Dalithashakthi November 2017 Cover page
పొట్టకూటి కోసం పొలంలో కలుపు తీసిన చేతులే నేడు సమాజాన్ని పట్టిపీడిస్తున్న కులం కలుపును తీసే పనిలో ఉన్నాయి. అడుగడుగునా అవమానాలతో ప్రారంభమైన జీవితాన్ని ''ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగితే విజయం నీదే'' అన్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్ఫూర్తితో ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు ఉన్నత శిఖరానికి చేరుకున్నారు. తను శిఖారాన్ని చేరుకున్నట్లే తన సమాజం కూడా అగ్రస్థానానికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నే ఉన్నారు. 70 ఏళ్ల వైద్యరంగ చరిత్రలో ప్రొఫెసర్, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ స్థాయికి ఎదిగిన మొట్ట మొదటి దళితుడు మన డాక్టర్ నల్లపు వెంకటేశ్వర్లు అంటే అతిశయోక్తి కాదు. గతంలో ఎదురైన అనుభావాలను దృష్టిలో పెట్టుకుని నలుగురికి సాయం చేస్తూ, కులరహిత సమాజం కోసం తన సమాజాన్ని చైతన్యం చేయడానికి పూనుకున్నారు. వ్యక్తికన్న వ్యవస్థలో మార్పులు రావాలని దానికి రాజ్యాధికారమే అన్నింటీకి మూలం అన్నారు
ప్రొఫెసర్ డాక్టర్ నల్లపు వెంకటేశ్వర్లు.
కుటుంబ నేపథ్యం
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామానికి చెందిన దళితుడు, అందులో అత్యంత నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబంలోని రామయ్య, మాణిక్యమ్మ పుణ్య దంపతులకు 12వ సంతానంగా 1961 జనవరి 3న మీనవోలు లో నల్లపు వెంకటేశ్వర్లు జన్మించారు. అమ్మానాన్న వ్యవసాయ కూలీలు, అందులో నిరక్ష్యరాసులు. పిల్లలు ఏం చేస్తున్నారో? ఏం చదివించాలో? తెలియని పరిస్థితి వారిది. తన కొడుకుకు చదువు పట్ల ఉన్న శ్రద్ద, ఆసక్తి, పట్టుదల, కార్యదీక్షని గమనించిన రామయ్య దంపతులు కొడుకును బాగా చదివించాలనే వారి ఆశయం ముందు కష్టాలు, కడగండ్లను లెక్క చేయలేదు. కూలీ పనులకు తీసుకువెళ్ళకుండా కొడుకును చదువు చెప్పించేందుకు హాస్టల్‌కు పంపటంతో వెంకటేశ్వర్లు కూడా అంతే పట్టుదలతో చదివేవాడు.
హాస్టల్ టు ఉస్మానియా డెంటల్ కాలేజీ
వెంకటేశ్వర్లు మీనవోలు గ్రామంలో ప్రాథమిక విద్య, నాల్గవ తరగతి నుండి ఇంటర్ వరకు సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో ఉండి చదువు కున్నారు. ఇంటర్ ఉత్తమ మార్కులతో పాస్ అయ్యారు వెంకటేశ్వర్లు. డాక్టర్ కావాలనే కోరికతో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఎంట్రెన్స్ ద్వారా పరీక్ష రాసి ఉస్మానియా డెంటల్ కాలేజ్‌లో సీటు సంపాదించుకున్నాడు. కానీ కాలేజీలో చేరడానికి ఖమ్మం నుండి హైదరాబాద్‌కు రావటానికి రైలు చార్జీలు కూడా లేని పేదరికం, వేసుకోవడానికి కూడా సరైన బట్టలు, చెప్పులు కూడా లేవు, తనకు ఉన్న ఒకటి, రెండు జతల బట్టలను బ్యాగులో వేసుకుని జేబులో ఒక్క పైసా కూడా లేకుండానే రైలు ఎక్కి సికింద్రాబాద్ చేరుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి నడుచుకుంటూ ఉస్మానియా డెంటల్ కాలేజీకి చేరుకున్నాడు. కానీ వెంకటేశ్వర్లు పరిస్థితి చూసిన ప్రొఫెసర్ క్లాసులోకి రానివ్వకుండా గెటౌట్ అన్నారు.
