Monday, March 7, 2016

అంబేద్కర్‌ ఆలోచనలు సమకాలీన ప్రాధాన్యత


అంబేద్కర్‌ ఆలోచనలు సమకాలీన ప్రాధాన్యత


                 డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ యొక్క వ్యక్తిత్వానికి సమకాలీన దేశ రాజకీయల్లో చాలా ప్రాధాన్యత వచ్చింది. ఇప్పుడు అందరు అంబేద్కర్‌ గురించి మాట్లాడుతున్నారు. రకారకాల దృక్పథాల నుంచి రకరకాలుగా అంచనాలు వేస్తున్నారు. అయన మౌలిక అలోచనలను తమ అవసరాలకు అనుగుణంగా కుదించి, వక్రీకరించి (కొంతమంది) ప్రచారం చేస్తున్నారు. అంబేద్కర్‌ జీవితానికి, ఆలోచన లకు ఈ సమయంలో ఎందుకు ఇంత ప్రాధాన్య త వచ్చింది? అంబేద్కర్‌ జీవిత కృషి ఎక్కువ భాగం స్వాతంత్య్రానికి పూర్వం జరిగింది. ఆయన 1956లోనే చనిపోయారు. ఆయన జీవించిన కాలంలో అనేక మంది ఆయన భావాలను పూర్తిగా తిరస్కరించారు. ఆయన కృషిని వ్యతిరేకించారు. కాని అప్పుడు ఆయనను తిరస్కరించిన సంస్థలకు, భావాలకు వారసులు గా ఉన్నవారు ఇప్పుడు ఆయనను ఆకాశానికి ఎత్తి బ్రహ్మరథం పడుతున్నారు. నేడు దేశంలో అంబేద్కర్‌ భావాలకు, వ్యక్తిత్వానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి చర్చించటానికి ఒక రాజకీియ చరిత్రక నేపథ్యం ఉన్నది.
జీవితకాలంలో గుర్తించకుండా అనం తర కాలంలో సమాజం తలకెత్తుకునే పరిస్థితి ఎంతో మంది మహావ్యక్తులకు తప్పలేదు. గురజాడ అభ్యుదయ సాహిత్యం రాసినప్పుడు ఆయన గురించి పెద్దగా పట్టించుకోలేదు. జాతీయ ఉద్యమ కాలంలో ప్రజా ఉద్యమాలు, వామపక్ష ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడినా 1940 దశకంలోనే ఆయన భావాలు ప్రజల్లో బాగా వ్యాప్తి చెందాయి. కొన్ని సందర్భల్లో కొన్ని తరగతులకు ఆ భావాలు ఉపయోగపడుతాయి అనుకుంటే వాటిని బయటికి తీసి, మెరుగులు దిద్ది ప్రాచుర్యం కల్పిస్తారు. వర్గ అవసరాలకు వినియోగించుకుంటారు. కారల్‌మార్క్స్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురయింది. మార్క్స్‌ పెట్టుబడి గ్రంధం రాసినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. కార్మిక ఉద్యమం ఎప్పుడయితే బలపడిందో, యూరప్‌ దేశాల్లో నిర్మాణయుతం అయిందో, ఎప్పుడైతే ఉద్యమాలు, పోరాటాలు పెరిగాయో అప్పుడు పెట్టుబడి గ్రంధానికి విపరీతమైన అదరణ వచ్చింది. ఆయన ప్రాతిపాదించిన లక్ష్యాలను సాధించాలనుకున్నవారు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఆయన భావాలకు ప్రాచుర్యం వచ్చింది. ఆయన అలోచనలు తమ జీవితాలకు అద్దం పడుతున్నందునే ప్రజలు ఆయన వైపు అకర్షించబడ్డారు. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విషయంలో కూడా నేడు అదే జరుగుతున్నది.
అంబేద్కర్‌ భావపరంపర వ్యాప్తిచెందితే ప్రమాదం అనుకున్న అరుణ్‌శౌరి అంబేద్కర్‌ వ్యక్తిత్వాన్ని చులకన చేస్తు ప్రత్యేకంగా ఒక పుస్తకమే రాశాడు. అంబేద్కర్‌ బలహీన వర్గాల పాలిట దేవుడు కాదు, ఆయన ఒక బూటకపు దేవుడు అని చిత్రీకరించాడు. హిందూత్వ సిద్ధాంతాన్ని, రాజకీయాల్ని సంఫ్‌ుపరివార్‌ ప్రణాళికను ముందుకు తీసుకుపోవడం అరుణ్‌శౌరి లక్ష్యం. ప్రస్తుతం అంబేద్కర్‌ భావ జాలం అందుకు ప్రధానమైన అటకంగాభావిం చినందునే అరుణ్‌శౌరి తన పుస్తకం ద్వారాఅంబే ద్కర్‌ అలోచనలు, వ్యక్తిత్వంపై దాడి చేశాడు.
