Friday, September 28, 2018

దళితుల అభ్యున్నతికోసం కృషిచేసిన నిరంతరశ్రామికుడు డి.సర్వయ్య


బాబాసాహెబ్‌ డాక్టర్‌ అంబేడ్కర్‌ అందించిన రాజ్యాంగ ఫలాలను ప్రజలకు అందించేందుకు నిరంతరం తాపత్రయపడేవారే మన నాయకుడైతే, 'పే బ్యాక్‌ సోసైటి' సిద్దాంతాన్ని, టీమ్‌ స్పీరిట్‌తో పని చేసే సర్వయ్యలాంటి నాయకులు ప్రాంతం పట్ల, ప్రజల పట్ల అవగాహాన కలిగి ఉండటం మనకు అదనపు అర్హతలు. గత ఇరవై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పని చేసిన అనుభవంతో పేదలు, దళితులు ఎక్కువగా ఉన్న అంబర్‌పేట ప్రాంతంతో ప్రత్యేక అనుబంధాన్ని పెంచుకున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధికి తన వంతుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం అందించే నిధులతోపాటు వివిధ వర్గాల ప్రజల ద్వారా 20 కోట్ల సమీకరించి ''కార్ఫస్‌ ఫండ్‌'' ఏర్పాటు చేయనున్నారు. అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను తయారుచేసేందుకు వివిధ వర్గాల ప్రజలతో మానిటరింగ్‌ కమిటిని నియమించుకుని బస్తీలు, కాలనీలకు కావాల్సిన మౌళిక వసతులు, విద్య, వైద్యం, తదితర సామాజిక అవసరాలకు తీర్చే విధంగా ఈ కమిటి పని చేయనున్నట్లు ప్రకటించారు. చదువుకున్న విద్యార్థులు, సివిల్‌ సర్వీస్‌, గ్రూప్స్‌ కోచింగ్‌, సొంతంగా వ్యాపారం చేసుకోవాలని అనుకున్న వారికి స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌కు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ''తన జాతి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందలంటే రాజ్యాధికారం వచ్చినప్పుడే సాధ్య''మని బాబాసాహెబ్‌ డాక్టర్‌ అంబేడ్కర్‌ అన్నారు. అలాంటి నాయకున్నే మన నేతగా ఎన్నుకుంటే మనం విజయం సాధించినట్లే...

Friday, September 21, 2018

దళిత బహుజన మహిళల విముక్తి కోసం... జూపాక సుభద్ర


దళిత బహుజన మహిళల విముక్తి కోసం... జూపాక సుభద్ర

 
ఈ పేరు వింటేనే దళితధిక్కార స్వరం కంచుకంఠంతో ధ్వనిస్తుంది. తెలంగాణా దళితవాడల విషాద జీవన కథనాలు కళ్లముందు సాక్షాత్కరిస్తాయి. దళిత స్త్రీల గుండె ఘోషలు వినిపిస్తాయి. తెలంగాణ దళితస్త్రీల వేదనలను విషాద జీవితాలను కథలుగా, కవితలుగా అక్షరబద్ధం చేసిన ప్రముఖ కవయిత్రి, కథనశిల్పి జూపాక సుభద్ర. అణగారిన గ్రామీణ జనం మానవ గౌరవం, మెరుగైన జీవనం, మార్పు కోసం పడే తండ్లాటలను రచయిత్రిగా గొప్పగా చిత్రికరించారు. అంచుల అడుగులకు, వెనుకకు నెట్టబడిన జీవితాలు ఈమె రచనల్లో కనిపిస్తాయి. మట్టి మనుషుల జీవ భాషలోని నుడి, వడి, పలుకుబడుల మాధుర్యాన్ని ఈమె మాటల్లో వినిపిస్తాయి. అవే మాటలను రచనల ద్వారా సమాజానికి అందించారు. అద్భుతమైన దష్టి, సష్టి, ప్రతిభ, సామాజిక బాధ్యతలకు కొండగుర్తుగా నిలుస్తుంది జూపాక సుభద్ర. అట్టడుగు సమూహాల అక్షరశిల్పి. తన కథల్లో అత్యంత అణగారిన సమాజాలను జీవింపచేసే సజనకారి. కవయిత్రిగా, కథకురాలుగా, కాలమిస్టుగా, వ్యాసకర్తగా, అనువాదకురాలుగా, పరిశోధకరాలుగా, నాయకురాలుగా, అత్యుత్తమవక్తగా, సంఘసేవకురాలుగా, ప్రభుత్వ ఉన్నతాధికారిణిగా బహుముఖ ప్రజ్ఞా పాటవాలతో ప్రజల్లో ఒక్కరుగా, ప్రజలతో ఒకరుగా సామాన్యురాలుగా ఉన్నారు జూపాక సుభద్ర.
నేపధ్యం
అత్యంత వెనకబడిన జిల్లాగా పేరుపొందిన ఆదిలాబాద్‌ జిల్లాలో నల్ల బంగారంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బెల్లంపల్లిలో దళిత కుటుంబంలో జూపాక నర్సయ్య, కోయిల కనకవీర దంపతులకు పన్నెండు మంది సంతానంలో భద్రక్క 11వ సంతానం. సింగరేణి బొగ్గుగనుల్లో అగ్నికణంగా 1964 అక్టోబర్‌ 30న జన్మించింది. కుటుంబంలో ఎవ్వరికి చదువు ల్లేవు. పన్నెండు మంది పిల్లల్లోనే కాకుండా కుటుంబంలో అందరికంటే చురుకైన పిల్ల. అందరికీ అతిచిన్న వయస్సులోనే బాల్య వివాహలు చేశారు. కానీ భద్రక్క చురుకుదనం తండ్రిలో ఆత్మవిశ్వాసాన్ని పొంపెందించింది. స్కూల్‌ పంపించాలని అనుకున్న ఇంట్లో వాళ్ళు చదువుకున్న పెండ్లి చేయలా? చదువు లేకున్న పెండ్లి చేయలా కదా! చదువుకుంటే ఏం చేస్తది అని కుటుంబం నుండి ప్రశ్నల వర్షం కురిసేది. బాల్యమంతా సింగరేణి బొగ్గు గనుల చుట్టూ తిరిగింది. ఆ గనులకి లాగానే భద్రక్క కూడా తవ్వినా కొద్దీ వెల్లబోసేదంతా మండే ఇంధనమే ఉంది. ఆ గనుల పొరల్లో వున్నట్టు నీళ్ళు, అగాధాలూ, చీకట్ల సామ్యం వుందని బాల్య స్మృతులు యాదికొచ్చాయి భద్రక్కకు.
బాల్యం-విద్య
సింగరేణిలో దళితుల ఇళ్ల పక్కనే ప్రైమరీ స్కూలు నాల్గవ తరగతి దాకా వుండేది. భద్రక్కను ఆ స్కూల్లో చేర్పించిండ్రు. భద్రక్కగా ఉన్న పేరు ఆ స్కూల్‌ టీచర్‌ భద్రక్క ఏంది భద్రక్క అని సుభద్రగా నమోదు చేసుకుంది. ఆనాటి నుండి చదువుల ప్రస్థానం మొదలు పెట్టింది సుభద్ర. చదువులో మెరిట్‌ విద్యార్థిగా పేరు తెచ్చుకుంది. రెండు గదుల్లో నాలుగు క్లాసులు జరిగేవి. అది తడ్కలతో కట్టింది గనక అందరూ దాన్ని తడ్కల బడి అనేటోళ్ళు. మాకున్న ఒకే వొక్క సారు నాలుగు క్లాసులకు పాఠాలు చెప్పేవాడు. ''ఒక్కొక్క క్లాసుకు వారానికి రెండు పాఠాలు జరిగితే మహా ఎక్కువ''. వారంలో జరిగే రెండు క్లాసులు మినహా మిగతా టైమంతా మగపిల్లలు సెరువులో ఈతలకూ, పరికి పండ్లకూ, రేగ్గాయల సెట్లల్లకూ, సైకిల్‌ తొక్కనీకి గ్రౌండ్లకు పోయేవాల్లు. కానీ మా ఆడపిల్లలం బొమ్మరిల్లాటలూ, గురుగులాటలూ, బొమ్మల పెండ్లి ఆటలూ, ఆడటం టైం కాగానే ఇంటికీ పోయేటోల్లం. ఇంటికి పోయినసంది పుస్తకాల సంచి అడ పడేసి పోచమ్మ చెరువు కాడ నుండి నీళ్ళు మోసుడు, బొగ్గు, పెండ, ఎర్రమట్టి, మొగ్గు తెచ్చేటోల్లం, గిన్నెలు తోమడం, వాకిలూడ్చే పనులు చేసెటోల్లం. మొగ పోరగాండ్లను గాలికి వదిలేసినట్టు మా ఆడ పోర గాండ్లని కూడా వదిలేస్తే వాళ్ళ తాతల సొమ్మేంబోయేదోనని పించేది. 
నాల్గవ తరగతి వరకూ చెప్పీ చెప్పని, వినీ వినని పాఠాలతో, దీపం కింద చదివీ చదవని పరీక్షలతో, బయటపడి, దళితుల ఇండ్లకి రెండు కిలో మీటర్ల దూరమున్న మాగంటి చంద్రన్న హైస్కూల్లో చేర్పించిండ్రు. ''నాల్గో తరగతి దాకా చదివిన పది, పదిహేను మంది నా క్లాసు ఆడ పిల్లల్లో ముగ్గురం మాత్రమే కొత్త స్కూల్లో (హై స్కూల్లో) చేరినాము''. ఆ స్కూలు ఊరు, వాడకు దూరంగా ఆఫీసర్ల కాలనీ మధ్యలో వుండేది. సింగరేణి బొగ్గుబావులు తవ్వే కార్మికుల పిల్లలు అక్షరాన్ని అందుకోవాలంటే రోజూ నాలుగు కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చేది. ఆఫీసర్ల కాలనీ వాళ్ళు, మా స్కూల్‌ టీచర్లు, ఆ కాలనీ పిల్లలు 'అండీ', 'గారు' అని ప్రతీ మాటకు వాడేవారు. ఆ పదాలు నాకు కొత్తగా వింతగా అనిపించేవి. వాటిని పట్టుకోవాలని ప్రయత్నించాను కానీ నా భాషకు యిప్పటి వరకు అతకలేదు. క్లాసులో టీచర్‌ లేకుంటే క్లాసు వాళ్ళ మీద, స్నేహితుల మీద, టీచర్ల మీద, క్లాసు సబ్జెక్టుల మీద, పూల మీద, పళ్ళ మీద, గాలి మీద నేల మీదంతా కవితలు రాసి క్లాసులో చదివి ఆనందపడేది. వాటి ప్రయోజనం కూడా దోస్తుల వరకు, క్లాసు రూము వరకే వుండేది. అలాగే క్లాసు రూమ్‌లో ముందు వరుసలో కూర్చునేది. నేటికీ ఎక్కడైనా ముందు వరుసలోనే కూర్చుంటా. ఏదైనా సబెక్టులో ఒక్క మార్కు తక్కువ వచ్చినా రాత్రంతా చదివేది. స్కూల్‌ రెండు కిలోమీటర్ల దూరం ఉండటంతో రోజు స్కూల్‌కు సద్ది (టిఫిన్‌) తీసుకోని వెళ్ళేది, కానీ ఒక్కొక్కరోజు సద్ది పాసిపోయేది అలా చాలా రోజులు పగటికీ తినకుండా ఉండేది.