జీవితంలో డబ్బు మహిమ ఇంత గొప్పదా? డబ్బులు లేకుండా చదువు కొనసాగించలేమా? ఇప్పుడు ఏమిటి పరిస్థితి అనే సంశయం వెంటాడింది. అదే సందర్భంలో అంబేడ్కర్ జయంతి సభ కార్యక్రమం పేపర్‌లో చూసి అక్కడికీ వెళ్ళడంతో ఆత్మవిశ్వాసం కూడగట్టుకుని ప్రొఫెసర్ చేసిన అవమానానికి కుంగిపోకుండా మరింత పట్టుదలతో చదివి తాను అవమానపడ్డ కాలేజీలో ప్రొఫెసర్ స్థానాన్ని చేరుకోవడం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి యొక్క ఆశయం స్ఫూర్తి నాకు ఆదర్శంగా నిలిచాయి. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్ఫూర్తిని తీసుకొని చదువు కోవటం తోపాటు నలుగురికి ఆదర్శంగా ప్రేరణగా నిలిచారు, నిలుస్తునే ఉన్నారు.
జీవితాన్ని మలుపు తిప్పిన అంబేడ్కర్
డెంటల్ కాలేజీ విద్యార్థిగా క్లాస్‌లో అందరి కంటే పేదరికంలో ఉన్న తనను 1983 ఏఫ్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సభ తన జీవితాన్నే మలుపు తిప్పిందని అంటారు వెంకటేశ్వర్లు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బాండ్ వద్ద ప్రతి సంవత్సరం జరిగే జయంతి ఉత్సవాలకు హాజరు కావటం వెంకటేశ్వర్లకు అదే మొట్టమొదటి సారి. అక్కడే నాయకులు డాక్టర్ అంబేడ్కర్ జీవిత ఘట్టాలను, ఆయన చేసిన పోరాటాలు, సాధించిన విజయాలు విన్న వెంకటేశ్వర్లు అక్కడ అంబేడ్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని కొనుగోలు చేసి రాత్రి, పగలు తేడా లేకుండా అధ్యయనం చేసిన తరువాత అప్పటి వరకు తనకు తెలిసిన పిడియస్‌యు, ఆర్‌ఎస్‌యు లాంటి సంఘాలకు విభిన్నమైన పద్దతుల్లో అంబేడ్కర్ ఆలోచనలు, ఆశయాలను మనస్సులో నింపుకుని తన లక్ష్యంపై కేంద్రీకరించి చదవటం మొదలుపెట్టారు. అప్పటి వరకు వెంకటేశ్వర్లులో ఉన్న భయాలు పోగొట్టింది అంబేడ్కర్ జీవిత చరిత్ర. భారతదేశంలో కులం పునాదులు ఎంత బలంగా ఉన్నాయో అర్థం చేసుకున్నారు. మూడు నెలల కాలంలోనే అంబేడ్కర్ జయంతి సభ ప్రేరణ, జీవిత చరిత్రను స్ఫూర్తితో క్లాస్‌లో చదువులో మెరుగుదల, చదువుపై పట్టు సాధించారు. ఆనాటి నుండి నేటికీ అంబేడ్కర్ ప్రేరణతోనే తాను డాక్టరుగా, సర్జన్‌గాను, ప్రొఫెసర్‌గా తన తరగతి విద్యార్థుల (క్లాస్‌మేట్స్) కన్నా ముందుగానే సాధించారు. తనను అవమానించిన కాలేజీ ప్రొఫెసర్ స్థానంలోనే ఈరోజు కూర్చోవడం గర్వంగాను, ఆనందంగాను ఉందని ప్రొఫెసర్ డాక్టర్ నల్లపు వెంకటేశ్వర్లు దళితశక్తి ఎడిటర్ బి.గంగాధర్‌తో తన జీవిత అనుభావాలను పంచుకున్నారు.
