Friday, September 21, 2018

కరుణానిధి... ఒక ఉద్యమం



బిడ్డల పాలకై బిచ్చమెత్తు దేశంలో
రాళ్ళకు పాలిచ్చు కథ నశించునదెన్నడో
పేడకు బొట్టెట్టి దైవమని పూజించువారు
పేదను గుర్తించగ మారబోవునదెన్నడో
ఎపుడొచ్చును దేశానికి చైతన్యం
అది తెచ్చుట కదా మన కర్తవ్యం.
తమిళనాడులో తన పాలనను నిమ్నకులాల వలన, నిమ్న కులాల చేత, నిమ్న కులాల కొరకు నడపబడుతున్న స్వయంపాలనగా ప్రకటించుకున్న ధీశాలి అతడు. నా జాతే.. నా జాతీయత, నా గడ్డే నాదేశం, అదే నా దేశభక్తి అని గర్జించిన ద్రావిడ సింగం కరుణానిధి.



వందల మతాలు, వేల కులాలు, భిన్న సాంప్రదాయాలు, విభిన్న సంస్కృతులుగా ముక్కలైన మానవ సమాజం యొక్క సామూహిక స్వరూపమే భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశం యొక్క గొప్పతనమని ఎంత గొప్పగా చెప్పుకున్నప్పటికీ, ఆ భిన్నత్వంలో దాగిన అసమానత్వమే ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని ఖండఖండాలుగా విభజిస్తుందన్నది మాత్రం కాదనలేని సత్యం. భిన్న భాషలు, విభిన్న సంస్కృతులు, అనేక మతాలు, అంతకు మించిన కులాలు తమ తమ అస్తిత్వాలతో ఉమ్మడిగా మనుగడ సాగిస్తున్న దేశమిది. ఏకత్వమే కాదు, ఈ దేశానికి ఇదమిద్ధంతా ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం, ఒక మతం, ఒక చరిత్రంటూ లేవు. ఈ దేశంలో జీవిస్తున్న అనేక జాతులు, తెగలు తమకు మాత్రమే సొంతమైన సంస్కృతి, సాంప్రదాయాలు, భాషలను కాపాడుకోడానికి ఒకదానితో ఒకటి అనునిత్యం ఘర్షణ పడుతూనే ఉంటాయి. 70వ దశకంలో ఉత్తరాది రాష్ట్రాలు తమ మీద సాగిస్తున్న ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాలు పెద్దయెత్తున్న ఉద్యమించాయి. తమిళ ప్రజలు కూడా ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ ద్రావిడ ఉద్యమాన్ని పెద్దయెత్తున్న చేపట్టారు. దేశంలో మహౌజ్వలంగా సాగిన ద్రావిడ ఉద్యమానికి తమిళ ప్రజలే నాయకులై నడిపించారు. ఆత్మగౌరవం పేరుతో తమిళనేల నాలుగు చెరుగులా విస్తరించిన ద్రవిడ ఉద్యమం దేశానికి ఎంతోమంది సామాజిక విప్లవ కారులను అందించింది. ఆ ఉద్యమాల నుండి ప్రభవించిన ఒక విప్లవ సూరీడే కరుణానిధి ఆలియాస్‌ కలైంజర్‌. 