మన మాటుండది ముచ్చెటుండది..
పుస్తకంలో వున్న భాషకు, ఈ 'అండీ', 'గారు' భాషకు తేడా ఏమీ కనిపించకపోయేది. ఆ భాష నాకు నోరు తిరగ నట్లుండేది. నేనకునేట్లుగా లేకపోయేది. పేరుకు తెలుగే కానీ మా యింట్ల వాళ్ళు, మా పరిసరాల వాళ్ళు మాట్లాడే భాషే కాదు. అంతా అయోమయంగా వుండేది. అవ్వను అడిగితే 'సదువంటే గట్లనే వుంటది బిడ్డా, అండ్ల మన మాటుండది ముచ్చె టుండది' అనే మా ముసలవ్వ మాటలు వేరే దిక్కులేదు అనే రాజీ అర్థం తో సముదాయించి నట్టుండేది. ఆ భాష అర్థం చేసుకోవడానికి అలవాటు పడడానికి ఎంత అవస్థ పడ్డానో. ఒక్క భాషే కాదు, పాఠ్యపుస్తకాల్లో, బయటి పుస్తకాల్లో, చందమామ కథల్లో, రేడియోలల్ల, పేపర్లల్ల, సినిమాలల్ల, సినిమా పాటలల్ల ఎక్కడ విన్నా, చదివినా మా భాషగానీ, మా వాళ్ళ పేర్లు గానీ, మా దేవుళ్ళ పేర్లు గానీ, మా పండుగల పేర్లు గానీ, మా వంటకాల పేర్లు గానీ, మా వాళ్ళ కట్టుబొట్టున్న బొమ్మలు గానీ చూద్దామన్నా కనబడకపోవడానికి కారణాలు, అడ్డంకులేమిటో తెల్వక పోయేది.
నేను ఎనిమిది తరగతి వరకు తెలుగు వంటల్లో దద్దోజనం, ఆవడ, గోంగూర, పూతరేకులు, బొబ్బట్లు, ఇడ్లి, దోశ లాంటివన్నీ టీచర్‌ చెప్పే పాఠాల్లో వినుడే గానీ అవెట్లుంటాయో తెల్వక పోయేది. క్యాబేజి, కాలిప్లవర్‌ ఇంకా కొన్ని కూరగాయలు వండుకుంటారని కూడా తెలియదు. మరి మా పల్లెల్లో, మా ప్రాంతంలో వండుకునే ఉల్లిగడ్డల కూర, పచ్చి పులుసు, సింతపండు తొక్కు, బొక్కల సోరువ, వంకాయ వట్టిచాపలు, సియ్యల కూరలు, బెల్లంబువ్వ, పాషంబువ్వ, బెల్లపప్పలు, రొట్టెలు, కుడుములు, పేలాలు, గుడాలు వాటి రుచి తెలుగు వంటల్లో ఎందుకు చేరలేదు? నోరు తిరగని, అలవాటు లేని సుబ్రహ్మణ్యం, మీనాక్షి, పంకజం, సుబ్బారావు, గాయత్రి, పద్మనాభ శాస్త్రి లాంటి పేర్లే గానీ, మాకలవాటైన మా ప్రాంతపు ఎల్లమ్మ, మల్లన్న, సమ్మక్క, సారక్క, లింగయ్య, ఐలయ్య, కొమురయ్య, భద్రక్క, పోశమ్మ, ఉప్పలమ్మ పేర్లు నేను చదివే పుస్తకాలల్లుంటే బాగుండేదనుకునేది. ఆకరికి మా దేవుళ్ళు గూడ పుస్తకాల్ల, సినిమాలల్ల కనబడకుంట రేడియోల్ల వినబడకుండా వుండేది. రామేసుడు, బద్ధిపోశమ్మ, కట్టమైసమ్మ, కొమురెల్లి దేవుడు, మల్లన్న దేవుడు, సమ్మక్క, సారక్క, పోశవ్వ, ఉప్పలమ్మ దేవుల్లు మా పుస్తకాలల్లుంటే వాళ్ళకు నెమలీకలు బెట్టి మొక్కుకుంటే మంచిగుండే దనుకునేది, సదువు బాగొస్తాదనుకునేది.
కట్టు బొట్టుకు పోలికే కనబడక పొయే...
''యింకా మా పుస్తకాల్ల తెలుగు వాళ్లవని చాలా బొమ్మలుండేవి. కానీ ఆ బొమ్మల కట్టు బొట్టుకు మా వాళ్ళ కట్టు బొట్టుకు పోలికే కనబడక పొయెది. మా ఆడోల్ల గోసికట్టు, యేలి సిగె, గంటీలు, సెవుపుల్లలు, ముక్కు పోగులు, పక్క పుల్లల్లు, మీది పుల్లలు, నల్లపూసల గుండ్లు, పట్టెడ, కాళ్ళ కడాలు, సాలం కడాలు, తోడాలు, దండె కడాలు, ముంజేతి కడాలు పెట్టుకున్న బొమ్మలు మా ప్రాంతపు మొగోల్ల పంచె కట్టు, సెవు పోగులు, చేతులక్కడాలు, తలకు రుమాలు, భుజాన కండువా, కాళ్ళకు దేవుని బేడీలు, మొలపట్ట, చెవులసుట్ట వున్న బొమ్మలు ఆ తెలుగు వాళ్ళంటున్న బొమ్మల్లో వుండక పోడానికున్న అభ్యంతరాలేంటివో తెలువక పొయ్యేది. మేము పెద్దగా చేయని సంక్రాంతి వంటి పండుగల మీద ఏకంగా పాఠాలే వుండేది గాని మా వూల్లె, ప్రాంతంల చాలా గొప్పగా, పెద్దగా చేసుకునే 'సద్దుల' పండగ, బతకమ్మల గూర్చి వుండక పోవడం గురించి మనసు చిన్నబోయేది''.
యిక ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక చరిత్రలో నదుల ప్రస్తావ నొచ్చి కష్ణ, గోదావరి, పెన్నా, తుంగభద్ర నదులున్నాయని చదూకున్నపుడు, మరి మా వూరు పక్క నుంచి చాలా వూళ్ళ పొంటి పెద్దగా పారే మా 'గంగ' పేరు లేదేంది? అదే టీచెర్నడిగితే 'గంగేంటి గంగా? అది వారణాసిలో వుంటది, నోర్మూసుకొని కూర్చో' అన్నది చాలా కసురుకొంటూ. స్పష్టత కోసం పడే నా ఉత్సాహాన్ని కూడా నోర్మూయించింది. మా మంచిర్యాల 'గంగే' గోదావరినది అని నా కప్పటి వరకూ, ఇంకా చాలా రోజుల వరకు తెల్వలేదు. నా చదువంతా నాకు నా కుటుంబానికి, నా పరిసరాలకు సంబంధించని, సామరస్యం లేని, సమన్వయం కాని, అలవాటులేని, అలవికాని పేర్లని పదాలని గుర్తు పెట్టుకోడానికి, తిరిగి అవి పేపరు మీద పెట్టడానికే నా బాల్యపు శక్తి యుక్తులన్నీ ధార పోశాను.
అక్షర జ్ఞానం కోసం... ఆకలినే పెట్టుబడిగా...
ఇంటర్‌ చేసేటప్పుడు వరంగల్లోని బాలసముద్రం హాస్టల్లో చేర్పించడానికి మా అయ్యా షరతులు పెట్టిండు. కాలేజీ సదువులో ఫెల్‌ అయినా, అటు-ఇటు సూసినా, పెండ్లి చేసేస్తా, అందరికీ ఆదర్శంగా ఉండాలని, మన గూడెం నుండి ఇంత సదువు సదివినదానివి ఒక్కదానివే. కాలేజీలో మంచిగా సదివి పేరుకు రావాలే అని జాగ్రత్తలు చెప్పిండు. నేను సరే అన్న. అప్పుడు హాస్టల్లో చేర్పిండు.
హాస్టల్‌ గోడల మీద విద్యార్థి సంగమోళ్ళు 'చదువు-పోరాడు' అనే నినాదం, 'మారాలీ మన సమాజము, రాజుల సంస్కతి ప్రజలది అంటే చెల్లదు చెల్లదు చెల్లదులే, హక్కులకై పోరాడుదామురా చెల్లెమ్మా' వంటి పాటలు, సాహిత్యం నన్ను విద్యార్ధి ఉద్యమాల వైపు ఆకర్షించి, నడిపించాయి. రాజ్యహింస, దొరల దోపిడీ, దౌర్జన్యాల మీద రాసిన చిన్న చిన్న రచనలు చెసేది. ఓసారి విద్యార్ధి ఉద్యమ సావనీర్లో నాదొక పెద్ద వ్యాసం రావడం నా పట్ల నాకు నమ్మకమేర్పడింది. నేను సమాజంలో కులంగా, జెండర్‌గా ఎదుర్కొంటున్న సమస్యల్ని, భావాల్ని బాహాటంగా మాట్లాడే పరిస్థితులు కాని, రాసే వాతావరణం కనిపించకపోయేది. ఇవన్నీ రాస్తే హేళన చేస్తారేమోనని, సిన్న చూపు చూస్తారేమోనని రాసినవి కూడా చూపించడానికి భయపడేది. 
బయటి వారి వివక్షలతో... కుటుంబ సభ్యుల జాగ్రత్తలతో ప్రారంభమైనా కాలేజీ సదువులు డిగ్రీని హాస్టల్‌లో ఉండి పూర్తిచేసినా. డిగ్రీ పూర్తికాగానే జాబ్‌ల కోసం అనేక రకాల పరీక్షలకు సదివేది. సివిల్స్‌కు పరీక్ష రాసినా ప్రిలిమినరి పాస్‌ అయినా.. మెయిన్‌ పాస్‌కాలేదు. ఇక్కడ ఒక్కవిషయం గుర్తించుకోవాలి. ఎందుకంటే నేను ఒకే ఒక్కసారి రాసినా మళ్ళీ మళ్ళీ రాయవచ్చని నాకు తెల్వదు అందుకు నేను ఒక్కసారి మాత్రమే రాసినా. 
