Sunday, March 13, 2016

దళితశక్తి మార్చి 2016 పత్రిక సంపాదకీయం

సంపాదకీయం
దేశంలోని ప్రతి పౌరుడు కుల, మతాలకు, ప్రాంతాలకు, భాష, లింగ బేధాలు లేకుండా భారతరాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుంది. ఆ హక్కు రాజ్యాంగానికి లోబడి భారత దేశ సౌర్వభౌమాధికారాన్ని గానీ, భారతదేశ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా గానీ, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా గానీ ఉండకూడదు. కానీ కన్నయ్య ప్రసంగంలో అలాంటివి ఏమి లేవని రుజువైంది. రాజ్యాంగానికి లోబడి మాత్రమే కన్నయ్య ప్రసంగం చేశారు కానీ రాజ్యాంగానికి అతీతంగా ఎప్పుడు కుడా మాట్లడలేదు. రోహిత్‌ వేముల ఆత్మహత్య ఘటనను పార్లమెంట్‌లో చర్య లేవనెత్తకుండా, కులవివక్షపై చర్చ జరగకుండా కన్నయ్యను దేశద్రోహాం కేసుపెట్టి దేశం మొత్తాన్ని ప్రక్కదారి పట్టించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది. దేశద్రోహులు, దేశభక్తులెవరు? అనే అంశాన్ని ముందుకు తెచ్చింది. 
రాజ్యసభలో మాయవతి కులవివక్ష అంశాన్ని, రోహిత్‌ ఆత్మహత్యకు గల కారణాలను లెవనెత్తిన చర్చతో దేశవ్యాప్తంగా మరోసారి కులవివక్షపై చర్చ జరిగింది. పార్లమెంట్‌లో చర్చ చేసిన రోహిత్‌ కుటుంబానికి న్యాయం మాత్రం చేయలేకపోయారు. దేశద్రోహాం కేసులో యూనివర్సిటీ క్యాంపస్‌లోకి పోలీసులు చొరబడి కన్నయ్యకుమార్‌ను అరెస్టు చేసినట్లు రోహిత్‌ ఆత్యహత్యకు కారణమైన నిందితులు అగ్రకులాల వారు కాబట్టే ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు. మనువాదులు భారత రాజ్యాంగం, చట్టాలకు లోబడి కాకుండా నిందితులే జడ్జీలై తమకు తమే తీర్పు ఇస్తున్నారు. ఈ తీర్పులు ధిక్కారిస్తున్న వారికి ఊరితాడులు ఎదురోస్తున్నాయి. రోహిత్‌ వేముల తన చివరి లేఖలో ''మనిషి విలువ పతనమైపోయింది. ఒక ఓటుకు, ఒక సంఖ్యకు, ఒక వస్తువుకు మనిషి విలువ పడిపోయింది. మనిషిని ఎప్పుడూ ఒక మెదడు ఉన్న వ్యక్తిగా గుర్తించడం లేదు. ప్రతి రంగంలో, చదువుల్లో, సమాజంలో, రాజకీయీల్లో, పుట్టుకలో, మరణంలో ఎక్కడా కూడా మనిషికి విలువ లేదు'' అన్నట్లు దళితులు, పేదలను సమాజం నుండి వేరు చేశారు, చేస్తూనే ఉన్నారు. అధికారం కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటం పతనానికి నాంది కాబోతున్నది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, జేఎన్‌యూ విద్యార్థుల పోరాటాలు దళిత, బడుగు, బలహీన వర్గాలు మేల్కొకొలుపు కావాలనీ ఆశీస్తూ...మీ...


డాక్టర్‌ గాలి వినోద్‌ కుమార్‌
గౌరవ సంపాదకులు

Dalithashakthi March 2016




Monday, March 7, 2016

రోహిత్‌ వేముల

రోహిత్‌ వేముల మరణానికి దారితీసిన పరిణామాలు

రోహిత్‌ వేముల మరణానికి దారితీసిన పరిణామాలు
                  హైద్రాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో రోహిత్‌ ఆత్మహత్య దేశంలోని ప్రతిష్టాత్మ్మక ఉన్నత విద్యా సంస్థలలో దళిత విద్యార్థుల పట్ల బాగా వేళ్ళూనుకొనిపోయిన కుల వివక్షపై చర్చను లేవదీసింది.
హైద్రాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ పరిశోధన విద్యార్థి వేముల రోహిత్‌ ఆత్మహత్య ఒక్కసారి జరిగిన సంఘటన కాదు. కానీ తమ బాల్యాన్ని నాశనం చేసిన కులవిద్వేషాలను అంతం చేయాలని తీర్మానించుకొని, భయంకర మైన గ్రామీణ పేదరికం నుండి వచ్చిన మొదటి తరం విద్యార్థుల అవసరాలను పట్టించుకోవ డంలో పరాకాష్ఠకు చేరిన వైఫల్యం..
దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థ లలో ఒకటైన హైద్రాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శి టీలో దశాబ్దకాలంలో జరిగిన ఆత్మహత్యలలో రోహిత్‌ ఆత్మహత్య తొమ్మిదవది. వారిలో ఆరుగురు దళితులు, ఒకరు ఆదివాసీ విద్యార్థి, ఒకరు బి.సి.కులం, ఒకరు ఉన్నత కులానికి చెందినవారు. ఐదుగురు దళిత విద్యార్థుల ఆత్మ హత్యలు వారు చదివే కోర్సుకు సంబంధించిన తేడాలవల్ల, వారికిచ్చే ఫెలోషిప్‌ను తగ్గించడం, సమయానికి పి.హెచ్‌.డి గైడ్‌ను కేటాయించక పోవడం లాంటి పరిపాలనా విభాగంలో తప్పిదాల వల్ల జరిగాయి. రోహిత్‌ ఆత్మహత్య, తనకు విధించిన తీవ్రమైన శిక్ష ఫలితంగానే జరిగింది. రోహిత్‌లాంటి విద్యార్థుల ఉన్నత విద్యా లక్ష్యాలను సాధించడానికి వారి అవసరాల పట్ల సున్నితంగా వ్యవహరించాల్సిన బాధ్యత యూనివర్శిటీకి ఉన్నది. ఆ లక్ష్యాలే అందరినీ కలుపుకుపోయే ఆదర్శాలను ప్రతిబింబిస్తాయి.
50 సంవత్సరాల ప్రతిష్ఠాత్మక సెంట్రల్‌ యూనివర్శిటీ అధికారులు సరిదిద్దగలిగిన, విద్యార్థుల రాజకీయాలకు సంబంధించి చిన్న తగాదాతో అది ప్రారంభమయ్యింది. 2015 ఆగస్ట్‌ 3వ తేది అర్ధరాత్రికి ఒక గంట ముందు అంబేద్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌కు చెందిన గుంపు, ఒక వామపక్ష దళిత విద్యార్థి గుంపు బి.జె.పి. అనుబంధ విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి పరిషత్‌కి నాయకుడైన, భాషా శాస్త్రంలో పరిశోధక విద్యార్థి నందనం సుశీల్‌ కుమార్‌ నుండి క్షమాపణలు కోరాలని నిర్ణయిం చారు. అతడు ఫేస్‌బుక్‌లో చేసిన అవమానకర మైన వ్యాఖ్యానాలకే ఈ క్షమాపణలు. ఆగస్ట్‌ 3న అతడు చేసిన వ్యాఖ్యానాలు: ''ఎయస్‌ఎ గూండాలు గూండాయిజం గురించి మాట్లాడ డం, హాస్యాస్పదం'' జూలై 30, 1993లో ముంబైలో జరిగిన వరుస పేళుళ్ల కేసులో నేరస్తునిగా ఉరిశిక్షకు గురైన 'యూకుబ్‌ మెమన్‌' ను స్మరిస్తూ జరిపిన సంతాప సభకు ప్రతిచర్యగా పై వ్యాఖ్యానాలు చేయబడినాయి. ఉరిశిక్షను నిరసిస్తూ అంబేద్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ ఈ సమావేశాన్ని నిర్వహించింది.
తాను స్వయంగా జనవరి 21న 'జీన్యూస్‌' ఛానల్‌లో ఒప్పుకున్నట్లుగా, సుశీల్‌ ఆ నిరసనను చూడలేదు. కేవలం ఫేస్‌బుక్‌లో నిరసన ఫోటో లు మాత్రమే చూశాడు. ఈ సంఘటనపైబాగా కలత చెందానని, వెంటనే ఆ సమావేశానికి చెందిన ఫోటోలను గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ భూపతికి పంపించానని ఒక ఇంటర్యూలో చెప్పాడు. హైద్రాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో దేశద్రోహ కార్యక్రమాలు జరుగుతున్నాయన్న విషయాన్ని భూపతి దృష్టికి తీసుకొని రావాలనుకుంటాడు.
సుశీల్‌కుమార్‌ ఈ వ్యాఖ్యానం ఉద్రేక రహితంగా చేశాడు. కాని దానిని రాజకీయంగా భిన్నాభిప్రాయాలు తెలియజేసేవారికి వ్యతిరే కంగా ఎబివిపి వారు ఉపయోగించుకుం టారని, పరిణామాలు ఈ విధంగా ఉంటాయని అనుకోలేదు. 2014లో నరేంద్ర మోడీ అధికారం లోకి వచ్చిన కొద్ది నెలల తరువాత కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆధ్వర్యంలో ఉన్న మానవ వనరుల అభివృద్ధి శాఖ నుండి యూనివర్శిటీ కళాశాలల పరిధిలో పోలీస్‌ పెట్రోలింగ్‌ పెంచాలని, యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమీషన్‌ (యుజిసి)కు ఉత్తర్వులు అందాయి. ఈ మార్గదర్శకాలు విద్యార్థులు, అధ్యాపకుల నుండి విమర్శలకు గురి అవుతాయి.
