Wednesday, May 31, 2023

చందాదారులకు విజ్ఞప్తి





దళితశక్తి మానపత్రిక తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ, అభిమానం సంపాదించుకుని అత్యధిక సర్క్యులేషన్‌ కలిగి ఉన్నది. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌, జ్యోతిరావ్‌ ఫూలే, మాన్యశ్రీ కాన్షీరాంల ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి నిరంతరం కషి చేస్తున్నది. ఇప్పటి వరకు అనేక పత్రికలు వచ్చాయి, పోయాయి. ఎందుకంటే ఆర్ధిక వనరులు లేక ఆ పత్రికలు నిలబడలేకపోయాయి. ఈ పోటీ ప్రపంచంలో ప్రింట్‌ మీడియా రంగంలో ఉన్నటువంటి పత్రికలకు మీ వంతు సహాయ, సహకారాన్ని చందాలు, ప్రకటనలు, విరాళాల రూపంలో అందించి ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము. మన పత్రికలను మన వారే ప్రోత్సహించకపోతే ఇతరులెవరూ కొంటారు? ఇతరులెవరూ ప్రోత్సహిస్తారు? మన ప్రయోజనాల కోసం నిబద్ధతతో నడిచే పత్రికకు దళిత, బహుజన ప్రజలు, ఉద్యోగులు, నాయకులు చందాలు, ప్రకటనలు, విరాళాలు అందించి ముందుకు నడిపిస్తారని, నడిపించాలని దళితశక్తి మాసపత్రిక విజ్ఞప్తి చేస్తున్నది.

చిరునామా : ఇంటినెం.78/A, 1వ అంతస్తు, పికెట్‌, సికింద్రాబాద్‌-26. ఫోన్‌ నెం: 9440154273

Monday, May 29, 2023

విజ్ఞప్తి

చందాదారులకు విజ్ఞప్తి
దళితశక్తి మాసపత్రికకు ఆర్థిక సహాయ సహాకారాలు, ప్రకటనలు ఇచ్చి ప్రతికాభివృద్ధికి సహకారం అందిస్తున్న మిత్రులందరికీ జై భీమ్‌లు. దళితశక్తి మాస పత్రికను మరింత ముందుకు తీసుకుపోవడానికి మమ్ముల్ని ముందుకు నడిపిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. మీ సహాయ సహాకారాలు ఎల్లవేళల అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

దళితశక్తి మాసపత్రిక చందాల వివరాలు :

సంవత్సర చందా రూ. 400/- 
మూడేళ్ళ చందా రూ. 1,000/- 
ఐదేళ్ళ చందా రూ. 1,800/- 
జీవిత చందా రూ. 5,000/-
చందాలు, విరాళాలు UPI Id: 9440154273@ybl 
ద్వారా పంపించవచ్చు లేదా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి పంపించవచ్చు.



 

Thursday, May 11, 2023

నిరుద్యోగుల ఘోష ఆలకించేదేవరు?

నిరుద్యోగుల ఘోష ఆలకించేదేవరు?

సంపద సష్టికర్తలన్న ముద్దుపేరుతో ప్రభుత్వాలు వారికి మరింత దాచుకొనేందుకూ, దోచుకొనేందుకూ సహకరిస్తున్నాయి. సంపద పంపిణీలో అసమానతలు, శ్రమజీవికి తగిన ఫలం దక్కకపోవడం పాలకులకు పట్టడం లేదు. కార్మికులకు రక్షణనిచ్చే చట్టాలన్నీ చట్టుబండలు చేసి, బడా పారిశ్రామికవేత్తల వీరవిహారానికి ఆటంకాలు లేకుండా చేయడమే జరుగుతోంది. పెరిగిన సంపద అందరిదీ కాదనీ, కొందరిది మాత్రమేననీ, ప్రజలందరికీ చెందాల్సిన దానిని కొందరికి కట్టబెట్టే పని సాగిపోతున్నదనీ గ్రహించాలి.

సామాజిక హింసపై చట్టమేదీ?

సామాజిక హింసపై చట్టమేదీ?

మన దేశంలో సామాజిక ఉత్పత్తి శ్రమలు జీవన విధానమైన మహిళలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ కులాలుగా ఉంటే సామాజిక ఉత్పత్తి శ్రమలకు దూరంగా ఉత్పత్తి శ్రమల్లో లేని మహిళలు ఆధిపత్య కులాలుగా ఉన్నారు.

ఆధునిక భారత నిర్మాత, బాబాసాహెబ్‌ డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌

 ఆధునిక భారత నిర్మాత, 

బాబాసాహెబ్‌ డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌

125 అడుగుల విగ్రహావిష్కరణ


125 అంబేడ్కర్‌ అడుగుల విగ్రహావిష్కరణ ప్రకాశ్‌ అంబేడ్కర్‌తో కలిసి ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏఫ్రిల్‌ 14, 2023న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌తో కలిసి ఆవిష్కరించారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌ సమీపంలో నిర్మించిన ఈ విగ్రహాన్ని అంబేడ్కర్‌ జయంతి రోజునే ఆవిష్కరించారు. విగ్రహా విష్కరణకు ముందు బౌద్ధమత గురువులు ప్రార్థనలు చేశారు. హెలికాప్టర్‌ ద్వారా విగ్రహంపై పూల వర్షం కురిపించారు. 125 అడుగుల ఎత్తయిన విగ్రహం కిందనే 50 అడుగుల ఎత్తులో నిర్మించిన అంబేడ్కర్‌ స్మారక భవనాన్ని ప్రకాశ్‌ అంబేడ్కర్‌ ప్రారంభించారు. ఆ భవనంలో అంబేడ్కర్‌ జీవిత విశేషాలు ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను, అందులోని థియేటర్‌లో ప్రభుత్వ విభాగాలు అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణంపై రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శనను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, ప్రకాశ్‌ అంబేడ్కర్‌, మంత్రులు, ఇతర ముఖ్యనేతలు తిలకించారు. దీన్ని సభకు వచ్చిన వారందరికీ లైవ్లో చూపించారు. సభావేదికపై ప్రకాశ్‌ అంబేడ్కర్‌ను సత్కరించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆయనకు బుద్ధుని ప్రతిమను బహూకరించారు. ఈ సందర్భంగా 'దళితబంధు పధకం విజయగాధలు' సీడీని ప్రకాశ్‌ ఆవిష్కరించారు.

అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. హిందువులు ముస్లింలకు ప్రత్యేక దేశం ఉండాలని అంబేడ్కర్‌ 1938లోనే చెప్పారని ప్రకాశ్‌ అంబేడ్కర్‌ ప్రస్తావించారు. అందుకు అనుగుణం గానే దేశ విభజన జరిగిందని గుర్తు చేశారు. ఇప్పటికే ఒకసారి మతం ఆధారంగా దేశ విభజన జరిగినందున ఇక మళ్లీ హిందూ రాష్ట్రం డిమాండ్‌ లేవనెత్తడం అర్థరహితమని వ్యాఖ్యానించారు. ఎప్పుడైతే దేశంలో కులం, మతం రాజకీయాలు ప్రారంభమవుతాయో, అప్పుడు దేశంలో జాతీయ నాయకుడు అనే వారే ఉండరని అప్పట్లోనే అంబేడ్కర్‌ చెప్పారన్నారు. అభివద్ధిలో తెలంగాణ దేశానికే కొత్త మార్గం చూపించిందని ప్రకాశ్‌ అంబేడ్కర్‌ ప్రశంసించారు. కుల మతాల రాజకీయాలకు దూరంగా ఉంటామని అందరం శపధం చేయాలని ప్రకాశ్‌ అంబేడ్కర్‌ పిలుపు నిచ్చారు. హైదరాబాద్‌ దేశానికి రెండో రాజధాని చేయాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ కన్న కలలను నిజం చేయాలని ఆయన మనుమడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ అన్నారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, రెండో రాజధాని కోసం కేంద్రాన్ని డిమాండ్‌ చేయాలని పిలుపు నిచ్చారు. దేశ రక్షణ కోణంలో హైదరాబాద్‌ రెండో రాజధానిగా ఉండాలని అంబేడ్కర్‌ బలంగా కోరేవారన్నారు.

