ఓటుహక్కుపై దేశవ్యాప్తంగా యువజనులకు సరైన అవగాహన ఉండటం లేదు. 'పద్దెనిమిదేళ్లు వచ్చాక మారుతున్నవారిలో ప్రజాస్వామ్య చైతన్యం పెద్దగా కనపడటం ఎందుకు ఓటేయాలి? ఎవరికి ఓటేయాలి? వంటి విషయాల్లో వారు మానసికంగా సిద్ధం కావడం లేదు' అన్న ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవకుమార్ తాజా వ్యాఖ్యలు అక్షరసత్యాలు. అర్హులు అందరికీ ఓటుహక్కు కల్పించి, వారిని పోలింగు కేంద్రాలకు రప్పించడంలో ఈసీ వర్గాలు చేతులెత్తేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఓటు విలువను విద్యార్థులకు తెలియజెప్పేందుకు తొమ్మిదో తరగతి నుంచి ప్రజాస్వామ్య పాఠాల బోధనకు సంసిద్ధమవుతున్నట్లు సీఈసీ ప్రకటించారు. అది యధారీతిన మూసపద్ధతిలోనే చెబితే ప్రజాస్వామ్యంలో ఓటరు పాత్ర ఏమిటో నవతరానికి బోధపడదు. మంచివాళ్లు ఓటింగ్‌కు దూరంగా ఉండటం- చెడ్డ ప్రభుత్వాల ఏర్పాటుకు దారితీస్తుందన్నది. మాజీ సీఈసీ శేషన్ హెచ్చరిక. భావితరానికి అది అవగతమయ్యేలా పాఠ్యాంశాలను రూపొందించాలి. నిర్దేశిత వయసులో ఓటర్లుగా నమోదు కావడం, ఓటుహక్కును విచక్షణాయుతంగా వినియోగించుకోవడం... ఇలా అన్ని అంశాలనూ ఆసక్తికర శైలిలో విద్యార్థులకు విడమరచాలి. అప్పుడే ఎన్నికల సంఘం ఆకాంక్ష వాస్తవ రూపం దాలుస్తుంది.
లోక్‌సభకు మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు (1951-52 దేశీయంగా ఓటర్ల సంఖ్య 17.32 కోట్లు. 2023 ఫిబ్రవరి నాటికి అది 94.50కోట్లకు చేరినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జనాభాకు తగినట్లు కాలక్రమంలో ఓటర్లు అధికమైనా, పోలింగ్ శాతంలో పెరుగుదల మాత్రం మరీ ఎక్కువగా ఏమీలేదు. తొలి సార్వత్రిక సమరంలో 45.67శాతం ఓటింగ్ జరిగితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో అది 67.40శాతంగా లెక్కతేలింది. ఈసీ పరిశీలన ప్రకారమే- అర్హులైన వారిలో 30కోట్ల మంది ముఖ్యంగా పట్టణ ప్రాంతీయులు, యువత, వలస కార్మికులు గత సార్వత్రిక ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. పొట్ట చేతపట్టుకుని పరాయి ప్రాంతాలకు వెళ్ళే శ్రమజీవుల హక్కులను పరిరక్షించడంలో వ్యవస్థాగత వైఫల్యాలు ఒకపక్క వెక్కిరిస్తున్నాయి. మరోవైపు ఉన్నత విద్యావంతులు, అధికాదాయ వర్గాల నిరాసక్తత కారణంగా నగరాల్లో పోలింగ్ శాతాలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. అవగాహన రాహిత్యంతో పాటు తామొక్కరం ఓటు వేయకపోతే కొంపలేమి మునిగిపోతాయన్న అలక్ష్యంతో పోలింగ్ కేంద్రాల వైపు కన్నెత్తి చూడని యువతీయువకులూ గణనీయంగానే ఉంటున్నారు. అవతలి వ్యక్తుల కంటే ఒక్క ఓటు అదనంగా పొందగలిగితే చాలు, వారినే విజేతలుగా నెత్తిన పెట్టుకునే ఎన్నికల వ్యవస్థ మనది. కాబట్టి ఓటింగ్‌కు ఏ కొందరు గైర్హాజరైనా అభ్యర్థుల జాతకాలే తలకిందులవుతాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ హెచ్చరించినట్లు, ప్రజాస్వామ్యంలో ఒక ఓటరు అజ్ఞానం- మిగిలిన వారందరి భద్రతనూ ప్రమాదంలో పడేస్తుంది. యువత దీన్ని అర్ధం చేసుకోవాలి. తమ భవితను తామే నిర్దేశించుకోవాలంటే ప్రజాస్వామ్య యజ్ఞంలో వారు పాలుపంచుకుని తీరాలి. వెగటు పుట్టిస్తున్న ధన, రౌడీ రాజకీయాలతో పరువుమాస్తున్న ఎన్నికల ప్రక్రియను ఏవగించుకునే వారూ లేకపోలేదు. జనాన్ని ముందుండి నడిపించిన జాతినేతల దేశభక్తే భారతావనికి స్వాతంత్య్రాన్ని సముపార్జించి పెట్టింది. అదేవిధంగా అవినీతి అక్రమాల చెరలోంచి జనస్వామ్యానికి స్వేచ్ఛ ప్రసాదించగలిగే ప్రజా ఉద్యమానికి యువతే నేడెందుకు నేతత్వం వహించకూడదు? ప్రజాసంక్షేమానికి పాటుపడని నేతలను నిగ్గదీయడమే కాదు. అటువంటి వారిని శంకరగిరి మాన్యాలు పట్టించే శక్తిని తమకు సమకూర్చేది ఓటుహక్కేనని యువత గుర్తించాలి. దేశం తలరాతను మార్చిరాసే విధాతలుగా వారు అవతరించాలి?

No comments:
Post a Comment