కరుణానిధి ఉద్యమ ప్రస్ధానం తమిళ రాజకీయ, సామాజిక, సాహిత్య రంగాలలో ఒక కొత ్తచరిత్రకు నాంది పలికింది. కరుణానిధి చరిత్ర తెలుసుకోవటమంటే మొత్తానికి మొత్తంగా తొంభై నాలుగేళ్ల తమిళ సామాజిక, రాజకీయ, తాత్విక ఉద్యమ చరిత్రను తెలుసుకోవటమే అవుతుంది. ఆయన జీవిత ప్రస్ధానం గురించి మాట్లాడుకోవటమంటే యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, జంతుబలులు, దేవుడు, దెయ్యం వంటి అనాగరీక లక్షణాలతో కునారిల్లుతున్న తమిళ సమాజాన్ని శాస్త్రీయ ధృక్పదం వైపు నడిపించడానికి ద్రవిడ నేలమీద నడిచిన నాస్తికోద్యమం గురించి మాట్లాడుకోవటమే అవుతుంది. తమిళనాడు రాజకీయ, సామాజిక, సాహిత్య రంగాలలో కరుణానిధి పోషించిన పాత్ర అనితర సాధ్యమయ్యింది. కవిగా, పత్రికా సంపాదకుడిగా, వక్తగా, రచయితగా, ఉద్యమకారుడిగా, నాస్తికుడిగా, హేతువాది గా, రాజకీయ నాయకుడిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా అన్నింటికీ మించి కోటానుకోట్ల మంది ప్రజలను కనుసైగతో కదిలించగల నాయకుడిగా కరుణానిధి తమిళ, భారత రాజకీయ ఇతిహాస చరిత్రలో ధృవతారలా వెలుగొందారు. తన చరిత్రే.. తమిళనాడు చరిత్రగా.. తమిళ నాడు చరిత్రే తన చరిత్రగా మమేకమైన నాయకుడు తమిళనేల మీద ఒక్క కరుణానిధి తప్ప మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. 
తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరుక్కువళై అనే కుగ్రామములో 1927 జూన్‌ 3వతేదిన ముత్తువేలార్‌, అంజుగం దంపతులకు కరుణానిధి జన్మించారు. సామాజికంగా వెనుకబడిన కులంలో జన్మించటం, చిన్నతనంలోనే స్వతహాగా అనేక అవమానాలను ఎదుర్కొవటం ఆయన్ని కరడుగట్టిన సంస్కరణవాదిగా మార్చివేశాయి. కరుణానిధి ఈసావెల్లలార్‌ (తెలుగు నాయిబ్రాహ్మాణ) అనే శూద్రకులంలో జన్మించారు. ఈసా అనగా సంగీతము, వెల్లలార్‌ అంటే సేద్యగాడు అని అర్ధం. ఈసావెల్లలార్‌ అంటే సంగీత వాద్యకారుడు అని అర్ధం. కరుణానిధి పూర్వీకులంతా సంగీత విద్వాంసులే. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పెళ్ళూరు సంస్ధానంలో కరుణానిధి తాత, ముత్తాతలు సంగీత విద్వాంసకులుగా ఉండేవారని అంటారు. ఒంగోలు దగ్గరలోని చెరువుకొమ్ముపాలెం కరుణానిధి పూర్వీకుల జన్మస్థలమని ప్రచారం కూడా ఉంది. అందుకే తెలుగువారు ఎవరు కనిపించినా కరుణానిధి తెగ సంతోష పడిపోయేవారని, ఆప్యాయంగా ఆలింగనం చేసుకునేవారని ఆయన్ని కలిసిన కొంతమంది చెబుతారు. కరుణానిధి తండ్రి కూడా నాదస్వర విద్వాంసుడే. తన కొడుకు కూడా నాదస్వర విద్వాంసుడిగా పేరు తెచ్చుకోవాలని ఆయన కోరుకునేవాడు. అందుకే కరుణానిధిని తిరుక్కువళై గ్రామంలో అగ్రకులస్తుల ఆధ్వర్యంలో నడపబడుతున్న సంగీత పాఠశాలలో చేర్పించారు. తమిళనాడులో సంగీత పాఠశాలలు ఆకాలంలో ఎక్కువగా దేవాలయాల్లో నిర్వహించబడేవి. ఆనాడు తమిళనాడు అంతా కులవివక్ష తీవ్రంగా ఉండేది. పెద్దకులాలకు చెందిన మనుషులు వస్తున్నప్పడు శూద్రకులాలకు చెందిన వారు పైచొక్కా ధరించి వారికి