవు. కుటుంబం లేదు.స్వార్థం విడనాడివాడు. విలాసం వంతమైన జీవితాన్ని మలంలాగా విసర్జించాలంటాడు.
అన్ని కులాలు అన్ని మతాలు సమానమే అంటాడు. మనుషులంతా పుట్టుకరిత్యా సమానమే అంటాడు.
కుల అసమానతలు వద్దంటాడు. ముస్లింలు ఒకప్పుడు ఈ దేశ మూలవాసులే అంటాడు.
'ఏది చెప్పినా బల్లగుద్దినట్లు'.. కాకుండా "గుండెపై గుద్దినట్లు" చెప్తాడు.
మెదడులో వాస్తవాలు నిక్షిప్తం అయ్యేలా వివరించడం, ఒప్పించడం
ఆయన నైజం.
సంతు జీవితం అన్నాను కదా, పాటను ఆరో ప్రాణంగా భావిస్తాడు. మనసులో కలిగిన జ్ఞానాన్ని పాటగా వ్యక్తపరుస్తాడు. అంటే పాటల ఊట, పాటల చెలిమే.. ఇవేవీ కాదు ఇంకా ఎక్కువే.
ఏకంగా మల్లెల తీర్థపు జలపాతమే అనొచ్చు. మామ పాట వింటే హృదయ పలకo విచ్చుకొని అక్షరాలన్నీ శిలాక్షరాలుగా మారిపోతాయి.
పాట మస్తిష్కంలో నిక్షిప్తమై, అశోకుని శిలా శాసనాల వలె నిటారుగా ఉండిపోయి ధ్వజస్తంభమై నిలిచిపోతుంది.
ఆ పాటకు మనిషి కేంద్రం. అసమానతలు లేని మనిషి కేంద్రం. మనుషులంతా సమానమనే భావన. లౌకిక భావన. ఈ దేశ జంబుద్వీప భావన. గణ రాజ్య భావన.
ఆయన పాడే పాటలు ఉయ్యాల వలె ఊగే బతుకులకు ఒక స్థిత ప్రజ్ఞతను భరోసానిస్తాయి. పాటలు ఊహలు కాదంటూ వాస్తవికమై నిలవాలి అంటాడు. ఎవరైనా తప్పు చేసిన మనిషి సలహా అడిగితే 'అప్పు' చేయని, 'తప్పు' చేయని మనిషి
ఎవడంటాడు? సర్ది చెప్తాడు. మళ్ళీ చేయకూడదని ఉపాయం కూడా చెప్తాడు.
ఒకరి ముందు చేయి చాచడు.
తలవంచడు. మద్రామ
సించెట్టు కాడ చింతకాయలకై కావలుంటాడు. ఎండాకాలం మాడిచెట్ల కాడ కావాలుంటాడు. చింతపండు మాడిపండు అమ్మి జీవితం గడుపుతుంటాడు.
చిన్నప్పుడు అమ్మ తల్లి పోసినందుకు ముఖమంతా గుల్లలై ఆరిపోయాక ఆ మచ్చలు అట్లాగే మిగిలిపోయాయేమో... ముఖం నిండా మచ్చల బెందులే. ఎర్రటి కనుగుడ్లు మచ్చల మధ్య మండే సూర్యుడి వలే కనిపిస్తాయి.
గట్టి మురుకోల కట్టే చేతుల ఎప్పుడు ఉంటది. ఆ కట్టెకు కొనన రెండు మువ్వల గజ్జలు కట్టుకుంటాడు.
"ఎందుకూ"...? నడుస్తున్నప్పుడు గజ్జల శబ్దానికి ఎదురుగుండా వస్తున్న వాళ్ళు అలర్ట్గా ఉండడానికి.
ఆయన చేతి కర్రకు ఉన్న గజ్జెలు గిరగిరా భూగోళం లాగా తిరుగుతూ "యుద్ధ నినాదం "చేస్తున్నట్టు ఉంటాయి.
ఆయనతో ఉంటుంటే, ఆయనైపోతాం. మమేకమై తీరుతాం. ఆయనను చూస్తుంటే, సత్యాన్ని నెత్తిన పెట్టుకోవాల్సిందే. అన్ని కులాల మతాల కలుపుగోలు కల కనాల్సిందే.
బజారున నడుస్తున్నప్పుడు ఎవరైనా చిన్నపిల్లలే గాని లేక పెద్దలే గాని 'ఒరేయ్ గుడ్డోడా' అని అరిస్తే గుత్ప తీసుకొని ఎదుర్తాడు.