పిజి కోసం కాకతీయ యూనివర్శిటీలో చేరినా తరువాత ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని చాలా కష్టబడి సదువేది. యం.ఏ మొదటి సంవత్సరంలో రాసినా గ్రూప్‌-2 (ఏఎస్‌ఓ సచివాలయం)కు మా క్లాసుమేట్స్‌ ముఫ్పై, నలభై మందిమి పరీక్ష రాస్తే నాకు ఒక్కదానికే రెండు సంవత్సరాల తరువాత జాబ్‌ వచ్చింది. యంఏ పూర్తి కాగానే ఎల్‌ఎల్‌బిలో కూడా సీటు వచ్చి జాయిన్‌ అయినా రెండవ రోజే యం.ఫిల్స్‌లో సీటు, జాబ్‌లో జాయిన్‌ కావాలని లేటర్‌ వచ్చింది. అలా విద్యార్థి దశ దాటుకుని ఉద్యోగపాత్రలోకి మారిపోయినా. 
ఆత్మగౌరవ తిరుగుబాటు...
ఇంటర్‌లో ఉండగా నా క్లాసుమేట్‌ బ్రహ్మణ అమ్మాయి నాపట్ల వివక్ష పూరితంగా చూడడం నాకు ఇబ్బందిగా అనిపించింది. అలా చాలాసార్లు చూసింది. కానీ ఒక్కరోజు నీళ్ళకాడ మాత్రం అలానే చూసింది దాంతో కుండతీసి నెత్తిమీద కొట్టిన. నా మీద ప్రిన్సిపల్‌కు కంఫ్లైంట్‌ చేసింది, నన్ను కాలేజీల్లోకి తీసివేయమని చెప్పింర్రు. కాలేజీ లెక్చరర్స్‌ మాత్రం సుభద్ర మెరిట్‌ విద్యార్థిని అని ప్రిన్సిపల్‌కు చెప్పి నన్ను కాపాడింర్రు.
అలాగే హాస్టల్‌లో కూడా ఓ ఘటన జరిగింది. హాస్టల్‌ బాత్‌రూంలో చాలా రక్తం ఉండడం చూసి వార్డెన్‌ పిల్లలందరిని పిలిచి అడిగింది, కానీ ఎవరిది కాదన్నరు. వెంటనే అందరిని హాస్పిటల్‌కు రెండూ, మూడు జీపులల్లో తీసుకెళ్లారు, కానీ నన్ను రమ్మంటే నేను రాను, ఆ రక్తం నాది కాదు, ఎందుకు రావాలని వెళ్ళలేదు, హాస్పిటల్‌ వెళ్ళకుంటే హాస్టల్‌ నుండి తీసేస్తానని వార్డెన్‌ చెప్పింది దాంతో అందరూ నన్ను హాస్టల్‌ నుండి తీసి వేస్తుందని భావించారు, ఆ బాత్‌రూంలో రక్తం కుక్క చేసిందని ఆయా గమనించి వార్డెన్‌కు చెప్పడం ద్వారా ఎవ్వరిని ఏమి అనలేదు. అలా హాస్టల్‌ నుండి వెళ్ళేెది తప్పించుకున్నాను. ఈ రెండు సంఘటనాలు నా కాలేజీ జీవితం గొప్ప పాఠంగా మారాయి. వేసవి సెలవులు వస్తే కూడా భయం వేసింది. ఎందుకంటే ఇంటికి వెళ్తే పెండ్లి చేస్తారనే భయం వెంటాడేది. కాలేజీ సెలవులుంటే హాస్టల్‌ బందు చేసేవారు. కానీ నాల్గురం, ఐదుగురం కలిసి హాస్టల్లోనే ఉండేటోల్లం. వార్డెన్‌ మాకు కొన్ని బియ్యం, పప్పు ఇచ్చేది. మేము ఒక్కపూట వండుకుని తినేవాళ్లం. అలా చదువుకోసం ఆకలిని పెట్టుబడిగా పెట్టి ప్రక్కనే ఉన్న లైబ్రరిలో అన్ని రకాల పుస్తకాలు చదవటం నాకు ప్రయోజనం కల్గింది. 
హాస్టల్‌ నుండి సంవత్సరంలో ఒక్కటి, రెండు సార్లు మాఊరు దామరంచెపల్లికి వెళ్లినప్పుడు వివిధ కులాల మహిళలు ఓ పోరి, ఏందే, ఓ మాదిగోళ్ళపోరి.. అని వివిధ రకాలుగా పిలిచేటోళ్ళు అది విని నాకు కోపం వచ్చేది, తట్టుకోక కొన్ని సందర్భాలల్లా మీరు మా భూమిలో కూలీ పని వస్తరు, నేను ఎప్పుడైనా మీ భూమిలో కూలీకి వచ్చిన్నా... అని తిట్టేది.
ఉద్యోగం
1988లో ఏఎస్‌ఓగా రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగం వచ్చిన తరువాత హైదరాబాద్‌ రావడం అదే మొదటిసారి. అప్పటికీ హైదరాబాద్‌ అంటే అంతులేని భయం. ''బిడ్డ పట్నంలా వుద్యోగం ఎట్లానో.. ఏమో? యాడ ఉంటావో.. అని భయ పడ్డాడు అయ్యా''. అప్పటీకే హైదరాబాద్‌లో మాకు తెలిసిన ఓ అక్క మౌలాలీలో ఉండేది. ఆ అక్క వద్దకు వచ్చి ఉద్యోగంలో చేరినా. అలా ప్రారంభమైనా ఉద్యోగ ప్రస్థానంలో అడు గడుగునా వివక్షలతో, అంతులేని ఆవేదనలతో కూడుకున్నది. ఇక్కడ ఉద్యోగం చేరగానే మనల్ని స్కాన్‌ చేస్తరు. ఇక్కడ మనకు ఎవరూ ఉండరు, వాళ్ళకైతే అందరూ కలుపుకపోతరు. మన వాళ్ళకు పనికి మాలిన పని అప్పచెప్తరు. ముఖ్యమైన సెక్షన్లకు మన వాళ్లను వేయరు. వేరేవాళ్ళకు మాత్రం అన్ని విధానాలు, విధాల చెప్తరు, ఎట్లా పని చెయాలి, ఏవిధంగా ఫైల్‌ రాయాలి అని చెప్తరు. మన వాళ్ళకు చెప్పేవారు ఉండరు. వాళ్ళు చిక్కగా ఉంటారు. సచివాలయం పరిపాలన కేంద్రమే కాదు, కులాల గుంపు. ఒక్క కులమోళ్ళు ఒక్కతాట కుసొని భోజనం చేస్తరు. మనవాళ్ళు వాళ్ళ వాళ్ళ గుంపులో గోవింద అనుకుంటరు, కానీ మనవాళ్ళందరిని ఒకగుంపు మాత్రం చేయరు. వీళ్ళకు గుంపుగా ఉండాలనే సొయి కూడా ఉండదు. 
తెలుగు మీడియం చదివి వచ్చిన వారికి ఇంగ్లీసు రాదని, ఫైల్‌ రాయడం రాదని వేధిస్తరు. 2010లో హౌం శాఖలో మన పిల్లడు ఈవిధంగా వేధించడం ద్వారా ఆత్మ'హత్య' చేసుకున్నడు. హెల్ప్‌ చేయకపోంగ, చెడగొడుతరు, తప్పుడు పద్దతిని చెప్తరు. నాక్కుడా ఒక్కసారి ఇట్లానే చెప్పింర్రు. నేను వరంగల్‌ నుండి అందులో వామపక్ష భావజాలం నుండి వస్తిని. 1990లో ఉమ్మడి సెక్రెటెరియట్‌లో ఏపిఎస్‌ఇఏ (అప్సా)లో ఎన్నికల్లో అడిషనల్‌ సెక్రెటరికి పోటీ చేసినా. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన దాంట్లో ఒక్కదాన్నే మహిళను అందులో ఎస్సీ, మల్లా తెలంగాణ. ఇక సూడు ఒక్కరకంగానా... కానీ ఆ ఎన్నికల్లో నేనే గెలిచినా. 
సచివాలయంలో అప్సా సంఘం ఒక్కటే ఉన్నది, మహిళలకు సంఘమే లేదు, కాబట్టి 1991లో ఆంధ్రప్రదేశ్‌ సెక్రెటెరియట్‌ ఉమెన్‌ ఎంప్లాయిస్‌ అసోషియేషన్‌ను ఫౌండర్‌ ప్రసిడెండ్‌గా మహిళ సంఘం పెట్టినం. అందులో ఫోర్త్‌క్లాసు ఆడోళ్ళను తీసుకోవాలని నిర్ణయం చేస్తే అందరూ అడ్డుకున్నారు. అందులో మనోళ్ళు కూడా ఉన్నరు. ఫోర్త్‌క్లాసు ఆడోళ్ళపై వేధింపులు ఎక్కువగా జరుగుతాయి, ఏమైనా అంటే ఉద్యోగం పోతదనే భయం ఉంటది. రికార్డు రూమ్‌లో ఫోర్త్‌క్లాసు ఆడోళ్ళను వేధిస్తే నేను ఒకన్ని కొట్టినా.
14ఏళ్ళు ఏఎస్‌ఓగా చాకిరి చేసి ఇప్పుడు అడిషినల్‌ సెక్రెటరిగా పని చేస్తున్నాను. కానీ చాకిరి ఎక్కువ, గుర్తింపు తక్కువ ఉండే సెక్షన్ల మనోళ్ళను పెడ్తరు. మైండ్‌లో కులగోడలు కట్టుకుని ఉంటరు. మనకు సపోర్ట్‌ చేసే వారు ఉండరు. పెద్ద పోస్టులో ఉన్నా మర్యాద ఇవ్వరు. ఇంకా చెప్పుకుంటాపోతే పెద్ద చరిత్ర అయితది. ముఖ్యంగా ప్రమోషన్స్‌లో మనకు అన్యాయం జరుగుతది, కానీ ఎవ్వరూ అడగరు. అదే వాళ్ళకు జరిగితే తిర్రమర్ర అయితదని తనలోని ఆవేదనను తెలిపారు. రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయంలో ఎస్సీలను ముఖ్యంగా మహిళల కష్టాలకు అంతులేదని వివరించారు. దేశంలో, రాష్ట్రంలో వివిధ విభాగాల్లో ఎన్నో ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఉన్నాయి కానీ సచివాలయంలో నేటికీ ఎస్సీ, ఎస్టీ సంఘం లేదంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ సంఘం ఏర్పాటు కు ఇక్కడి వారికి, బయట వారికి సంబంధాలే ఉండవు.