70 ఏళ్ల స్వాతంత్య్రం అనంతరం కూడా నేటికీ అంబేడ్కర్‌ ఆలోచనలు దేశ ప్రజల ముందుకు పూర్తిగా రాలేదని ప్రకాశ్‌ అంబేడ్కర్‌ అన్నారు. బాబాసాహెబ్‌ ఆలోచనలు కేవలం దళితులు, బలహీన వర్గాలకు పరిమితం కాలేదని, దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలని ఆయన కలలు కన్నారని చెప్పారు. దుర దష్టవశాత్తు నేడు దేశంలో మతం ఆధారంగా మైనార్జీలను పరిగణి స్తున్నారని, సామాజిక వెనకబాటు ఆధారంగా ఉన్న మైనార్జీలను గుర్తించి చేయూత అందించాలని సూచించారు. అప్పుడే పేదరికాన్ని నిర్మూలించాలని చెప్పారు. భాషా ప్రయుక్త సాధ్యమవు తుందని రాష్ట్రాలకు అప్పట్లో కేంద్రంతోపాటు, అంబేడ్కర్‌ కూడా వ్యతిరేకమని, పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేయనంత వరకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండు కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని ప్రకాశ్‌ అంబేడ్కర్‌ గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు మరణం తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినపుడు కాంగ్రెస్‌ పార్టీ పుణ్యదానం చేసిందని అంబేడ్కర్‌ అన్నారని ప్రస్తావించారు. అంబేడ్కర్‌ చిన్న రాష్ట్రాలకు అనుకూలమని, ఆర్థికంగా మనగలగడం, భౌగోళిక అంశాల ఆధారంగా రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని చెప్పే వారని అన్నారు. సంక్షేమం, అభివద్ధి చిన్న రాష్ట్రాలతోనే సాధ్యమని అంబేడ్కర్‌ పదేపదే చెప్పేవారని, ఇప్పుడు అది నిజమవు తోందని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లో అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం దేశంలో వెనకబడిన వర్గాలకు ఒక ఆశాదీపంలా కనిపిస్తోందని ప్రకాశ్‌ అంబేడ్కర్‌ అన్నారు. అంబేడ్కర్‌ జయంతిని ఏటా అందరూ నిర్వహిస్తారని, హైదరాబాద్‌ కార్యక్రమం వాటన్నింటికన్నా భిన్నమైనదని చెప్పారు. సమాజంలో మార్పు కోసం సంఘర్తించాలని అంబేడ్కర్‌ చెప్పేవారని, నేటి యుగం వాస్తవికతను గ్రహించి మానవత్వాన్ని పెంచేందుకు సంఘరించాలని పిలుపు నిచ్చారు. రూపాయితో బ్రిటిష్‌ ప్రభుత్వం ఎలా ఆడుకుందో, దేశాన్ని ఎలా దోచుకుందో 1923లోనే ప్రాబ్లం ఆఫ్‌ రూపీ అనే పుస్తకంలో అంబేడ్కర్‌ వివరించారని ప్రకాశ్‌ అంబేడ్కర్‌ ప్రస్తావించారు. ఈ దోపిడీ ఇప్పటికీ కొనసాగుతోందని, ప్రస్తుత కాలాన్ని బట్టి ఈ సమస్యను 'దియరీ ఆఫ్‌ లూట్‌' పేర్కొనవచ్చని చెప్పారు. దియరీ ఆఫ్‌ లూట్‌ను అడుకునే ప్రయత్నం చేస్తోందని ప్రశంసించారు. దేశంలో ఉత్పత్తిదారు, విక్రయదారు స్థానాలను ధనిక పారిశ్రామికవేత్తలు ఆక్రమించారని, పేదలు, బలహీన వర్గాలవారు కొనుగోలుదారులుగా మిగిలారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దళిత బంధు పథకంతో చేస్తున్న కషిని అభినందించారు. దళితబందు పధకంలో అందించే రూ.10 లక్షలు ఏడాది తర్వాత కూడా అంతే విలువ కలిగి ఉండాలని, రూపాయి విలువ నిలకడగా లేనపుడు పేదరిక నిర్మూలనకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఉపయోగం ఉండదని ప్రకాశ్‌ అంబేడ్కర్‌ వ్యాఖ్యానించారు.

Tuesday, May 2, 2023

కుబేరుల రాజ్యంలో... కూటికిలేనివారే ఎక్కువ?

కుబేరుల రాజ్యంలో... కూటికిలేనివారే ఎక్కువ?


 భారత రాజ్యాంగం ద్వారా సామాజిక సమానత్వం అనే అమతాన్ని అందించారు. సాంస్కతిక భారత్‌తోపాటు, బలమైన సమైక్య రాజకీయ భారత్‌ అవసరమని భావిస్తూ బలమైన కేంద్రం గల భారత రాజ్యాంగాన్ని మనకందించారు. ఒకే ప్రజ నుండి - ఒకే రాజ్యం - ఒకే రాష్ట్రం వైపు భారత్‌ రూపొందే విధంగా భారత రాజ్యాంగాన్ని అంబేడ్కర్‌ అందించారు.