వివాహం - పిల్లలు
1989 ఫ్రిబవరి 19న రీనాతో జరిగింది. మా వివాహంతో ఒక అంశం ముడిపడి ఉందని అది ఆయన మాటల్లోనే... ''నేను హాస్టల్లో ఉండి పదవ తరగతి అవుతున్న సందర్భంగా పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే అదే హాస్టల్లో పని చేస్తున్నా ఆనందరావు గారు నాకు 30 రూపాయలు పరీక్ష ఫీజు కట్టి నన్ను ఆదుకున్నారు. ఆయన వల్లనే నేను ఉన్నత స్థానానికి చేరడానికి తొలిమెట్టుకు బాటలు వేశారు, నేను డెంటల్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఆనందరావు గారు గుండెపోటుతో మరణించడం నన్ను తీవ్రంగా కలచివేసింది. నాకు సహాయం చేసిన ఆనందరావు గారికీ ఏవిధంగానైనా రుణం తీర్చుకోవాలని నిర్ణయించు కున్నాను. ఆనందరావు గారి చెల్లెలు రీనా అప్పటికే ఇంటర్ పూర్తి చేసింది. ఆయన చెల్లెలు రీనాను పెళ్లి చేసుకొని ఆయన రుణం తీసుకునే అవకాశం దొరికింది, అందుకే రీనాను వివాహం చేసుకున్నాను'' అన్నారు వెంకటేశ్వర్లు.
ప్రొఫెసర్ డాక్టర్ నల్లపు వెంకటేశ్వర్లు, రీనా దంపతులకు ఇద్దరు సంతానం. మొదటి అమ్మాయి అనూష, అబ్బాయి అనూప్‌లు డెంటల్ కాలేజీలోనే కుతూరు యండిఎస్ చేస్తే కొడుకు బిడిఎస్ చేసి డాక్టర్లుగా పనిచేస్తున్నారు. కొడుకు డాక్టర్ అనూప్ మాత్రం సివిల్ సాధించాలనే పట్టుదలతో చదువు కొనసాగిస్తున్నాడు. రిజర్వేషన్ ద్వారా ఈరోజు డాక్టర్‌గా, సర్జన్‌గా, ప్రొఫెసర్‌గా ఎదిగాను. కాబట్టి నా పిల్లలు కూడా రిజర్వేషన్లు వాడుకుంటే మిగతా వారి పరిస్థితి ఏమిటి? అని ఆలోచించి తన పిల్లలకు రిజర్వేషన్ అందించకుండా ఓపెన్ కేటగిరిలో చదివించడం ఆదర్శనీయం.
జ్యోతిరావ్ ఫూలే...
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ స్పూర్తితో పనిచేస్తున్న నాకు నా భార్యను కూడా ఉన్నత చదువులు చదివించే అవకాశం కలిగింది. జ్యోతిరావ్ ఫూలే తన భార్య సావిత్రిభాయి ఫూలేను చదువు నేర్పించి దేశంలో మొట్ట మొదటి టీచర్‌గా తయారు చేశారు. ఫూలే ఆదర్శంతో వెంకటేశ్వర్లు కూడా తన భార్య రీనాను హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ, పిజి, ఎంఫిల్ వరకు చదివించారు. ఆమె ఇప్పుడు డిగ్రి కాలేజీ లెక్చరర్‌గా పని చేస్తున్నది.
వెంకటేశ్వర్లు పెద్ద అమ్మాయి అనూషకు మూడు సంవత్సరాల వయస్సు ఉంటుంది. అప్పుడు ఖమ్మం జిల్లాలో డిగ్రి లెక్చరర్ పోస్టులకు ఇంటర్వ్యుకు వెళ్లారు, అక్కడే గోదావరి జిల్లాల నుండి వచ్చిన ఒక దళిత అమ్మాయి వెంకటేశ్వర్లు గారితో మాట్లడుతూ ఉద్యోగం తనకు ఎంత అవసరమో చెప్పింది. ఆర్థికంగా నిలదొక్కుకున్న మనం ఉద్యోగం చేయడం అంత ప్రాధాన్యత కాదు, కానీ ఈ ఇంటర్వ్యూకు వచ్చిన వారికి ఎంతో ముఖ్యం వారికీ, వారి కుటుంబానికి అని ఇంటర్వ్యుకు వెళ్లకుండానే భార్య రీనాను తీసుకుని వెనుతిరిగి వచ్చేశారు. దీంతో అమ్మాయికి ఉద్యోగం వచ్చింది. అమ్మాయి వెంకటేశ్వర్లు గారికి కృతజ్ఞతలు తెలియజేయడం వెంకటేశ్వర్లు ఇప్పటికీ మరిచిపోలేక పోతున్నారు. ఎందు కంటే ఆయన నిర్ణయం అమ్మాయికి ఉద్యోగం రావడానికి కారణం.