ఎదురుపడటం నేరంగా భావించేవారు. దేవాలయాలకు రోజూ అనేక మంది పెద్దకులానికి సంబంధించిన వారు దేవుని దర్శించుకోడానికి వస్తారు కాబట్టి సంగీతం నేర్చుకోడానికి వచ్చే శూద్రకులాలకు చెందిన విద్యార్థులు పైచొక్కా లేకుండా రావాలని నిభందన పెట్టారు. ఈ సంఘటన కరుణానిధిని తీవ్రంగా కలచివేసింది. కేవలం కులం పేరుతో కొంతమంది విద్యా, కళారంగాలపై ఆధిపత్యం చెలాయిస్తూ, మిగిలిన వారిని విద్యకు, కళలను దూరం చేయడాన్ని కరుణానిధి జీర్ణించుకోలేక పోయారు. కేవలం కులం కారణంగా సాటిమానవులను హీనంగా చూడటం చిన్నతనం లోనే కరుణానిధికి అంతులేని ఆవేదన కలిగించింది. చిన్ననాడే తనను తీవ్రంగా భాదించిన ఈ సంఘటనల గురించి కరుణానిధి మాట్లాడుతూ ''నా మొదటి సంగీత అభ్యసన తరగతులే, నా మొదటి రాజకీయ తరగతులు. కులం మనుషులను ఎంత హీనంగా చూస్తుందో నాకు అప్పుడే అర్ధమయ్యింది'' అని అన్నారు.
బాల్యంలో జరిగిన అనేక సంఘటనలు కరుణానిధిని హిందూ మనువాద శక్తులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల వైపు ఆకర్షితుడయ్యేలా చేసింది. చిన్న వయస్సులోనే తమిళనాడులో జరిగే అనేక సామాజిక ఉద్యమాలలో కరుణానిధి ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సామాజిక వివక్షకి కారణమైన బ్రాహ్మాణీయ మనువాద శక్తులకు వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున్న ఉద్యమాన్ని నడిపిస్తున్న పెరియార్‌, అన్నాదురై వంటి యోధానుయోధులకి కరుణానిధి దగ్గరయ్యారు.
బ్రాహ్మాణీయ మనువాదశక్తులు అంటరానితనం పేరుతో కోట్లాది మంది సామాన్య ప్రజలకు చెందాల్సిన హక్కులన్నింటినీ దోచుకుంటున్న కాలమది. మనువాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. తమిళనాడులో కూడా పెరియార్‌ రామస్వామి నాయకర్‌ వంటి ఉద్యమకారులు మనువాదశక్తులకు వ్యతిరేకంగా పెద్దయెత్తున్న ఉద్యమాలు నడిపారు. ఉత్పాదక కులాల శ్రమశక్తిని దేవుని పేరుతో దోచుకుంటున్న పురోహిత కులాల అమానవీయ విధానాలకు వ్యతిరేకంగా పెరియార్‌ నడిపిన ఆత్మగౌరవ పోరాటం తమిళప్రజలను విశేషంగా ఆకర్షించింది. ఎంతోమంది నాయకులు, రచయితలు, ఉద్యమ కారులు పెరియార్‌ ఆత్మగౌరవ పోరాటంలో భాగస్వాము లయ్యారు. 
బాల్యంలోనే తనకు ఎదురైన సామాజిక వివక్ష వల్ల కరుణానిధి కూడా పెరియార్‌ సాగిస్తున్న ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారు. పెరియార్‌ ఆశయాలు, ఆలోచనలు, ప్రసంగాలు యుక్తవయస్కుడైన కరుణానిధిని అమితంగా ఆకర్షించేవి. పెరియార్‌ తాత్విక భోదనలతో కరుణానిధి ఎంతగా ప్రభావితమయ్యారంటే తన తల్లిదండ్రులు పెట్టిన దక్షిణామూర్తి అన్న హిందూ పేరును కరుణానిధి అని మార్చుకున్నారు. కుల, మతాల పేరుతో మనుషులను విభజిస్తూ, వారిని హీనంగా చూస్తున్న వ్యవస్ధలను, వాటిని కాపాడుతున్న వ్యవస్థలను, సాహిత్యాన్ని ద్వారా ధ్వంసం చేయాలని పెరియార్‌ పిలుపు నిచ్చారు. పెరియార్‌ ఆలోచనాధారతో ప్రభావితులైన ఎంతో మంది తమిళనాట తిరుగులేని నాయకులుగా ఎదిగారు. 