అట్లా చాలామంది పిల్లలు భయపడతారు. ఇంకా కావల్సుకుని పెద్దలు ఎవరన్నా బనాయిoచినట్లు 'గుడ్డోడా 'అంటే తిరగబడతాడు. మామను చూస్తే నాకు మా ఊరి నేలన నడిచిన ఆత్మగౌరవ జెండా,'తిరుగుబాటు పతాక' అనిపిస్తది.
ఓం శబ్దంనందే ఆకాశము, అగ్ని,గాలి, నీరు పంచభూతాలన్నీ పుట్టినవని నమ్ముతాడు. స్వార్ధము విడనాడిన మనసులో కలిగిన జ్ఞానాన్ని పాట పాడితే ఏదోలేని శక్తి తాకుతుంది హృదయానికి.
తాత్విక ప్రతిభ మాటల్లో ఉట్టిపడుతుంది.
పది నిమిషాలు సంభాషిస్తే జీవితం యొక్క పరమార్థం అర్థమై పోతుంది. నిజాయితీ మాటల్లో ఉట్టిపడుతుంది మాటల్లో. మనుషులందరూ సమానమే అంటారు ఈశ్వరుని దృష్టిలో.
ఈశ్వరుడు జాంబవంతుని "అంశ" అని నమ్ముతాడు.
శరీర వాంఛ కంటే జ్ఞానవాంఛనే మనిషిని ఉన్నతంగా నిలబెడుతుందని చెప్తాడు.
ఆత్మ దర్శనం, సత్య మార్గం ఆయనకు ఇష్టమైన భావాలు.
తత్వంతో శరీరానికే కాదు మనసుకు కూడా శిక్షణ ఇవ్వగలడు.
మనిషిని ఆరోగ్యంగా ఉంచగలిగేది "ఆలోచనలే" అని నమ్ముతాడు.
తెల్లవారుజామునే మూడు గంటలకు మేలుకుంటాడు. చక్కని సంగీతం ఆలపిస్తాడు. అదో గొప్ప అనుభూతి.
బాగా ఫీల్ అయి పాడుతాడు.
రెండు ఆనంకాయలు ఎండబెట్టి పొట్టి వొట్టి ఎదురు బొంగుతో తుంబురా చేసుకున్నాడు.
ఆ తుంబురాపై తత్వజ్ఞానం పాడుతూ ఆత్మానందం పొందుతాడు.
ఆయన పాడుతుంటే చుక్కలు రాలినట్లు చింత ఆకులు రాలుతాయి . సూర్యోదయం కూడా తొందరపడతాడు ఉదయించడానికి.
ఆ రాగం మిస్సవుతానేమోనని ఆతృత.
నిద్రిస్తున్నప్పుడు ఆత్మ, సత్య పోరాటాలు మొదలైపోతాయి బొందయ్య మామలో.
* * *
వాసిరెడ్డి విష్ణు భక్తుడు. చదువుకున్నాడు. కానీ ఊరిలోనే ఉంటాడు. 'జాతీయ వాద' భావాలని చెప్పి మనుషులను కులాలుగా, మతాలుగా విడగొట్టే పనిని సంస్కృతి పేరుతోటి చేస్తుంటాడు.
మొదట 'బత్తాయి' సంస్థలలో పని చేశాడు. నలబై ఎకరాలు
ఆసామి. ఇద్దరు జీతాగాలని పెట్టి వ్యవసాయం నడిపిస్తాడు.
బొందయ్య మామకు ఊరిలో అన్ని కులాల వాళ్ళు ఇచ్చే గౌరవం నచ్చనివాడు. పైగా శైవం అంటే పగ. లౌకిక అనే పదాన్ని సహించడు. కానీ బొందయ్య మామ ప్రభావం వల్ల ఊరు లౌకిక విలువలకు నిలయం. అన్ని కులాల వాళ్లు ఉంటారు.
కుల ధర్మాలను పాటించినా వావి వరుసలతోటి అన్నదమ్ముల వలనే పిలుచుకుంటారు.
అంటరానితనాన్ని పాటించినా సందర్భానుసారంగా ఆ విలువల్ని పాటించకుండా కూడా ఉంటారు.
'బత్తాయి' సిద్ధాంతాలను పునికి పుచ్చుకున్న వాసిరెడ్డి ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుంటాడు.
అతడు మూలవాసులైన దళితులను బీసీలను లోపల అసహ్యించుకుంటాడు. పైకి మాత్రం 'జాతీయ భావాల'నే వొదులుతుంటాడు.
ముస్లింలు అంటే చెప్పలేనంత ద్వేషం. రాజ్యాంగం అన్నా రాజ్యాంగ విలువలన్నా పూర్తిగా అగౌరవం .