మా వూరి దొరసాండ్ల్రు యాదికోచ్చేది
అప్పటికే వామపక్ష భావజాలంతో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న. మా క్లాసుల్లో, కాలేజీల్లో, ఉద్యమాల్లో నాయకురాళ్ళను చూస్తే మా వూరి దొరసాండ్ల్రు యాదికోచ్చేది. పేరుకు తోటి స్త్రీలే కాని వాళ్ళ భాష తిండి, అలవాట్లు, చదువు, కట్టుబొట్టు, జీవన విధానం శ్రమ, లైంగికతలో మా కింది కులపాడోల్లకే మాత్రం పోలిక కనబడేది కాదు. ఎంత రాసుకొని పూసుకొని తిరిగినా దగ్గరి తనమనిపించక పోయేది.
నా పరిసరాల జ్ఞానం ప్రచార జ్ఞానం, దాంట్లో వున్న వైరుధ్యాలు వైవిధ్యాలు అర్ధం చేసుకునే ఘర్షణలో ప్రచార జ్ఞానమే నన్ను కబళించింది, తరాలుగా అణచబడి అడుగునబడిన నా కులం, ప్రాంతం, జెండర్‌, వర్గం, భాష, సంస్కతి రాశి (వెలుగు) లోకి రాకుండా రంగానికెక్కకుండా నిరోధింపబడ్డ దారుల నుండే నా ప్రయాణం, రచనలు మొదలైనవి.
రంగానికెక్కకుండా నిరోధింపబడ్డ దారుల నుండే...
యిట్లా అనేక విధాలుగా యింట్ల, బైట ఘర్షణ పడి అర్ధం కాని అభిప్రాయాల్తో వాటికి సమాధానాలు వెతికే క్రమంలో భంగపడి, బాధపడి నా బుర్రని తోడి మనసును తొలిచి మొత్తంగా నా ఆలోచనలు ఎత్తి పోతలయ్యేవి. యీ ప్రాంతం, జెండర్‌, వర్గం, కులం సంబంధాలకు అతీతంగా అంటనట్లున్నా కూడా నా సమస్యలకు అణచివేతలకు సామ్యము వెతికే క్రమంలో సాహిత్యంతో చాలా సాన్నిహిత్యమేర్పడింది. అట్లా చలం సాహిత్యంలో జెండర్‌, శ్రీశ్రీ, చాసో, కారా సాహిత్యంలో వర్గం జాతీయోద్యమ సాహిత్యంలో ప్రాంతం, గురజాడ, కందుకూరి సంస్కరణ సాహిత్యంలో నా కులాన్ని, నా గూడెం, మా కులవివక్ష, మా జీవివ విధానం, మా సంస్కృతి లేదు. సాహిత్య చరిత్రల్లో, రచయిత్రుల సంకలనాల్లో, నాకులపోల్లు వేసిన దళిత సంకలనాల్లో కింది కులాల ఆడవాళ్ళ సాహిత్యం లేదు. 
కుక్క ముట్టిన పాయసంగా...
నా పర్యవరణంలో నా ప్రపంచానికి, మెయిన్‌ స్ట్రీమ్‌ ప్రచారానికి మధ్య వుండే యీ వేల మైళ్ళ దూరంలో మా జాతులన్ని మట్టి పోరల్లోనే ఇంకా బువ్వకుండ చుట్టు తిరిగే ఆకలిలోనే వున్నారు. ప్రాంత పరంగా చూస్తే తెలంగాణ రచయిత్రులు అందులో దళిత రచయిత్రులు సాహిత్యంలో అసలు కనబడరు. వలస నీతి, వర్గ నీతి, కుల నీతి, జెండర్‌నీతి, ఆ జెండర్‌లో ఆధిపత్యకుల జెండానీతి, కింది కులాల స్త్రీ రచనల్ని సాహిత్య సంకలనాలు, వూరికి దూరంగానే వుంచిన నియమం కనబడుతుంది. తెలుగు సాహిత్య చరిత్ర కోస్తాంధ్ర ఆధిపత్య పితస్వామిక విలువల పట్టుతో మొదలైంది. ఆ విలువల్లో భాగంగానే సాహిత్యమంటే కేవలం హిందూ ఆధిపత్య పురుషులు రాసిందే మేటి సాహిత్యమైంది. దళిత, బహుజనులు, స్త్రీలు రాసిన సాహిత్యాన్ని ''కుక్క ముట్టిన పాయసంగా పారేసిన క్రమం'' నుంచి దళిత, మైనారిటీ, గిరిజన స్త్రీల సాహిత్యం సాహిత్యంగా యింకా గుర్తింపబడటం లేదు. 
ఎన్నో దళితోద్యమాలు, ఫెమినిస్టు ఉద్యమాలు, విప్లవోద్యమాలు వచ్చినా దళిత, బీసీ, ఆదివాసి మహిళల సమస్యల్ని పట్టించుకోలేదు. సాహితీకరించడం జరగలేదు. స్త్రీ వాద ఉద్యమం దళిత మహిళా సమస్యల్ని నిశ్శబ్దంలోకి నెట్టి వేసింది. స్త్రీ వాద ఉద్యమం సీమాంధ్ర నుండి కాదు కోస్తాంధ్ర అగ్రకుల ఆడవాల్ల సమస్యల్నే ఎజెండా చేసుకొని యిప్పటిదాకా సాగుతుంది. వారి 'పితస్వామ్య విముక్తినే స్త్రీ విముక్తి' అనే సిద్దాంతం సమాజంలో వత్తి కులాల ఉత్పత్తి మహిళలకు అంటదు. ఈ మహిళలకు శ్రమ విముక్తి, కుల విముక్తి, ఆసామి విముక్తి తమ మగవాల్ల నుంచి కూడా విముక్తి జరగాలి. కాని యివన్నీ స్త్రీ వాదులు చీకట్లో పెట్టారు. 
స్త్రీ విముక్తి సంస్కరణలు అగ్రకులాల స్త్రీలకే కానీ దళిత స్త్రీల సంస్కరణలు చేయనెలేదు. వాళ్ళ స్త్రీలు ఎప్పుడు గడప దాటలేదు కానీ దళిత, బహుజన స్త్రీలు ఎప్పుడు కూడా గడప దాటకుండా ఉండలేరు. వీరికి గడప దాటితే గాని ఇళ్లు గడవని పరిస్థితి. సంస్కరణల పరంగా సూసిన కింది కులాల్లో ఉన్న జోగిని, బసివి, దేవదాసిలాంటివి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అట్లానే సతి, వితంతు వివాహాలు కూడా పై కులాల్లోనే ఉండింది. కింది కులాల్లో లేదు కదా!
''ఎవడారగించు అమృతభోజనమున
కలిసెనో యీ లేమ గంజిబువ్వ
ఎవడు వాసము సేయు శృంగార సౌధాన
మునిగెనో యిన్నారి పూరిగుడిసె
ఎవడపహరించే ఏమయ్యె యీమెసుఖము'' అని జాషువా కింది కులాలపై 1930 ప్రాంతంలోనే రాసిండు. అలాగే మెదడు ఉంది ఆలోచించనివ్వండి/ స్వేచ్ఛ ఉంది తిరగనివ్వండి/ పశువుల్లా కట్టెస్తారేందుకు? అని చలం రాసింది నేటికీ అక్షరాల సత్యాలు. 
హిందూ కోడ్‌ బిల్లు కూడా సవర్ణ హిందువుల కోసమేనని ముందుమాటలో బాబాసాహెబ్‌ డాక్టర్‌ అంబేడ్కర్‌ రాసిండు. ఇప్పటి మహిళ రిజర్వేషన్‌ బిల్లు లెక్క. ఎందుకంటే ఇది చట్టమయితే దళిత, బహుజన మహిళాల సమస్యలపై ప్రత్యేక చట్టం ప్రవేశపెట్టాలని అంబేడ్కర్‌ ఆలోచన చేసిండని ఆయన రచనల్లోనే ఉంది. 
తట్టలు మోసిన నెత్తిపై నిన్నెందు మోయాలి
స్త్రీ వాద సాహిత్యం పునాదులు కుల హిందూ పితస్వామ్యాల అణచివేత పునాదుల్నించే వచ్చాయి. అట్లా బహుజన మహిళల్ని నిర్లక్ష్యం చేశారు. జ్యోతిరావ్‌ ఫూలే, సావిత్రీ బాయీ ఫూలే, నారాయణ గురు, పెరియార్‌ నుంచి అంబేడ్కర్‌ దాకా హేతువాద సామాజిక వైతాళికుల భావాజాలాన్ని ఆధిపత్య కులాలు స్త్రీవాదం ఆదర్శంగా తీసుకోలేదు. స్త్రీ విద్యకై, స్త్రీ దురాచారాల నిర్మూలనకై పోరాడిన చైతన్యాల్ని, చరిత్రల్ని స్త్రీ వాదులు ముందుకు తీసుకొనిపోలేదు. స్త్రీ విముక్తికి పాటుబడిన బహుజన వైతాళికుల సంస్మరణలు కూడా స్త్రీ వాదులకు అంటరానివే అయ్యాయి.
జ్యోతిబాఫూలే, నారాయణ గురు, సాహు మహారాజ్‌, పెరియార్‌ ఇ.వి. రామస్వామి నాయకర్‌, డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ భావాజాలంతోపాటు, మార్క్సిజం ప్రభావం కూడా దళిత సాహిత్యంలో కనిపిస్తుంది. ''దేశీయ మార్స్కిజం' అనే భావన కూడా తెలుగు దళిత సాహిత్యంలో చర్చలోకొచ్చింది. అందువల్ల దళిత సాహిత్యాన్ని కాలం, స్వభావాలను అనుసరించి గుర్తించవలసి ఉంది. అయినా, దళిత సాహిత్యం ఆవిర్భవించటానికి శతాబ్దాల సామాజిక పీడనను ఎదుర్కొన్న చారిత్రక నేపథ్యం ఉంది. ఆ నేపథ్యం నుండే ''దళిత సాహిత్యం' స్పష్టమైన అంబేడ్కర్‌ తాత్త్విక భావజాలంతో ఆవిర్భవించింది. 'మనుస్మతి' అనేది కుల హిందూ, కుల జెండర్‌ అణచివేత చట్టం, అట్లాంటి మనుస్మతిని తగల బెట్టిన అంబేడ్కర్‌ స్ఫూర్తి చైతన్యాల్ని ఇప్పటికీ బహుజన వర్గాలు కొనసాగిస్తూ మనుస్మతిని దహనం చేస్తున్నారు. కానీ స్త్రీ వాదులు, బ్రాహ్మణ సంస్కర్తలైన వీరేశ లింగాన్ని, గురజాడ అడుగుల్ని దాటి బైట పడని అప్రజాస్వామికాల్నే పాటిస్తున్నారు. ఒక్కడ ఒక్కవిషయం గమనించలే బెంగళూరులో నాగరత్నం అనే జోగిని వారి సమస్యలపై రాసిన పుస్తకాన్ని కందుకూరు వీరేశ లింగం బ్యాన్‌ చేయించి కేసులు పెట్టించి జైలుకు పంపిండు. తట్టలు మోసిన నెత్తిపై నిన్నెందు మోయాలి? అని జూపాక సుభద్ర ప్రశ్నించింది.