ఉద్యోగ జీవితం
1989లో నల్లగొండ జిల్లా హూజూర్‌నగర్‌లో డెంటల్ అసిస్టెంట్ సర్జన్‌గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. కొంత కాలం హైదరాబాద్ నుండి హూజూర్‌నగర్‌కు ప్రతిరోజు బస్సులో వెళ్లి వచ్చేవారు. ఒక్క మిత్రుడి సహాకారంతో హూజూర్‌నగర్ నుండి హైదరాబాద్ నాంపల్లి ఆసుపత్రికి బదిలిఅయ్యింది. చదువుకుంటానో లేదో అనుకున్న టైంలో అంబేడ్కర్ జయంతి సభ తన జీవితాన్నే మలుపు తిప్పినట్లే హూజూర్‌నగర్ నుండి నాంపల్లి ఆసుపత్రికి బదిలీ కావటం కూడా అంతే మలుపు. నాంపల్లి ఆసుపత్రికి అనేక మంది ప్రముఖులు డాక్టర్ వెంకటేశ్వర్లు వద్దకు రావడం ఆసుపత్రి వర్గాల్లో చర్చానీయం అయింది. అందరూ డాక్టర్లు ఆసుపత్రి పని సమయానికి వచ్చి సమయం ముందుగానే వెళ్ళే వారు, కానీ వెంకటేశ్వర్లు ఎక్కడ పనిచేసిన సమయాని కంటే గంట ముందు వచ్చి సమయం అయిపోయిన రెండు, మూడు గంటల తరువాత గానీ వెళ్ళేవారు కాదు. ఆయనకు వృత్తిపట్ల ఉన్న నిబద్థ, రోగుల పట్ల గౌరవం, ఆయనను వెళ్లేనిచ్చేది కాదు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవారు ఎక్కువ మంది దళిత, బడుగు, బలహీన వర్గాల వారే వస్తారని, వారికి వైద్యసహాయం చేయడం నాయొక్క బాధ్యత అంటారు ప్రొఫెసర్ డాక్టర్ నల్లపు వెంకటేశ్వర్లు.
విజయాల పరంపర
నిరుపేద విద్యార్థిగా 1983లో ఉస్మానియా డెంటల్ కాలేజీలో చేరిన వెంకటేశ్వర్లు 1988లో డాక్టర్ వెంకటేశ్వర్లుగా తన జీవితాన్ని ప్రారంభించారు. 1993లో డెంటల్ (పిజి) సర్జన్ పూర్తి చేసుకున్నారు. 1989లో నల్లగొండ జిల్లా హూజూర్‌నగర్‌లో అసిస్టెంట్ సర్జన్‌గా తన విధులు నిర్వహించడం ప్రారంభించిన నాటి నుండి నేటికీ వెనక్కి తిరిగి చూసు కోలేదు, హూజూర్‌నగర్ నుండి నాంపల్లి ఆసుపత్రికి బదిలీపై వచ్చి 3 సంవత్సరాలు విధులు నిర్వహించిన అనంతరం తన చదువుకున్న ఉస్మానియా డెంటల్ కాలేజీకి అసిస్టెంట్ ప్రొఫెసర్ హౌదాలో వెళ్లారు. దాదాపు ఆరు సంవత్సరాలుగా తన అందించిన సేవలకు హెచ్‌ఓడిగా, ప్రొఫెసర్‌గా విజయవాడ డెంటల్ కాలేజీకి ప్రమోషన్‌పై బదిలీ అయ్యారు. అనతి కాలంలోనే తిరిగి ఉస్మానియా డెంటల్ కాలేజీకి చేరుకున్నారు. 70 ఏళ్ళ వైద్యరంగ చరిత్రలో డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా నియమితులైన మొట్టమొదటి దళితుడు ప్రొఫెసర్ డాక్టర్ నల్లపు వెంకటేశ్వర్లే. డాక్టర్‌గా తను అందించిన సేవలు, విధుల పట్ల తనకు ఉన్న అంకితభావం వల్లనే డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా స్థాయికి చేరుకున్నారు. ఉస్మానియా నుండి గాంధీ హాస్పిటల్‌లో నాల్గున్నర సంవత్సరాలపాటు పని చేసిన తరువాత తిరిగి ఉస్మానియా డెంటల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్‌గా తిరిగి నియమితులయ్యారు. ఇప్పటికీ తన సేవలను కొనసాగిస్తున్నారు. 2016లో సేవారత్న అవార్డుతో సాంఘిక సంక్షేమశాఖ సత్కరించింది. 2017 బెస్ట్ ప్రొఫెసర్ అవార్డును తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అందుకున్నారు ప్రొఫెసర్ డాక్టర్ నల్లపు వెంకటేశ్వర్లు.
అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ...

గాంధీ హాస్పిటల్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నప్పుడు గాంధీ మెడికల్ కాలేజీలో రాజ్యాంగ దినోత్సవం ఏర్పాటు చేశారు. ఆ వేదికపై అనేక మంది ప్రొఫెసర్లు, డాక్టర్లు ప్రసంగించారు. కానీ రాజ్యాంగ దినోత్సవం రోజు రాజ్యాంగ నిర్మాత చిత్రపటం లేకుండా చేయడాన్ని గమనించిన ప్రొఫెసర్ నల్లపు వెంకటేశ్వర్లు. వెంటనే భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చిత్రం పటాన్ని తెప్పించి వేదికపై పెట్టించారు. ఆ వేదికపై నుండి మాట్లడుతూ... జెండాకు, జనాలకు ఉన్నటువంటి సంబంధాన్ని, రాజ్యాంగం యొక్క విలువలను, స్ఫూర్తిని సుదీర్ఘంగా వివరించారు. అదే రోజు ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలోనూ బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చిత్రపటాలను ఏర్పాటు చేయించి, ప్రతి సంవత్సరం డాక్టర్ అంబేడ్కర్ జయంతి, వర్థంతి కార్యక్రమాలు చేయాలని పిలుపు నిచ్చారు ప్రొఫెసర్ డాక్టర్ నల్లపు వెంకటేశ్వర్లు. ప్రభుత్వ ఆసుపత్ల్రో పని చేస్తున్న ఎస్సీ, ఎస్టీ డాక్టర్స్ అందరీని సమీకరించి ఎస్సీ, ఎస్టీ డాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. 2009 నుండి నేటికీ అసోసియేషన్ అధ్యక్షులుగా వ్యవహారిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే బడుగు, బలహీన వర్గాలను తన వంతు సహాయ, సహాకారాలు అందిస్తున్నారు.
బరోడా సందర్శన
ప్రొఫెసర్ డాక్టర్ నల్లపు వెంకటేశ్వర్లు డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా మొట్టమొదటిసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పనిచేసినటువంటి బరోడా సందర్శించే అవకాశం లభించింది. డెంటల్ కాలేజ్ ఇన్స్‌పెక్టర్‌గా బరోడాలో దిగిన వెంటనే అంబేడ్కర్ పనిచేసినటువంటి బరోడా సంస్థానాన్ని సందర్శించడం జరిగింది. ఆ తర్వాతనే కాలేజీ సందర్శించడం జీవితంలో మరపురాని జ్ఞాపకంగా మిగిలింది. బరోడా సంస్థానంలో అంబేడ్కర్‌కు జరిగినటువంటి అవమానాన్ని అక్కడి ప్రభుత్వాలు కాలేజీలు దళితుల పట్ల నేటికీ అవలంబిస్తున్న వివక్షకు నిదర్శనంగా నిలుస్తున్నాయని అన్నారు. బరోడాలో ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు సందర్శించిన కాలేజీలో కూడా డాక్టర్ మోరేని కూడా డెంటల్ కాలేజ్ యజమాన్యం ప్రొఫెసర్‌గా ప్రమోషన్ ఇవ్వకుండా 5 సంవత్సరాలుగా తొక్కి పెట్టింది. దానిని ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు కాలేజీ యాజమాన్యాన్ని నిలదీయడంతో అప్పటికప్పుడే డాక్టరు మోరేగారిని ప్రొఫెసర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. డాక్టర్ మోరే ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు గారితో మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మీ రూపంలో ఇక్కడికి వచ్చినట్లు ఉందని డాక్టర్ మోరే అనడం ఆనందంగానూ సంతోషంగానూ ఉందని తెలిపారు.
