తమ భావాలను నిర్భయంగా వెల్లడించేందుకు ప్రజలకు స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైనది. భిన్నాభిప్రాయాలను వ్యక్తీకరించడం, అసమ్మతిని ప్రకటించడం, విమర్శించడం దేశహితానికి దోహదపడతాయి. వాటి ముసుగులో వైషమ్యాలను రాజేస్తే విద్వేష వ్యాఖ్యలేమో ప్రజాభద్రతను పెళ్ళగిస్తాయి. హింసోన్మాద జ్వాలలను ఎగదోసి- రాజ్యాంగ ఆదర్శమైన సౌభ్రాతత్వాన్ని బూడిద చేస్తుంది. అటువంటి హేయధోరణులపై సుప్రీంకోర్టు కొన్నేళ్లుగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విద్వేషాల మందుగుండును దట్టించిన మాటల తూటాలను పేల్చేవారిపై సుమోటోగా కేసులు నమోదుచేయాలని సర్వోన్నత న్యాయస్థానం మొన్న ఏప్రిల్‌లో అన్ని రాష్ట్రాలను సూచించింది. దేశ లౌకిక స్వరూప స్వభావాలను ఛిన్నాభిన్నం చేసే ద్వేషపూరిత ఉపన్యాసాలను తీవ్రనేరాలుగా పరిగణించాలని 'సుప్రీంకోర్టు' అప్పట్లో స్పష్టంచేసింది. విభిన్న వర్గాల నడుమ వైమనస్యానికి పురిగొల్పితే కఠిన పర్యవసానాలను ఎదుర్కోక తప్పదనే సందేశం అందరికీ చేరాలని న్యాయపాలిక తాజాగా మరోసారి ఉద్ఘాటించింది. విద్వేష వ్యాఖ్యల నిరోధానికి ప్రత్యేక పాలనా పాలనా ఏర్పాటు గురించి ఆలోచిస్తున్నట్లు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టే గతంలో తూర్పారపట్టినట్టు- ప్రభుత్వాల అసమర్థత కారణంగానే విషపూరిత ప్రసంగాలు పెచ్చరిల్లుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం- 2014 తరవాత ఆరేళ్లలో ఇటువంటి కేసులు అయిదింతలయ్యాయి. కులం, మతం, ప్రాంతం, భాష, ఆహారం, ఆహారం తదితరాల పేరుతో సాటి మనుషులపై విషం కక్కుతున్న వ్యక్తులు నేడు కోకొల్లలు. జుగుప్సాకరమైన వదరబోతుతనంతో సామాజిక శాంతిని దహిస్తున్న వారిలో రాజకీయ నాయకులది పెద్ద వాటా కావడమే దేశ ప్రారబ్ధం.
ప్రజల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టడం, ఏహ్యభావనల వ్యాప్తికి ప్రయత్నించడం వాటిని ఎన్నికల భ్రష్టాచారాలుగా ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 123(3ఏ) నిరూపిస్తోంది. జనవర్గాల మధ్య విభేదాలను తీవ్రతరం చేసే, పరస్పర ద్వేషానికి పాలుపోసే పెడపోకడలకు పార్టీలు, అభ్యర్థులు దూరంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శక నియమావళి సైతం నిర్దేశిస్తోంది. కానీ, ఇవేమీ క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలుకు నోచుకోవడం లేదు. పనిగట్టుకుని తమ ఉపన్యాసాలతో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే నాయకులపై ఈసీ చేతలూ పదును తేలడం లేదు. ఎన్నికల ప్రచారంలో నేతల వాక్కాలుష్యంపై నిర్వాచన్ సదన్ నిర్లిప్తతను సుప్రీంకోర్టు నాలుగేళ్ల క్రితమే ఎండగట్టింది. అయినప్పటికీ నిరుడు పోలింగుకు వెళ్ళిన రాష్ట్రాల్లో విద్వేష ప్రచారం అవధులు దాటినట్లు విశ్లేషణలు వెలుగుచూశాయి. తాజాగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారపర్వాల్‌లోనూ నేతలూ వారి అనుచరుల నోట అవాంఛనీయ వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. విద్వేషాగ్నులకు ఆజ్యం పోసిన కేసుల్లో నిందితులైన వారు- రాజ్యాంగానికి విధేయంగా మెలగుతామంటూ, దేశ సమగ్రతను సంరక్షిస్తామంటూ చట్టసభల్లోకి అడుగుపెడుతుండటమే విస్మయకరం. దేశంలో 33 మంది ఎంపీలు, 74 మంది ఎమ్మెల్యేలపై ఇటువంటి కేసులు నమోదైనట్లు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం ఇటీవలే ఉన్నాయి. తమ మాటలూ చేతలతో సామాజిక సమరస్యాన్ని చెడగొట్టే, మూకదాడులకు ప్రేరేపించే వ్యక్తులను కఠినంగా దండించేందుకు ప్రస్తుత చట్టాల్లో మార్పుచేర్పులు అత్యవసరం. సంకుచిత రాజకీయ ప్రయోజనాలకోసం విద్వేష ప్రచారకులకు పెద్దపీట వేస్తున్న పార్టీల పిదపబుద్ధులూ మారాలి. అప్పుడే జాతి ఐక్యతకు ప్రోదిచేసేలా జనభారతంలో సోదరభావం వికసిస్తుంది.
- సంపాదకీయం

No comments:
Post a Comment