Monday, May 1, 2023

బాబాసాహెబ్‌ డాక్టర్‌ అంబేడ్కర్‌ సాంఘిక విప్లవం

 బాబాసాహెబ్‌ డాక్టర్‌ అంబేడ్కర్‌ 

సాంఘిక విప్లవం


మానవ సమాజం కొన్ని వందల సంవత్సరాలుగా పరిణామం చెందుతూ నేటి దశకు చేరుకున్నది. అంతర్లీనంగా ఒక ఐక్యతా సూత్రాన్ని అల్లుకుంటూ సమాజం వికాసం చెందుతూ వుంటుంది. ఈ పరిణామ క్రమంలో ఎన్నో రకాల నాగరికతలు, సంస్కతులూ వికసిస్తూ ఉంటాయి, అంతరించిపోతూ ఉంటాయి. అటు వికసించటానికీ, ఇటు అంతరించ టానికి మనుషుల ఉమ్మడి కషి, ఇష్టం, వ్యతిరేకత ఎంతగానో ప్రభావితం చేస్తుంటాయి. మానవ సమాజం విస్తరిస్తూ ఉన్న వివిధ దశల్లో వ్యవసాయం, వ్యాపారం ప్రభావం వుంటుంది. ఈ ప్రభావం ఉన్నంతసేపూ సమాజ వికాసం మారుతూ ఉంటుంది. విలువలు కూడా మారుతూ ఉంటాయి. మనోభావాల ప్రభావం మాత్రం చాలా నిలకడగా ఉంటుంది. విశ్వాసాలు, ఆలోచనల మీద ఆధారపడిన, లేదా వాటితో ప్రభావితమైన పరిణామ దశకు కొంత శాశ్వతత్వం ఉంటుంది. వివాహం, కుటుంబవ్యవస్థ అలాంటివి. దీనికీ ఆస్తి సంబంధాలకూ చాలా ప్రత్యక్ష సంబంధం ఉన్నా దీనిని నడిపించేదీ, నిలిపి ఉంచేదీ భావన ప్రభావం మాత్రమే. ఎన్నో వ్యవస్థలు బయలుదేరాయి. సమాజంలో కొన్ని రోజులు నిలబడ్డాయి, ఆ తర్వాత అంతరించిపోయాయి. కుటుంబ వ్యవస్థ, వివాహం, ప్రస్తుతానికి నిలకడగా నిలిచిపోయాయి. సభ్యదేశాలు అన్నింటిలోనూ ఈ వ్యవస్థలు ఇంచుమించు ఒకే మాదిరిగా స్థిరపడిపోయాయి. ఇలాంటిదే మరో వ్యవస్థ 'కులవ్యవస్థ. ఇది కూడా కొన్ని వందల ఏళ్ళు పరిణామం చెంది ఈ రూపంలో గడ్డకట్టుకుపోయింది. ఈ రకమైన వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా కనబడదు. కులవ్యవస్థ ఏర్పడటానికి ముందు ఉండిన దశలు ఇతర దేశాలలో కూడా ఏర్పడ్డాయి. కాని వాటిని అధిగమించి కులరహిత సమాజం ఏర్పడటానికి ప్రయత్నాలు చేసుకున్నారు అక్కడి ప్రజలు. అంటే కుల వ్యవస్థను పిండంలోనే త్రెంచి గడ్డకట్టుకోకుండా చేశారు. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా దానిని కాపాడుకుంటూ గడ్డను ఏర్పాటుచేసుకున్నారు. ఇతర దేశాలలో ఈ కులవ్యవస్థ లేకపోవటం వల్ల సమాజంలోని మానవ సంబంధాల మధ్య అధిగమించరాని అడ్డుగోడలు ఏమీ లేకుండా పోయాయి. త్రెంచేసుకోడానికి వీల్లేని ముళ్ళకంచె మనుషుల చుట్టూ లేకుండాపోయింది. ఎక్కి పైకి రావడానికి వీల్లేని నిచ్చెనలు ఏర్పాటు కాకుండా పోయాయి.
మనదేశంలో మాత్రం అలాకాదు. కులవ్యవస్థ ఏర్పడటం మూలంగా మానవ సమాజ వికాసం ఆగిపోవటమే కాకుండా ముళ్ళ కంచెలు మొలిచాయి. కుళ్ళు కాల్వలు ఏర్పడ్డాయి. అభివద్ధి చెందిన ఇతర దేశాలతోపాటు భారతదేశం అభివద్ధి చెందక పోవటానికి ప్రధానమైన కారణం 'కుల వ్యవస్థ'. అన్ని అరిష్టాలకు ఇదే కారణం. ఇద్దరు మనుషులు కలిసి నడవటానికి వీల్లేని వ్యవస్థ ఈ కులవ్యవస్థ. ఇద్దరు కలిసి మంచినీళ్ళు తాగటానికి వీల్లేదు, కలిసి భోజనం చేయటానికి గాని, ఒకరితో భోజనం మరొకరు పంచుకోవటానికి గాని, స్త్రీ పురుషులిద్దరు పెళ్ళిచేసుకోవ టానికి గానీ వీలులేకుండా చేసింది ఈ కులవ్యవస్థ. మానవ జీవితానికి, మానవ సమాజ వికాసానికి ప్రధాన మైన తిండి, నివాసం, వివాహం లాంటి వ్యవస్థల్లో ఇద్దరు కలవటానికి వీలులేకుండా చేస్తే ఇక ఆ సమాజం ఏం వికాసం చెందుతుంది? సమాజంలో మనుషులు వ్యక్తులుగా ఎదగటానికి చాలా అవసరమైనది విద్య. దానిని సమాజంలో అత్యధిక శాతం జనానికి అందకుండా చేస్తే ఇక ఆ సమాజంలో వికాసం ఎలా వుంటుంది? మనిషి పుట్టుకను తప్ప మిగిలిన అన్ని అవస్థలను శాసిస్తున్నది కులవ్యవస్థ. ఎవరు ఎక్కడ నివసించాలి, ఎవరు ఎటువంటి బట్టలు వేసుకోవాలి, ఎవరు ఎటువంటి పనులు చెయ్యాలి, ఎవరు ఏ విధంగా ఎవరితో వివాహం చేసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఆఖరికి చనిపోయినప్పుడు ఎవరిని ఎక్కడ ఏ విధంగా పాతిపెట్టాలి లేదా తగలబెట్టాలి అనే విషయాన్ని నిర్ణయిస్తుంది ఈ కులవ్యవస్థ. కేవలం నిర్ణయించటమే కాకుండా దానిని ఎంతో పటిష్ఠంగా అమలు చేయిస్తుంది. అది శాసించిన నియమాలను అతిక్రమించిన వారికి లేదా అమలు చేయటానికి నిరాకరించిన వారికి కఠినమైన శిక్షలు విధించింది. అంతే కాదు అమలు కూడా చేయించింది. దాని వలస కులవ్యవస్థకు ఎక్కడలేని బలం వచ్చింది. జీవితంలోని వివిధ దశలను ఈ కులం శాసిస్తూ వస్తున్నది.
ఈ కుల వ్యవస్థ మొత్తం మనుషులను ప్రధానంగా రెండు రకాలుగా చీల్చివేసింది. ఒకటి లాభం పొందే రకంబీ రెండోది నష్టపోతున్న రకం, ఒకటి మర్యాద పొందే రకం; రెండోది అవమానం పొందే రకం. ఈ రెండు వర్గాలకూ ఈ కుల వ్యవస్థ వలన 'భద్రత' దొరుకుతున్నది ఏమీ లేకపోయినా ప్రధాన విషయమైన వివాహం, చావు దగ్గర ఇది చాలా అవసరమవుతున్నది. 'చనిపోయినప్పుడు నాకు అవసరమైన తంతు తతంగాలు దహన సంస్కారాలు జరిపిస్తారు' అనే విశ్వాసం. ఒకే కులంలో తప్ప వివాహాలు జరగవు. పెళ్ళి జరగాలంటే కులాన్ని ఆశ్రయించ వలసిందే. అది లేకపోతే పెళ్ళికానట్లే. చావు దగ్గరా అంతే - కులం వాళ్ళు తప్ప మరొకరు చావుకు సంబంధించిన పనులు చెయ్యరు. కాబట్టి కులాన్ని ఆశ్రయించక తప్పటం లేదు.