రోహిత్‌ ఆత్మహత్యను దర్యాప్తు చేసే అధికారిగా భూపతి నియమించబడతాడు. ఆ ఫిర్యాదులో ఆత్మహత్యకు కారకులైన ఆరుగురిపై యస్‌.సి., యస్‌.టి. చట్టం మోపబడింది. అతడు (భూపతి) , సుశీల్‌కుమార్‌ ఒకరికొకరు తెలుసు అన్న విషయం అందరికీ తెలిసిందే. దానివల్ల అధికారి పక్షపాతంగా వ్యవహరిస్తాడని అందరు అనుకోవచ్చు. దళితుడు లేదా ఆదివాసీ అని నిరూపించబడకుండా ఈ కేసు యస్‌సి, యస్‌టి ప్రివెన్షన్‌ ఆఫ్‌ అట్రోసిటీస్‌ యాక్ట్‌ కింద నమోదు చేయబడకూడదు. ప్రాథమిక సమాచార నివేదిక (యఫ్‌ఐఆర్‌) ప్రకారం ఈ కేసులో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, యన్‌. రామచందర్‌రావు, (యంయల్‌సి), సుశీల్‌కుమార్‌, అతని బాబాయి, స్మృతి ఇరానీకి దత్తాత్రేయ చేత లేఖ వ్రాయించిన బిజెపి కార్యకర్త అయిన నందనం దివాకర్‌, హెచ్‌సియు వైస్‌ ఛాన్స్‌లర్‌ పొదిల అప్పారావు, సుశీల్‌కుమార్‌ స్నేహితుడు, ఎబివిపి కార్యకర్త, ఆగస్ట్‌ 3,-4న సంఘటనకు సాక్షిగా ఉన్న కృష్ణచైతన్య పేర్లు నమోదు చేయబడినాయి.
రోహిత్‌ స్నేహితుడు, అర్ధశాస్త్ర విభాగం లో పరిశోధక విద్యార్థి దొంత ప్రశాంత్‌ చేత ఈ ఫిర్యాదు ఇవ్వబడింది. సోషల్‌ విూడియా లో సుశీల్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలలో ''గుండాలు'' అన్నపదం ''అసాధారణమైన'' పదంగా 'జీన్యూస్‌' కిచ్చిన ఇంటర్య్వూలో తానే పేర్కొనడం జరిగిం ది. తన శత్రువులు తనను కాషాయ తీవ్రవాదు లు, ఫాసిస్ట్‌లు అని పేర్కొన్నపుడు, తాను వారిని ఆ పదంతో పిలవడంలో తప్పేముంది అని అంటాడు.
క్షమాపణ, ''దాడి''
ఆగస్ట్‌ 3వ తేదీన జరిగిన విషయం వివరి స్తూ సెక్యూరిటీ అధికారి దలీప్‌సింగ్‌ అర్ధరాత్రి దాటిన తరువాత సుశీల్‌కుమార్‌ న్యూరిసెర్చ్‌ స్కాలర్స్‌ బిల్డింగ్‌ బయటవున్న సైకిల్‌స్టాండ్‌ దగ్గర ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతుండగా చూశా నని చెప్పాడు. అతనికి 50 అడుగుల దూరంలో నిలబడి ఉన్న అంబేద్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియే షన్‌ (ఎయస్‌ఎ)కు చెందిన సభ్యులు ఫేస్‌బుక్‌లో సుశీల్‌కుమార్‌ వారిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. దలీప్‌సింగ్‌ చెప్పినదానికి నిజనిర్ధారణ కమిటీకి తెలిసింది ఇదే విషయం. ''అతడు ఫోన్‌ మాట్లాడి వస్తాడు. ఎ.యస్‌.ఎ. సభ్యులు అతడిని ఆ వ్యాఖ్య లు ఎందుకు చేశావు అని అడిగితే, తనకు ఇంటర్నెట్‌ గురించి అంత అవగాహనలేదని, అంటాడు. వారు చేయమన్నదానికి అతను చేయనని తిరస్కరిస్తాడు. చివరికి అతడు ఒక క్షమాపణ పత్రాన్ని వ్రాసి యిస్తాడు.''
దలీప్‌సింగ్‌, డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్స్‌ వెల్‌ఫేర్‌ (డియస్‌డబ్ల్యి) ప్రకాష్‌బాబు విద్యార్ధుల మధ్య జరుగుతున్న ఈ తగాదా ఏమిటో చూడమని ఫోన్‌ చేసిన మీదట అక్కడికి 1:20 ఎ.యమ్‌. కు చేరుకున్నాడు. విద్యార్ధుల మధ్య షుమారు 20 ని||ల పాటు వాదనలు సాగాయి.
సుశీల్‌ కుమార్‌ తాను 100కు ఫోన్‌చేసి అతనికి బాగా తెలిసిన సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ నవీన్‌కు విషయాలు తెలియజేశాడు. వెంటనే రెండు పోలీస్‌ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. ఎ.యస్‌.ఎ. విద్యార్ధులు తనను గదినుండి బైటికి లాగి గాయపర్చారని దానికి సాక్షాలు కూడ ఉన్నాయని ఆరోపించాడు. వారు ఫేస్‌బుక్‌లో తన క్షమాపణను పోస్ట్‌ చేయమని అన్నట్లుగా పేర్కొంటాడు. ఉద్రికతలను తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఇద్దరు సెక్యూరిటీ అధికారులు మెయిన్‌ గేటు వద్ద ఉన్న వారి కంప్యూటర్‌లు ఉపయోగిం చుకోమని అంటారు. ప్రశాంత్‌, అతని స్నేహితుడు సెక్యూరిటీ అధికారుల జీపులో సుశీల్‌ కుమార్‌ వెంట వెళ్ళమని ఒత్తిడి చేస్తారు. ఈ సందర్భంలో, లాక్కోవడం, తోసుకోవడం జరిగిన ట్లు అనిపించింది. ఫలితంగా సుశీల్‌ కుమార్‌ చొక్కా చిరిగింది, భుజంపై చర్మం కమిలింది.
సుశీల్‌ కుమార్‌ ఉత్తరం అప్‌లోడ్‌ చేసిన అనంతరం , దలీప్‌సింగ్‌ అతన్ని యూనివర్శిటీ అతిథిగృహంలోనే ఉంటావా, అక్కడ ఆ రాత్రికి రక్షణ కల్పించబడుతుంది అని అడుగుతాడు. సెక్యూరిటీ అధికారి, సుశీల్‌ను తనకు వ్యతిరే కంగా ఏదైనా హింస జరిగిందా? తనకేమైన గాయాలయ్యాయా అని అడిగాడు. తనకేవిూ కాలేదు బాగానే ఉన్నానని సుశీల్‌ చెప్పాడు. ఎ.యస్‌.ఎ. విద్యార్ధులు తమ గదులకు తిరిగి వెళ్ళారు. సుశీల్‌ తన సోదరుడు విష్ణుకొరకు ఎదురు చూస్తాడు. కొద్ది సమయంలోనే అతను కారులో వచ్చిన పిదప, ఇద్దరూ కలిసి వెళ్ళడం జరిగింది.
ఇదంతా ఒక గంట సమయంలోనే జరి గింది. సుశీల్‌ కుమార్‌ తరువాత తన వ్యాఖ్య లను తీసివేసి, తన ఫేస్‌బుక్‌ పేజీని తాత్కాలి కంగా నిలిపివేస్తాడు. దీనిపట్ల ఎ.యస్‌.ఎ. విద్యార్ధులు దిగులు చెందుతారు. ముస్లింలకు వ్యతిరేకంగా ఉరితీయబడిన హిందువుల సంఖ్యను పోలుస్తూ తన ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసిన ఆగస్ట్‌ 3 నుండి, స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు ఎ.బి.వి.పి వారు తీసిన ఫోటోలు అప్‌లోడ్‌ చేసిన ఆగస్ట్‌ 15కు మధ్య సామాజిక సమస్యలకు సంబంధించిన పోస్టింగ్‌ లు ఏవిూలేవు.
ఆగస్ట్‌ 4 న, 10 మంది అంబేద్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (ఎ.యస్‌.ఎ) విద్యార్ధు లను పోలీసులు ప్రశ్నించడానికి తీసుకొని వెళ్తారు. అంతకు ముందే సుశీల్‌కుమార్‌ దగ్గర్లోని ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చేరతాడు. ఆరుగురు విద్యార్ధుల పైన (ప్రాక్టోరియల్‌ బోర్డ్‌) క్రమశిక్షణా బోర్డుకు ఫిర్యాదు చేస్తాడు. సుశీల్‌కుమార్‌ ఆగస్ట్‌ 7న ఆసుపత్రిలో అపెండిసైటిస్‌ ఆపరేషన్‌ చేయించుకుంటాడు. రోహిత్‌ ఆత్మహత్య అనం తరం సుశీల్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ వారు దాడిచేసి కొట్టిన ఫలితంగానే ఈ అనారోగ్యం సంభవించినట్లు ఆరోపించాడు.
సుశీల్‌ కుమార్‌ చెప్పిన విషయాలు వైద్య అధికారి డా|| అనుపమారావు పరిశీలనలకు విరుద్ధంగా ఉన్నాయి. ఆమె సుశీల్‌కు వైద్యం అందించిన వైద్యులతో సమావేశం అయింది. ఆమె నివేదికలో ''ఎడమ భుజంపై కొన్ని గాట్లు ఉన్నట్లుగా'' పేర్కొనడం జరిగింది. సుశీల్‌ కుమార్‌కు శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు వెల్లడించిన అంశాలను నిజనిర్ధారణ కమిటీకి మాత్రమే వెల్లడిస్తాను అని ఆమె చెప్పింది. సుశీల్‌ కడుపులో నొప్పిగా ఉన్నదని, అది తనపై జరిగిన దాడి వల్లనే అనే ఫిర్యాదుతో రావడం జరిగిందని, డాక్టర్లు చెప్పినట్లుగా డా|| అనుపమ పేర్కొనడం జరిగింది. అంతర్గతంగా ఏ గా యం లేదని ఆమె తెలిపింది. భుజంపై చర్మం కమిలినట్టుగా ఉండడం తప్ప శరీరంపై ఎక్కడా ఏ గాయం లేదని చెప్పడం జరిగింది.