అప్పుడెప్పుడో బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రారంభమైన రథయాత్రలో చాలా కీలకంగా పాల్గొన్నాడు. అప్పుడప్పుడు బీసీ దళిత యువకులను పిలిచి 'శాఖ' చేయించాడు. బాబ్రీ మసీదును కూలగొట్టాలనేవాడు. ఆస్థానం లో అయోధ్యలో రామ మందిరం నిర్మించాలంటాడు.
ముస్లింలకు మత స్వేచ్ఛ వద్దంటాడు. ముస్లిమ్స్ కూడా ఈ దేశ వైష్ణవాన్ని ఫాలో కావాలంటాడు.
ఆయన ఆలోచనలు సామాజిక వ్యవస్థ ఉన్నత స్థాయికి చేరనీయకపోగా, కిందికి దిగజారే ప్రమాదం ఉందని తెలిసినా, ఆ ఆలోచనలనే ఇతరులకు ఇంజెక్టు చేస్తుంటాడు.
భారతమాత అంటే చాలా ఇష్టం. కానీ ఊర్లో కింది కులాల ఆడోళ్ళను మాత్రం
'అసేయ్' ' ఒసేయ్' అని పిలుస్తూ అనుభవించాలని చూస్తుంటాడు. భారతమాత అనే బొమ్మకు ఇచ్చిన విలువ సాటి మనిషికి ఇవ్వడు. బార్డర్ను ప్రేమించినంతగా బార్డర్ లోపల ఉన్న మనుషులను ప్రేమించడు. ఆయనకు దేశమంటే మట్టి. మనుషులు కాదు.
ద్వేషించాల్సింది ప్రేమించాలంటాడు. ప్రేమించాల్సింది ద్వేషించాలంటాడు. కులాల మధ్య ఉన్న, మతాల మధ్య ఉన్న సున్నిత సంబంధాల్ని ద్వేష సంబంధాలుగా మార్చగలడు. అనైతిక దృక్పథం మెండు. ఇతర మతాల నైతిక దృక్పథాన్ని బొత్తిగా గౌరవించడు. పరమత సహనం లేకపోగా విషాదపు చేష్టలను సృష్టిస్తాడు. అసత్యాన్ని స్వీకరించి సత్యాన్ని తిరస్కరిస్తుంటాడు.
ఊర్లో పీర్లను
ఆడనివ్వకూడదనేది ఆయన ఉద్దేశం. పీర్ల పండుగ మన దేశ పండుగ కాదు.అది ముస్లింల పండుగ. అది మన ఆచారం కాదనివాదిస్తాడు. మన సనాతన ధర్మంలో ఈ పండగే లేదంటాడు. ఆ మాటకొస్తే వైష్ణం, శైవం విషయంలో దేనినో ఒకదానిని ఎంచుకోమంటే వైష్ణవాన్ని ఎంచుకుంటాడు. శైవాన్ని ఎందుకు ఎంచుకోవు అని ప్రశ్నిస్తే శైవం ఈ దేశ మూలవాసులదని, బహుజనులదని అతనికి తెలుసు. మూలవాసులు అంటే బహుజనులనే అతనికి ఎరుక కలదు. కాబట్టి మధ్య ఆసియా నుండి వలస వచ్చిన ఆర్య మత ఆచారాలైన వైష్ణవ మతమే అతడు ఈ దేశ మతంగా ఫీల్ అవుతాడు.
* * *
దుస్తులు ధరించేటప్పుడు ఆడపిల్లలైనా మగ పిల్లలైనా ఆధునికతవైపు ప్రయాణించకూడదు అని వాదిస్తుంటాడు.సనాతన ధర్మం ప్రకారం భారతీయ దుస్తులనే ధరించాలని గొంతు చించుకుంటాడు. మగ పిల్లలు జీన్స్ పాయింట్ వేస్తేనే ఒప్పుకోడు. ఇంగ ఆడపిల్లలు వేస్తే అసలే ఒప్పుకోడు.
ఆడపిల్లల మీదికి అత్యాచారాలు జరగడానికి వాళ్ళు వేస్తున్నటువంటి దుస్తులే ప్రధాన కారణం అని వాపోతాడు.
కొన్ని రోజుల తరువాత
అఘోరిని ఊరికి ఆహ్వానించాడు. ఒంటిమీద నూలు పోగు లేని అఘోరికి నమస్కరిస్తున్నాడు.
మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి అమ్మవారే అఘోరి రూపంలో బయలుదేరిందని ఊరి వాళ్లకు అందరికీ చెబుతున్నాడు. త్యాగమంటాడు. బర్రెబత్తల కనిపించిన మనిషిని దైవ స్వరూపమని కొలుస్తాడు.
**** ****
ఎన్నో ఏళ్ల నుండి దళితులను, బీసీలను, ముస్లింలను, ఆయన నమ్మే జాతీయవాద పార్టీల వైపు మళ్ళించాలనుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు విఫలమయ్యాడు.