అంబేద్కర్‌ అలోచనలపై దాడిచేయడం వల్ల అనుకున్న ఫలితాలను పూర్తిగా సాధించడం సాధ్యం కానందునే మరోవైపు నుండి కూడా ఆర్‌.ఎస్‌.ఎస్‌, సంఫ్‌ుపరివార్‌ శక్తులు తమ ప్రయత్నాలను చేస్తున్నారు. అంబేద్కర్‌ ఆలోచన లను వక్రీకరించి, తమకు తగినట్లుగా తీర్చిదిద్ది, ఆయనను తమ వాడిగా చేసుకొనే ప్రయత్నాలను గత కొంతకాలంగా చేస్తున్నారు. అంబేద్కర్‌ హిందుమతాన్ని సంస్కరించి, మెరుగుపర్చడానికి కృషిచేసిన సంఘసంస్కర్త అని, ఇస్లాం, క్రైస్తవ మతాలను తిరస్కరించిన ఆయన ఉత్తమ జాతీ యవాదని అందుకే భారతీయ సంస్కృతిలో భాగ మైన బౌద్దమతాన్ని స్వీకరించాడని ప్రచారం చేస్తున్నారు. సంఫ్‌ుపరివార్‌ సిద్ధాంత కర్తలు అయిన నాయకుల సరసన అంబేద్కర్‌కి స్థానం ఇచ్చి,భ్రమలు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే సంఫ్‌ుపరివార్‌ శక్తులు, బి.జె.పి. చేసే ప్రయత్నాలు నిజాయితి, చిత్తశుద్ధిలేనివి. జీవితాంతం అంబేద్కర్‌ చెప్పిన భావా లు హిందుత్వశక్తుల భావాలకు పూర్తి వ్యతిరేకం. కులవ్యవస్థను నాశనం చేయడానికి, ఆ వ్యవస్థకు ఆలంబనగా ఉన్న హిందు మతభావాలను, హిందుమత బోధలను తుత్తునియలు చేయడానికి అయన జీవితమంతా కృషి చేశారు. హిందూ మతం ఉన్నంత కాలం కులం, అంటరానితనం పోవని, దాన్ని వదిలేస్తేనే దళితులకు విముక్తి లభిస్తుందని అంబేద్కర్‌ బలంగా నమ్మాడు. అందుకే చాలా తీవ్రమైన మీమాంస తరువాత తన అనుయాయులతో హిందు మతాన్ని వీడి బౌద్ధమతాన్ని స్వీకరించాడు. 1930 దశకంలోనే తను హిందువుగా మరణించనని ప్రకటించాడు. ఆయన జీవిత చరమాంకం వర కు మతమార్పిడి గురించి చర్య తీసుకోక పోయినా, ఆయన అభిప్రాయంలో మార్పు రాలేదు. అనేక మంది అనేక కారణాల వలన ఇస్లాం మతంలోకి అకర్షించాలని అంబేద్కర్‌తో చర్చలు జరిపారు. ఆయనను క్రైస్తవమతంలోకి అకర్షించాలని అనేకమంది ప్రయత్నించారు. సిక్కుమతం అయితే ఎలా ఉంటుందని అంబేద్క ర్‌ స్వయంగా ఒక అలోచన చేశారు. అనేక మందితో చర్చించారు. అంబేద్కర్‌ మతమార్పిడి గురించి ఆలోచిస్తున్నారని తెలిసి ఆ ప్రయత్నా లను అడ్డుకోవడానికి కూడా అనేక మంది ప్రయత్నించారు. అంతగా హిందుమతంలో ఉండటం ఇష్టంలేకపోతే పరమతాలయిన ఇస్లాం, క్రైస్తవ మతాలను కాకుండా, జాతీయ స్రవంతిలో భాగమైన ఇంకా ఎదైనా మతం గురించి అలోచించమని హిందు మహాసభ నాయకులు అంబేద్కర్‌ని వేడుకున్నారు. కాంగ్రెస్‌ నాయకుడిగా ఉన్న జగ్జీవన్‌రామ్‌ వంటివారు, దళిత నాయకు లుగా ఉన్న ఎసి రాజావంటి వారు హిందూ మతాన్ని విడిపోవాలన్న అంబేద్కర్‌ అలోచనలను తీవ్రంగా ప్రచారం చేశారు. అయినప్పటికి అంబేద్కర్‌ హిందుమత వ్యవస్థలో సామాజిక న్యాయం సాధ్యంకాదన్న స్పష్టమైన భావంతో ఉన్నందునే మతమార్పిడికి సిద్ధం అయ్యాడు. అందువల్ల అంబేద్కర్‌ను హిందూమత సంస్కర్త గా చిత్రీకరించడానికి సంఘపరివార్‌ శక్తులు చేసే ప్రయత్నాలు కుటిలబుద్ధితో కూడుకున్నవి.