దేశంలోని యూనివర్శిటీలలోని మంచి ఆరోగ్య కేంద్రాలలో ఒకటిగా హైద్రాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, పరిగణించబడుతుంది. ఇది అన్ని వేళల్లో తెరిచే ఉంటుంది. అక్కడ ఉండే ప్రతి విద్యార్ధికి వైద్యసేవలను అందిస్తుంది. డా|| అను పమారావు ఇలా పేర్కొంటుంది. ''నేను, సుశీల్‌ను వెంటనే ఇక్కడకు ఎందుకు రాలేదని అడిగినాను. ఎ.యస్‌.ఎ. విద్యార్ధులు తనను యూనివర్శిటీ క్యాంపస్‌కు తిరిగి రావడా నికి అనుమతించలేదని, ఒకవేళ వస్తే తిరిగి మళ్ళీ దాడి చేస్తారని భయపడినట్లు చెప్పారు. అతడు జరిగిన దాడి వలన ఒత్తిడిలో అపెండి సైటిస్‌ సమస్య తలెత్తినట్లుగా నమ్ముతాడు''
డా|| సంతోష్‌ ఇనగంటి అనే హైద్రా బాద్‌కు చెందిన గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్‌ కడుపులో తగిలిన దెబ్బల కారణంగా ఇనెఫెక్షన్‌తో జబ్బు సంభవించిందన్న విషయాన్ని కొట్టివేసాడు. ఏదైనా ప్రమాదం సంభవించినపుడు కనిపించే గాయం లోతుగా అయితే అపెండిక్స్‌పై ప్రభావం చూపుతుందని, శరీరంపై తగిలిన దెబ్బల వల్ల అపెండిక్స్‌ ఏ అనారోగ్యానికి గురి అవదని పేర్కొంటాడు.
ఆర్‌.ఎస్‌.ఎస్‌. విశ్వాసపాత్రులు
సుశీల్‌కుమార్‌ తన అభిప్రాయాలు వెలి బుచ్చడానికి అందుబాటులో లేడు.తన సోదరుడు విష్ణు(29) బి.జె.పి అనుబంధ యువజన సంఘం నాయకుడు.తమ తల్లి వినయ కరుణాకర్‌ హెచ్‌సియు దగ్గరలో చందానగర్‌లో నివాసం ఉంటున్నారు. సుశీల్‌ కుమార్‌ హాస్టల్‌లో ఉంటున్నాడు. తమ కుటుంబానికి చాలా కాలంగా ఆర్‌యస్‌యస్‌తో మంచి అనుబంధం ఉన్నది. 47 సంవత్సరాల వయసున్న వినయ భారతీయ జనతాపార్టీ సభ్యురాలు. ఫిబ్రవరి 2న జరిగిన జిహెచ్‌యంసి ఎన్నికలలో ఆ ప్రాంత కార్పొరేటర్‌గా పోటీ చేయడానికి ఆమెకు బిజెపి టికెట్‌ కేటాయించింది. ఈ సంఘటన జరిగిన అనంతర పరిణామాల వలన ఆమె సుశీల్‌ కుమార్‌ ఆరోగ్య పరిరక్షణ కొరకు తన నామినేషన్‌ ఉపసంహరించుకున్నది. కానీ ఆమె పోటీచేయ డం లేక ప్రచారం చేయడం అనేది పార్టీ రాజకీయ ఆత్మహత్య చేసుకోవడంతో సమానం అని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
'క్షమాపణ సంఘటన' తరువాత రోజు బి.జె.పి, యంయల్‌సి రాంచందర్‌రావు, యూని వర్శిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ (ఇంచార్జి) ఆర్‌.పి. శర్మను తన కార్యాలయంలో సుశీల్‌ తల్లితోపాటు సందర్శించాడు. అతడు ఇలా పేర్కొంటాడు. ''హాస్పిటల్‌లోవున్న సుశీల్‌ కుమార్‌ను సందర్శిం చడం, అదే రోజు వైస్‌ ఛాన్స్‌లర్‌తో పాటు ఉన్న అతని తల్లిని ఓదార్చడానికి మాత్రమే నా పాత్ర పరిమితమైంది. మా సమావేశంలో రిజిస్ట్రార్‌, విద్యార్దుల సంక్షేమ అధికారి (డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్స్‌ వెల్‌ఫేర్‌) కూడా ఉన్నారు. యూనివర్శిటీ ప్రాంగణంలో అలాంటి కార్యకలా పాలు విద్యార్ధులకు మంచిది కాదని నేను వైస్‌ ఛాన్స్‌లర్‌తో చెప్పాను''. కానీ రాంచందర్‌ రావు తన చర్యలు యూనివర్శిటీ అధికారులపై అధికారిక ఒత్తిడి కలుగజేస్తున్నాయని అనుకోలేదు. తాను మీడియాతో ఈవిధంగా ప్రతిస్పందించడం జరిగింది. ''ఎ.యస్‌.ఎ. విద్యార్ధులకు వ్యతిరేకం గా ఏదైన ఒక చర్య తీసుకోబడాలి. లేకుంటే ఈ దేశంలో ఎలా ప్రవర్తించాలో బయటి వారు వారికి తెలియజెపుతారు''.
నిజ నిర్ధారణ నివేదిక
యూనివర్శిటీ యంత్రాంగంచే ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయబడింది. ఆ కమిటీకి ప్రొ|| అలోక్‌పాండే నాయకత్వం వహించాడు. ఆయన ఆగస్టు 12న నిజనిర్దారణ నివేదికను సమర్పించాడు. ముఖ్య ఫిర్యాదు దారుడైన సుశీల్‌కుమార్‌ యొక్క వాంగ్మూలం, మెడికల్‌ రిపోర్ట్‌ అందుబాటులో లేకపోవడం వలన తమ నివేదిక అసంపూర్ణంగా ఉన్నదని, ఈ నివేదికను 3,4 రోజులలోనే సమర్పించాలని శర్మ కోరడాన్ని పాండే విమర్శించాడు. తన కేసును బలపర్చ డానికి ఉత్తరంతో సహా సుశీల్‌కుమార్‌చే నియమించబడిన కృష్ణ చైతన్య వాంగ్మూలం ఆధారంగా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అతను భౌతికంగా దాడి జరిగినట్లుగా ఏ ఆధారం ఇవ్వలేకపోయాడని క్రమశిక్షణా బోర్డు గమనించింది. ఈ నివేదిక ఇరు వర్గాల వారికి గట్టి హెచ్చరిక చేయాలని సిఫారసు చేసింది. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని అనుకోవ డం జరిగింది. దీనితో పాటుగా వీలైనంత త్వరలో సుశీల్‌కుమార్‌ వాంగ్మూలం కూడ తీసుకోవాలని అనుకోవడం, వైస్‌ ఛాన్స్‌లర్‌ సమక్షంలో తన సమ్మతితో జరిగింది. ఇదంతా అంబేద్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ విద్యార్థులకు వ్యతిరేకంగా చర్య తీసుకోవాలని సుశీల్‌ కుటుంబం నుండి శర్మను రాజకీయంగా ఒత్తిడి చేయడం, దానిని అతడు తట్టుకోలేక పోయిన ట్లుగా గమనించడం జరిగింది.
బోర్డుకు ఆహ్వానించబడిన ఇరువురు అధ్యాపకులు, ఉత్తర్వుల అమలు తీరుతో విభేది స్తూ అది ఏకపక్షంగా ఉందంటూ వైస్‌ ఛాన్స్‌ల ర్‌కు ఒక ఉత్తరం వ్రాస్తారు. యూనివర్శిటీ ఆఫ్‌ హైద్రాబాద్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (యుహెచ్‌టిఎ) కార్యదర్శి దీపా శ్రీనివాస్‌, అప్పటి అధ్యక్షుడు కె. లక్ష్మీనారాయణచే ఆగస్ట్‌ 12న వ్రాయబడిన లేఖ, సిఫారసుల పై వారికి ఓటు వేసే హక్కులేదని, వారు ఆహ్వానితులు మాత్రమేనని మధ్యంతర ఉత్తర్వుల ద్వారా తెలియపరచినట్లు ఆరోపించింది. కమిటీలలో ఎన్నుకోబడిన ప్రతినిధులను (విద్యార్థి, అధ్యాపక, బోధనేతర సిబ్బంది) చేర్చడం అనేది, కమిటీలో సభ్యులు అని అనిపించుకోవడం కన్నా ముఖ్యం అని, సభ్యులందరు చర్చించి తీసుకున్న నిర్ణయం కన్నా ఓటింగ్‌ ద్వారా తీసుకునే నిర్ణయాలు, అలాంటి కమిటీల ఉద్దేశ్యాలను అడ్డుకుంటాయని ఆ ఉత్తరంలో పేర్కొనడం జరిగింది.
యూనివర్శిటీలో ఆంతరంగిక రక్షణ యంత్రాంగం ఉండగా క్యాంపస్‌ లోపలికి పోలీ సులను ఎలా అనుమతించారన్న ప్రశ్నను ఆ ఉత్తరం లేవదీసింది. పోలీసులు క్యాంపస్‌ నుండి విద్యార్థులను పట్టుకొని పోవడానికి ఎందుకు అనుమతించారు, విద్యార్థులను ఒక రోజల్లా ఎందుకు నిర్బంధంలో ఉంచారు? యూని వర్శిటీ గ్రాంట్స్‌ కవిూషన్‌ (యుజిసి) ప్రకారం 556 పోస్టులకు గాను, 150 ఖాళీ పోస్టులు పోను, 406 మంది బోధనా సిబ్బందిలో సగానికి పైన ఉన్న సిబ్బందికి యు.హెచ్‌.టి.ఎ. ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆ సంఘం ఇకముందు ఓటింగ్‌ హక్కు లేకుండా దేనిలోను పాలుపంచు కోమని ప్రకటించింది. దానర్ధం క్రమశిక్షణ బోర్డు ఉనికిలో లేనట్టు. అయినప్పటికి ఒక క్రొత్త నిజ నిర్ధారణ కమిటీ ఇతర వాంగ్మూలాలతో కొన సాగుతున్నది.