ఈ కుల వ్యవస్థలో మరొక లక్షణం - 'ఓదార్పు' ఉన్నది. ఈ ఓదార్పు దోపిడీకి అవమానలకు, దౌర్జన్యాలకు గురవుతున్న వారికి బాగా పనికి వస్తున్నది. తనకింది వాడిని చూసుకొని సంతప్తిపడతారు తప్ప, తనకంటే 'పైన' ఇంకా చాలామంది ఉన్నారని వారి చేతులమీద ఎన్నో అవమానాలకు గురవుతున్నామనే ఆలోచన వారికి రాదు. ఏదో కొంత మోతాదులో ఓదార్పు 'భద్రత' దొరకుతుండటం మూలంగా ఈ కుల వ్యవస్థ కోరలలో నుంచి బయటపడలేక పోతున్నారు.
ఈ కులవ్యవస్థ మరొక లక్షణం మనుషుల్ని నిచ్చెనమెట్లలా నిలబెట్టింది ఒకరిపై ఒకరిని. ఈ నిచ్చెన మెట్లు కూడా అన్నీ సమానం కాదు. పైకి వెళ్లే కొలదీ పూజ్యభావం పెరుగుతుంది, కిందకు వచ్చే కొలదీ ఏహ్యభావం కలుగుతుంది. ఈ నిచ్చెనమెట్లు కూడా తనకంటే ఎక్కువ ఎవరో ఉన్నారని వారు తమని అవమానిస్తూ ఉంటారని అనుకోవటం లేదు - తనకంటే కింద కొన్ని మెట్లు ఉన్నాయని వాటిని నీచంగా చూడటం మాత్రం చేస్తూ ఒక మాదిరి ఆనందాన్ని పొందుతూ వుంటాయి. ఒక మెట్టునూ మరొక మెట్టునూ కలిపే బంధం ఏదీలేదు. అందుకనే మెట్లులేని నిచ్చెన మెట్లు లేని సమాజాన్ని నిర్మించుకో టానికి ఏ ఒక్కరూ కషిచేయలేదు. ఇటువంటి కులవ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా కనపడదు. ఇది అందిస్తున్న విష ఫలాలు ఏ దేశాలలోనూ ఉండవు.
మనిషిని కొలవటానికి ఇది ఒక కొలబద్ద. మనిషి ప్రతిభను, విజ్ఞానాన్ని ఇది కొలుస్తుంది. మనిషి సాధించిన దానికంటే ఎక్కడ పుట్టాడు అనేది మనిషి విలువలను గుర్తించ టానికి పరికరం అయింది. మనిషి ఐశ్వర్యం సంపాదించాలన్నా ఆస్తి సంపాదించాలన్నా కులమే నిర్ణయిస్తుంది. మొత్తం మనిషి జీవితంలో ఇంత ప్రధానమైన పాత్ర వహించిన దానిని ప్రజలు ఈ విధంగా పెరగనివ్వటానికి కొందరు. కొన్ని వర్గాల వారు దోహదం చేశారు. దీనికి ఒకప్పుడు రాజముద్ర ఉండేదిబీ అంటే ఈ వ్యత్యాసాలు ఇలానే ఉండాలనేది; ఇప్పుడు సమాజం ముద్ర ఉన్నది. ఈ ముద్రతో జీవన రంగంలోని ప్రతి అంశాన్ని శాసిస్తూ ఉన్నది. ఇంత భయంకరమైన, హానికరమైన, నష్టదాయకమైన, ఘోరమైన, విషపూరితమైన వ్యవస్థను ఎందుకు నాశనం చేయటం లేదు? దీనిని మార్చటానికి ఎందుకు ప్రయత్నాలు చెయ్యటంలేదు? మార్పు తీసుకురావలసిన వర్గం ఈ వ్యవస్థల వల్ల ప్రయోజనాలు పొందు తున్నారు. వారు, అటువంటప్పుడు వారు సమాజాన్ని మార్చాలని అనుకోరు.
ఇటువంటి సమాజాన్ని మార్చాలని ఆలోచించింది, అందు కోసం ప్రయత్నం చేసింది చరిత్రలో అయిదారుగురు కంటే ఎక్కువ ఉండరు. అందులో కూడా మార్పు పైపైన మార్చేది కావు. సమూలంగా ఈ వ్యవస్థ నాశనమై కొత్త వ్యవస్థ ఏర్పడాలని ఆలోచించింది మరీ తక్కువ. వీరిలో మహాత్మా జ్యోతిరావ్‌ పూలే మొదటివాడయితే, డాక్టర్‌ అంబేడ్కర్‌ మరొకరు. ఈ వ్యవస్థలో చాలా తీవ్రస్థాయిలో మార్పు తీసుకురావటానికి ప్రయత్నం చేసింది గౌతమ బుద్ధుడు. ఆయన తర్వాత జ్యోతిరావ్‌ ఫూలే, ఆ తర్వాత డాక్టర్‌ అంబేడ్కర్‌ వస్తారు. జ్యోతిరావ్‌ ఫూలే చనిపోయిన సంవత్సరానికి అంబేద్కర్‌ అదే మహారాష్ట్రలో జన్మించటం యాదచ్ఛికం. ఒకే ఆదర్శం కోసం, ఒకే గమ్యం కోసం ఇద్దరూ కషిచేశారు. కాబట్టి ఒకరి నుంచి మరొకరు ఈ ఉద్యమ స్ఫూర్తిని అందుకున్నట్టు అయింది.
ప్రతి సమాజంలోనూ ఏదో చెడు ఉంటుంది. ఆ చెడును బాగు చేయటానికి కొందరు సంస్కర్తలు వస్తారు. దానిని బాగుచేసి వెళ్ళి పోతారు. అదేవిధంగా భారతదేశ సమాజంలో కులం అనే ఒక చెడు ఉన్నది. దీనిని బాగుచేయటానికి చాలామంది పెద్దలు బయలు దేరారు. అప్పుడొక మార్పు, ఇక్కడొక మార్పు చేశారే గాని పూర్తి వ్యవస్థను కూకటి వేళ్ళతో పెకలించి నూతన వ్యవస్థను ఏర్పాటు చేయటానికి కషి జరపలేదు.
భారతదేశ సమాజంలో మార్పు కాదు - విప్లవం రావాలన్నాడు డా.అంబేడ్కర్‌. ఎటువంటి విప్లవం తీసుకురావాలనుకున్నాడు, దానికోసం ఏమేమి చేశాడనేది మనం పరిశోధించాలి. భారతదేశం ప్రధానం గా కులాలుగా చీలిపోయింది. దేశమంతా ఒక ''జాతి'' అని చెప్పటానికి వీలులేకుండా పోయింది. ఈ కులాలను నిర్మూలించి మొత్తం ప్రజలను ఒక ''భారతీయ జాతి''గా రూపొందించవలసిన అవసరం ఎంతో ఉన్నది. ఈ అవసరాన్ని గుర్తించిన వారు చాలా తక్కువ. ఈ విషయంలో డాక్టర్‌ అంబేడ్కర్ని ప్రధానంగా గుర్తించ వలసింది ఎందుకంటే ఆయన ఒక్కడే ''కులాలను నిర్మూలించండి'' అని నినాదాన్ని ఇచ్చాడు. ''ఈ కులంపేరు మీద మీరు ఒక జాతిని గాని నీతిని గాని నిర్మించలేరు'' అని హెచ్చరిక కూడా చేశాడు. డా. అంబేడ్కర్‌ కంటే ముందు ఈ కులవ్యవస్థ గురించి, కులాల గురించి ప్రస్తావించి, ఈ వ్యవస్థను సరిదిద్దటానికి, చక్కపెట్ట టానికి కొంత కషి చేసినవారు ఉన్నారని ముందు చెప్పుకున్నాం. వారికి డా.