అంబేద్కర్‌ వ్యక్తిత్వాన్ని ప్రధాన స్రవంతి బూర్జువా నాయకుని స్థాయికి పరిమితం జేయాలని కాంగ్రెస్‌ మొదటి నుండీ ప్రయత్నిం చింది. రాజ్యాంగ సభకు జరిగిన ఎన్నికలలో మొదట అంబేద్కర్‌ని కాంగ్రెసు వారు ఓడించారు. ఆయన బెంగాల్‌ నుండి ముస్లింలీగ్‌ సహాయం తో రాజ్యాంగ సభ సభ్యునిగా గెలిచాడు. దేశం విడిపోయినప్పుడు బెంగాల్‌ విడిపోయి, ఆయన సభ్యత్వం రద్దయింది. అపుడు కాంగ్రెస్‌ పార్టీ ముంబాయి ప్రెసిడెన్సీలో కాంగ్రెసు సభ్యుని చేత రాజీనామా చేయించి, ఆ స్థానంలో అంబే ద్కర్‌ని నిలబెట్టి గెలిపించి, రాజ్యాంగ సభకు తీసుకొ చ్చారు. రాజ్యాంగసభలో రాజ్యాంగ ముసాయి దా కమిటీ ఛైర్మన్‌గా చేశారు. అంబేద్కర్‌ లాంటి వాళ్లు తమ మధ్య ఉంటే బలహీన వర్గాల ప్రజల్ని ఆకట్టుకోవటానికి, నియంత్రణ చేయడా నికి ఉపయోగం అని భావించారు. అంబేద్కర్‌ ను తిట్టి తూలనాడిన వాళ్లే తమలో చేర్చుకున్నా రు. దళితులు కమ్యూనిస్టుల వైపు మళ్ళకుండా నిరోధించవచ్చు అనుకున్నారు. అప్పటి వరకూ దళితులు, బలహీనవర్గాలు, వ్యవసాయ కార్మికు లు, ఇతర పేదవర్గాలు కమ్యూనిస్టుల పక్కన ఉన్నారు. అంబేద్కర్‌ను కాంగ్రెసు ఆలింగనం చేసుకోవడంతో దళితులు కూడా కాంగ్రెస్‌ వైపుకు మొగ్గారు. ఆ తర్వాత అంబేద్కర్‌ కాంగ్రెస్‌నుండి దూరమయినా, దళితులు దూరం గాకుండా కాంగ్రెస్‌ జాగ్రత్తపడ్డది. ఇందిరాగాంధి కాలం వరకు దళితులు కాంగ్రెసులో చేరుతూనే ఉన్నారు. కాంగ్రెస్‌కు దూరం అయినా అంబేద్కర్‌ విగ్రహాలను కాంగ్రెసు విడిచిపెట్టలేదు. సరళీ కరణ విధానాలను తలకెత్తుకున్న తర్వాత కాంగ్రెస్‌ పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగింది. దాంతో దళితులు అనేక రాష్ట్రాలలో దూరమవడం ప్రారంభమయ్యింది. అంబేద్కర్‌ను మళ్లీ తమ వాడిగా చిత్రీకరించుకుని, అంబేద్కర్‌ భావాలే తమ భావాలని చెప్పుకోవడమే కాకుండా, దళితులు, ఇతర సామాజిక తరగతు లను తమ వైపు ఆకర్షించుకునేలా ఈరోజు కాంగ్రెస్‌ ప్రయత్నం చేస్తున్నది.