అన్నాదురై, కరుణానిధి వంటి నేతలు కూడా పెరియార్‌ మార్గదర్శకత్వంతో రాటుదేలిన వారే. అన్నాదురై, పెరియార్‌ సహాచర్యం కరుణానిధిని పూర్తిస్ధాయి సామాజిక ఉద్యమ కారుడిగా మార్చివేసింది. పెరియార్‌ని ఉద్యమగురువుగా, అన్నాదురైని రాజకీయ గురువుగా కరుణానిధి భావించేవారు. వీరిద్దరి ఉద్యమ సహాచర్యమే కరుణానిధి ముఖ్యమంత్రి అయిన తర్వాత తమిళనాడులో అనేక సాంఘిక సంస్కరణల దిశగా ఆయన్ని పురిగొల్పింది. వారి ఆశయాలను కొనసాగించటమే తన ముందున్న కర్తవ్యమని కరుణానిధి అనేకసార్లు ప్రకటించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు సమాజంలోని అన్నివర్గాల వారికీ సమానంగా అందాలని ఆయన ఆకాంక్షించేవారు. సమాజంలో కొంతమందిని ఉన్నతులుగా, కొంతమందిని హీనులుగా చూసే వ్యవస్థలన్నింటినీ ప్రజాస్వామీకరించాలని ఆయన భావించేవారు. కొన్ని వర్గాల గుత్తాధిపత్యంలో ఉన్న దేవాలయాల్లో పనిచేయడానికి అన్ని వర్గాలకు అవకాశం ఉండాలనే పెరియార్‌ ఆలోచనలకు అనుగుణంగా తమిళనాడు లోని అన్ని ప్రధాన దేవాలయాల్లో కిందికులాల వారిని అర్చకులుగా నియమించడానికి వీలు కల్పిస్తూ కరుణానిధి ఒక ప్రత్యేకచట్టాన్ని తీసుకువచ్చారు. ఆ చట్టం వల్ల ఆలయాలపై కొన్ని కులాలకు మాత్రమే సొంతమైన గుత్తాధిపత్యాన్ని తొలగటంతోపాటు, నిమ్నకులాల వారికి అర్చకులుగా పనిచేసే అవకాశం కలిగింది. ప్రజాస్వామ్య దేశంలో కులాల గుత్తాధిపత్యం చెల్లదని, తరతరాలుగా దేవాలయాలపై కొన్ని కులాలకు వారసత్వంగా వస్తున్న అధిపత్యహక్కులని రద్దు చేయాలని, సమాజంలో అన్ని కులాల వారికీ దేవాలయాల్లో పౌరోహిత్యం నిర్వహించే అవకాశం కల్పించాలని బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆనాడే డిమాండ్‌ చేశారు. 
కరుణానిధి తీసుకువచ్చిన ప్రత్యేకచట్టం వల్ల తమిళనాడులో అన్ని కులాల వారికి ప్రధాన దేవాలయాల్లో అర్చకులుగా నియమించడానికి అవకాశం కలిగింది. నిమ్నకులాల వారిని అర్చకులుగా నియమించడానికి వీలుగా తమిళనాడులో శిక్షణా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. కరుణానిధి తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించింది, తమిళనాడు స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకున్న కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాలు కూడా ఇలాంటి చట్టాలను చేశాయి. తమ అధిపత్యాన్ని బద్ధలు కొడుతూ కరుణానిధి తీసుకువచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని మనువాద సంఘాలు కోర్టుకెక్కాయి. కరుణానిధి మాత్రం ఈ చట్టం అమలు చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేశారు. ఈ చట్టం వల్లే కేరళలోని శబరిమల, తమిళనాడులోని కొన్ని దేవాలయాల్లో నిమ్నకులాలకు చెందిన వారిని పూజారులుగా ఇటీవల నియమించారు.
ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో కరుణానిధి అనేక సాంఘిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. మత స్వేచ్ఛను పరిరక్షించటం అంటే రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కులని పరిరక్షించడమే అవుతుందని కరుణానిధి భావించే వారు. మతస్వేచ్ఛని హారించే నిర్భంధ మత మార్పిడి చట్టాన్ని కరుణానిధి రద్దు చేశారు. వెనుకబడిన ముస్లిం మతస్తులు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి వీలుగా వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారు. 
మహిళలకు ఆస్తిలో సమానవాటాను పొందే హక్కును కల్పించటంతోపాటు, విద్య, ఉపాధి అవకాశాలలో 30 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. ఒక్కప్పుడు తమిళనాడు అంతా మనుషులచేత లాగబడే రిక్షాలుండేవి. మనకు తెలిసిన గుర్రపుబగ్గీలు వంటివే అవి, అయితే వాటిని గుర్రాలు లాగేవి, తమిళ నాడులో మనుషులు లాగేవారు. ఈ అమానుషాన్ని కరుణానిధి తీవ్రంగా నిరసించారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే మనుషులు లాగే రిక్షాలను పూర్తిగా రద్దుచేశారు. దీనివల్ల ఉపాధి కోల్పోయిన వారందరికీ సైకిల్‌ రిక్షాలను ఉచితంగా పంపిణీ చేశారు. 
జన్యులోపం వల్ల ట్రాన్స్‌జెండర్లుగా పిలువబడే హిజ్రాలు సమాజంలో గౌరవప్రదంగా జీవించడానికి ప్రత్యేకంగా కొన్ని రిజర్వేషన్లు కల్పించారు. ట్రాన్స్‌జెండర్లకు మొదటిసారి రేషన్‌కార్డులు అందచేసిన రాష్ట్రం తమిళనాడే. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బిసి కులాలకు వారి జనాభా థామాషా ప్రకారం 69 శాతం రిజర్వేషన్లని అమలు చేశారు. ఈ రిజర్వేషన్లు అమలు చేయడానికి కోర్టు తీర్పులు అడ్డు నిలిచినప్పటికీ కరుణానిధి వెనుకడుగు వేయలేదు. నిమ్నకులాలకు 69శాతం రిజర్వేషన్లు అమలు చేసి, సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమానికి తన నిబద్ధత ఏమిటో కరుణానిధి నిరూపించారు. దీన్నే తమిళనాడు తరహా మోడల్‌ రిజర్వేషన్ల విధానమని అంటారు. ఈ విధానాన్ని అమలు చేయాలని అనేక రాష్ట్రాలలో డిమాండ్‌ ఉంది. సమాజంలో నిమ్నకులాల అభివృద్ధికి దోహాదపడే ఏ అంశాన్నైనా తక్షణమే అమలు చేసే తత్వం కరుణానిధిది.
