Monday, November 6, 2017

సంపాదకీయం - Dalithashakthi November 2017 Magazine.


కుల, మతోన్మాదం ఒకవైపు, అగ్రకులోన్మాదం మరోవైపు భారత దేశాన్ని ఆధునిక సమాజం వైపు ప్రయాణించేలా కాకుండా ఆదిమ సమాజం వైపు అడుగులు వేయిస్తున్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాలు ఆధునిక సమాజం వైపు ప్రయాణం చేస్తే సహించలేని అగ్రకుల పెత్తందార్లు దళితుల చైతన్యానికి అడుగడుగున అడ్డంకులు సష్టిస్తున్నారు. తమ చైతన్యానికి దిక్సూచి, స్ఫూర్తిదాత, ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటే గరగపర్రులో దళితులను సామూహికంగా సాంఘిక బహిష్కరణ చేసి నెలలు గడుస్తున్నాయి. అలాగే అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వకుండా అగ్రకుల ఆధిపత్యానికి నిదర్శనంగా నిలుస్తున్నారు. 
నిజామాబాద్‌ జిల్లా రేకులపల్లిలో అంబేడ్కర్‌ విగ్రహం పెట్టుకుంటే వర్షాలు పడవని, కరువు వస్తుందని దుష్ప్రచారం చేయడం వారి మూఢత్వానికి సాక్ష్యంగా నిలిచింది. తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ స్థలంలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేసుకుంటే అక్కడి నుండి వీచే గాలి తమ కొబ్బరి చెట్లపై పడి చెట్లు మైల పడుతాయని విగ్రహాన్ని అర్ధరాత్రి కూలదోశారు. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో, వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న అంబేడ్కర్‌ విగ్రహాలను ధ్వంసం చేయటం, వారి మూఢత్వానికి, అజ్ఞానానికి నాణానికి ఒక వైపు మాత్రమే. మరోవైపు అగ్రకులాధిపత్యంతో దళిత, బడుగు, బలహీన వర్గాలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు, సాంఘిక బహిష్కరణ, నగంగా ఊరేగించడం లాంటి ఆటవిక చర్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం పాలకులు వీటన్నింటినీ చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకున్నట్టు వంటి దాఖలాలు లేవు. మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ మధ్య ప్రజల మధ్య విచ్చిన్నానికి కారణమవుతున్నారు.
దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలు ఐక్యతతో చైతన్య వంతంగా అగ్రకులతత్వాన్ని, మతోన్మాదాన్ని ఎదుర్కోవలసిన అవసరం ఎంతైనా ఉంది. బాబాసాహెబ్‌ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌, మాన్యశ్రీ కాన్షీరాం పోరాటస్ఫూర్తితో రాజ్యాధికారదిశగా ప్రయాణించాల్సిన అవసరం ఎంతో ఉంది.

No comments:

Post a Comment

Dalithashakthi - 2025 - Magazines