Sunday, September 1, 2024

Editorials

 సామాజిక వివక్ష...!

ఎస్సీ కులాలు వేల సంవత్సరాలుగా అంటరానితనాన్ని, సామాజిక వివక్షను అనుభవించాయి. సంపద మీద హక్కు లేకుండా ఆర్థిక వెనుకబాటుతనాన్ని చవిచూస్తున్నాయి. రాజ్యాంగంలో ఎస్సీ కులాలకు రిజర్వేషన్లు కల్పించినా, చారిత్రక, సామాజిక కారణాల వల్ల వాటి పంపిణీలో అసమానతలు తలెత్తుతున్నాయి.


ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదిగల సంపూర్ణ అభివద్ధి సాధ్యమవుతుందా?, మాలల అభివద్ధి అడుగంటి పోతుందా? రిజర్వేషన్స్‌తోనే దళితుల సకల సమస్యలు సమసిపోతాయా? ప్రభుత్వ రంగం ఉండి, రిజర్వేషన్లను త్రికరణశుద్ధిగా అమలుచేస్తే 16 శాతం మంది మాత్రమే ప్రయోజనం పొందుతారు, మిగతా 84 శాతం అసంఘటిత రంగాలలో జీవనోపాధి పొందవలసి ఉంటుంది. రిజర్వేషన్ల కారణంగా ఎస్సీ మొత్తం జనాభాలో రెండు నుంచి మూడు శాతమే ఇప్పటికి అభివద్ధి చెందారని గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. మిగిలిన సుమారు 97 శాతం ఇంకా అభివద్ధి చెందాల్సిన స్థితిలోనే ఉంది. ప్రైవేటు రంగం శరవేగంగా విస్తరిస్తున్న వర్తమానంలో కూడా ప్రభుత్వ రంగంలోని రిజర్వేషన్ల చుట్టూనే ఇరువర్గాలు తిరుగుతున్నాయి. రిజర్వేషన్లు కలిగించే ప్రయోజనాలకు పరిమితులున్నాయి.

మొత్తంగా 60 ఉపకులాలు పరిమితంగానే అమలయ్యే రిజర్వేషన్లని తమ వెనుకబాటుతనం ప్రాతిపదికన అవకాశాలు అందిపుచ్చుకోగల పద్ధతిని అభివద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. అభివద్ధి చెందని వారిని మొదటి లబ్ధిదారుగా, ఇప్పటికే అభివద్ధి చెందిన వారిని ద్వితీయ లబ్ధిదారుగా మార్చటం ద్వారా ఇది సుసాధ్యం అవుతుంది. దీనికి విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సంబంధిత వ్యక్తులు పొందిన లబ్ధిని, వెనుకబాటు తనాన్నీ లెక్కించి వెయిటేజ్‌ మార్కులు ఇవ్వటం ద్వారా ఈ ఎంపిక ప్రక్రియను సమర్థంగా నిర్వహించవచ్చు. జే.ఎన్‌.యు. వంటి చోట్ల అడ్మిషన్లలో ఇటువంటి పద్ధతి ఎప్పటినుంచో అమలవుతున్నది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికత ఈ పనిని సులభతరం చేస్తుంది. ఇది ఒకే సామాజికవర్గంలోని సహౌదరుల మధ్య అభివద్ధిలో గల వ్యత్యాసం తగ్గించి సర్వతోముఖాభివద్ధికి దోహదపడుతుంది. దీనికి రాజ్యాంగ సవరణ అక్కర్లేదు, పార్లమెంట్‌ తీర్మానమూ అక్కర్లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసినా సాంకేతికపరమైన, చట్టపరమైన ఇబ్బందులకు ఆస్కారం ఉండదు. పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో దళిత నాయకత్వం తమ దీర్ఘకాలిక సమస్యకు ముగింపు పలకవలసిన చారిత్రక సందర్భం ఇది. దీనిని అధిగమించి అనేక ఇతరత్రా సమస్యల పరిష్కారానికి ఉమ్మడిగా సమాయత్తం కావాల్సిన అవసరం ఎంతగానో ఉంది.

No comments:

Post a Comment

Dalithashakthi - 2025 - Magazines