ఒక్కప్పుడు తమిళనాడు అంతా ప్రయివేటు బస్సుల హావా ఎక్కువగా నడిచేది. కరుణానిధి రవాణాశాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో తమిళనాడులోని బస్సు సర్వీసులన్నింటినీ జాతీయ చేశారు. ఆయన ప్రారంభించిన అనేక సంస్కరణలను మిగిలిన రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు అనుకరించేవారు. హిందూత్వ భావజాలాన్ని రూపుమాపడానికి కరుణానిధి విశేషంగా కృషి చేశారు. వివాహావ్యవస్ధలో నిర్భంద పూజలు, క్రతువులను ఆయన నిరసించారు. ఎవరికి నచ్చినట్టు వారు వివాహాం చేసుకునే స్వేచ్ఛ ఉండాలని ఆయన భావించేవారు, ప్రజలకున్న వివాహా స్వేచ్ఛను కాపాడటానికి వీలుగా స్వీయగౌరవ వివాహ చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చారు. కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించటంతోపాటు, మతాచారాలు జీవనదశలను ప్రభావితం చేయకుండా అడ్డుకోవటంలో ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడింది. సామాజిక సంక్షేమ రంగానికి సంబంధించిన ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు కరుణానిధి పాలనా కాలంలో అమలు చేయబడ్డాయి. రైతులకు రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్న దళారీ వ్యవస్ధను నిర్మూలించడానికి రైతుబజార్లు ఏర్పాటు చేయటం, పేదవారికి ఒక్క రూపాయికే కిలోబియ్యం, బిచ్చగాళ్లకి, కుష్టువ్యాధిగ్రస్తులకు ప్రత్యేక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయటం వంటి ఎన్నో సంస్కరణలు తమిళనాట ఆయన్ని తిరుగులేని నాయకుడిగా నిలబెట్టాయి. ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలపై చెలాయించే పెత్తందారీ పోకడలను కరుణానిధి వ్యతిరేకించారు. రాజ్యభాషైన హిందీలోనే పాలనా వ్యవహారాలు సాగించాలన్న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను ఆయన వ్యతిరేకించారు. తమిళనాట ఉవ్వెత్తున ఎగిసిన హిందీ వ్యతిరేక ఉద్యమానికి ఆయనే నాయకుడై నడిపించారు. 
భారతదేశంలో మూలవాసులను దొంగలుగా, వేలాది మంది వీరులను రాక్షసులుగా చిత్రీకరిస్తూ సాగిన మనువాద సాహిత్యాలలోని డొల్లతనాన్ని బట్టబయలు చెయ్యాలని దళిత వర్గాలకు అంబేడ్కర్‌ పిలుపునిచ్చారు. దీంతో నిమ్నకులాలకు చెందిన సాహితీవేత్తలు బ్రాహ్మాణీయ, మనువాద సాహిత్యాలలోని డొల్లతనాన్ని వ్యతిరేకిస్తూ తమ గళాలను, కలాలను ఎక్కుపెట్టారు. తమిళనాడులో కూడా పెరియార్‌ వంటి అనేకమంది ఉద్యమకారులు, సామాజికవేత్తలు బ్రాహ్మాణీయ, మనువాదాలను ఖండిస్తూ అనేక రచనలు చేశారు. ఈ కాలంలోనే కలం పట్టిన కరుణానిధి తన అక్షరాలను సామాజిక వివక్షని ధ్వంసం చేసే దిశగా ఎక్కుపెట్టారు. సామాజిక అసమానతలకు, వివక్షకు దన్నుగా నిలుస్తున్న మనువాద భావజాలాన్ని కరుణానిధి తీవ్రంగా ద్వేషించేవారు. హిందూత్వ భావజాలం, కిందికులాలపై ఆధిపత్య కులాలు కొనసాగిస్తున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక దోపిడినీ నిరసిస్తూ ఆయన అనేక రచనలు చేశారు. కరుణానిధి తన జీవిత కాలంలో ఏనాడు దేవుణ్ణి విశ్వసించలేదు. దేవుడి పేరుతో సమాజంలో జరుగుతున్న దోపిడినీ కరుణానిధి తీవ్రంగా నిరసించేవారు. ''సముద్రం మీద సేతువు నిర్మించడానికి రాముడేమైనా ఇంజనీరా.. అయితే రాముడు ఏ ఇంజనీరింగు కాలేజీలో చదివాడు'' అని కరుణానిధి చేసిన వ్యాఖ్యలు దేశంలో సంచలనం కల్గించాయి. హిందూ సంస్ధలన్నీ కరుణానిధి వ్యాఖ్యల మీద భగ్గుమన్నాయి. కరుణానిధి వాటిని ఏ మాత్రం ఖాతరు చేయలేదు. నాటకం, కథ, సినిమా, కథనం ప్రక్రియ ఏదైనా కరుణానిది సమాజాన్ని చైతన్యవంతం చేయడానికే ప్రయత్నించే వారు. కరుణానిధి మొదటిసారిగా మాటలందించిన సినిమా 'పరాశక్తి'. ఆ సినిమాలో కరుణానిధి రాసిన డైలాగులు సమాజంలో ఒక పెనుసంచలనం రేపాయి. మంత్రాలు, తంత్రాలు అంటూ పూజారివర్గం చేస్తున్న దోపిడీని ఈ సినిమాలో ఆయన దునుమాడారు. మనువాదాన్ని నిరసిస్తూ ఆయన సంధించిన మాటల, తూటాలు తమిళ సమాజాన్ని హేతువాదం వైపు, శాస్త్రీయ ధృక్ఫదంవైపు నడిపించాయి.