ఆగస్ట్‌ 17న సికింద్రాబాద్‌ యం.పి. దత్తాత్రేయ హెచ్‌.సి.యు క్యాంపస్‌లో 'కులతత్వ, తీవ్రవాద, జాతి వ్యతిరేక' రాజకీయ వాతావ రణం ఉందని వివరిస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఒక ఉత్తరం వ్రాశాడు. ఆయన సుశీల్‌ కుమార్‌పై ఎ.యస్‌.ఎ. విద్యార్ధులు భౌతిక దాడి చేస్తే ఆసుపత్రి పాలు అయినట్లు, ఘటన పట్ల యూని వర్శిటీ పాలనా విభాగం ఏమీ మాట్లాడకుండా ప్రేక్షక పాత్ర వహించినట్లు ఆరోపించాడు. ఈ ఉత్తరం సంబంధిత మంత్రివర్గ శాఖలోని కార్యదర్శి స్థాయి అధికారి నుండి హెచ్‌.సి.యు. రిజిస్ట్రార్‌కు పంపించడం జరిగింది. విషయాన్ని జ్ఞప్తిచేస్తూ ప్రతి రెండు వారాలకు ఒకటి చొప్పున అయిదు ఉత్తరాలు ముందుగా రిజిస్ట్రార్‌కు, తరువాత వైస్‌ ఛాన్స్‌లర్‌కు పంపడం జరిగింది. రెండవ ఉత్తరం (రిమైండర్‌) పంపే సమయానికి శర్మస్థానంలో ప్రొ|| పొదిలి అప్పారావు వైస్‌ ఛాన్స్‌లర్‌గా వచ్చాడు. రామకృష్ణ రామస్వామి రాజీనామా అనంతరం ఆ స్థానం సంవత్సర కాలంగా ఖాళీగా ఉంది. నాల్గవ ఉత్తరం (రిమైండర్‌) అక్టోబర్‌ 20, 2015న స్వయంగా హెచ్‌.ఆర్‌.డి. సహాయ కార్యదర్శి సుఖబీర్‌సింగ్‌ సంధు తన స్వహస్తంతో ''ప్రొఫెసర్‌ పొదిలి'' అని సంభోదిస్తూ వ్రాశాడు. దానిలో '' సంఘట నలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకొని వీలైనంత త్వరలో జరిగిన వాస్తవాలను తెలియపర్చాలని'' వ్రాశాడు. ఈ ఉత్తర ప్రత్యుత్తరాలను ముఖ్యమైన వ్యక్తుల నుండి వచ్చే ఉత్తరాలకు సమాధానంగా వ్రాసే దైనందిన కార్యక్రమంగా స్మృతి ఇరానీ సమర్ధించుకొన్నది.
న్యాయస్థానానికి వెళ్ళిన తల్లి
ఈ ఒత్తిడి సరిపోదు అన్నట్లు సుశీల్‌ కుమార్‌ తల్లి వినయ హెచ్‌.సి.యులో తన కుమారునికి ప్రాణహాని ఉన్నది కాబట్టి రక్షణ కల్పించమని కోరుతూ ఆగస్ట్‌ 26న హైద్రాబాద్‌ హైకోర్టులో ఒక కేసుదాఖలు చేసింది. అంతకు ముందు అనుకున్న విధంగా అదే రోజు సుశీల్‌ క్రమశిక్షణ బోర్డు ఎదుట వాంగ్మూలం ఇచ్చాడు. యూనివర్శిటీ పాలకమండలి, రక్షణ సిబ్బంది, సిబ్బందితో పాటు పోలీసులు ఎ.యస్‌.ఎ. విద్యార్ధులతో కుమ్మక్కు అయినట్లు తన పిటిషన్‌లో ఆమె నిందారోపణలు చేసింది.. దళితుడైన డీన్‌, స్టూడెంట్స్‌ వెల్‌ఫేర్‌ (డి.యస్‌.డబ్ల్యు) కూడ అమర్యాదగా ప్రవర్తించినట్లుగా పిటిషన్‌లోని 4వ పేరాలో నిందించడం జరిగింది. వినయ తన పిటిషన్‌లో డి.యస్‌.డబ్ల్యు ప్రకాష్‌బాబు ధోరణికి అవాక్కయినట్లుగా, అతనే దాడిచేసిన వారిని ప్రోత్సహించాడని పేర్నొన్నది. ఫేస్‌ బుక్‌లో పోస్ట్‌ చేసిన దాని ప్రకారం వారు తన కుమారుని గది వద్దకు కబురు చేసిన తరువాత మధ్యరాత్రి వెళ్ళినట్లుగా పేర్కొనడం జరిగింది. తన కుమారుడు క్రమశిక్షణ బోర్డు కమిటీకి 26.08.2015 న కనిపించాడు. ఆమె తన కుమారునితో పాటు క్యాంపస్‌కు వెళ్లి కొంత మంది సిబ్బందిని కలిసింది. వారు కనీసం సానుభూతిని ప్రదర్శించక పోవడం, తాను కొంత అసౌకర్యానికి గురిఅయినట్లు తెలిపింది. ఇక న్యాయస్థానం ఒక్కటే మార్గం అనుకున్నది.
సస్పెన్షన్‌ నిరసనలు
ఈ సంఘటనలో సుశీల్‌కుమార్‌ చెప్పిన విధంగా పాల్గొన్న ఐదుగురు విద్యార్థులను మిగిలిన సెమిస్టర్‌ వరకు అన్ని తరగతులకు హాజరు కాకుండా హాస్టల్‌ నుండి వెంటనే సస్పెండ్‌ చేయాలని ఆగస్ట్‌ 31వ తేదీన క్రమశిక్షణా బోర్డు సిఫారసు చేసింది. సెప్టెంబర్‌ 8న ఉత్తర్వులు వచ్చాయి. ఆ అయిదుగురు విద్యార్థులు : ప్రశాంత్‌, రోహిత్‌, పెద్దపూడి విజరుకుమార్‌, రాజనీతి శాస్త్రం పి.హెచ్‌.డి. విద్యార్ధి చెముడుగుంట శేషయ్య, వేల్పుల సుంకన్న ఫిలాసఫి పి.హెచ్‌.డి. విద్యార్థి.
ఏ.యస్‌.ఏ, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకత్వాన యూనివర్శిటీ క్యాంపస్‌లో నిరసన జ్వాలలు పెల్లుబికినాయి. వారికి పరోక్షంగా బోధనా సిబ్బంది, పాలనా విభాగానికి చెందిన సిబ్బంది మద్దతు పలికారు. మూడురోజుల అనంతరం ఒక కొత్త కమిటీ ఈ సంఘటన పూర్వ పరాలను పరిశీలించడానికి ఏర్పడుతుంది, ఆ కమిటీ చెప్పిన విధంగా విద్యార్థులు నడుచుకో వాలన్న షరతుపై సస్పెన్షన్‌ తొలగించబడింది.
ఏక పక్షంగా రూపొందించబడిన ఎగ్జిక్యూ టివ్‌ కౌన్సిల్‌ యొక్క సబ్‌కమిటీ నివేదిక రావడా నికి మూడు నెలలు ఆలస్యం జరిగింది. యూని వర్శిటీ ఆఫ్‌ హైద్రాబాద్‌ 1974 చట్టం ప్రకారం, యూనివర్శిటీ పాలకవర్గం తీసుకున్న క్రమశిక్షణా చర్యలను సవాల్‌ చేస్తూ విద్యార్థులు చేసుకున్న విన్నపాలను వినడానికి ఒక ట్రిబ్యునల్‌ రూపొందించబడుతుంది. ఆ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదుదారుడైన విద్యార్థి, ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌చే నియమించబడిన సభ్యుడు, భారత రాష్ట్రపతిచే నియమించబడిన ఒక పరిశీలకుడు ప్రతినిధు లుగా ఉండాలని చట్టం పేర్కొన్నది. క్రమశిక్షణా బోర్డు సస్పెండ్‌ చేస్తూ చేసిన నిర్ణయం పట్ల చేసిన అప్పీలు విషయంలో పైన తెల్పిన విషయా లు ఏవీ అనుసరింపబడలేదు. ఈ విషయాన్ని సమ్మెచేస్తున్న ఏ.యస్‌.ఏ. కార్యదర్శి ఉత్తరం ద్వారా తెలియజేశాడు. ఆ కమిటీలో యు.హెచ్‌. టి.ఎ. ప్రతినిధులు కూడ ఎవ్వరూ లేరు. దానికి బదులుగా సీనియర్‌ ప్రొఫెసర్‌ అయిన విపెన్‌ శ్రీ వాత్సవ నాయకత్వాన ఏర్పడిన ఆరుగురు సభ్యుల అడ్‌హాక్‌ కమిటీ క్రమశిక్షణా బోర్డు నిర్ణయంతో ఏకీభవించింది.