1991లో సరళీకరణ విధానాలు ప్రారంభమైన తర్వాత అంబేద్కర్‌ వారసత్వాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం ప్రారంభమైంది. రిజర్వేషన్లు, సాంఘీక సంక్షేమ పథకాలను బలహీనం చేయటం, భూసంస్కరణల రద్దు తదితర చర్యల వలన దళితులు నష్టపోతు న్నారు. దళితుల ప్రయోజనం కోసం వాటిని రక్షించుకోవలసిన అవసరం ఏర్పడింది. ఈ మధ్యకాలంలో దళితుల్లో మధ్య తరగతి అభి వృద్ధి అయింది. మిగతా కులాల్లో కూడా రిజర్వేషన్లు, ఇతర అంశాల వలన చదువుకున్న ఒకచిన్న మధ్యతరగతి, ఇంకా పైకి ఎగబాకాలి అని ఆశ కలిగిన ఒక చిన్న పొర ఏర్పడింది. రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లను రక్షించుకోవడం, ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్లు విస్తరించడం జరగకపోతే తమకు భవిష్యత్‌ ఉండదన్న భావం ఈ తరగతుల్లో ఏర్పడింది. సరళీకరణ విధానాల పట్ల తీవ్రమవుతున్న బలహీనవర్గాల అసంతృప్తి కూడా అంబేద్కర్‌ పట్ల ఆసక్తి పెరగడానికి మరొక కారణం.
అంబేద్కర్‌ను మన దేశ పాలకవర్గాలు తమకు సంబంధించిన ఒక సింబల్‌గా విని యోగించుకొంటున్నాయి. సింబల్‌గా విని యోగించుకొనే వాటిలో ఆయన విగ్రహం ముఖ్య మైనది. అంబేద్కర్‌ చేసింది ఇతరంగా ఏమీ లేనట్లు, రాజ్యాంగ రచనలో మాత్రమే ఆయన పాత్ర ఉన్నట్లు ఆయన విగ్రహం చేతిలో రాజ్యంగం పుస్తకం పెడతారు. రాజ్యాంగ రచన లో అంబేద్కర్‌ పాత్ర విస్మరించరానిదనే దాంట్లో సందేహం లేదు. రాజ్యాంగ నిర్మాత అని ఆయ నను కొనియాడడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. బలహీన వర్గాల ప్రయోజనాల రక్షణ కోసం రాజ్యాంగంలో రిజర్వేషన్లను జొప్పిం చడంలో అంబేద్కర్‌ కృషి ఎనలేనిది. ఒక లిబరల్‌ ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని తయారు చేయడంలో అంబేద్కర్‌ ముద్ర స్పష్టంగా కన్పి స్తుంది. అయినా మన రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావం వ్యక్తిగత ఆస్తి రక్షణే నన్నది మరువ కూడదు. సామాన్యులకు పనికొచ్చే అంశాల న్నింటిని హక్కులుగా కాకుండా ఆదేశిక సూత్రా లకు పరిమితం చేశారు. రాజ్యాంగం తయారీ లో అంబేద్కర్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఉంటే ఎటువంటి రాజ్యాంగం తయారయ్యేదో రాజ్యాం గ సభకు ఆయన సమర్పించిన మొమొరాండాన్ని చదివితే ఎవరైనా గమనించగలరు. అంబేద్కర్‌ అభిప్రాయాలు రాజ్యాంగంలో పొందుపర్చిన వాటికన్నా తీవ్రమైనవి. ప్రత్యామ్నాయమైనవి. వాస్తవంగా అంబేద్కర్‌లో మౌలిక భావాలతో కూడిన అంశాలు చాలా ఉన్నాయి. కులవ్యవస్థ గురించి, ప్రజాస్వామ్యం గురించి, సమానత్వం గురించి గ్రామీణ సామాజిక వ్యవస్థ గురించి అనేక అభ్యుదయ అంశాలు ఉన్నాయి.