అంబేడ్కర్కి ఉన్న ప్రధానమైన తేడా ఏమంటే వారు ఈ వ్యవస్థను ఇలానే ఉంచి దానిలో లోపాలను సరిదిద్ది, దానిని కొంచెం మెరుగుపరిస్తే చాలు అని అన్నారు. డా.అంబేడ్కర్‌ మాత్రం ''లేదు! ఈ వ్యవస్థను నిర్మూలించండి'' అని చెప్పాడు. విప్లవం అంటే సమూలంగా వచ్చే మార్పు అని అనుకున్నప్పుడు డాక్టర్‌ అంబేద్కర్‌ ఒక్కడే సామాజిక విప్లవం కావాలని కోరిన వ్యక్తి అవుతాడు. సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను తొలగించటానికి కషి జరిగింది. అయితే ఆ కషి కులవ్యవస్థ చట్రంలోనే, ఆ పరిధిలోనే ఉంటుంది. డాక్టర్‌ అంబేడ్కర్‌ మాత్రం ఆ చట్రాన్ని ఛేదించండి అన్నాడు. ఆ పరిధిని తొలగించండి అన్నాడు. ''కులం నిర్మూలించండి'' అని ఒక నినాదాన్ని ఇవ్వటం ఒక హెచ్చరిక చేయటమే కాకుండా అది ఎలా పోతుందో కూడా మార్గాన్ని చూపాడు. దాని మూలం ఎక్కడున్నదో కనుక్కుని, దానిని వేర్లతో సహా పెరికి పారేయమన్నాడు. భారతదేశంలో కులానికి ప్రధానమైన మూలం 'హిందూమతం' ఆ మతాన్ని నిర్మూలించనిదే కులం పోదు అని చెప్పాడు. ఏ హిందువుకి ఆ ధైర్యం ఉన్నది. వీటిని కులాన్ని పోషిస్తున్నది మతం, ఆ మతం నిర్దేశించిన కట్టుబాట్లు, నిర్మూలించకుండా కులాన్ని నిర్మూలించలేమని డా.అంబేడ్కర్‌ అంటాడు. అందుకే ఆయన్ని సాంఘిక విప్లవకారుడు అని అనటం.
కుల వ్యవస్థ, సాంఘిక మార్పులు, సాంఘిక సంస్కరణ అంటే చాలామందికి గుర్తు వచ్చేది గాంధీ. ఆయన్ను చెప్పకుండా సాంఘిక విప్లవం గురించి ఏం చెప్పగలం అనేవారు కూడా ఉన్నారు. కులవ్యవస్థలో ప్రధానమైన అంశం అంటరానితనం అనే దానిని అనేక రూపాలతో పాటిస్తూ ఉంటారు. మనిషిని ముట్టుకోకపోవటం నుండి, అతని చేతులమీద మంచి నీళ్ళు తాగకపోవటం నుంచి, అతనిని ఇంట్లోకి ప్రవేశించక పోవటం నుండి, గుడిలోకి రానీయకపోవటం నుండి, అతనిని తనతో సమానంగా అంగీకరించకపోవటం నుండి, అతనితో పెళ్ళిచేసుకోవపోటం నుండి, అతని చేతుల మీద దహన సంస్కారం జరిపించుకోకపోవటం నుంచి. ఇవన్నీ అంటరానితనానికి రూపాలే. దీనిని నిర్మూలించకుండా సమాజాన్ని ఒకటిగా చేయటం ఎలా సాధ్యమవుతుంది? ఈ విషయాన్ని చాలామంది సంస్కర్తలు అంగీకరించారు. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. వివిధ రూపాలలో అమలులో ఉన్న ఈ అంటరానితనాన్ని నిర్మూలించటానికి చాలామంది కషి చేశారు. గాంధీ కూడా కషిచేశాడు. అయితే ఈ కషి చేసిన మహానుభావుల్లో సంస్కర్తల్లో చిత్తశుద్ధి ఉన్నది. అంటరానితనం నిర్మూలన విషయంలో ఆ చిత్తశుద్ధి గాంధీజీలో ఉన్నదా అనే విషయంలో కొన్ని అభిప్రాయ భేదాలున్నాయి. అయితే ఇక్కడ అది అప్రమత్తం అవుతుంది. కాబట్టి, మరో సందర్భంలో దాని గురించి పట్టించుకోవచ్చు. ఆయన కషి సలిపాడు అనేది మాత్రం తీసుకుంటే, వీరంతా అంటరానితనాన్ని నిర్మూలించండి అని అన్నారు గాని అది కులచట్రాన్ని కదలించకుండానే. గాంధీజీ అయితే చాలా స్పష్టంగా చెప్పాడు. ''కులవ్యవవస్థ చాలా మంచిది. అది శాస్త్రీయమైన వ్యవస్థ. అయితే అంటరానితనం మాత్రం చెడ్డది. దానిని తొలగించాలి''. ''అంటరానితనాన్ని తొలగించండి, కాని కులాన్ని మాత్రం అలాగే ఉంచండి'' అని గాంధీజీ అన్నాడు. కుల నిర్మూలన అనే మాట ఆయన ఊహకు ఎక్కడా అందలేదు. ఇక్కడే ఆయన చిత్తశుద్ధిని శంకించవలసి రావటం డా. అంబేడ్కర్‌ మాత్రం ''అంటరానితనాన్ని పోగొట్టాలంటే కులాన్ని నిర్మూలించవలసిందే'' అని చెప్పాడు. దేనిమీద అయితే అంటరానితనం ఆధారపడి ఉన్నదో దానిని నిర్మూలించ కుండా అంటరానితనాన్ని నిర్మూలించటం ఎలా సాధ్యం అని ప్రశ్నిస్తాడు డా.అంబేడ్కర్‌. మూలాన్ని నిర్మూలించకుండా పైన పూస్తున్న పిందెల్ని తెంపితే చెట్టుకు కాయకుండా ఉంటుందా? మూలాన్ని పెకలించమని చెప్పింది డా. అంబేద్కర్‌ కాబట్టి ఆయన్ని సాంఘిక విప్లవకారుడు అని అంటున్నాం. సంఘసంస్కరణోద్యమాలు మనదేశంలో చాలా వచ్చాయి. అందులో ప్రధానమైన సతీ సహ గమనం, బాల్య వివాహాలు, వ్యభిచార నిర్మూలన, జంతుబలి ఆపటం వంటివి. ఈ ఉద్యమాలు ఏవీ కూడా కులం గురించి మాట్లాడవు. ఒక కులానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు ఇవి కొన్ని. వీటిని నిర్మూలించాలను కున్నప్పుడు ఆ కులం గురించి ప్రస్తావించక పోవటం, దానిని పరిగణన లోనికి తీసుకోకపోవటం జరిగిందంతే. ''మూలం''లోకి ఎవరూ పోదలచుకోలేదని తెలుస్తుంది. సమస్య లోతుల్లోకి వెళ్ళి పరిశోధించారా అనేది వేరే విషయం. మూలాన్ని ముట్టుకో కుండా తెచ్చే ఏ మార్పు అయినా