సంపాదకీయం
బాబాసాహెబ్ బి.ఆర్. అంబేడ్కర్ మై ఫ్యాషన్
భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనూ బహుముఖ ప్రాభవాన్ని చూపిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్. ఆయన జీవితం, అభిప్రాయాలు, పోరాటాలు నేటి సమాజానికి మార్గదర్శకాలు. ఆయన ఆశయాలు సమాజానికి వెలుగు, నాకు దిశానిర్దేశం. అంబేడ్కర్ చూపిన మార్గమే మాకు స్ఫూర్తి, మా ప్రతి అడుగులో ఆయనే ప్రేరణ. న్యాయం, సమానత్వం, స్వతంత్రత కోసం ఆయన నిరంతరం పోరాటం చేసిన తీరు ప్రతి యువతకు ఆదర్శప్రాయంగా మారింది. డాక్టర్ అంబేడ్కర్ ఆశయాలు నేడు కూడా సమాజానికి పునరుజ్జీవాన్ని అందిస్తున్నాయి, అందుకే ఆయన మాకు ఫ్యాషన్.
బాల్యం నుంచే అంబేడ్కర్ కులవివక్షలను ఎదుర్కొన్నారు. అంటరానితనం వల్ల ఆయనకు చదువు కూడా సులభంగా లభించలేదు. పాఠశాలలో నీటిని తాగే సమయంలోనూ ఎదురైన అవమానాలు ఆయనకు జీవిత పాఠాలుగా మారాయి. ఆ అవమానాలనే ప్రేరణగా మార్చుకుని, నైతిక ధైర్యంతో ప్రపంచంలో అత్యధిక విద్యను పొందిన వ్యక్తిగా నిలిచారు. అమెరికాలో కోలంబియా యూనివర్సిటీ నుంచి పిహెచ్‌డీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి డాక్టరేట్లు సంపాదించిన అంబేడ్కర్ విద్యార్హతలు నేటి సమాజానికి స్ఫూర్తిగా నిలిచాయి. అందుకే ఆయన మాకు ఫ్యాషన్.
సామాజిక సమానత్వం కోసం బాబాసాహెబ్ అంబేడ్కర్ చేసిన పోరాటాలు భారతదేశానికి అపూర్వమైన మైలురాళ్లు. కులవివక్ష నిర్మూలనకు ఆయన చేసిన ప్రయత్నాలు సామాజిక న్యాయం వైపు దేశాన్ని నడిపించాయి. మహారాష్ట్రలోని చవ్దార్ తాలాబ్ వద్ద నీటిని త్రాగే హక్కు కోసం నిర్వహించిన పోరాటం, మనువు ధర్మశాస్త్రాన్ని బహిరంగంగా కాల్చి కులవివక్షకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విధానం ఆయన స్పష్టమైన ధక్పథాన్ని సూచిస్తాయి. అందుకే ఆయన మాకు ఫ్యాషన్.
భారతదేశాన్ని స్వతంత్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆయన సూచించిన పధకాలు భారత ఆర్థిక చరిత్రలో కీలకమైనవి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి సంస్థల ఏర్పాటు ఆయన ఆర్థిక ప్రతిభకు నిదర్శనం. శ్రామికులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఆయన రూపొందించిన విధానాలు నేటికీ ప్రభావవంతంగా కొనసాగుతున్నాయి.అందుకే ఆయన మాకు ఫ్యాషన్. అంబేడ్కర్ చేసిన విశ్లేషణలు ప్రతీ రంగాన్ని ప్రభావితం చేశాయి. కార్మికుల హక్కులను పరిరక్షించడానికి 12 గంటల పని వ్యవస్థను 8 గంటలకు కుదించడంలో ఆయన పాత్ర అమూల్యమైనది. సామాజిక సమానత్వానికి, ఆర్థిక న్యాయానికి ఆయన చేర్చిన మార్గదర్శక సూత్రాలు నేటికీ సమాజంలో ప్రాధాన్యతను కలిగిస్తున్నాయి. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలకు చట్టసభల్లో సమాన హక్కులు కల్పించడమే అంబేడ్కర్ లక్ష్యం. ఆయన రూపొందించిన హక్కుల సంరక్షణతో ప్రజాస్వామ్యానికి స్థిరత్వం ఏర్పడింది. అందుకే ఆయన మాకు ఫ్యాషన్.
అంతర్లీనంగా హిందూ మతం సష్టించిన కులవ్యవస్థను నిర్ధారించడానికి, సమానత్వం పునరుద్ధరించడానికి, బౌద్ధమతంలోకి మారిన అంబేడ్కర్, సమాజానికి నిజమైన మార్గదర్శిగా నిలిచారు. తన అనుచరులకు కూడా అదే మార్గాన్ని సూచించి సమాజంలో సమానత్వానికి ప్రాధాన్యతను చూపించారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ వంటి మహానీయులను అవమానిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నేతలకు గుణపాఠం చెప్పే సమయం వచ్చింది. అమిత్ షా బహిరంగంగా క్షమాపణ చెప్పి, మంత్రిపదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే, బాబాసాహెబ్ అంబేడ్కర్‌కు భారతదేశంలోని 95% బడుగు బలహీన వర్గాల మనస్సులో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన ఆశయాలు, ఆలోచనలు నేటి సమాజానికి మార్గదర్శనం. భారత రాజ్యాంగం ప్రతి భారతీయునికి మార్గదర్శనం చేస్తున్నట్లే, ప్రతి సమస్యకు, ప్రతి పోరాటానికి అంబేడ్కర్ ఆశయాలు మార్గదర్శనం. సమానత్వం, స్వతంత్రం, సామాజిక న్యాయం కోసం అంబేడ్కర్ చూపిన దారిలో నడవడమే నేటి యువతకు ఫ్యాషన్.

No comments:
Post a Comment