వీరు సచ్చినా ఇంకా సాహిత్యాన్ని శాషిస్తున్నారు. 
ఇప్పుడొస్తున్న అస్తిత్వ కవిత్వం చాలా బలంగా వస్తుంది. అయితే తెలుగు సాహిత్యంలో ఆధిపత్య కులాల రచనలే సాహిత్యంగా చెలామణి అవుతుంది. అగ్రవర్ణ రచయితలు, కవులు చచ్చిపోయి కూడా సాహిత్యాన్ని శాసిస్తున్నారు. అణగారిన కులాలపై ఆధిపత్య కులాలు చేసే రచనలకే పెద్దపీట వేస్తుండటం జరుగుతుంది. కాని అణగారిన సమూహాలు జెండర్లు తమ జీవితాల్ని సంఘర్షణల్ని, పోరాటాల్ని తామే సాహిత్యంగా మలిచి రచనలు చేస్తే అవి సాహిత్యం కాదని, ఎంత గొప్పగా వున్నప్పటికీ శిల్పం లేదనీ, అర్ధం కాని భాషనీ, బూతుగా వుందనీ అవాచ్యం చేయడం, చిన్న చూపు చూడ్డం జరుగుతుంది. యింకా అస్తిత్వ ఉద్యమాలు యింత ఉధతంగా జరుగుతున్నా, వాటి ప్రభావంగా అస్తిత్వ సాహిత్యం ఇంత పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ- తమ సాహిత్య పీఠాల్లో, అకాడమీల్లో 'తమ బాధలు, అనుభవాలు సాహిత్యీకరించు కోవడం అవి స్థానిక రచనలుగానే వుండిపోతాయి, గానీ అవి ప్రాపంచిక సాహిత్య విలువల్లోకి చేరవు' అని చర్చ చేస్తుంటారు. దళితుల జీవన విధానాన్ని చైతన్యవంతంగా వర్ణించిన సాహిత్యం దళిత సాహిత్యమవుతుంది. దళితుల అభ్యున్నతి కోసం ఎవరు రాసినా అది దళిత సాహిత్యంగానే పరిగణిస్తున్నారు. దళితులే తమ సమస్యలకు ప్రతిస్పందించి రాస్తే దాన్ని ''ఆత్మాభిమాన వాదం'గానూ దళితేతరులు దళితుల పక్షాన్ని వహించి రాస్తే దాన్ని ''ఉదార వాదం'గానూ పిలుస్తున్నారు.
రచనలు
  • నల్లరేగటిసాల్లు 2006
  • సంగతి (తమిల్‌ నుండి తెలుగు)
  • కైతునకల దండెం 2008
  • అయ్యయ్యో దమ్మక్క 2009
  • చంద్రశ్రీ యాదిలో... 2013
  • రాయక్క మాన్యమ్‌ 2014
  • భూమిక స్త్రీవాద మాసపత్రిక కాలమిస్టుగా, దళితశక్తి మాసపత్రిక గౌరవ ఎడిటర్‌గా, వివిధ మాస, వార, దినపత్రికలకు వ్యాసాలు రాస్తుంటారు.
పురస్కారాలు
  • మైత్రేయ కళాసమితి కథ పురస్కారం 2006
  • ఆంధ్రప్రదేశ్‌ భాషా కమీషన్‌ అవార్డు 2007
  • జివిఆర్‌ కల్చరల్‌ పౌండేషన్‌ అవార్డు 2007
  • డా.సుశీల నారాయణ రెడ్డి ట్రస్టు అవార్డు 2009
  • తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ కవయిత్రి అవార్డు 2011
  • నోముల కథ పురష్కారం 2013
  • దామోదరం సంజీవయ్య సాహితి పురస్కారం 2013
  • దళితమిత్ర ధనజీరావు గైక్వాడ్‌ ట్రస్టు అవార్టు మహారాష్ట్ర సమాజ్‌ భూషన్‌ పురస్కారం 2013
  • నందివాడ శ్యామల సహృదయ సాహితి పురస్కారం 2014
  • డా.బోయ జంగయ్య చేతన పురస్కారం 2014
  • రంగినేని ఎల్లమ్మ సాహితి పురస్కారం 2015
  • అమృత లత- అపూర్వ అవార్డు 2015
  • తెలంగాణ మహిళ శక్తి పురస్కారం 2015
  • డా.కవిత స్మాకర పురస్కారం కడప 2015
  • లాడ్లి మీడియా స్పెషల్‌ అవార్డు 2016
  • తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య ప్రతిభ పురస్కారం 2016
  • తెలంగాణ స్టేట్‌ లిటరరీ అవార్డు 2017
  • డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ జాతీయ అవార్డు, దళిత్‌ ఓపెన్‌ యూనివర్శిటీ ఆఫ్‌ ఇండియా 2017
  • ఈశ్వరీబాయి మెమోరియల్‌ అవార్డు 2018
  • వెంకట సుబ్బు అవార్డు 2018
అణచివేతల ధిక్కార స్వరాల్ని...
స్త్రీల గురించి పురుషులు రాసినా, దళితుల గురించి దళితేతరులు రాసినా, తెలంగాణ మీద ఆంద్రోల్లు రాసినా, ఒక మతం గూర్చి యింకో మతం వాల్లు రాసినా అది సంపూర్ణం కాదనీ ఏ సమూహాల అస్తిత్వ గాయాలు, దుక్కాలు, లోతులు వారికే అనుభవమని అణగారిన అస్తిత్వ సమూహాలు అంటున్నాయి. వీరు బలంగా సామాజిక బాధ్యతతో రాస్తున్నా వీరి రాతలు విస్తత వ్యాప్తిలోకి రావడానికి అంతులేని అడ్డంకులు నియంత్రణలు. అదే అగ్రకులాల సాహిత్యం విస్తత వ్యాప్తిలోకి రావడానికి కారణం వారికున్న వనరులు, మీడియాలు వాల్లవి గనక. యీ అవకాశాలు అణగారిన కులాలకు లేవు. అయినప్పటికీ దళిత, బహుజన రచయితలు, రచయిత్రులు కోకొల్లలుగా రాస్తున్నరు. దళిత సాహిత్యం, దళిత మహిళల సమస్యలపై, సాహిత్యంపై 1992 నుండి నేటి వరకు అనేక రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సెమినార్స్‌లో పాల్గోని పేపర్స్‌ అందించారు. వర్తమాన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు కుల, జెండర్‌, మత ప్రాంత అణచివేతల ధిక్కారస్వరాల్ని బాగానే వినిపిస్తున్నారు. అయితే ఆధిపత్య సమూహాల్నించి వచ్చి సాహిత్య రాజ్యాలు పాలిస్తున్న వ్యక్తుల శక్తులే ఇప్పటికీ సాహిత్య, సాంస్కతిక అధికారాల్ని చలాయిస్తున్నారు. ప్రత్యామ్నాయ కవిత్వం, సాహిత్యం ద్వారానే దోపిడీ శక్తుల సాంస్కతిక, సాహిత్యాలని ఎదుర్కోగలం. బహుజన కవులు, రచయితలు, రచయిత్రులు ఇది గమనించాలని అంటారు జూపాక సుభ్రద.
సుభద్ర తెలుగు సాహిత్యంలో ఉన్న అగ్రకుల స్వభావాన్ని, అంతేకాక మహిళా సాహిత్యంలో ఉన్న అగ్రకుల భావాజాలాన్ని ప్రశ్నిస్తూ ఆధునిక సాహిత్యంపై తనదైన శైలిలో విమర్శనాత్మకమైన విమర్శన చేస్తూ దళిత, బహుజన సాహిత్యం యొక్క ఉన్నతిని పెంపొందిస్తు వ్రాయడం జరుగుతుంది. దళిత సాహిత్యం ప్రధానంగా దళితులు రాసే 'మా సాహిత్యాన్ని ఎందుకు పక్కన పెట్టేస్తారు?' అని ప్రశ్నిస్తారు జూపాక సుభద్ర. 'ఆధిపత్య కులాల రచనలకు లేబుల్స్‌ ఉండవు. పరిమితులుండవు. వారు రాసింది విశ్వసాహిత్యం. మేము రాస్తే- అది దళిత సాహిత్యం, తెలంగాణ సాహిత్యం.. ఇంకా ఏవేవో పేర్లు' అంటారామె. 'స్త్రీ వాదులు కోరుతున్న విముక్తికీ, దళిత స్త్రీలు కోరుతున్న విముక్తికీ చాలా తేడా ఉంది. భారతదేశంలో ఉన్న అగ్రవర్ణాల వారికి పితస్వామ్యం నుంచి విముక్తి కావాలి. మాకు కులం నుంచి భూస్వాముల నుంచి ఆకలి నుంచి విముక్తి కావాలి' అంటారామె.
చివరగా...
వామపక్ష బావజాలంతోపాటు బాబాసాహెబ్‌ డాక్టర్‌ అంబేడ్కర్‌, మహత్మా జ్యోతిరావ్‌ ఫూలే, సావిత్రి భాయి ఫూలే స్ఫూర్తితో పెన్నే ఆయుధంగా చేసుకుని కలాన్ని గళంగా చేసుకుని పోరాటం చేస్తున్నారు జూపాక సుభద్ర. కవయిత్రిగా, కథకురాలుగా, కాలమిస్టుగా, వ్యాసకర్తగా, అనువాదకురాలుగా, పరిశోధకురాలుగా, నాయకురాలుగా, అత్యుత్తమ వక్తగా, సంఘసేవకురాలుగా, ప్రభుత్వ ఉన్నతాధికారిణిగా బహుముఖ ప్రజ్ఞా పాటవాలతో ప్రజల్లో ఒక్కరుగా, ప్రజలతో ఒకరుగా సామాన్యు రాలుగా ఉన్నారు జూపాక సుభద్ర మహిళలందరికీ మార్గదర్శకురాలు, ఆరద్శప్రాయురాలు.