ఎన్నో కుట్రలు చేశాడు విజయవంతం కాలేదు. కులాల మధ్య, మతాల మధ్య ఎన్నో కొట్లాటలు పెట్టడానికి ప్రయత్నించాడు కానీ కాలేదు.సర్పంచ్ పదవికి పోటీ చేసిండు. ఓడిపోయిండు.
'కారణం ఏమిటా'? అని
తీక్షనంగా ఆలోచించసాగాడు. బొందయ్య బోధనలే అని నమ్మాడు. లౌకిక భావానికి పునాది బొందయ్య బోధనలే అని తెలుసుకున్నాడు.
తను చెప్పే మాట ఎవరూ నమ్మడం లేదు. కానీ బొందయ్య మాటలు నమ్ముతున్నారని ఆయనపై ఈర్ష పెంచుకున్నాడు.
కనుకనే చంపాలనుకున్నాడు. లేకుండా చేయాలనుకుని కుట్రపన్నాడు .
'లౌకిక' భావాలు ఉన్నవాడు ఈ ఊర్లో ఉండొద్దు.
"వైష్ణవ భావజాలం" ఉన్నవాడే ఉండేలా ఆయన కోరిక. అందుకే శైవం నశించాలి. శైవం నశించాలి. శైవం బోధించే బోధకులు నశించాలి. సకల చరాచర జీవరాసులు భద్రంగా జీవించాలనే భావన సరి కాదు. ఒకే ఒక్క సాంప్రదాయం బతకాలి. నిజానికి 'మతం బుద్ధికెక్కితే, బుర్ర అరికాలికి దిగుతుంది' అనేది నిరూపిస్తున్నాడు. మతసామరస్యం కాకుండా, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు. కులసామరస్యం కాకుండా, కులాల కుంపట్లు రగిలేస్తున్నాడు. వైష్ణవం అజేయం అజేయం అంటూ పలవరిస్తున్నాడు.
బొందయ్యను చంపాలనుకున్నాడు.
"ఎందుకూ" ?
"మత ఆధిపథ్యం కోసం"!.
తన గుండెలలో ప్రశ్నలు నిరంతరంగా.. ఆగకుండా
జ్వలిస్తున్నాయి.పగతో పొడుసుకొస్తున్నాయి.
బొందయ్య పై దాడుల బీభత్సం అప్రతిహతంగా సాగుతున్నది.
ఏటు మీద ఏటు గుత్ప తీసుకొని వాసిరెడ్డి వేస్తూనే ఉన్నాడు. బొందయ్య మామ నిశ్చష్టుడయ్యాడు. బొందయ్యా అంటే బొందల ఉండాలే. మందిల ఉండొద్దు. ఊర్లో అసలే ఉండొద్దు అని వాసి రెడ్డి మనుసులో అనుకుంటున్నాడు.బలంగా.. మరింత బలంగా దెబ్బలు పడుతున్నాయి. ఆ రాత్రి పగ రాత్రి.
శిశిర ఋతువు, వసంత
రుతువు ముసలివైపోయాయి.
గ్రీష్మ రుతువు ప్రవేశిస్తుందో లేదో తెలియదు.
ఆకు రాలు కాలం వీస్తుంది.ఇక తనకు ఈ భూమి మీద నూకలు ఉన్నాయో లేదో తెలియదు. తనకు రోజులు దగ్గరపడ్డాయని బొందయ్య తెలుసుకున్నాడు.
'కళ్ళు మూసుకుంటున్నాడు'. కనురెప్పలు వాలిపోతున్నాయి.!కానీ బలవంతంగా నిలబెడుతున్నాడు. అయినా సరే ఆగడం లేదు. మామ కళ్ళల్లో వెన్నెల కాంతి సుడులు తిరుగుతుంది. అంతా అయ్యాక ఆ రాత్రి బొందయ్య మామను ఊరి ముందల షెల్కల నీళ్లు లేని బావిలో దొబ్బిండు.
పంచభూతాలు దగ్గరికైనవి. బొందయ్య మామను, మామ వాక్కును హత్తుకున్నాయి. అన్ని కులాల 'ఐక్యతకు' మూలం నీ మాటే,
నీ పాటే. అందుకు "మేము సాక్షులం".
ఈ లౌకిక భావాలను మేము కాపాడుతామని నీకు మాట ఇస్తున్నామని గాలి 'జుయ్'... 'జుయ్' మంటూ వీస్తూ మైదానంలో యుద్ధ నినాదం చేస్తుంది.
- గుడిపల్లి నిరంజన్, నాగర్ కర్నూల్
9493319878