ఏ దేశానికైనా ఒక చరిత్ర ఉంటుంది. అది ఆదేశ ప్రజల జీవన తాత్వికతను, సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడైనా ఆ దేశంలోని ప్రజల చరిత్రే దేశ చరిత్రగా, వారి సంస్కృతే దేశ సంస్కృతిగా చెలామణీ అవుతాయి. భారతదేశంలో మాత్రం దేశీయ జాతులకు చెందిన మూలవాసుల చరిత్ర ధ్వంసం చేయబడి, వలసవాదుల చరిత్రే దేశీయ చరిత్రగా వేలాది సంవత్సరాలు చెలామణీ అయ్యింది. నడుస్తున్న చరిత్రంతా పరాయీకరణ చెందిన చరిత్రని, దానిని ధ్వంసం చేసి ఈదేశ వాస్తవ చరిత్రను నిర్మించాల్సిన భాద్యత దళిత, అణగారిన వర్గాల సమూహాలకు చెందిన మేధావులు, విద్యావంతులపైన ఉందని అంబేద్కర్ భావించారు. అంబేద్కర్ వెలుగులో ఈదేశ వాస్తవ చరిత్ర, సాహిత్య నిర్మాణానికి దారుల పడ్డాయి. ఆ వెలుగు నుండి అనేక మంది చరిత్రకారులు, సాహిత్యకారులు ఆవిర్భవించి తమ చరిత్రను, తమ సాహిత్యాన్ని తాము రాసుకోవటం మొదలుపెట్టారు. ఆంధ్రదేశంలో కూడా అనేక మంది కవులు దళిత జీవితాలను, పోరాటాలను ప్రతీకలుగా తీసుకుని అనేక రచనలు చేశారు. ఆ క్రమంలోనే బొనిగల రామారావుగారు తమ సాహిత్య ప్రస్ధానంను ప్రారంభించారు. రామారావుగారి రచనలు చరిత్రను ఉపరితలం నుండి నిర్మించవు. అట్టడుగు పొరల్లో నిక్షిప్తమైన మూలవాసుల చరిత్రను, సంస్కృతిని అన్వేషించి, అక్కున చేర్చుకుంటాయి. తన స్వీయ జీవితంలో ఎదురైన అనుభవాలనే ప్రతీకలు తీసుకుని ఆయన రచించి, వెలువరించిన ఎంగిలి కవితా సంపుటి దళిత జీవితంలోని సంఘర్షణకు అద్దం పడుతుంది.
ఎంగిలి కవితా సంపుటిలోని కవితలు తరతరాలుగా దళితులు, అణగారిన వర్గాలు అనుభవిస్తున్న అవమానాలను, వారిపై నిరంతరం జరుగుతున్న సాంస్కృతిక దాడులను మనకు పరిచయం చేస్తూనే వాటిని ఎదిరించి నిలబడే ధైర్యాన్ని నూరిపోస్తాయి. ఎంగిలి కవితా సంపుటి ఆవేదన అనే కవితతో ప్రారంభమై, దళిత దళం అనే కవితతో ముగుస్తుంది. వైయక్తికమైన వేదనంతా సామాజిక వేదనగా మారి ప్రత్యామ్నాయ పోరుబాట వైపు దళిత దళంగా ముందుకు కదలాలని సింబాలిక్‌గా రచయిత అలా తన కవితలకు నామకరణం చేసి ఉంటారు. 'ఆవేదన' అనే కవితలో ఇలా అంటారు.
చేతకాని వాడ్ని కాదు
చేవలేని వాడ్ని కాదు
చావను నేను
నెత్తురు మండుతుంది
పచ్చల పిడిబాకుంది
చెక్కుతా! భారతమ్మోరి నుదిటిరాత!! కొత్త ఉలితో! అంటూ తన సాహితీ ప్రస్ధానంను ప్రారంభించిన బొనిగల నిజంగానే భారతమ్మోరి నుదిటిరాతను కొత్తపాళీతో అందునా దళితపాళీతో రచించారనిపిస్తుంది. కాదంబరిలో సర్వం భాణోశ్చిష్టం అని భాణుడు అంటే ఎంగిలిలో రామారావు సర్వం దళితోశ్చిష్టం అంటారు. దళితులు సృష్టించిన సాహిత్యాన్ని దోచేసి తిరిగి దాన్ని తమ సాహిత్యంగా తెరమీదికి తీసుకు వచ్చిన కుట్రను ఆయన తన కవితల ద్వారా ఎండగడతాడు. దళిత సాహిత్యాన్ని కబ్జా చేసిన విధానాన్ని 'లయలు' అనే కవితలో
గొల్ల సుద్దులు
హైజాక్ చేసిన అన్నమయ్య
దళిత లయలు కాపీ చేసిన త్యాగయ్య
గాంధర్వ విదుషీమణి
సాకంపాటి వేశ్యామణి
వద్ద పద కవితలు నేర్చిన క్షేత్రయ్యలు
ఎంగిలి మెతుకులు ఏరుకుని
సొంగకార్చిన విద్వాంసులు అని జరిగిన ద్రోహాంపై అంతులేని ఆగ్రహాన్ని వ్యక్తీకరిస్తారు.