విజయవాడ డెంటల్ కాలేజీలో ప్రిన్సిపల్ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ఇతర విద్యార్థులతో కలవకూడదని ఆంక్షలు విధించడంతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో నల్లపు వెంకటేశ్వర్లు పార్లమెంట్ సభ్యులు రామ్‌విలాస్ పాశ్వాన్‌కు లేఖ రాయటంతో ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవదీశారు. ఆనాటి ప్రధానమంత్రి ఆటల్ బిహారీ వాజ్‌పాయి జోక్యం చేసుకుని వెంటనే ప్రొఫెసర్‌ను బదిలి చేయించారు. అలాగే ఉస్మానియా డెంటల్ కాలేజీలో కూడా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ఫేయిల్ చేయడం ప్రొఫెసర్ వెంకటేశ్వర్లను తీవ్రంగా కలచివేసింది. దీంతో 10 సంవత్సరాల డేటాను సేకరించి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ఫేయిల్ చేయడం కులతత్వమే కారణమని గ్రహించారు. ప్రొఫెసర్స్ మీటింగ్‌లో ప్రొఫెసర్‌గా నాకు కూడా అధికారులు ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని హెచ్చరించారు. అయినా గతం పున:వృత్తం కావడంతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు నిరహారదీక్ష చేయడం ఈ విషయంపై అసెంబ్లీ చర్చ రావడంతో ఆ ప్రొఫెసర్‌ను బదిలీ చేశారు.
నేటికి అనేక మంది డాక్టర్లు, ఇంజనీర్లు, లెక్చరర్లు, టీచర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ తిప్పలు తప్పటం లేదు. అందుకే దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలు ఐక్యంగా హక్కుల సాధనకోసం ముందుకు కదలాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని మరింత దృఢంగా నిర్ణయించుకున్నారు ప్రొఫెసర్ డాక్టర్ నల్లపు వెంకటేశ్వర్లు. ఏ విషయంలోనైనా తనను కలిసిన తన వారికి తోచిన సహాయాన్ని, సహకారాన్ని అందించడం ఆయనకు ఆయనే సాటి.
ఫే బ్యాక్ ద సోసైటి
డెంటల్ కాలేజీ ప్రొఫెసర్‌గా ఒక్కవైపు రోగులకు వైద్యం, విద్యార్థులకు వైద్యవిద్యా బోధనతోపాటు తను నేర్చుకున్న వెలుకువలు అందించడం వృత్తి నైపుణ్యం. బాబాసాహెబ్ డాక్టర్ అంబేడ్కర్ చెప్పినట్లు ''ఫే బ్యాక్ ద సోసైటీ'' ద్వారా ప్రతి సంవత్సరం తన జీతంలో ఒకనెల జీతంను పేద విద్యార్థుల కోసం చదువు కోసం ఖర్చు చేస్తున్నారు. తన వచ్చిన గ్రామాన్ని, తన ప్రజలకు సామాజికంగా, ఆర్థికంగా సహాయ సహాకారం అందిస్తూనేఉన్నారు. తన గ్రామంలో 50లక్షలతో విశాలమైన భవనాన్ని (పూర్వ విద్యార్థులతో కలిసి) నిర్మించారు. అందులో లైబ్రరి, కంప్యూటర్స్‌ను ఏర్పాటు చేశారు. ఆర్థికంగా వెనుకబడి బడుగు, బలహీన వర్గాల పిల్లలు పోటీ ప్రపంచంలో అందరితో సమానం గా పోటీ పాడాలని అందరికంటే ముందంజలో ఉండాలని ప్రొఫెసర్ డాక్టర్ నల్లపు వెంకటేశ్వర్లు అభిలాషా.
70 ఏళ్ల చరిత్రలో వైద్యరంగ చరిత్రలో ప్రొఫెసర్, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ స్థాయికి ఎదిగిన మొట్ట మొదటి దళితుడు మన డాక్టర్ నల్లపు వెంకటేశ్వర్లు అంటే అతిశయోక్తి కాదు. చీకటి నుండి వెలుగులోకి వచ్చిన వెంకటేశ్వర్లు మాటల్లోని నిజాయితీ, స్ఫూర్తి ఆయన వ్యక్తిత్వంలోనే కనిపిస్తాయి. తన తోటి డాక్టర్లు, నర్సులు, సిబ్బంది, మిత్రులాందరు ఉస్మానియా అంబేడ్కర్‌గా పిలిపించుకోవడం చాలా గర్వంగా ఉందని అంటారు ప్రొఫెసర్ డాక్టర్ నల్లపు వెంకటేశ్వర్లు (9849031420)
- బి.గంగాధర్, ఎడిటర్,
దళితశక్తి సామాజిక జాతీయ మాసపత్రిక,
9490098902, 9440154273.