యూనివర్శిటీ నిర్ణయాలను చివరగా నిర్ధారించే అధికారం ఉన్న వైస్‌ ఛాన్స్‌లర్‌ విద్యార్థులకు విధించిన శిక్షను ఈ విధంగా తగ్గించాడు. ''తొలగింపబడిన విద్యార్ధులు గదులలోనికి ప్రవేశించడానికి, భోజనశాలలకు, అందరు తిరిగే ప్రాంతాలకు అనుమతిలేదు. అదేవిధంగా వారి కోర్సు పూర్తి కావడానికి మిగి లిన కాలంలో వారు ఏ ఎన్నికలలో పాల్గొనడా నికి అనుమతి లేదు.'' అని రోహిత్‌ చనిపోవడానికి ఖచ్చితంగా ఒక నెల ముందు, అంటే డిశంబరు 16న ఆ ఐదుగురు విద్యార్ధులకు తెలియపర్చ బడింది. అప్పటి నుండి జనవరి 14 మధ్య కాలంలో పాలనా విభాగం నుండి ఏ ఒక్కరు వారి దగ్గరకు పోయే ప్రయత్నం చేయలేదు.
సుశీల్‌కుమార్‌ నుండి విద్యార్ధులు క్షమా పణలు కోరిన మార్గం తప్పా? ఒకవేళ ఐనా ఇంత కఠినమైన శిక్ష అవసరమా? అప్పారావు నాయకత్వాన ఉన్న పాలకవర్గం అది అవసరం అనే అంటుంది. కొంతమంది బోధనాసిబ్బంది రాజకీయ ఒత్తిడి ప్రభావంతో అప్పారావు ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా ఒప్పుకున్నారు.
వైస్‌ ఛాన్స్‌లర్‌ నియామకం దాదాపు ఎప్పుడూ రాజకీయ నిర్ణయంపైనే ఆధారపడు తుంది. అప్పారావు నియామకం దానికి భిన్నంకాదు రెండు దశాబ్దాల పాటు సేవలందిం చిన ఒక అధ్యాపకుడు ''అతడు (అప్పారావు) ఈ క్యాంపస్‌లో అంత సీనియర్టీ ఉన్న వ్యక్తికాదు. అతనికి బిజెపి, టి.డి.పి, పార్టీల మద్దతు ఉండి ఉంటుంది. అతడు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు, మరొక టి.డి.పి యం.పి. కేంద్ర మంత్రి సుజనా చౌదరికి బాగా తెలుసు అని, దానితోపాటు అప్పారావు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం లోని కోస్తా ప్రాంతంలోని బలమైన కమ్మ సామా జిక వర్గానికి చెందిన వ్యక్తి అని'' అంటాడు. టి.డి.పి, కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్న పార్టీ కాబట్టి ఈ నిర్ణయం ప్రభావితం చేయబడి ఉంటుంది.
నిరవధికంగా సెలవుపై వెళ్ళిన అప్పా రావు, ఇన్‌ఛార్జి వైస్‌ ఛాన్స్‌లర్‌గా ఉన్న విపెన్‌ శ్రీవాత్సవ (ఈయన కూడ సెలవుపై వెళ్ళాడు) ఇరువురిపై గతంలో కులవిద్వేషాల ఆరోపణలు ఉన్నాయి. వారు ఆ ఆరోపణలను నిరాకరించారు. కానీ వారు అంత తేలికగా మారేవారు కాదు. అప్పారావుకు సంబంధించిన కేసు 2002లో అతడు ఛీప్‌ వార్డెన్‌గా ఉన్న సమయంలో విద్యార్థులే నిర్వహించుకునే హాస్టళ్లలో అవినీతి ఆరోపణలు లేకుండా చేయాలని కొన్ని సంస్కరణ లు చేసే ప్రయత్నం చేశాడు. కొనుగోళ్ళ కమిటీ ఏర్పడిన సమయంలో, రోటేషన్‌ పద్ధతిలో మేనే జర్‌గా ఒక దళిత విద్యార్థి ఉన్నాడు. విద్యార్థులు భయపడినట్లుగానే, బోజన ఖర్చులు పెరిగినాయి. ఆ సంవత్సరం జనవరి 10న, 10 మంది దళిత విద్యార్థులు పెరిగిన ఖర్చులకు సంబందిం చిన సమస్యలపై అప్పారావును కలిసినపుడు అతడు స్పందించలేదు. చిన్న తగాదా జరిగింది. అప్పారావు తనను విద్యార్థులు బాగా కొట్టినట్లు ఆరోపించాడు. ఫలితంగా ఆ 10 మంది దళిత విద్యార్థులు బహిష్కరింపబడినారు. కొన్ని సంవత్సరాల అనంతరం మాత్రమే హెచ్‌.సి.యు. నుండి వారు తమ డిగ్రీలను పొందగలిగారు. అందులో ఒకరు యూనివర్శిటీ ప్రొఫెసర్‌ కూడ అయ్యారు.
విపెన్‌ శ్రీవాత్సవ ఫిజిక్స్‌ విభాగం డీన్‌గా ఉన్న సందర్భంలో తమిళనాడు నుండి సెంతిల్‌ కుమార్‌ అనే దళిత విద్యార్థి పిహెచ్‌.డి కోర్సులో చేరినాడు. పిహెచ్‌.డి పూర్తి అయింది అని నిర్ధారించడానికి ఒక వ్రాత పరీక్ష, ఒక మౌఖిక పరీక్ష ఉంటుంది. సెంతిల్‌ కుమార్‌ విషయంలో ఏ వివరణ లేకుండా, అదనపు పరీక్ష నిర్వహిం చడం వలన అతని పిహెచ్‌.డి రెండు సంవత్సరాలు పూర్తయ్యేనాటికి నిర్ధారించబడ లేదు. ఆ క్రమంలో అతడు తన స్కాలర్‌షిప్‌ కోల్పోయాడు. పి.హెచ్‌.డి డిగ్రీ వస్తుందన్న ఆశ కోల్పోతాడు. ఫలితంగా 2008 ఫిబ్రవరి 24న ఆత్మహత్య చేసుకున్నాడు.
స్కూల్‌ ఆప్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగం ప్రొఫెసర్‌ వినోద్‌ పవరాల నేతృత్వం వహిస్తున్న ఆంతరంగిక కమిటీ నివేదికలో ఈ విధంగా పేర్కొనబడింది. ''ఫిజిక్స్‌ విభాగం రిజర్వేషన్‌ కేటగిరీకి చెందిన విద్యార్ధుల పట్ల పని కట్టుకొని వివక్ష చూపినట్లుగా కమిటీ దృష్టికి రాకపోయి నా, కోర్సుకు సంబంధించిన, కొన్ని అస్పష్టమైన, తేడాల వల్ల ప్రభావానికి లోనైయ్యేది యస్‌.సి., యస్‌.టి. విద్యార్ధులు అనేది నిజం. ఫలితంగా తమ పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారన్న భావనకు యస్‌.సి., యస్‌.టి. విద్యార్థులు లోనవుతున్నారు. యస్‌.సి. యస్‌.టి. విద్యార్థుల పట్ల ఆ విభాగం వారు వివక్ష చూపుతున్నారని ఫిజిక్స్‌ విభాగానికి చెందిన విద్యార్థులందరూ ఈ కమిటీకి తెలియజేశారు''.
'వెలివాడ' నిరసన
రోహిత్‌ కేసులో ముందు ఐదుగురు విద్యార్థు లు కమిటీ నిర్ణయాన్ని అంగీకరించి తమ స్నేహితుల గదులలో ఉన్నారు. కానీ యూని వర్శిటీ గదులు చిన్నగా ఉండడంతో అవి జనంతో నిండిపోతున్నాయి. తమకు అన్యాయం జరిగిందన్న భావన వారిని మరింత గాయపరిచింది. దీనిని ప్రతిఘటించాలన్న నిర్ణ యం డిశంబర్‌లో తీసుకొనబడింది. బహిష్కరిం చబడిన ఐదుగురు విద్యార్థులు యూనివర్శిటీ బయట ఉత్తరం వైపు ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ దగ్గర చలిలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. దానిని వారు 'వెలివాడ'గా (అంటే 'ఊరి బయట') పిలుచుకున్నారు. గ్రామాలలో దళితులు ఊరికి బయటనే నివసిస్తారు.
రోహిత్‌తో సహా బహిష్కృతులైన విద్యార్థు లందరూ వారి వారి విభాగాలలో తెలివైన వారు. వారందరికి పేదరికం, వివక్షకు సంబం ధించిన దయనీయమైన కథనాలు ఉన్నాయి. వారు వారి కుటుంబాలలో మొదటి తరానికి చెందిన పట్టభద్రులు. చెముడు గుంట శేషయ్య నెల్లూరు జిల్లాకు చెందిన గ్రామం నుండి వచ్చాడు. మరణించిన అతని తల్లిదండ్రులు వ్యవసాయ కార్మికులు. ఆ గ్రామానికి చెందిన ఒక రెడ్డిభూస్వామికి సహాయకులుగా పనిచేశారు. తన తల్లిదండ్రులు నెలకు 20 రూపాయలు చెల్లించలేక పోవడంలో శేషు కొంత కాలం మాత్రమే ట్యూషన్‌కు వెళ్ళాడు. దళితులు, ఇతర తక్కువ కులానికి చెందిన విద్యార్థులు మాత్రమే వెళ్ళే పాఠశాలకు శేషు 'క్లాస్‌లో విద్యార్థుల నాయకుడు'. భూస్వాములైన రెడ్లు తమ పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలలకు పంపేవారు. క్లాస్‌లో విద్యార్థుల నాయకుడు' స్థానం తన పాఠశాల దాటి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు నిర్వహించే 'ప్రైవేట్‌ ట్యూషన్‌' దాకా వెళ్లింది. అక్కడ తనతో పాటు ఉన్నత కులాలకు చెందిన వారి పిల్లలు కూడా ఉండేవారు. వారు ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తిస్తే, 'క్లాస్‌ లీడర్‌'గా తమ ఉపాధ్యాయునితో చెబు తానంటే ఉన్నత కులాలకు చెందిన వారు తమను ముట్టుకోవద్దని చెప్పేవారు. కుల వివక్ష అంటే ఏమిటో శేషయ్యకు అప్పుడు అర్ధం అయింది.