పైపై మెరుగులే తప్ప అసలు వస్తువులో ఏమి మార్పు వస్తుంది? ఉదాహరణకు సతీ సహగమనం తీసుకుందాం. ఇది ప్రధానంగా బ్రాహ్మణ, క్షత్రియ కులాలలో ఉన్నది. అది కూడా ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో ప్రధానంగా ఉన్నది. దీనిని నిర్మూలించటానికి రాజా రామ్మోహన్‌ రారు కషి చేశాడు. అయితే ఇది భారతదేశ ప్రజలలో ఎంతమందికి సంబంధించిన విషయం? ఎంతశాతం ప్రజలు ఈ పద్ధతి వలన నష్టపడు తున్నారు? ఇది ఎవరికి సంబంధించినది? దేశ జనాభాలో అత్యంత తక్కువ శాతానికి సంబంధించిన విషయం. మిగిలిన సమాజానికి ఏమాత్రమూ సంబంధం లేదు దీనితో. అయితే ఒకరికి చెడు జరిగినా అందరికీ జరిగినట్టే, మొత్తం సమాజానికి జరిగినట్టే అని భావించటంలో తప్పులేదు. కాని చాలా తక్కువ శాతం ప్రజలకి సంబంధించిన విషయం. దీని ప్రభావం మిగతా సమాజంమీద ఏమీ లేకపోవటం. అటువంటప్పుడు సతీ సహగమనానికి సంబం ధించిన కషి సాంఘిక విప్లవం ఎలా అవుతుంది? సంఘ సంస్కరణ ఎలా అవుతుంది. అయినా దానిని సంఘ సంస్కరణ అన్నాం. రాజా రామ్మోహన్‌ రారును సంఘ సంస్కర్త అని పిలిచాం. సాంస్కతిక పునరుజ్జీవన నిర్మాత అని కొనియాడాం. అదే విధంగా మిగిలిన సంస్కరణలు, బాల్య వివాహాలు, విధవా వివాహాలు కూడా అంతే. ఈ ఉద్యమాలు ఏవీ కూడా మొత్తం దేశ ప్రజలకు సంబంధించినవి కావు. ఒక్క కులవ్యవస్థ, దాని నుంచి వచ్చిన అంటరానితనం మాత్రమే మొత్తం ప్రజలకు సంబంధించినది. దీని గురించి ఆలోచించిన వారు చాలా తక్కువ. దీనిపై ధ్వజమెత్తినవారు మరీ తక్కువ. దీనిపై గొడ్డలి ఎత్తినవారు ఇంకా తక్కువ. ఈ ఆఖరి వర్గంలోకి డాక్టర్‌ అంబేడ్కర్‌ వస్తాడు. అందుకనే ఆయన్ని సాంఘిక విప్లవకారుడు అంటాం.
ఒక మార్పును గాని, విప్లవాన్ని గాని తీసుకురావటానికి ఒక సిద్ధాంతం ఉండాలి. విప్లవం రావాలంటే విప్లవ సిద్ధాంతం ఉండాలి. సమాజంలో ఉన్న విషయాలను వాస్తవాలను అంతర్గతంగా విబేధిస్తున్న అంశాలను ఆధారం చేసుకొని ఒక సిద్ధాంతాన్ని రూపొందిస్తారు. ఆ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టటానికి ఒక సైద్ధాంతిక భూమికను ఏర్పరుచుకుంటారు. సామాజిక విప్లవాన్ని తీసుకురావటానికి అంబేడ్కర్‌ ఏ సిద్ధాంతాన్ని రూపొందించాడు? ఏ సైద్ధాంతిక భూమికను సిద్ధం చేసుకున్నాడు పరిశీలిద్దాం.
ఆ అంశాన్ని పరిశీలించే ముందు కులవ్యవస్థకు సంబంధించిన వివిధ పోరాటాలలో ఏ సిద్ధాంతం ప్రధాన పాత్ర వహించింది అనే విషయాన్ని పరిశీలించటం అవసరం. కుల వ్యవస్థ మూలంగా జరుగుతున్న చెడును తొలగించటానికి కషిచేసిన వారు ఎక్కువగా మానవతా దష్టితో చేశారు. ''దేవుని దష్టిలో అందరూ సమానమే. కాబట్టి కులం పేరు మీద తేడాలు ఉండడానికి వీల్లేదు'' అనే దష్టి వారికి ఉండేది. దీనికి ప్రత్యేకమైన సిద్ధాంతం ఏదీలేదు. కేవలం మానవతా దష్టి. ఇతర మనుషుల పట్ల ఒకరకమైన జాలి, దయ, సానుభూతి, అనుకంపనతో కూడి ఉన్న దష్టి ఇది. అంటరానివారి పట్ల ఉన్న దయ, సానుభూతి, ఇతర మధ్య కులాలలో ఉన్న వ్యత్యాసంపట్ల వ్యతిరేకత ఇవన్నీ కలిసిన దష్టి అది. దీనికి ప్రత్యేకమైన సిద్ధాంతం ఏదీ లేదు. మరికొంతమంది భక్తి సిద్ధాంతాన్ని దీనికి జోడించారు. ఏదో ఒక దేవుని పట్ల విశ్వాసం ఉన్న వారు, ఆ దేవుణ్ణి ఆరాధించే వారంతా సమానులే అన్న దష్టితో సమానత్వాన్ని ప్రచారం చేశారు, ప్రబోధం చేశారు. దీనికి కూడా ప్రత్యేకమైన సిద్ధాంతం ఏదీలేదు. ఆ తర్వాత వచ్చిన సాంఘిక సంస్కర్తలు కూడా ప్రత్యేకమైన సిద్ధాంత భూమికను ఏర్పరచుకోలేదు. హైందవ సమాజంలో ఉన్న కొన్ని ఛాందస భావాలను, అంధ విశ్వాసాలను, సంప్రదాయాలను ఖండించటం మాత్రమే చేశారు. వాటిని మెరుగు పరచాలని ప్రయత్నం చేశారు. కొన్ని పద్ధతులను మార్చినట్లయితే సమాజం బాగుపడుతుందనే ఉద్దేశమే ప్రధానంగా వారికి ఉన్నది. సాంఘిక సంస్కరణ చేపట్టిన వ్యక్తులలో ప్రధానమైన వారంతా హిందూమతాన్ని సంస్కరించటానికే ప్రయత్నించారు గాని దానిని పూర్తిగా క్షాళనం చేసి కొత్త వ్యవస్థను ఏర్పరటానికి ఆలోచించ లేదు. అందుకనే వారిని ''ప్రొటెస్టెర హిందువులు'' అని పిలవటం జరిగింది. అంటే హిందూమతాన్ని కొంత వ్యతిరేకించే వారని అర్థం. ఆ తర్వాత వచ్చిన గాంధీ అయితే హిందూ మతం ఆయన జీవన విధానం. భగవద్గీత శిరోధార్యం. రామనామం నిత్య పారాయణం. ''చాతుర్వర్ణాం మయా సష్టాం'' (ఈ చతుర్వర్ణాలను నేనే సష్టించాను) అని చెప్పిన గీతను పాటించే గాంధీజీ చతుర్వర్ణాలను నిర్మూలించటానికి కషిచేస్తాడనే సమస్యే ఉండదు. వాటిని పదిలంగా కాపాడటమే ఆయన కర్తవ్యం. కాబట్టి ఏమతమైతే మనుషుల మధ్య అడ్డు గోడలు కట్టిందో, ఏ విశ్వాసమయితే మనుషుల్ని కలవకుండా చేసిందో ఆ మతాన్ని, విశ్వాసాన్ని పదిలంగా కాపాడటానికి జీవితమంతా కషిచేసిన గాంధీ సాంఘిక విప్లవాన్ని తీసుకువస్తాడని ఆశించడంలో అర్థం లేదు. ఆయన సిద్ధాంత భూమిక భగవద్గీత. వర్ణ వ్యవస్థను పదిలంగా కాపాడటం కోసం ఎవరికీ హాని తలపెట్టకుండా తన మానాన తాను తపస్సు చేసుకుంటున్న శంబుకుణ్ణి (కేవలం అతడు శూద్రుడు కావటం వల్లనే) తలనరికి చంపివేసిన రాముడు ఆయనకు ఆదర్శ పురుషుడు కాబట్టి ఈ విషయంలో గాంధీజీ నుంచి మనం ఏమీ ఆశించలేము.