- బి.గంగాధర్‌, ఎడిటర్‌

కరుణానిధి... ఒక ఉద్యమం



బిడ్డల పాలకై బిచ్చమెత్తు దేశంలో
రాళ్ళకు పాలిచ్చు కథ నశించునదెన్నడో
పేడకు బొట్టెట్టి దైవమని పూజించువారు
పేదను గుర్తించగ మారబోవునదెన్నడో
ఎపుడొచ్చును దేశానికి చైతన్యం
అది తెచ్చుట కదా మన కర్తవ్యం.
తమిళనాడులో తన పాలనను నిమ్నకులాల వలన, నిమ్న కులాల చేత, నిమ్న కులాల కొరకు నడపబడుతున్న స్వయంపాలనగా ప్రకటించుకున్న ధీశాలి అతడు. నా జాతే.. నా జాతీయత, నా గడ్డే నాదేశం, అదే నా దేశభక్తి అని గర్జించిన ద్రావిడ సింగం కరుణానిధి.



వందల మతాలు, వేల కులాలు, భిన్న సాంప్రదాయాలు, విభిన్న సంస్కృతులుగా ముక్కలైన మానవ సమాజం యొక్క సామూహిక స్వరూపమే భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశం యొక్క గొప్పతనమని ఎంత గొప్పగా చెప్పుకున్నప్పటికీ, ఆ భిన్నత్వంలో దాగిన అసమానత్వమే ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని ఖండఖండాలుగా విభజిస్తుందన్నది మాత్రం కాదనలేని సత్యం. భిన్న భాషలు, విభిన్న సంస్కృతులు, అనేక మతాలు, అంతకు మించిన కులాలు తమ తమ అస్తిత్వాలతో ఉమ్మడిగా మనుగడ సాగిస్తున్న దేశమిది. ఏకత్వమే కాదు, ఈ దేశానికి ఇదమిద్ధంతా ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం, ఒక మతం, ఒక చరిత్రంటూ లేవు. ఈ దేశంలో జీవిస్తున్న అనేక జాతులు, తెగలు తమకు మాత్రమే సొంతమైన సంస్కృతి, సాంప్రదాయాలు, భాషలను కాపాడుకోడానికి ఒకదానితో ఒకటి అనునిత్యం ఘర్షణ పడుతూనే ఉంటాయి. 70వ దశకంలో ఉత్తరాది రాష్ట్రాలు తమ మీద సాగిస్తున్న ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాలు పెద్దయెత్తున్న ఉద్యమించాయి. తమిళ ప్రజలు కూడా ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ ద్రావిడ ఉద్యమాన్ని పెద్దయెత్తున్న చేపట్టారు. దేశంలో మహౌజ్వలంగా సాగిన ద్రావిడ ఉద్యమానికి తమిళ ప్రజలే నాయకులై నడిపించారు. ఆత్మగౌరవం పేరుతో తమిళనేల నాలుగు చెరుగులా విస్తరించిన ద్రవిడ ఉద్యమం దేశానికి ఎంతోమంది సామాజిక విప్లవ కారులను అందించింది. ఆ ఉద్యమాల నుండి ప్రభవించిన ఒక విప్లవ సూరీడే కరుణానిధి ఆలియాస్‌ కలైంజర్‌. 
కరుణానిధి ఉద్యమ ప్రస్ధానం తమిళ రాజకీయ, సామాజిక, సాహిత్య రంగాలలో ఒక కొత ్తచరిత్రకు నాంది పలికింది. కరుణానిధి చరిత్ర తెలుసుకోవటమంటే మొత్తానికి మొత్తంగా తొంభై నాలుగేళ్ల తమిళ సామాజిక, రాజకీయ, తాత్విక ఉద్యమ చరిత్రను తెలుసుకోవటమే అవుతుంది. ఆయన జీవిత ప్రస్ధానం గురించి మాట్లాడుకోవటమంటే యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, జంతుబలులు, దేవుడు, దెయ్యం వంటి అనాగరీక లక్షణాలతో కునారిల్లుతున్న తమిళ సమాజాన్ని శాస్త్రీయ ధృక్పదం వైపు నడిపించడానికి ద్రవిడ నేలమీద నడిచిన నాస్తికోద్యమం గురించి మాట్లాడుకోవటమే అవుతుంది. తమిళనాడు రాజకీయ, సామాజిక, సాహిత్య రంగాలలో కరుణానిధి పోషించిన పాత్ర అనితర సాధ్యమయ్యింది. కవిగా, పత్రికా సంపాదకుడిగా, వక్తగా, రచయితగా, ఉద్యమకారుడిగా, నాస్తికుడిగా, హేతువాది గా, రాజకీయ నాయకుడిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా అన్నింటికీ మించి కోటానుకోట్ల మంది ప్రజలను కనుసైగతో కదిలించగల నాయకుడిగా కరుణానిధి తమిళ, భారత రాజకీయ ఇతిహాస చరిత్రలో ధృవతారలా వెలుగొందారు. తన చరిత్రే.. తమిళనాడు చరిత్రగా.. తమిళ నాడు చరిత్రే తన చరిత్రగా మమేకమైన నాయకుడు తమిళనేల మీద ఒక్క కరుణానిధి తప్ప మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. 
తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరుక్కువళై అనే కుగ్రామములో 1927 జూన్‌ 3వతేదిన ముత్తువేలార్‌, అంజుగం దంపతులకు కరుణానిధి జన్మించారు. సామాజికంగా వెనుకబడిన కులంలో జన్మించటం, చిన్నతనంలోనే స్వతహాగా అనేక అవమానాలను ఎదుర్కొవటం ఆయన్ని కరడుగట్టిన సంస్కరణవాదిగా మార్చివేశాయి. కరుణానిధి ఈసావెల్లలార్‌ (తెలుగు నాయిబ్రాహ్మాణ) అనే శూద్రకులంలో జన్మించారు. ఈసా అనగా సంగీతము, వెల్లలార్‌ అంటే సేద్యగాడు అని అర్ధం. ఈసావెల్లలార్‌ అంటే సంగీత వాద్యకారుడు అని అర్ధం. కరుణానిధి పూర్వీకులంతా సంగీత విద్వాంసులే. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పెళ్ళూరు సంస్ధానంలో కరుణానిధి తాత, ముత్తాతలు సంగీత విద్వాంసకులుగా ఉండేవారని అంటారు. ఒంగోలు దగ్గరలోని చెరువుకొమ్ముపాలెం కరుణానిధి పూర్వీకుల జన్మస్థలమని ప్రచారం కూడా ఉంది. అందుకే తెలుగువారు ఎవరు కనిపించినా కరుణానిధి తెగ సంతోష పడిపోయేవారని, ఆప్యాయంగా ఆలింగనం చేసుకునేవారని ఆయన్ని కలిసిన కొంతమంది చెబుతారు. కరుణానిధి తండ్రి కూడా నాదస్వర విద్వాంసుడే. తన కొడుకు కూడా నాదస్వర విద్వాంసుడిగా పేరు తెచ్చుకోవాలని ఆయన కోరుకునేవాడు. అందుకే కరుణానిధిని తిరుక్కువళై గ్రామంలో అగ్రకులస్తుల ఆధ్వర్యంలో నడపబడుతున్న సంగీత పాఠశాలలో చేర్పించారు. తమిళనాడులో సంగీత పాఠశాలలు ఆకాలంలో ఎక్కువగా దేవాలయాల్లో నిర్వహించబడేవి. ఆనాడు తమిళనాడు అంతా కులవివక్ష తీవ్రంగా ఉండేది. పెద్దకులాలకు చెందిన మనుషులు వస్తున్నప్పడు శూద్రకులాలకు చెందిన వారు పైచొక్కా ధరించి వారికి ఎదురుపడటం నేరంగా భావించేవారు. దేవాలయాలకు రోజూ అనేక మంది పెద్దకులానికి సంబంధించిన వారు దేవుని దర్శించుకోడానికి వస్తారు కాబట్టి సంగీతం నేర్చుకోడానికి వచ్చే శూద్రకులాలకు చెందిన విద్యార్థులు పైచొక్కా లేకుండా రావాలని నిభందన పెట్టారు. ఈ సంఘటన కరుణానిధిని తీవ్రంగా కలచివేసింది. కేవలం కులం పేరుతో కొంతమంది విద్యా, కళారంగాలపై ఆధిపత్యం చెలాయిస్తూ, మిగిలిన వారిని విద్యకు, కళలను దూరం చేయడాన్ని కరుణానిధి జీర్ణించుకోలేక పోయారు. కేవలం కులం కారణంగా సాటిమానవులను హీనంగా చూడటం చిన్నతనం లోనే కరుణానిధికి అంతులేని ఆవేదన కలిగించింది. చిన్ననాడే తనను తీవ్రంగా భాదించిన ఈ సంఘటనల గురించి కరుణానిధి మాట్లాడుతూ ''నా మొదటి సంగీత అభ్యసన తరగతులే, నా మొదటి రాజకీయ తరగతులు. కులం మనుషులను ఎంత హీనంగా చూస్తుందో నాకు అప్పుడే అర్ధమయ్యింది'' అని అన్నారు.
బాల్యంలో జరిగిన అనేక సంఘటనలు కరుణానిధిని హిందూ మనువాద శక్తులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల వైపు ఆకర్షితుడయ్యేలా చేసింది. చిన్న వయస్సులోనే తమిళనాడులో జరిగే అనేక సామాజిక ఉద్యమాలలో కరుణానిధి ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సామాజిక వివక్షకి కారణమైన బ్రాహ్మాణీయ మనువాద శక్తులకు వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున్న ఉద్యమాన్ని నడిపిస్తున్న పెరియార్‌, అన్నాదురై వంటి యోధానుయోధులకి కరుణానిధి దగ్గరయ్యారు.
బ్రాహ్మాణీయ మనువాదశక్తులు అంటరానితనం పేరుతో కోట్లాది మంది సామాన్య ప్రజలకు చెందాల్సిన హక్కులన్నింటినీ దోచుకుంటున్న కాలమది. మనువాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. తమిళనాడులో కూడా పెరియార్‌ రామస్వామి నాయకర్‌ వంటి ఉద్యమకారులు మనువాదశక్తులకు వ్యతిరేకంగా పెద్దయెత్తున్న ఉద్యమాలు నడిపారు. ఉత్పాదక కులాల శ్రమశక్తిని దేవుని పేరుతో దోచుకుంటున్న పురోహిత కులాల అమానవీయ విధానాలకు వ్యతిరేకంగా పెరియార్‌ నడిపిన ఆత్మగౌరవ పోరాటం తమిళప్రజలను విశేషంగా ఆకర్షించింది. ఎంతోమంది నాయకులు, రచయితలు, ఉద్యమ కారులు పెరియార్‌ ఆత్మగౌరవ పోరాటంలో భాగస్వాము లయ్యారు. 