శేషు, ఇతర బహిష్క ృత విద్యార్థులు హెచ్‌.సి.యు లాంటి విశ్వవిద్యాలయాలలో చదవడానికి చాలా కష్టపడినారు. రిజర్వేషన్‌ల ద్వారా లబ్దిపొందిన అంతకు ముందు తరం దళితులు వారికి ఆదర్శం. హెచ్‌.సి.యుకు వెళ్ళి న తరువాత హాజరైన ఒక పెళ్ళిని శేషు గుర్తు చేసుకుంటాడు. యూనివర్శిటీలో తన సీనియర్‌ విద్యార్థి ఒక దళిత జంట వివాహానికి ఆహ్వాని స్తాడు. అక్కడికి సూట్‌, బూటు వేసుకొనివున్న పెద్దలు కూడ హాజరయినారు. వారు దళిత ఉద్యమంలో కూడా చురుకుగా పనిచేస్తారు. తనలాగా మంచి ఇంగ్లీష్‌ మాట్లాడలేని, గ్రామాల నుండి వచ్చి ఏ.యస్‌.ఏ.లాంటి సంఘాలలో పనిచేసే వారు చాలా మంది ఉంటారు అని శేషు అంటాడు. విద్య ద్వారా సామాజిక సమస్య లను అధిగమించవచ్చుననే ఆశ ఈ అనుభవం ద్వారా కలిగిందని, ఇది ఒక భిన్నమైన అనుభవం అంటాడు. రిజర్వేషన్ల శకం తరువాత తన సంఘం, ఇతర దళిత సంఘాలు విశ్వవిద్యాల యాలలో బాగా బలపడ్డాయని అంటాడు.
రోహిత్‌ మరణం విషాదం కావచ్చు. కానీ విశ్వవిద్యాలయాలలో విశాలమవుతున్న, పెరుగుతున్న మేధో పరమైన, సాంస్కృతిక ఉద్యమాల యుగానికి అది సూచికగా ఉంది. గత మూడు సంవత్సరాలుగా హెచ్‌.సి.యులో జరిగిన ఎన్నికలలో భారత విద్యార్ధి ఫెడరేషన్‌తో కలిసి పోటీ చేసి గెలుపొందుతున్న బలమైన విద్యార్ధి సంఘాలలో ఒకటిగా ఏ.యస్‌.ఏ ఉంటూ వస్తున్నది.
తరగతి గదులలో విభజన
''ముందు మనం కొత్త వాళ్ళను కలుసుకో వాలనే తొందరలో ఉంటాం. పెద్దవాళ్ళం అయ్యామని, స్వేచ్ఛగా ఉండొచ్చనే భావనలో కూడ ఉంటాం. తరగతులలో బోధన జరిగిన ఒక్కనెలలో, తరగతి గది దానంతట అదే విభజిం చబడుతుంది. నీకు సంబందించిన వారెవరు? నీ స్నేహితులెవరు? ఏ ప్రాంతానికి చెందిన వాడివి? నీకు తెలిసిపోతుంది,'' అని ప్రాచీన భారతదేశ చరిత్ర పిహెచ్‌.డి విద్యార్ధి ప్రభాకర్‌ పేర్కొంటాడు. ప్రభాకర్‌ ఇప్పటికి కొన్ని సంవత్స రాలుగా తన పిహెచ్‌.డి పూర్తి చేయడానికి పోరాడుతున్నాడు. రోహిత్‌ మరణించిన వెంటనే వైస్‌ఛాన్స్‌లర్‌, బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరాహారదీక్షకు పూనుకొని ముందుకొచ్చిన విద్యార్ధులలో ఒకడు.
''ప్రొఫెసర్‌లు కేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డ్‌, హార్వర్డ్‌ యూనివర్శిటీల నుండి వస్తారు. వారు ఉన్నతస్థాయి ఇంగ్లీష్‌ మాట్లాడతారు, అర్ధం చేసుకోలేని వారి కొరకు ఆ భాష స్థాయిని తగ్గించే విషయం గురించి పట్టించుకోరు. వారిని (ప్రొఫె సర్‌లను) అందుకోలేకపోతున్నారన్నట్లుగా పట్టణ ప్రాంతాల నుండి వచ్చే ధనవంతుల పిల్లలు ఈ విద్యార్థుల వైపు చూస్తారు'' అని ప్రభాకర్‌ అంటాడు. 2008లో ఒక విద్యార్థి మరణం తరు వాత విద్యార్థులకు కోచింగ్‌ ఇవ్వాలని ఒక కమిటీ సూచించింది. విద్యార్థుల అవసరాలు తీర్చగలిగిన ఆ కోచింగ్‌ ఇప్పించడంలో పాలక వర్గం విఫలమయింది.
విద్యార్థులు ఒకే నేపథ్యం కలిగిన విద్యార్థు లతో స్నేహం చేస్తే ఆ క్యాంపస్‌ చాలా అనుకూ లంగా ఉంటుంది. కానీ అది విద్యార్థుల జీవితా లను కూడ తెలియపరుస్తుంది. వెంటనే ఒక విధమైన నిరుత్సాహం వచ్చేస్తుంది. విద్యా విషయ కంగా బాగా చేయలేకపోతున్నామనేది కూడా ఒత్తిడి పెరగటానికి కారణం అవుతుంది.
ఇవన్నీ అణగారిన వర్గాల నుండి వచ్చిన విద్యార్థుల అవసరాలు తీర్చడానికి, సమగ్రతను కాపాడే దిశగా కళాశాల పాలనా విభాగం ముందున్న కొత్త సవాళ్ళు. కుల ప్రాతిపదికన బోధన, బోధనేతర సిబ్బంది విభజనను ప్రారంభించిన పాలకవర్గంలోనే విద్వేషాలు న్నాయని అధికారులు ఆలస్యంగా తెలుసు కున్నారు.
2013లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు స్పంది స్తూ కళాశాల క్యాంపస్‌లో జరిగే ఆత్మహత్యలను సుమోటోగా తీసుకొని,విద్యావిషయక సమస్యలను పరిష్కరించడం, దళిత, ఆదివాసి, మహిళల ప్రత్యేక అవసరాలు తీర్చగలిగే సలహాదారుల నియామకం, పి.హెచ్‌.డి విద్యార్థుల ప్రవర్తనను నియంత్రించే నియమ నిబంధనలను సమీక్షిం చడం లాంటి కొన్ని చర్యలను సిఫారసు చేసింది.
''భారతదేశంలో ఉన్నత విద్య ఒక క్రమ పద్ధతిలో సవర్ణ హిందువులకు అనుకూలంగా, దళిత ఆదివాసి విద్యార్థుల పట్ల వివక్షను ప్రదర్శి స్తుంది''. అని యు.జి.సి. మాజీ ఛైర్మన్‌ సుఖదేవ్‌ థోరట్‌ రోహిత్‌ ఆత్మహత్య సందర్బంగా మాట్లాడు తూ పేర్కొంటాడు.
రోహిత్‌ క్యాంపస్‌లో పొందిన అనుభవం, దళిత కుటుంబ నేసథ్యం నుండి వచ్చిన విద్యా ర్థుల అనుభవాలకు భిన్నంగా లేదు. అతడు చదువులలో ముందుండి ఎదుగుతున్న నాయ కుడు. తన సూసైడ్‌ నోట్‌లో వ్రాసినట్లు తాను నీడలో ఉండి తన చూపును నక్షత్రాలపై ఉంచాడు.
ఈ విషాద ఘటనకు దారి తీసిన నిరసన సభలోని మాట ప్రతిధ్వనించాలంటే, కళాశాల క్యాంపస్‌లలో, విద్యార్ధులలో, విద్యా విషయక అంశాలలో, సాంస్కృతిక జీవనంలో దేశవ్యా ప్తంగా నాటకీయమైన మార్పురావాలి. ఒక్క రోహిత్‌ మరణిస్తే, ప్రతి ఇంట్లో ఇంకొక రోహిత్‌ పుట్టాలి.
- కునాల్‌ శంకర్‌ 
(అనువాదం: బోడపట్ల రవీందర్‌)

అంబేద్కర్‌ ఆలోచనలు సమకాలీన ప్రాధాన్యత


అంబేద్కర్‌ ఆలోచనలు సమకాలీన ప్రాధాన్యత


                 డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ యొక్క వ్యక్తిత్వానికి సమకాలీన దేశ రాజకీయల్లో చాలా ప్రాధాన్యత వచ్చింది. ఇప్పుడు అందరు అంబేద్కర్‌ గురించి మాట్లాడుతున్నారు. రకారకాల దృక్పథాల నుంచి రకరకాలుగా అంచనాలు వేస్తున్నారు. అయన మౌలిక అలోచనలను తమ అవసరాలకు అనుగుణంగా కుదించి, వక్రీకరించి (కొంతమంది) ప్రచారం చేస్తున్నారు. అంబేద్కర్‌ జీవితానికి, ఆలోచన లకు ఈ సమయంలో ఎందుకు ఇంత ప్రాధాన్య త వచ్చింది? అంబేద్కర్‌ జీవిత కృషి ఎక్కువ భాగం స్వాతంత్య్రానికి పూర్వం జరిగింది. ఆయన 1956లోనే చనిపోయారు. ఆయన జీవించిన కాలంలో అనేక మంది ఆయన భావాలను పూర్తిగా తిరస్కరించారు. ఆయన కృషిని వ్యతిరేకించారు. కాని అప్పుడు ఆయనను తిరస్కరించిన సంస్థలకు, భావాలకు వారసులు గా ఉన్నవారు ఇప్పుడు ఆయనను ఆకాశానికి ఎత్తి బ్రహ్మరథం పడుతున్నారు. నేడు దేశంలో అంబేద్కర్‌ భావాలకు, వ్యక్తిత్వానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి చర్చించటానికి ఒక రాజకీియ చరిత్రక నేపథ్యం ఉన్నది.