మొదటిసారిగా కులవ్యవస్థపై ధ్వజమెత్తిన గౌతమ బుద్ధుడి గురించి కూడా మనం ప్రస్తావించుకోవాలి. బుద్ధుని కాలంనాటికే బ్రాహ్మణవాదం ఉచ్ఛదశలోకి వచ్చేసింది. అనేక ఆచార వ్యవహారాలు నెలకొల్పి బ్రాహ్మణ ఆధిక్యతను పెంచుకొంటూ వస్తున్నారు. దానిని కాపాడ టానికి ఒక పూజారి వర్గం ఏర్పడి పటిష్టమవుతూ ఉన్నది. అసమాన సమాజం ఆవిర్భవించి ఉన్నది. ఆ సమయంలో గౌతమ బుద్ధుడు బ్రాహ్మణీయత లేదా బ్రాహ్మణీకంకు వ్యతిరేకంగా, అది ప్రవేశపెట్టిన సంప్రదాయాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేశాడు. పూజారి వర్గ ఆధిక్యతను అంగీకరించక సమానత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. ఒకరినొకర్ని కలవ నీయకుండా చేసిన హిందూ సమాజపు ఆంక్షలను ఛేదించి ''సంఘాన్ని'' ఏర్పాటు చేసి ఆ సంఘంలో అందరికీ సభ్యత్వాన్ని కలుగజేశాడు. సభ్యత్వం అనేది కులంతో, కుల ఆధిక్యతతో సంబంధం లేకుండా ఉండేది. ఒకటి రెండు మినహాయింపులు ఉన్నప్పటికీ సంఘంలో అందరికీ ప్రవేశం ఉండేది. అయితే ఈ పోరాటం సామాజిక రంగం నుంచి దూరమై మత పరమయిపోయింది. హిందూ సంప్రదాయాలకు, హిందూమతానికి, బ్రాహ్మణీయతకు వ్యతిరేకంగా పోరాటం తలపెట్టిన మొదటి వ్యక్తి అయిన బుద్ధునికి మొత్తం హిందూ మతానికి వ్యతిరేకంగా కులవ్యవస్థ నిర్మూలన కోసం పోరాటంచేసే అవకాశం లేకపోయింది. ఆయన పోరాటమంతా బ్రాహ్మణీయత ప్రవేశపెట్టి అమలులో ఉంచుతున్న పద్ధతులపై. దానికి ఆదనంగా బ్రాహ్మణ ఆధిక్యతకు వ్యతిరేకంగా జరిపిన పోరాటం కూడా ప్రధాన మైనదే. అందువలన సామాజిక విప్లవానికి బుద్ధుణ్ణి ఆద్యునిగా మనం స్వీకరించలేము. ఏ సమాజ మయితే కులంమీద ఆధారపడి, మొత్తం జన జీవితాన్ని అన్ని దశలలోనూ నిర్ధేశిస్తూ ఉన్నదో దానిని నిర్మూలించకుండా విప్లవం అనేది సాధ్యం కాదనే భావంతోనే నేను ఈ మాట అంటున్నది. ఆ కోనం నుండి మాత్రం నేను చూస్తున్నాను.
పందొమ్మిదో శతాబ్దంలో అనేక విప్లవాలకు బీజాలు పడ్డాయి. ప్రపంచ దేశాలలో అనేకచోట్ల ప్రజా జీవితానికి సంబంధించిన అంశాలలో ప్రధానమైన మార్పులు, మౌలికమైన పరిణామాలు సంభవించాయి. భారతదేశంలోనూ ఒక గొప్ప విప్లవానికి బీజాలు వేశాడు. మహాత్మా జ్యోతిరావ్‌ ఫూలే. బ్రాహ్మణీయతపై ధ్వజమెత్తి, పూజారివర్గంపై పోరాటంచేసి కులవ్యవస్థపై ఎదురుతిరిగి ఒక్కడే తిరుగులేని పోరాటం చేశాడు. ఈ దేశంలో బ్రాహ్మణీయత నెలకొల్పిన బానిసత్వానికి వ్యతిరేకంగా శూద్రులను సమాయత్త పరిచాడు. అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. స్త్రీల కోసం, అంటరానివారి కోసం పాఠశాలలు నెలకొల్పి విద్య ద్వారా సాంస్కతిక పునరుజ్జీవనానికి పునాదులు వేసిన వ్యక్తిగా మనం జ్యోతిరావ్‌ ఫూలేను పరిగణిస్తాం. కులవ్యవస్థ మూలంలోకి పోయి దానిని పెకలించే సమయం ఆయనకు దొరకలేదు. అయితే దానికి విత్తనాలు మాత్రం చల్లి వెళ్ళిపోయాడు.
ఒకవిధమైన మానవ దక్పథంతో, తోటివారిపట్ల సానుభూతి తో వివేకా నందుడు కూడా హిందూ మతంలోని కొన్ని చెడులను తొలగించాలని ప్రబోధం చేసినా ''దరిద్ర నారాయణ'' సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినా హిందూమతోద్ధరణకే ఆయన కషి చేశాడు. కాని కులవ్యవస్థ నిర్మూలన కోసం ఏమీ చెయ్యలేదు. ఆ అవసరాన్ని కూడా ఆయన గుర్తించినట్టు లేదు.
ఈ కులవ్యవస్థపై జరిగిన పోరాటాలలో మరో ప్రధానమైన ఘట్టం ఉన్నది. అది బసవేశ్వరుని ఉద్యమం. కులవ్యవస్థ కల్పించిన ఎగుడు దిగుడులను, ఎక్కువ తక్కువలను, ఉచ్ఛనీచాలను, పూజ్యేహ్య భావాలను అంగీకరించక అందరూ సమానమే అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి ప్రచారం చేశాడు. ఆ సిద్ధాంతానికి అనుగుణంగా వచ్చిందే ''చాపకూడు'' సిద్ధాంతం. అంటే అందరూ కలిసి కుల భేదాలు లేకుండా, అంటరానితనం పాటించకుండా ఒకే చాపమీద కూర్చుని భోజనం చేయటం. అందరూ సమానమనే సిద్ధాంతాన్ని అమలులో పెట్టిన ఒక సామాజిక ఉద్యమం బసవేశ్వరుని తర్వాత ఒక మతమై దానిలోకి కూడా కులవ్యవస్థ అవలక్షణాలు జొరపడి, ఆ ఉద్యమాన్ని కూడా నాశనం చేసింది. మరో బ్రాహ్మణ్యం ఆవిర్భవించింది. కాని బ్రాహ్మణాధిక్యత, కులం పేరు మీద అసమానతలు తొలగిపోలేదు. ఎందుకంటే కులనిర్మూలనకు ఒక బలమైన సిద్ధాంతాన్ని గాని, సైద్ధాంతిక భూమికను గాని వారు ఏర్పాటు చేసుకోలేకపోయారు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఉద్యమాలు ఓటమి చెందుతాయంటే వాటి సిద్ధాంతాలకు బలం లేకపోవటమో, బలం చాలక పోవటమో అవుతుంది.
