Monday, October 9, 2017

సంపాదకీయం Dalithashakthi October 2017



1985కు ముందు దేశ రాజకీయాల్లో అగ్రకులాలదే అధిపత్యం. ఓట్ల రాజకీయాలను నోట్లమయం చేసి ప్రజస్వామ్య విలువల్ని భ్రష్టుపట్టిస్తున్న తరుణంలో ''ఓట్లు మావి, సీట్లు (అధికారం) మీదా? ఇకపై చెల్లదు ఇకపై సాగదు అంటూ ఓట్లు మావి అధికారం కూడా మాదే'' అని బహుజనుల పక్షాన నిలబడి అధిపత్యపార్టీలకు సవాలు విసిరారు కాన్షీరాం. పేదల కోసం, పేదల చేత, పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన పేదల పార్టీ బీఎస్పీ ద్వారా ఏనాడు అసెంబ్లీ, పార్లమెంట్‌ మెట్లెక్కని వెనుకబడిన అతి పేదలను ఎమ్మెల్యే, ఎంపీలుగా, మంత్రులుగా చేసిన ఘనత కాన్షీరాందే. సామాన్యులు సైతం ఈ దేశంలో ప్రజాస్వామ్య బద్ధంగా అత్యున్నత పదవులు పొందగలరని నిరూపించి ప్రజాస్వామ్య విలువల్ని ఆయన పరిరక్షించారు.
రాజకీయాల్లో కులం ప్రవేశపెట్టిన నాయకుడిగా ప్రచారం చేస్తారు కానీ ఆయన కులం అనే ముల్లును కులంతోనే తీయాలని 'కుల నిర్మూలన' కోసమే ఆయన దేశ రాజకీయాల్లో కుల ఎజెండాను చేర్చారు. ఫలితంగా అన్ని అగ్రకుల పార్టీల్లో బహుజనులను అవకాశాలు లభించాయి. కాన్షీరాం కొనసాగించిన కఠోరశ్రమ ఫలితంగా నిశ్శబ్ధ రాజకీయ విప్లవం అన్ని రాష్ట్రాలకు పాకింది. ఫలితంగా ఒక సామాన్య మహిళ, అందులో అంటరాని కులానికి చెందిన 'చమార్‌' మహిళను ముఖ్యమంత్రిని చేసిన ఘనత పూర్తిగా కాన్షీరాందే. తద్వారా బ్రహ్మణ, పురుషాధిపత్య రాజకీయాలకు పుల్‌స్టాప్‌ పెట్టారు కాన్షీరాం. 
ప్రస్తుత భారత రాజకీయాల్లో ఆయనకు సరితూగే నాయకుడు లేడనడంలో అతిశయోక్తి లేదు. అగ్రకులాల నాయకత్వాన్ని సమాజం మొత్తం అంగీకరిస్తుంది. కానీ కిందికులాల విషయంలో అలా జరగదు. ఎన్నో రకాల అడ్డంకులు, అవరోధాలు నిత్యం వారిని కిందికి లాగడానికి ప్రయత్నిస్తాయి. వీటన్నింటిని తట్టుకొని కాన్షీరాం దృఢ సంకల్పంతో ఉద్యమించడం వల్లనే జనం ఆయన వెంట నడిచారు. ఇవాళ దేశంలో కింది కులాల్లో నాయకులు పెరిగిన వారిలో లోపించినది ఇదే. దేశంలో ప్రపంచీకరణ విధానం ప్రారంభమైన తర్వాత ఎన్నికలే కాదు, ఉద్యమాలు కూడా వ్యాపార మయమైపోయాయి. కాబట్టి కాన్షీరాం వంటి త్యాగనిరతి కలిగిన నాయకుడి అవసరం చాలా ఉంది.
దేశరాజకీయాల్లో అగ్రకుల దోపిడి కులాల పెత్తనంపై తిరుగుబాటు చేసిన నేత కాన్షీరాం. డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆశించిన రాజ్యాధికారం వైపు దళిత, బహుజనులను పరుగులు పెట్టించారు. దళిత, బహుజనులకు ఈరోజు దేశరాజకీయాలను శాషించే స్థాయికి తీసుకు వెళ్లింది కూడా మాన్యశ్రీ కాన్షీరాం మాత్రమే. వీరి సాధనకు కృషి చేయడమే మనం ఆ మహానీయుడి అర్పించే నివాళి.

No comments:

Post a Comment

Dalithashakthi - 2025 - Magazines