సమాజంలో జరిగే ఏరకమైన ఆధిపత్యాన్ని కరుణానిధి ఒప్పుకునేవారు కాదు. ఆరోజుల్లో దేశమంతా సాగుతున్న సంస్కృత భాషాధిపత్యాన్ని ఆయన నిరసించేవారు. తమిళనాట జరిగే సాహిత్య క్రతువులన్నీ తమిళంలోనే జరగాలని ఆయన ఆకాంక్షించేవారు. తమిళ సాహితీరంగంలో తనదైన ముద్రను వేసుకున్న కరుణానిధి, సాహితీ ప్రస్ధానం పదమూడేళ్ల చిరు ప్రాయంలోనే ప్రారంభమయ్యింది. నూనూగు మీసాల నూతన యవ్వనంలో కరుణానిధి 'సెల్వ చందిర' అనే ఒక చారిత్రక నవలను రచించారు. ఈ నవల ''తమిళ భాష వర్ధిల్లాలి.. తమిళ ప్రజలు వర్ధిల్లాలి'' అనే వాక్యంతో ప్రారంభమవుతుంది. ఈ నవల ముందుమాటలో కరుణానిధి ''ద్రావిడనాడు నేడు తనకు మాత్రమే సొంతమైన కళలను, సంస్కృతిని, సాంప్రదాయలను కోల్పోయి నేడు సంకట స్థితిని ఎదుర్కొంటుంది. దక్షిణాదికి చెందిన తెలుగు, మళయాళం, కన్నడం వంటి సుందరమైన భాషలలో ఒకటైన తమిళం నేడు దాదాపు అంతరించి పోయే స్ధితిని ఎదుర్కొంటుందంటే, పరభాషా ఆధిపత్యం ఎంతగా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. తమిళప్రజలు తిరిగి తమిళనాడుకి, తమిళభాషకి, తమిళసంస్కృతికి పూర్వవైభవం తీసుకురావడానికి కొదమ సింహాలై గర్జించాలి'' అని రాశారు. కరుణానిధి రచనా శైలి అత్యంత సరళంగా, సూటిగా అచ్చమైన తమిళ నుడికారాలతో స్వచ్ఛంగా ఉంటుంది. ఆ శైలే కరుణానిధిని తమిళ సాహితీ రంగంలో తిరుగులేని సాహిత్య కారుడిగా నిలబెట్టింది. తొంభైనాలుగేళ్ల తన సుదీర్ఘ జీవితకాలంలో ఆయన చేసిన సాహిత్యకృషి అనితర సాధ్యమయ్యింది. తమిళ సాహితీ ప్రక్రియలలో ఆయన అడుగుపెట్టని రంగమంటూ లేదనే చెప్పాలి. కరుణానిధి కళలంటే అంతులేని ఆసక్తిని, అనురక్తిని కనబరిచేవారు. తానే సొంతంగా రచించి, ప్రదర్శించిన పలయప్పన్‌ అనే నాటకం తమిళనాడులో సంచలనం సృష్టించింది. తన అక్షరాలతో కరుణానిధి ఏనాడు తప్పటడుగులు వేయించలేదు. తన ప్రతి అక్షరాన్ని తాను నమ్మిన సిద్థాంతాల సాధన దిశగా సాగుతున్న సామాజిక ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలబెట్టారు. 