కొత్త వ్యవస్థలో సార్వజనీన ఓటు ఉండాలి. సమానత్వం స్వేచ్ఛ ఉండాలి. వ్యక్తిగత ఆస్తిహక్కుకు రక్షణ ఉండాలన్న విషయాలను వివరించాడు. ఎటువంటి ఆర్థిక వ్యవస్థ ఉండాలో కూడాచెప్పాడు. మిశ్రమ ఆర్థికవ్యవస్థను ప్రతిబింబిస్తూ పెట్టుబడిదారులందరూ కలిసి రూపొందించిన, బాంబేప్లాన్‌కన్నా మరికొంత రాడికల్‌గా ఉండే వాటిని దీనిలో ప్రతిపాది స్తాడు. కీలకమైన పరిశ్రమలు జాతీయం చేయాలి. బీమారంగం వంటి వాటిని జాతీయం చేయాలి. భూమిని జాతీయం చేసి, రైతులకు కౌలుకు ఇచ్చి ప్రభుత్వమే వారికి పెట్టుబడులు అందజేసి ప్రోత్సహించాలని చెప్పాడు.
భారతదేశంలో అత్యంత దుర్మార్గమైనది కులవ్యవస్థ. కులవ్యవస్థను నాశనం చేయాల నేది అంబేద్కర్‌ లక్ష్యం. అందుకే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేయాలని చెప్పాడు. కులవ్యవస్థకు పునాది గ్రామం. గ్రామాల్లో ఉంటే అంటరానితనం నుండి విముక్తి ఉండదు. కాబట్టి దళితులకు ప్రత్యేక గ్రామాల్ని నిర్మించా లని భావించాడు. ప్రత్యేకంగా దళితులకు భూములు కేటాయించండి అని కోరాడు. ప్రస్తుత గ్రామాలలో గ్రామ స్వరాజ్యం అన్న గాంధీజీ నినాదం గ్రామాల్లో అగ్రకులాలకు, ఆధిపత్య కులాలకు పెత్తనం ఇవ్వడమేనన్నది అంబేద్కర్‌ అభిప్రాయం.ఈ అభిప్రాయం అక్షరాలా నిజమేనని అనుభవం చెబుతున్నది. వాస్తవం గా పంచాయతి రాజ్‌ వ్యవస్థ ఏర్పడిన తర్వాత పాలకవర్గాలకు గ్రామాల్లో మంచి పునాది ఏర్పడింది. పాలకవర్గాలను బలపరిచే శక్తులు గ్రామాలలో బలపడ్డాయి. అంబేద్కర్‌ తన జీవిత కాలంలో రా జ్యాంగ నిర్మాణంలో వెచ్చించింది రెండు మూడు సంవత్సరాలు మాత్రమే. మిగిలిన జీవితమం తా కులవ్యవస్థ నిర్మూలన కోసం, బలహీన వర్గాల విముక్తి కోసం పాటుప డ్డారు. అంబేద్కర్‌ వ్యక్తిత్వంలోని ఈ మౌలిక పార్శ్వాన్ని మరుగు పర్చి, రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే ఆయనను చిత్రీకరించడం వాస్తవంగా కులవ్యవస్థ నిర్మూల న గురించి ఆయన చెప్పిన అంశాలను వెనక్కు నెట్టి అంబేద్కర్‌ వారసత్వా నికి అన్యాయం చేయడమే అవుతుంది.
అంబేద్కర్‌లో సామాజిక మార్పుకు తోడ్పడే పార్శ్వాన్ని పెద్దది చేసి, కాపాడుకుని, సామాజిక మార్పు కోసం పోరాడే శక్తులకు ఉపయోగపడే వ్యక్తిగా అంబేద్కర్‌ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాస్త వంగా అంబేద్కర్‌ వ్యక్తిత్వంలో, సిద్ధాంతంలో సామాజిక మార్పుకు దోహదం చేసే వాటిని రక్షించుకుంటూ ముందుకు పోవాలి. ఫ్యూడలి జానికి వ్యతిరేకమైన, సామాజిక మార్పు కు దోహదం చేసే భావజాలాన్ని రక్షించి ముందు కు తీసుకెళ్లే ప్రయత్నం మనం చేయాలి. అంబేద్కర్‌ భారతదేశంలో ప్యూడల్‌ వ్యవస్థను భగం చేయడానికి, దానిలో తీవ్రమైన మార్పుకు దోహదం చేసే కృషిచేశాడు. ఇటువంటి పరిస్థితిలో పాతకాలంలో అభ్యుదయ వాదులు అందించిన దానికన్నా ఒక పదునైన ఆయుదాన్ని అంబేద్కర్‌ నుంచి మనం పొందవచ్చు. దాన్ని తీసుకుని సామాజికమార్పు కోసం మనం ముందుకు సాగాలి.
- బి.వి. రాఘవులు

No comments:

Post a Comment

Dalithashakthi - 2025 - Magazines