బాల్యంలోనే తనకు ఎదురైన సామాజిక వివక్ష వల్ల కరుణానిధి కూడా పెరియార్‌ సాగిస్తున్న ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారు. పెరియార్‌ ఆశయాలు, ఆలోచనలు, ప్రసంగాలు యుక్తవయస్కుడైన కరుణానిధిని అమితంగా ఆకర్షించేవి. పెరియార్‌ తాత్విక భోదనలతో కరుణానిధి ఎంతగా ప్రభావితమయ్యారంటే తన తల్లిదండ్రులు పెట్టిన దక్షిణామూర్తి అన్న హిందూ పేరును కరుణానిధి అని మార్చుకున్నారు. కుల, మతాల పేరుతో మనుషులను విభజిస్తూ, వారిని హీనంగా చూస్తున్న వ్యవస్ధలను, వాటిని కాపాడుతున్న వ్యవస్థలను, సాహిత్యాన్ని ద్వారా ధ్వంసం చేయాలని పెరియార్‌ పిలుపు నిచ్చారు. పెరియార్‌ ఆలోచనాధారతో ప్రభావితులైన ఎంతో మంది తమిళనాట తిరుగులేని నాయకులుగా ఎదిగారు. 
అన్నాదురై, కరుణానిధి వంటి నేతలు కూడా పెరియార్‌ మార్గదర్శకత్వంతో రాటుదేలిన వారే. అన్నాదురై, పెరియార్‌ సహాచర్యం కరుణానిధిని పూర్తిస్ధాయి సామాజిక ఉద్యమ కారుడిగా మార్చివేసింది. పెరియార్‌ని ఉద్యమగురువుగా, అన్నాదురైని రాజకీయ గురువుగా కరుణానిధి భావించేవారు. వీరిద్దరి ఉద్యమ సహాచర్యమే కరుణానిధి ముఖ్యమంత్రి అయిన తర్వాత తమిళనాడులో అనేక సాంఘిక సంస్కరణల దిశగా ఆయన్ని పురిగొల్పింది. వారి ఆశయాలను కొనసాగించటమే తన ముందున్న కర్తవ్యమని కరుణానిధి అనేకసార్లు ప్రకటించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు సమాజంలోని అన్నివర్గాల వారికీ సమానంగా అందాలని ఆయన ఆకాంక్షించేవారు. సమాజంలో కొంతమందిని ఉన్నతులుగా, కొంతమందిని హీనులుగా చూసే వ్యవస్థలన్నింటినీ ప్రజాస్వామీకరించాలని ఆయన భావించేవారు. కొన్ని వర్గాల గుత్తాధిపత్యంలో ఉన్న దేవాలయాల్లో పనిచేయడానికి అన్ని వర్గాలకు అవకాశం ఉండాలనే పెరియార్‌ ఆలోచనలకు అనుగుణంగా తమిళనాడు లోని అన్ని ప్రధాన దేవాలయాల్లో కిందికులాల వారిని అర్చకులుగా నియమించడానికి వీలు కల్పిస్తూ కరుణానిధి ఒక ప్రత్యేకచట్టాన్ని తీసుకువచ్చారు. ఆ చట్టం వల్ల ఆలయాలపై కొన్ని కులాలకు మాత్రమే సొంతమైన గుత్తాధిపత్యాన్ని తొలగటంతోపాటు, నిమ్నకులాల వారికి అర్చకులుగా పనిచేసే అవకాశం కలిగింది. ప్రజాస్వామ్య దేశంలో కులాల గుత్తాధిపత్యం చెల్లదని, తరతరాలుగా దేవాలయాలపై కొన్ని కులాలకు వారసత్వంగా వస్తున్న అధిపత్యహక్కులని రద్దు చేయాలని, సమాజంలో అన్ని కులాల వారికీ దేవాలయాల్లో పౌరోహిత్యం నిర్వహించే అవకాశం కల్పించాలని బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆనాడే డిమాండ్‌ చేశారు. 
కరుణానిధి తీసుకువచ్చిన ప్రత్యేకచట్టం వల్ల తమిళనాడులో అన్ని కులాల వారికి ప్రధాన దేవాలయాల్లో అర్చకులుగా నియమించడానికి అవకాశం కలిగింది. నిమ్నకులాల వారిని అర్చకులుగా నియమించడానికి వీలుగా తమిళనాడులో శిక్షణా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. కరుణానిధి తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించింది, తమిళనాడు స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకున్న కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాలు కూడా ఇలాంటి చట్టాలను చేశాయి. తమ అధిపత్యాన్ని బద్ధలు కొడుతూ కరుణానిధి తీసుకువచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని మనువాద సంఘాలు కోర్టుకెక్కాయి. కరుణానిధి మాత్రం ఈ చట్టం అమలు చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేశారు. ఈ చట్టం వల్లే కేరళలోని శబరిమల, తమిళనాడులోని కొన్ని దేవాలయాల్లో నిమ్నకులాలకు చెందిన వారిని పూజారులుగా ఇటీవల నియమించారు.
ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో కరుణానిధి అనేక సాంఘిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. మత స్వేచ్ఛను పరిరక్షించటం అంటే రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కులని పరిరక్షించడమే అవుతుందని కరుణానిధి భావించే వారు. మతస్వేచ్ఛని హారించే నిర్భంధ మత మార్పిడి చట్టాన్ని కరుణానిధి రద్దు చేశారు. వెనుకబడిన ముస్లిం మతస్తులు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి వీలుగా వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారు. 
మహిళలకు ఆస్తిలో సమానవాటాను పొందే హక్కును కల్పించటంతోపాటు, విద్య, ఉపాధి అవకాశాలలో 30 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. ఒక్కప్పుడు తమిళనాడు అంతా మనుషులచేత లాగబడే రిక్షాలుండేవి. మనకు తెలిసిన గుర్రపుబగ్గీలు వంటివే అవి, అయితే వాటిని గుర్రాలు లాగేవి, తమిళ నాడులో మనుషులు లాగేవారు. ఈ అమానుషాన్ని కరుణానిధి తీవ్రంగా నిరసించారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే మనుషులు లాగే రిక్షాలను పూర్తిగా రద్దుచేశారు. దీనివల్ల ఉపాధి కోల్పోయిన వారందరికీ సైకిల్‌ రిక్షాలను ఉచితంగా పంపిణీ చేశారు. 
జన్యులోపం వల్ల ట్రాన్స్‌జెండర్లుగా పిలువబడే హిజ్రాలు సమాజంలో గౌరవప్రదంగా జీవించడానికి ప్రత్యేకంగా కొన్ని రిజర్వేషన్లు కల్పించారు. ట్రాన్స్‌జెండర్లకు మొదటిసారి రేషన్‌కార్డులు అందచేసిన రాష్ట్రం తమిళనాడే. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బిసి కులాలకు వారి జనాభా థామాషా ప్రకారం 69 శాతం రిజర్వేషన్లని అమలు చేశారు. ఈ రిజర్వేషన్లు అమలు చేయడానికి కోర్టు తీర్పులు అడ్డు నిలిచినప్పటికీ కరుణానిధి వెనుకడుగు వేయలేదు. నిమ్నకులాలకు 69శాతం రిజర్వేషన్లు అమలు చేసి, సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమానికి తన నిబద్ధత ఏమిటో కరుణానిధి నిరూపించారు. దీన్నే తమిళనాడు తరహా మోడల్‌ రిజర్వేషన్ల విధానమని అంటారు. ఈ విధానాన్ని అమలు చేయాలని అనేక రాష్ట్రాలలో డిమాండ్‌ ఉంది. సమాజంలో నిమ్నకులాల అభివృద్ధికి దోహాదపడే ఏ అంశాన్నైనా తక్షణమే అమలు చేసే తత్వం కరుణానిధిది.
ఒక్కప్పుడు తమిళనాడు అంతా ప్రయివేటు బస్సుల హావా ఎక్కువగా నడిచేది. కరుణానిధి రవాణాశాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో తమిళనాడులోని బస్సు సర్వీసులన్నింటినీ జాతీయ చేశారు. ఆయన ప్రారంభించిన అనేక సంస్కరణలను మిగిలిన రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు అనుకరించేవారు. హిందూత్వ భావజాలాన్ని రూపుమాపడానికి కరుణానిధి విశేషంగా కృషి చేశారు. వివాహావ్యవస్ధలో నిర్భంద పూజలు, క్రతువులను ఆయన నిరసించారు. ఎవరికి నచ్చినట్టు వారు వివాహాం చేసుకునే స్వేచ్ఛ ఉండాలని ఆయన భావించేవారు, ప్రజలకున్న వివాహా స్వేచ్ఛను కాపాడటానికి వీలుగా స్వీయగౌరవ వివాహ చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చారు. కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించటంతోపాటు, మతాచారాలు జీవనదశలను ప్రభావితం చేయకుండా అడ్డుకోవటంలో ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడింది. సామాజిక సంక్షేమ రంగానికి సంబంధించిన ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు కరుణానిధి పాలనా కాలంలో అమలు చేయబడ్డాయి. రైతులకు రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్న దళారీ వ్యవస్ధను నిర్మూలించడానికి రైతుబజార్లు ఏర్పాటు చేయటం, పేదవారికి ఒక్క రూపాయికే కిలోబియ్యం, బిచ్చగాళ్లకి, కుష్టువ్యాధిగ్రస్తులకు ప్రత్యేక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయటం వంటి ఎన్నో సంస్కరణలు తమిళనాట ఆయన్ని తిరుగులేని నాయకుడిగా నిలబెట్టాయి. ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలపై చెలాయించే పెత్తందారీ పోకడలను కరుణానిధి వ్యతిరేకించారు. రాజ్యభాషైన హిందీలోనే పాలనా వ్యవహారాలు సాగించాలన్న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను ఆయన వ్యతిరేకించారు. తమిళనాట ఉవ్వెత్తున ఎగిసిన హిందీ వ్యతిరేక ఉద్యమానికి ఆయనే నాయకుడై నడిపించారు. 