మరొకచోట కవికి తపించటం, తరించటం, చిత్రించటం, శిల్పించటం, ప్రవహించటంతో పాటు ప్రశ్నించటం కూడా ముఖ్యమంటారు. ప్రశ్నించటంతోనే దళిత సాహిత్య ప్రస్థానం ప్రారంభ మయ్యిందని చెబుతూ ఈదేశంలో దళితులు, వారి శ్రమలేకుండా ఏమున్నదని ప్రశ్నిస్తాడు.
రామాయణం నుండి
రాజ్యాంగం వరకూ
నేను లేకుండా ఏముంది? అని నిలదీస్తాడు. అంతలోనే 'నేనే' అంతా ఈ దేశానికి జీవం, జీవితం అని నినదిస్తాడు. దేశమే కాదు దేవుడు కూడా దళితుల శ్రమచుక్కలతోనే బతుకు వెళ్లదీస్తాడని, దళితుడు లేకపోతే దేవుళ్లకి కూడా దిక్కులేదని ఎలుగెత్తి ప్రకటిస్తాడు.
క్రీస్తుకు ఐదు రొట్టెలు,
రెండు చేపలు
అర్పించిన శ్రామిక బాలుడ్ని
శ్రీకృష్ణుడికి అక్షయపాత్రలో
అన్ని మెతుకులు విదిల్చిన
కూలోళ్ల కుర్రోడ్ని అంటూ
నా చేపలు, రొట్టెలు
అన్నం మెతుకులు లేనిదే
క్రీస్తువల్ల కాలేదు
కృష్ణుని చేత కాలేదు
నా శ్రమ కొంతైనా లేనిదే
దేవుళ్లకే దిక్కు లేదు అని అంటారు. ఎంతటి ధిక్కారం. ఎంతటి సాధికారత. నిజమే శ్రమజీవుల కష్టార్జితమే లేకపోతే మనుషులకే కాదు, దేవుళ్లకి కూడా ఆహారం దొరకదంటే అది అతిశయోక్తి కాదు, అక్షరసత్యం.
పుట్టుకతోనే కొందరిని ప్రతిభావంతులుగా, మరి కొంతమందిని ఎందుకు పనికి రానివారిగా చిత్రీకరించే సాహిత్యంపై ఆయన అంతులేని అగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రతిభ అనే కవితలో
ద్రోణుడి బాణం 'వాడి'ని శంకిస్తున్నా
బొటనవేళ్లు నరికి,
బరిలోకి దిగకుండా
ఎన్నాళ్లు కాపాడు కుంటారు
వెధవలు ప్రతిభని
అర్జునుడు వెధవని నేనెందుకంటాను
విలువిద్య నేర్పిన గురువుని నొదిలి అని నకిలీ ప్రతిభావంతులు, వారికి కీర్తిస్తూ సాగిన చరిత్రలలోని డొల్లతనాన్ని ఎండగడతారు. కులాల పేరుతో, మతాల పేరుతో దేశాన్ని ముక్కలు చేస్తున్న హైందవ సంస్కృతిని ఆయన అనేక సందర్భాల్లో నిరసించారు. కాకి గూళ్లని ఆక్రమించి, ఎదిగిన తర్వాత తన కాకిని కాళ్లతో తన్నే కోకిలతో హైందవ సంస్కృతిని పోలుస్తారు.
నా అఖండ భారతం
ఖండ, ఖండాలవ్వాలంటే
కూత, కులుకులు నేర్చిన
కోకిల, నెమళ్లు చాలు
వేరే గూట్లో గుడ్లు పెట్టొచ్చు
తేరగా తన జాతిని పెంచొచ్చు
ఎంగిలి కూత కుయ్యొచ్చు
ఏదో ఒక కులుకు కులకొచ్చు అందుకే కష్టించి జీవించే కాకి సంస్కృతి కావాలి, తేరగా తినమరిగే కోకిల సంస్కృతి నశించాలి అంటూనే కాకిని 'జాతీయపక్షి' గా ప్రకటించాలని డిమాండ్ చేస్తారు.
అంటరానివారిగా, కనరాని వారిగా ఊరికి దూరంగా బతుకుతున్న వారి కష్టమునుండే సమస్త నాగరికతలు ఆవిర్భవించాయని, దళితుల మేధస్సు శ్రమశక్తి లేకపోతే జంధ్యమేసుకున్న ఈదేశానికి నూలుపోగు కూడా ఉండేది కాదని ఇలా అంటారు.