జీవితకాలంలో గుర్తించకుండా అనం తర కాలంలో సమాజం తలకెత్తుకునే పరిస్థితి ఎంతో మంది మహావ్యక్తులకు తప్పలేదు. గురజాడ అభ్యుదయ సాహిత్యం రాసినప్పుడు ఆయన గురించి పెద్దగా పట్టించుకోలేదు. జాతీయ ఉద్యమ కాలంలో ప్రజా ఉద్యమాలు, వామపక్ష ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడినా 1940 దశకంలోనే ఆయన భావాలు ప్రజల్లో బాగా వ్యాప్తి చెందాయి. కొన్ని సందర్భల్లో కొన్ని తరగతులకు ఆ భావాలు ఉపయోగపడుతాయి అనుకుంటే వాటిని బయటికి తీసి, మెరుగులు దిద్ది ప్రాచుర్యం కల్పిస్తారు. వర్గ అవసరాలకు వినియోగించుకుంటారు. కారల్‌మార్క్స్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురయింది. మార్క్స్‌ పెట్టుబడి గ్రంధం రాసినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. కార్మిక ఉద్యమం ఎప్పుడయితే బలపడిందో, యూరప్‌ దేశాల్లో నిర్మాణయుతం అయిందో, ఎప్పుడైతే ఉద్యమాలు, పోరాటాలు పెరిగాయో అప్పుడు పెట్టుబడి గ్రంధానికి విపరీతమైన అదరణ వచ్చింది. ఆయన ప్రాతిపాదించిన లక్ష్యాలను సాధించాలనుకున్నవారు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఆయన భావాలకు ప్రాచుర్యం వచ్చింది. ఆయన అలోచనలు తమ జీవితాలకు అద్దం పడుతున్నందునే ప్రజలు ఆయన వైపు అకర్షించబడ్డారు. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విషయంలో కూడా నేడు అదే జరుగుతున్నది.
అంబేద్కర్‌ భావపరంపర వ్యాప్తిచెందితే ప్రమాదం అనుకున్న అరుణ్‌శౌరి అంబేద్కర్‌ వ్యక్తిత్వాన్ని చులకన చేస్తు ప్రత్యేకంగా ఒక పుస్తకమే రాశాడు. అంబేద్కర్‌ బలహీన వర్గాల పాలిట దేవుడు కాదు, ఆయన ఒక బూటకపు దేవుడు అని చిత్రీకరించాడు. హిందూత్వ సిద్ధాంతాన్ని, రాజకీయాల్ని సంఫ్‌ుపరివార్‌ ప్రణాళికను ముందుకు తీసుకుపోవడం అరుణ్‌శౌరి లక్ష్యం. ప్రస్తుతం అంబేద్కర్‌ భావ జాలం అందుకు ప్రధానమైన అటకంగాభావిం చినందునే అరుణ్‌శౌరి తన పుస్తకం ద్వారాఅంబే ద్కర్‌ అలోచనలు, వ్యక్తిత్వంపై దాడి చేశాడు.
అంబేద్కర్‌ అలోచనలపై దాడిచేయడం వల్ల అనుకున్న ఫలితాలను పూర్తిగా సాధించడం సాధ్యం కానందునే మరోవైపు నుండి కూడా ఆర్‌.ఎస్‌.ఎస్‌, సంఫ్‌ుపరివార్‌ శక్తులు తమ ప్రయత్నాలను చేస్తున్నారు. అంబేద్కర్‌ ఆలోచన లను వక్రీకరించి, తమకు తగినట్లుగా తీర్చిదిద్ది, ఆయనను తమ వాడిగా చేసుకొనే ప్రయత్నాలను గత కొంతకాలంగా చేస్తున్నారు. అంబేద్కర్‌ హిందుమతాన్ని సంస్కరించి, మెరుగుపర్చడానికి కృషిచేసిన సంఘసంస్కర్త అని, ఇస్లాం, క్రైస్తవ మతాలను తిరస్కరించిన ఆయన ఉత్తమ జాతీ యవాదని అందుకే భారతీయ సంస్కృతిలో భాగ మైన బౌద్దమతాన్ని స్వీకరించాడని ప్రచారం చేస్తున్నారు. సంఫ్‌ుపరివార్‌ సిద్ధాంత కర్తలు అయిన నాయకుల సరసన అంబేద్కర్‌కి స్థానం ఇచ్చి,భ్రమలు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే సంఫ్‌ుపరివార్‌ శక్తులు, బి.జె.పి. చేసే ప్రయత్నాలు నిజాయితి, చిత్తశుద్ధిలేనివి. జీవితాంతం అంబేద్కర్‌ చెప్పిన భావా లు హిందుత్వశక్తుల భావాలకు పూర్తి వ్యతిరేకం. కులవ్యవస్థను నాశనం చేయడానికి, ఆ వ్యవస్థకు ఆలంబనగా ఉన్న హిందు మతభావాలను, హిందుమత బోధలను తుత్తునియలు చేయడానికి అయన జీవితమంతా కృషి చేశారు. హిందూ మతం ఉన్నంత కాలం కులం, అంటరానితనం పోవని, దాన్ని వదిలేస్తేనే దళితులకు విముక్తి లభిస్తుందని అంబేద్కర్‌ బలంగా నమ్మాడు. అందుకే చాలా తీవ్రమైన మీమాంస తరువాత తన అనుయాయులతో హిందు మతాన్ని వీడి బౌద్ధమతాన్ని స్వీకరించాడు. 1930 దశకంలోనే తను హిందువుగా మరణించనని ప్రకటించాడు. ఆయన జీవిత చరమాంకం వర కు మతమార్పిడి గురించి చర్య తీసుకోక పోయినా, ఆయన అభిప్రాయంలో మార్పు రాలేదు. అనేక మంది అనేక కారణాల వలన ఇస్లాం మతంలోకి అకర్షించాలని అంబేద్కర్‌తో చర్చలు జరిపారు. ఆయనను క్రైస్తవమతంలోకి అకర్షించాలని అనేకమంది ప్రయత్నించారు. సిక్కుమతం అయితే ఎలా ఉంటుందని అంబేద్క ర్‌ స్వయంగా ఒక అలోచన చేశారు. అనేక మందితో చర్చించారు. అంబేద్కర్‌ మతమార్పిడి గురించి ఆలోచిస్తున్నారని తెలిసి ఆ ప్రయత్నా లను అడ్డుకోవడానికి కూడా అనేక మంది ప్రయత్నించారు. అంతగా హిందుమతంలో ఉండటం ఇష్టంలేకపోతే పరమతాలయిన ఇస్లాం, క్రైస్తవ మతాలను కాకుండా, జాతీయ స్రవంతిలో భాగమైన ఇంకా ఎదైనా మతం గురించి అలోచించమని హిందు మహాసభ నాయకులు అంబేద్కర్‌ని వేడుకున్నారు. కాంగ్రెస్‌ నాయకుడిగా ఉన్న జగ్జీవన్‌రామ్‌ వంటివారు, దళిత నాయకు లుగా ఉన్న ఎసి రాజావంటి వారు హిందూ మతాన్ని విడిపోవాలన్న అంబేద్కర్‌ అలోచనలను తీవ్రంగా ప్రచారం చేశారు. అయినప్పటికి అంబేద్కర్‌ హిందుమత వ్యవస్థలో సామాజిక న్యాయం సాధ్యంకాదన్న స్పష్టమైన భావంతో ఉన్నందునే మతమార్పిడికి సిద్ధం అయ్యాడు. అందువల్ల అంబేద్కర్‌ను హిందూమత సంస్కర్త గా చిత్రీకరించడానికి సంఘపరివార్‌ శక్తులు చేసే ప్రయత్నాలు కుటిలబుద్ధితో కూడుకున్నవి.
అంబేద్కర్‌ వ్యక్తిత్వాన్ని ప్రధాన స్రవంతి బూర్జువా నాయకుని స్థాయికి పరిమితం జేయాలని కాంగ్రెస్‌ మొదటి నుండీ ప్రయత్నిం చింది. రాజ్యాంగ సభకు జరిగిన ఎన్నికలలో మొదట అంబేద్కర్‌ని కాంగ్రెసు వారు ఓడించారు. ఆయన బెంగాల్‌ నుండి ముస్లింలీగ్‌ సహాయం తో రాజ్యాంగ సభ సభ్యునిగా గెలిచాడు. దేశం విడిపోయినప్పుడు బెంగాల్‌ విడిపోయి, ఆయన సభ్యత్వం రద్దయింది. అపుడు కాంగ్రెస్‌ పార్టీ ముంబాయి ప్రెసిడెన్సీలో కాంగ్రెసు సభ్యుని చేత రాజీనామా చేయించి, ఆ స్థానంలో అంబే ద్కర్‌ని నిలబెట్టి గెలిపించి, రాజ్యాంగ సభకు తీసుకొ చ్చారు. రాజ్యాంగసభలో రాజ్యాంగ ముసాయి దా కమిటీ ఛైర్మన్‌గా చేశారు. అంబేద్కర్‌ లాంటి వాళ్లు తమ మధ్య ఉంటే బలహీన వర్గాల ప్రజల్ని ఆకట్టుకోవటానికి, నియంత్రణ చేయడా నికి ఉపయోగం అని భావించారు. అంబేద్కర్‌ ను తిట్టి తూలనాడిన వాళ్లే తమలో చేర్చుకున్నా రు. దళితులు కమ్యూనిస్టుల వైపు మళ్ళకుండా నిరోధించవచ్చు అనుకున్నారు. అప్పటి వరకూ దళితులు, బలహీనవర్గాలు, వ్యవసాయ కార్మికు లు, ఇతర పేదవర్గాలు కమ్యూనిస్టుల పక్కన ఉన్నారు. అంబేద్కర్‌ను కాంగ్రెసు ఆలింగనం చేసుకోవడంతో దళితులు కూడా కాంగ్రెస్‌ వైపుకు మొగ్గారు. ఆ తర్వాత అంబేద్కర్‌ కాంగ్రెస్‌నుండి దూరమయినా, దళితులు దూరం గాకుండా కాంగ్రెస్‌ జాగ్రత్తపడ్డది. ఇందిరాగాంధి కాలం వరకు దళితులు కాంగ్రెసులో చేరుతూనే ఉన్నారు. కాంగ్రెస్‌కు దూరం అయినా అంబేద్కర్‌ విగ్రహాలను కాంగ్రెసు విడిచిపెట్టలేదు. సరళీ కరణ విధానాలను తలకెత్తుకున్న తర్వాత కాంగ్రెస్‌ పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగింది. దాంతో దళితులు అనేక రాష్ట్రాలలో దూరమవడం ప్రారంభమయ్యింది. అంబేద్కర్‌ను మళ్లీ తమ వాడిగా చిత్రీకరించుకుని, అంబేద్కర్‌ భావాలే తమ భావాలని చెప్పుకోవడమే కాకుండా, దళితులు, ఇతర సామాజిక తరగతు లను తమ వైపు ఆకర్షించుకునేలా ఈరోజు కాంగ్రెస్‌ ప్రయత్నం చేస్తున్నది.