భారతదేశంలో మూలవాసులను దొంగలుగా, వేలాది మంది వీరులను రాక్షసులుగా చిత్రీకరిస్తూ సాగిన మనువాద సాహిత్యాలలోని డొల్లతనాన్ని బట్టబయలు చెయ్యాలని దళిత వర్గాలకు అంబేడ్కర్‌ పిలుపునిచ్చారు. దీంతో నిమ్నకులాలకు చెందిన సాహితీవేత్తలు బ్రాహ్మాణీయ, మనువాద సాహిత్యాలలోని డొల్లతనాన్ని వ్యతిరేకిస్తూ తమ గళాలను, కలాలను ఎక్కుపెట్టారు. తమిళనాడులో కూడా పెరియార్‌ వంటి అనేకమంది ఉద్యమకారులు, సామాజికవేత్తలు బ్రాహ్మాణీయ, మనువాదాలను ఖండిస్తూ అనేక రచనలు చేశారు. ఈ కాలంలోనే కలం పట్టిన కరుణానిధి తన అక్షరాలను సామాజిక వివక్షని ధ్వంసం చేసే దిశగా ఎక్కుపెట్టారు. సామాజిక అసమానతలకు, వివక్షకు దన్నుగా నిలుస్తున్న మనువాద భావజాలాన్ని కరుణానిధి తీవ్రంగా ద్వేషించేవారు. హిందూత్వ భావజాలం, కిందికులాలపై ఆధిపత్య కులాలు కొనసాగిస్తున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక దోపిడినీ నిరసిస్తూ ఆయన అనేక రచనలు చేశారు. కరుణానిధి తన జీవిత కాలంలో ఏనాడు దేవుణ్ణి విశ్వసించలేదు. దేవుడి పేరుతో సమాజంలో జరుగుతున్న దోపిడినీ కరుణానిధి తీవ్రంగా నిరసించేవారు. ''సముద్రం మీద సేతువు నిర్మించడానికి రాముడేమైనా ఇంజనీరా.. అయితే రాముడు ఏ ఇంజనీరింగు కాలేజీలో చదివాడు'' అని కరుణానిధి చేసిన వ్యాఖ్యలు దేశంలో సంచలనం కల్గించాయి. హిందూ సంస్ధలన్నీ కరుణానిధి వ్యాఖ్యల మీద భగ్గుమన్నాయి. కరుణానిధి వాటిని ఏ మాత్రం ఖాతరు చేయలేదు. నాటకం, కథ, సినిమా, కథనం ప్రక్రియ ఏదైనా కరుణానిది సమాజాన్ని చైతన్యవంతం చేయడానికే ప్రయత్నించే వారు. కరుణానిధి మొదటిసారిగా మాటలందించిన సినిమా 'పరాశక్తి'. ఆ సినిమాలో కరుణానిధి రాసిన డైలాగులు సమాజంలో ఒక పెనుసంచలనం రేపాయి. మంత్రాలు, తంత్రాలు అంటూ పూజారివర్గం చేస్తున్న దోపిడీని ఈ సినిమాలో ఆయన దునుమాడారు. మనువాదాన్ని నిరసిస్తూ ఆయన సంధించిన మాటల, తూటాలు తమిళ సమాజాన్ని హేతువాదం వైపు, శాస్త్రీయ ధృక్ఫదంవైపు నడిపించాయి.
సమాజంలో జరిగే ఏరకమైన ఆధిపత్యాన్ని కరుణానిధి ఒప్పుకునేవారు కాదు. ఆరోజుల్లో దేశమంతా సాగుతున్న సంస్కృత భాషాధిపత్యాన్ని ఆయన నిరసించేవారు. తమిళనాట జరిగే సాహిత్య క్రతువులన్నీ తమిళంలోనే జరగాలని ఆయన ఆకాంక్షించేవారు. తమిళ సాహితీరంగంలో తనదైన ముద్రను వేసుకున్న కరుణానిధి, సాహితీ ప్రస్ధానం పదమూడేళ్ల చిరు ప్రాయంలోనే ప్రారంభమయ్యింది. నూనూగు మీసాల నూతన యవ్వనంలో కరుణానిధి 'సెల్వ చందిర' అనే ఒక చారిత్రక నవలను రచించారు. ఈ నవల ''తమిళ భాష వర్ధిల్లాలి.. తమిళ ప్రజలు వర్ధిల్లాలి'' అనే వాక్యంతో ప్రారంభమవుతుంది. ఈ నవల ముందుమాటలో కరుణానిధి ''ద్రావిడనాడు నేడు తనకు మాత్రమే సొంతమైన కళలను, సంస్కృతిని, సాంప్రదాయలను కోల్పోయి నేడు సంకట స్థితిని ఎదుర్కొంటుంది. దక్షిణాదికి చెందిన తెలుగు, మళయాళం, కన్నడం వంటి సుందరమైన భాషలలో ఒకటైన తమిళం నేడు దాదాపు అంతరించి పోయే స్ధితిని ఎదుర్కొంటుందంటే, పరభాషా ఆధిపత్యం ఎంతగా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. తమిళప్రజలు తిరిగి తమిళనాడుకి, తమిళభాషకి, తమిళసంస్కృతికి పూర్వవైభవం తీసుకురావడానికి కొదమ సింహాలై గర్జించాలి'' అని రాశారు. కరుణానిధి రచనా శైలి అత్యంత సరళంగా, సూటిగా అచ్చమైన తమిళ నుడికారాలతో స్వచ్ఛంగా ఉంటుంది. ఆ శైలే కరుణానిధిని తమిళ సాహితీ రంగంలో తిరుగులేని సాహిత్య కారుడిగా నిలబెట్టింది. తొంభైనాలుగేళ్ల తన సుదీర్ఘ జీవితకాలంలో ఆయన చేసిన సాహిత్యకృషి అనితర సాధ్యమయ్యింది. తమిళ సాహితీ ప్రక్రియలలో ఆయన అడుగుపెట్టని రంగమంటూ లేదనే చెప్పాలి. కరుణానిధి కళలంటే అంతులేని ఆసక్తిని, అనురక్తిని కనబరిచేవారు. తానే సొంతంగా రచించి, ప్రదర్శించిన పలయప్పన్‌ అనే నాటకం తమిళనాడులో సంచలనం సృష్టించింది. తన అక్షరాలతో కరుణానిధి ఏనాడు తప్పటడుగులు వేయించలేదు. తన ప్రతి అక్షరాన్ని తాను నమ్మిన సిద్థాంతాల సాధన దిశగా సాగుతున్న సామాజిక ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలబెట్టారు. 
తమిళనాట తరతరాలుగా అణగారిన, బలహీన వర్గాలు కోల్పోయిన హక్కులను తిరిగి రాబట్టటంతోపాటు, సామాజిక వివక్షను కూకటివేళ్లతో పెకలించి వెయ్యాలని నిరంతరం తపించిన తాత్వికుడు కరుణానిధి. సిద్థాంతానికి, ఉద్యమానికి, రాజకీయాలకు మధ్య వారధి నిర్మించిన వీరుడుతడు. తమిళ రాజకీయ, సాహిత్య, సినిమా రంగాలపై కరుణానిధి ప్రభావం అజరామరంగా నిలుస్తుందనటంతో ఎటువంటి సందేహాం లేదు. పెరియార్‌ సామాజిక సిద్థాంతం, అన్నాదురై రాజకీయ పంథాలను వారసత్వంగా పొందిన కరుణానిధి తమిళనాట ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు కారణమయ్యారు. కరుణానిధి తనకు తానుగా ప్రభవించిన ద్రవిడ సూరీడు. నమ్మిన సిద్థాంతాల కోసం తలవొంచక నిటారుగా నిలబడిన నాయకుడు. ఆయన మాటలు, పాటలు, ప్రసంగాలు ప్రజలను ఆకర్షించటంతోపాటు, ఆలోచింపచేసేవి. 94ఏళ్ల జీవితకాలంలో 13సార్లు ఎమ్మెల్యేగా, 5సార్లు ముఖ్యమంత్రిగా, 50 సంవత్సరాలపాటు పార్టీ అధ్యక్షుడిగా అన్నింటీకీ మించి 80 ఏళ్ల ప్రజాజీవితం, 60 ఏళ్ల రాజకీయ ప్రస్ధానం, భారతీయ రాజకీయ ఇతిహాస చరిత్రలో అత్యంత అరుదైన ఘటనగా చెప్పవచ్చు. 14వఏటనే సామాజిక ఉద్మమాలలోకి అడుగు పెట్టిన కరుణానిధి, 33ఏళ్లకే ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించి శాసనసభలోకి అడుగుపెట్టారు. నాటి నుండి ఆయన వెనుతిరిగి చూసిందిలేదు, తిరుగులేని నాయకుడయ్యారు. 
తమిళనాడులో తన పాలనను నిమ్నకులాల వలన, నిమ్న కులాల చేత, నిమ్న కులాల కొరకు నడపబడుతున్న స్వీయపాలనగా ప్రకటించిన ధీశాలి. నా జాతే... నా జాతీయత, నా గడ్డే... నాదేశం, అదే నా దేశభక్తి అని గర్జించిన ద్రావిడ సింగం కరుణానిధి. భారతదేశంలో అంబేడ్కర్‌ ఆశించిన అణగారిన వారి రాజ్యాధికార సిద్థాంతం కల సాకారమయ్యింది మొదటిసారి తమిళనాడులోనే, ఆ కలను సాకారం చేసిన వారిలో కరుణానిధి అగ్రగణ్యుడు. ఆయన మరణించినప్పటికీ తమిళనాడు భవిష్యత్‌ రాజకీయాలు కరుణానిధి ముద్ర లేకుండా కొనసాగలేవన్నది మాత్రం వాస్తవం.
- డాక్టర్‌ కారెం శశిధర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, నాగార్జున యూనివర్శిటీ, గుంటూరు

Sunday, September 9, 2018

మీ ఆర్థిక తోడ్పాటును అందించండి

సామాజిక జాతీయ తెలుగు మాసపత్రిక భారతదేశంలో దళిత, బహుజనల తెలుగు మాసపత్రికల్లో అత్యధిక సర్క్యులేషన్‌ పాఠకుల కృషి ఫలితమేనని బలంగా నమ్ముతున్నాము. మీ స్పందన మాలో స్ఫూర్తి నింపుతున్నది. మీరు అందిస్తున్న స్ఫూర్తితో పత్రికను మరింత ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తున్నాము. మా కృషికి మీ ఆర్థిక తోడ్పాటును అందించి మమ్ముల్ని ముందుకు నడిపిస్తారని గఢంగా విశ్వాసిస్తున్నాము. Dalithashakthi website

Dalithashakthi - 2025 - Magazines