తమిళనాట తరతరాలుగా అణగారిన, బలహీన వర్గాలు కోల్పోయిన హక్కులను తిరిగి రాబట్టటంతోపాటు, సామాజిక వివక్షను కూకటివేళ్లతో పెకలించి వెయ్యాలని నిరంతరం తపించిన తాత్వికుడు కరుణానిధి. సిద్థాంతానికి, ఉద్యమానికి, రాజకీయాలకు మధ్య వారధి నిర్మించిన వీరుడుతడు. తమిళ రాజకీయ, సాహిత్య, సినిమా రంగాలపై కరుణానిధి ప్రభావం అజరామరంగా నిలుస్తుందనటంతో ఎటువంటి సందేహాం లేదు. పెరియార్‌ సామాజిక సిద్థాంతం, అన్నాదురై రాజకీయ పంథాలను వారసత్వంగా పొందిన కరుణానిధి తమిళనాట ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు కారణమయ్యారు. కరుణానిధి తనకు తానుగా ప్రభవించిన ద్రవిడ సూరీడు. నమ్మిన సిద్థాంతాల కోసం తలవొంచక నిటారుగా నిలబడిన నాయకుడు. ఆయన మాటలు, పాటలు, ప్రసంగాలు ప్రజలను ఆకర్షించటంతోపాటు, ఆలోచింపచేసేవి. 94ఏళ్ల జీవితకాలంలో 13సార్లు ఎమ్మెల్యేగా, 5సార్లు ముఖ్యమంత్రిగా, 50 సంవత్సరాలపాటు పార్టీ అధ్యక్షుడిగా అన్నింటీకీ మించి 80 ఏళ్ల ప్రజాజీవితం, 60 ఏళ్ల రాజకీయ ప్రస్ధానం, భారతీయ రాజకీయ ఇతిహాస చరిత్రలో అత్యంత అరుదైన ఘటనగా చెప్పవచ్చు. 14వఏటనే సామాజిక ఉద్మమాలలోకి అడుగు పెట్టిన కరుణానిధి, 33ఏళ్లకే ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించి శాసనసభలోకి అడుగుపెట్టారు. నాటి నుండి ఆయన వెనుతిరిగి చూసిందిలేదు, తిరుగులేని నాయకుడయ్యారు. 
తమిళనాడులో తన పాలనను నిమ్నకులాల వలన, నిమ్న కులాల చేత, నిమ్న కులాల కొరకు నడపబడుతున్న స్వీయపాలనగా ప్రకటించిన ధీశాలి. నా జాతే... నా జాతీయత, నా గడ్డే... నాదేశం, అదే నా దేశభక్తి అని గర్జించిన ద్రావిడ సింగం కరుణానిధి. భారతదేశంలో అంబేడ్కర్‌ ఆశించిన అణగారిన వారి రాజ్యాధికార సిద్థాంతం కల సాకారమయ్యింది మొదటిసారి తమిళనాడులోనే, ఆ కలను సాకారం చేసిన వారిలో కరుణానిధి అగ్రగణ్యుడు. ఆయన మరణించినప్పటికీ తమిళనాడు భవిష్యత్‌ రాజకీయాలు కరుణానిధి ముద్ర లేకుండా కొనసాగలేవన్నది మాత్రం వాస్తవం.
- డాక్టర్‌ కారెం శశిధర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, నాగార్జున యూనివర్శిటీ, గుంటూరు

No comments:

Post a Comment

Dalithashakthi - 2025 - Magazines