Friday, July 21, 2023

...దేశం రావణకాష్టంలా


 ...దేశం రావణకాష్టంలా 


వట్టిగా

ఆడిపోసుకుంటాం కానీ..


నీరో చక్రవర్తి 

మరీ 

అంత దుర్మార్గుడేం కాదు 


రోమ్ నగరం తగలబడుతుంటే 

నీరో చక్రవర్తి 

ఫిడేలు వాయిస్తూ 

సంగీత సాధన చేస్తున్నాడు 


అంతేగాని 


రోమ్ నగరం తగలబడాలని కోరుకోలేదు 


తగలబెట్టనూ లేదు

ఆ... అగ్నికి 

ఆజ్యమూ పోయలేదు 


చక్రవర్తి నీరో పై 

కేవలం 

బాధ్యతల్ని విస్మరించడన్నదే ఆరోపణ 


కానీ 

ఇవ్వాలా.. ఇక్కడ 


కుల.. మత.. జాతి వైషమ్యాలతో 


దేశం   

దేశమే తగలబడుతుంటే 


ఈ 

విద్వేషాగ్నులకు 

సమిధలు వేస్తూ 

ఆ అగ్నికీలలకు 

ఆజ్యం పోస్తూ... 


అప్పుడప్పుడు 

తడి లేని 

రెండు పొడి మాటల్ని విదిలిస్తూ... 


రక్తపు మరకల 

రాక్షస హస్తాలతో రాజ్యాధికారాన్ని 

పదిల పరుచుకుంటూ 


ఓ  నా దేశ పాలకుల్లారా ! చూద్దాం 


మీరు 

ఇంకెంతకాలం వర్ధిల్లుతారో 


కాలానికి 

ఎదురెదుకుంటూ....


...బత్తుల శ్రీనివాసులు

No comments:

Post a Comment

Dalithashakthi - 2025 - Magazines