1991లో సరళీకరణ విధానాలు ప్రారంభమైన తర్వాత అంబేద్కర్‌ వారసత్వాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం ప్రారంభమైంది. రిజర్వేషన్లు, సాంఘీక సంక్షేమ పథకాలను బలహీనం చేయటం, భూసంస్కరణల రద్దు తదితర చర్యల వలన దళితులు నష్టపోతు న్నారు. దళితుల ప్రయోజనం కోసం వాటిని రక్షించుకోవలసిన అవసరం ఏర్పడింది. ఈ మధ్యకాలంలో దళితుల్లో మధ్య తరగతి అభి వృద్ధి అయింది. మిగతా కులాల్లో కూడా రిజర్వేషన్లు, ఇతర అంశాల వలన చదువుకున్న ఒకచిన్న మధ్యతరగతి, ఇంకా పైకి ఎగబాకాలి అని ఆశ కలిగిన ఒక చిన్న పొర ఏర్పడింది. రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లను రక్షించుకోవడం, ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్లు విస్తరించడం జరగకపోతే తమకు భవిష్యత్‌ ఉండదన్న భావం ఈ తరగతుల్లో ఏర్పడింది. సరళీకరణ విధానాల పట్ల తీవ్రమవుతున్న బలహీనవర్గాల అసంతృప్తి కూడా అంబేద్కర్‌ పట్ల ఆసక్తి పెరగడానికి మరొక కారణం.
అంబేద్కర్‌ను మన దేశ పాలకవర్గాలు తమకు సంబంధించిన ఒక సింబల్‌గా విని యోగించుకొంటున్నాయి. సింబల్‌గా విని యోగించుకొనే వాటిలో ఆయన విగ్రహం ముఖ్య మైనది. అంబేద్కర్‌ చేసింది ఇతరంగా ఏమీ లేనట్లు, రాజ్యాంగ రచనలో మాత్రమే ఆయన పాత్ర ఉన్నట్లు ఆయన విగ్రహం చేతిలో రాజ్యంగం పుస్తకం పెడతారు. రాజ్యాంగ రచన లో అంబేద్కర్‌ పాత్ర విస్మరించరానిదనే దాంట్లో సందేహం లేదు. రాజ్యాంగ నిర్మాత అని ఆయ నను కొనియాడడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. బలహీన వర్గాల ప్రయోజనాల రక్షణ కోసం రాజ్యాంగంలో రిజర్వేషన్లను జొప్పిం చడంలో అంబేద్కర్‌ కృషి ఎనలేనిది. ఒక లిబరల్‌ ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని తయారు చేయడంలో అంబేద్కర్‌ ముద్ర స్పష్టంగా కన్పి స్తుంది. అయినా మన రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావం వ్యక్తిగత ఆస్తి రక్షణే నన్నది మరువ కూడదు. సామాన్యులకు పనికొచ్చే అంశాల న్నింటిని హక్కులుగా కాకుండా ఆదేశిక సూత్రా లకు పరిమితం చేశారు. రాజ్యాంగం తయారీ లో అంబేద్కర్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఉంటే ఎటువంటి రాజ్యాంగం తయారయ్యేదో రాజ్యాం గ సభకు ఆయన సమర్పించిన మొమొరాండాన్ని చదివితే ఎవరైనా గమనించగలరు. అంబేద్కర్‌ అభిప్రాయాలు రాజ్యాంగంలో పొందుపర్చిన వాటికన్నా తీవ్రమైనవి. ప్రత్యామ్నాయమైనవి. వాస్తవంగా అంబేద్కర్‌లో మౌలిక భావాలతో కూడిన అంశాలు చాలా ఉన్నాయి. కులవ్యవస్థ గురించి, ప్రజాస్వామ్యం గురించి, సమానత్వం గురించి గ్రామీణ సామాజిక వ్యవస్థ గురించి అనేక అభ్యుదయ అంశాలు ఉన్నాయి.
కొత్త వ్యవస్థలో సార్వజనీన ఓటు ఉండాలి. సమానత్వం స్వేచ్ఛ ఉండాలి. వ్యక్తిగత ఆస్తిహక్కుకు రక్షణ ఉండాలన్న విషయాలను వివరించాడు. ఎటువంటి ఆర్థిక వ్యవస్థ ఉండాలో కూడాచెప్పాడు. మిశ్రమ ఆర్థికవ్యవస్థను ప్రతిబింబిస్తూ పెట్టుబడిదారులందరూ కలిసి రూపొందించిన, బాంబేప్లాన్‌కన్నా మరికొంత రాడికల్‌గా ఉండే వాటిని దీనిలో ప్రతిపాది స్తాడు. కీలకమైన పరిశ్రమలు జాతీయం చేయాలి. బీమారంగం వంటి వాటిని జాతీయం చేయాలి. భూమిని జాతీయం చేసి, రైతులకు కౌలుకు ఇచ్చి ప్రభుత్వమే వారికి పెట్టుబడులు అందజేసి ప్రోత్సహించాలని చెప్పాడు.
భారతదేశంలో అత్యంత దుర్మార్గమైనది కులవ్యవస్థ. కులవ్యవస్థను నాశనం చేయాల నేది అంబేద్కర్‌ లక్ష్యం. అందుకే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేయాలని చెప్పాడు. కులవ్యవస్థకు పునాది గ్రామం. గ్రామాల్లో ఉంటే అంటరానితనం నుండి విముక్తి ఉండదు. కాబట్టి దళితులకు ప్రత్యేక గ్రామాల్ని నిర్మించా లని భావించాడు. ప్రత్యేకంగా దళితులకు భూములు కేటాయించండి అని కోరాడు. ప్రస్తుత గ్రామాలలో గ్రామ స్వరాజ్యం అన్న గాంధీజీ నినాదం గ్రామాల్లో అగ్రకులాలకు, ఆధిపత్య కులాలకు పెత్తనం ఇవ్వడమేనన్నది అంబేద్కర్‌ అభిప్రాయం.ఈ అభిప్రాయం అక్షరాలా నిజమేనని అనుభవం చెబుతున్నది. వాస్తవం గా పంచాయతి రాజ్‌ వ్యవస్థ ఏర్పడిన తర్వాత పాలకవర్గాలకు గ్రామాల్లో మంచి పునాది ఏర్పడింది. పాలకవర్గాలను బలపరిచే శక్తులు గ్రామాలలో బలపడ్డాయి. అంబేద్కర్‌ తన జీవిత కాలంలో రా జ్యాంగ నిర్మాణంలో వెచ్చించింది రెండు మూడు సంవత్సరాలు మాత్రమే. మిగిలిన జీవితమం తా కులవ్యవస్థ నిర్మూలన కోసం, బలహీన వర్గాల విముక్తి కోసం పాటుప డ్డారు. అంబేద్కర్‌ వ్యక్తిత్వంలోని ఈ మౌలిక పార్శ్వాన్ని మరుగు పర్చి, రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే ఆయనను చిత్రీకరించడం వాస్తవంగా కులవ్యవస్థ నిర్మూల న గురించి ఆయన చెప్పిన అంశాలను వెనక్కు నెట్టి అంబేద్కర్‌ వారసత్వా నికి అన్యాయం చేయడమే అవుతుంది.
అంబేద్కర్‌లో సామాజిక మార్పుకు తోడ్పడే పార్శ్వాన్ని పెద్దది చేసి, కాపాడుకుని, సామాజిక మార్పు కోసం పోరాడే శక్తులకు ఉపయోగపడే వ్యక్తిగా అంబేద్కర్‌ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాస్త వంగా అంబేద్కర్‌ వ్యక్తిత్వంలో, సిద్ధాంతంలో సామాజిక మార్పుకు దోహదం చేసే వాటిని రక్షించుకుంటూ ముందుకు పోవాలి. ఫ్యూడలి జానికి వ్యతిరేకమైన, సామాజిక మార్పు కు దోహదం చేసే భావజాలాన్ని రక్షించి ముందు కు తీసుకెళ్లే ప్రయత్నం మనం చేయాలి. అంబేద్కర్‌ భారతదేశంలో ప్యూడల్‌ వ్యవస్థను భగం చేయడానికి, దానిలో తీవ్రమైన మార్పుకు దోహదం చేసే కృషిచేశాడు. ఇటువంటి పరిస్థితిలో పాతకాలంలో అభ్యుదయ వాదులు అందించిన దానికన్నా ఒక పదునైన ఆయుదాన్ని అంబేద్కర్‌ నుంచి మనం పొందవచ్చు. దాన్ని తీసుకుని సామాజికమార్పు కోసం మనం ముందుకు సాగాలి.
- బి.వి. రాఘవులు

Dalithashakthi - 2025 - Magazines