ఓ పంచమ చక్రవర్తీ!
ప్రత్తిచేలో పనికెళ్లే ఉంటావ్
పువ్వు విచ్చుకుంటే/ ఉచ్చ పోసే ఉంటావ్/ ఉమ్ము ఊసే ఉంటావ్/ కాలుతో తన్నే ఉంటావ్/ కనీసం తాకనైనా తాకే ఉంటావ్ ్‌నువ్వు తాకితే పునీతమైన చిన్నదారం వాడి ఒంటి మీద వేలాడితే ఎంత పవర్ అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాడు. అలాగే దళిత జీవితం, జీవన విధానంలోని ఔన్నత్యాన్ని వ్యక్తీకరిస్తూ ఇలా అంటారు.
తాను కూడు తింటే
పిల్లికి సల్ల బువ్వపెట్టి
ఎదురుగా కుక్కకేసి
చంకలో పిల్లకి పెట్టి
పిల్లలకోడికి మెతుకులిసిరి
తానాత్రంగా తింటాడు
వ్యవస్ధను బ్రతికిస్తూ
తాను జీవిస్తాడు
సంఘ సంస్క ృతికి ప్రతీక వీడు అంటూ దళిత జీవిత సారాంశాన్ని, సమున్నతిని అత్యద్భుతంగా ఆవిష్కరిస్తారు. తను బతుకుతూ పదిమందిని బతికించే దళిత జీవిత సౌందర్యాన్ని ఇంత హాృద్యంగా ఆవిష్కరించిన కవి బహుశా రామారావు గారేనెమో. ఆయన కవిత్వంలో దళితత్వం పొంగి పొరలుతుంది. చేతగాని, చేవలేని చరిత్రకారుల మీద ఆయన నిప్పులు కురిపిస్తారు. తన జాతికి ద్రోహాం చేస్తే బయట వారినే కాదు, సొంతవారైనా ఆయన వదిలిపెట్టడు. నిలదీస్తాడు, నిగ్గు తేలుస్తాడు. పుట్టిపెరిగిన జాతికి ద్రోహాం చేసే వారిపై కూడా ఆయన నిప్పులు కురిపిస్తాడు. జాతిద్రోహులనుద్దేశించి ఆయన ఇలా అంటారు.
ఎందుకు పుట్టార్రా మాకు
మమల్ని తార్చడానికా
మాకు చితి పేర్చడానికా
జాతి వికశిస్తుందా
జాతికి జాగృతి ఎట్లా
ఈ జాతికి సిగ్గు ఎలా తెలిసేది
నా జాతి కడుపు కోత ఏమని చెప్పేది అని అంటూనే ఈ దళిత దళారుల్ని ఎప్పుడు ఉరి తీసేది అని ప్రశ్నిస్తారు.
అంటరానిజాతుల చరిత్రను అన్వేషించడంలో ఆయన పడిన కష్టం, చేసిన పరిశోధన ఆయన రచించిన ప్రతి అక్షరంలోను ప్రతిఫలిస్తాయి.
ఎందుకొచ్చిన తంటా/
మరుగు పరిస్తే నిజాలు/
మక్కెలిరగదీస్తారు జనాలు/
అసలే మాలకన్న మనీడ్ని/
ముక్కలు, ముక్కలుగా కోసి/
బయటపడేస్తా తమరి బండారం... అని అంటూనే బ్రహ్మాణీయ మనువాద శక్తులు బండారాన్ని బట్టబయలు చేస్తారు. గతమంతా ఘనచరిత్ర కల్గిన జాతులు తమ జాతులకు పూర్వవైభవం తేవాలని, ఆ దిశగా ఒన మహౌజ్వల పోరాటానికి సిద్ధం కావాలని దళితులను సమాయత్తం చేస్తూ
కాటికాపరి వీరబాహు
నిప్పుల తప్పెటకు సెగపెట్టు
పల్నాటిసేనాని మాలకన్నమదాసు
వీరభైరవ ఖడ్గానికి పదునుపెట్టు
తల్లి అరుంధతి దీవెనందుకో
ఎదురులేరు నీకెవ్వరూ
ఏలుకో ఈదేశాన్ని! అని కర్తవ్యబోధ చేస్తాడు. అంటరానిజాతుల చరిత్రను అన్వేషించడంలో ఆయన పడిన కష్టం, చేసిన పరిశోధన ఆయన రచించిన ప్రతి అక్షరంలోను ప్రతిఫలిస్తాయి. దళితత్వాన్ని భారతీయ సాహిత్యంలోకి మహౌ జ్వలంగా ప్రతిఫలింపచేసిన గొప్ప సాహిత్య కారుడు బొనిగల రామారావు. ఆయన కలం నుండి మరిన్ని కవితా సంపుటాలు పురుడు పోసుకోవాలని ఆశిద్దాం..


No comments:
Post a Comment