ఈ నేపథ్యంలో మనం అంబేడ్కర్‌ సాగించిన పోరాటాన్ని పరిశీలించాలి. అప్పుడు మనకు ఆ ఉద్యమంలోని పటిష్టత, బలం కనిపిస్తాయి. కులం మూలాలను తరిచి, వాటిని పట్టుకొని పెకలించి వేయటానికి యత్నం చేసిన వ్యక్తి ఆయన. ఈ వ్యవస్థపై ఆయన సాగించిన తిరుగుబాటుకు వేటిని జోడుచేసుకున్నాడో పరిశీలిద్దాం.
కులానికి పునాదులు హిందూ మతంలో ఉన్నాయని కనుక్కున్నాడు. సమాజంలోని కొన్ని పరిణామాలవల్ల కులం ఏర్పడినా, అది ఒక స్పష్టమైన రూపం తీసుకొని స్థిరపడి పోవటానికి ఆధారాలు హిందూమతంలో ఉన్నాయని ఆయన అంటాడు. హిందూ మత మంత అమానుషమైనది, అసమానతతో కూడుకున్నది మరొకటి ఉండదని ఆయన అంటాడు. భారతదేశంలో, భారతీయ సమాజంలో విప్లవం తీసుకురావటానికి బౌద్ధమతం కషిచేస్తే దానికి ప్రతి విప్లవాన్ని తీసుకువచ్చింది బ్రాహ్మణవాదం అంటాడాయన. హిందూ మతానికి ఆధారాలైన వేదాలను, ఉపనిషత్తులను, భగవద్గీతను, పురాణాలను, ఇతిహాసాలను, వివిధ గాథలను ఆయన పరిశోధించి వాటినిండా ఎంత అమానుష వాదం ఉన్నదో బయటికి తీశాడు.
భారత, రామాయణ గాథలను క్షుణ్ణంగా చదివి అందులో ఏరకమైన సమాజాన్ని నెలకొల్పటానికి ప్రచారాలు జరిగాయో ఆయన చెప్పాడు. ఒక్కొక్క అవతార పురుషుని కథలను చదివి వారు నిజంగా మంచి చేయటానికి ''అవతారం ఎత్తారా లేక అసమానతను నెలకొల్పటానికి అవతరించారో చెప్పాడు. ఒక బలమైన సిద్ధాంతం, సైద్ధాంతిక భూమిక లేకపోతే ఈ కుల నిర్మూలన పోరాటం నిలబడదని ఆయన గ్రహించాడు. అందుకనే ఆయన వేదాల నుంచి నేటి వరకూ వచ్చిన మత గ్రంథాలను, పురాణాలను, గాథలను తవ్వి తీయటం చేశాడు. విజ్ఞానమంతా తమ సొత్తు అని, తమ గ్రంథాలలో ఉన్నదంతా విజ్ఞాన సర్వస్వమని, తమ పురాణాలన్నీ అసమాన సంపదతో నిండి ఉన్నాయని హిందువులు గొప్పలు చెప్పుకుంటారు. అది అబద్ధం అని వారికి తెలుసు. అందుకనే వాటిని వారు ముఖ్యంగా బ్రాహ్మణులు తప్ప ఎవరూ చదవకూడదని ఆంక్షలు పెట్టటం జరిగింది. వాటిని డా.అంబేడ్కర్‌ పరిశీలన పరిశోధన దష్టితో చదివాడు. ఆ కషినంతా, ఆ పరిశోధన అంతా అంబేడ్కర్‌ ''ది రివల్యూషన్‌ ఇన్‌ ఏన్షియంట్‌ ఇండియా'' అనే పుస్తకంలో రాసి ఉంచాడు. అంతే కాకుండా ''రిడిల్స్‌ ఆఫ్‌ హిందూయిజం'' అనే పుస్తకంలో కూడా ఎవరికీ తెలియనీయకుండా దాచేసి ఉంచిన రహస్యాలను బయట పెట్టాడు.
కులవ్యవస్థ ఎలా వచ్చింది, అసలు కులం అంటే ఏమిటి, అది ఎలా ఏర్పడింది. అది ఏఏ ఆధారాల మీద బ్రతుకుతూ ఉన్నది అనే విషయాలను ఆయన ''ది ఆరిజన్‌ అండ్‌ జెనిసిస్‌ ఆఫ్‌ కాస్ట్‌ ఇన్‌ ఇండియా'' అనే పుస్తకంలో చెప్పాడు. అది చూడటానికి చిన్న పుస్తకంలా కనిపిస్తుంది. కాని చదివితే అది పెద్ద డైనమైట్లా పేలుతుంది. కులానికి వర్గానికి భేదం చెబుతూ ఆయన ఒక గొప్ప భావాన్ని ప్రవేశపెట్టాడు. ''కులం అనేది గడ్డ కట్టుకున్న వర్గం'' అన్నాడు. అంటే ''వర్గం'' అనేది గడ్డ కట్టుకొని, గిరిగీసుకొని, చుట్టూ దడి కట్టుకొని ''కులం'' అయింది అని అర్థం. ఆ దడిలోపలికి ఎవరినీ రానీయకపోవటం ఒక గొప్ప విశేషం. ఏ దడికి ఆ దడే ఒక సమాజం. లోపలి వారు బయటికి పోకూడదు. బయటివారు లోపలికి వెళ్ళకూడదు. ప్రవేశానికి అర్హతలు, అనర్హతలు కల్పించటం ద్వారా దడిని పటిష్టంగా కాపాడుకున్నారు. కులంలో వర్గ లక్షణాలున్నా దానికి వర్గం అనటానికి వీల్లేదు. వర్గాలు ప్రధానంగా రెండు అనుకుంటే ఒక వర్గంలోంచి మరొక వర్గంలోకి వెళ్ళ టానికి అభ్యంతరాలు ఏవీ లేవు. ప్రవేశానికి నిషేధాలు ఏమీ లేవు. శ్రామికవర్గం నుంచి ధనిక వర్గంలోకి ఎవరైనా వెళ్ళవచ్చు. అభ్యంతరంగాని నిషేధంగాని ఏదీ లేదు. అదే విధంగా ధనిక వర్గం నుండి శ్రామిక వర్గంలోకి ఎవరైనా వెళ్ళవచ్చు. అక్కడా అభ్యంతరాలు గాని నిషేధాలు కాని లేవు. కాని కులం అలా కాదు. ఒక కులంలో నుంచి మరొక కులం లోకి వెళ్ళడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల లోనూ వీల్లేదు. ఎవరైనా ఒక కులంలో పుట్టటం ద్వారానే ప్రవేశించగలరు గాని, ఇష్టం ద్వారా గాని, కోరిక ద్వారా గాని, కావలసినగాని ఒక కులం వేరు మరొక కులంలోనికి వెళ్ళటానికి వీల్లేదు. ఒకవేళ కుల బహిష్కరణ జరిగినా ఆ కులంలో నుంచి బయటకు మాత్రమే వెళ్ళగలదు గాని మరొక కులంలోకి అతను ప్రవేశించలేడు. కిందివాడు పైకి వెళ్ళటానికి సాహసించడం నేరమూ, పాపమూను. అదే విధంగా పైవాడు కిందికి రావాలన్నా అతన్ని రానీయటం పాపమైన నేరం కూడా. ఆ ఆంక్షలు, అభ్యంతరాలు నిషేధాలు, వాటికి అవసరమైన శిక్షలు, దండనలు అన్నీ హిందూమతంలో, బ్రాహ్మణ వాదంలో దొరుకుతాయి. కాబట్టి ఈ కులవ్యవస్థ ను స్థిరీకరించి, నడిపిస్తున్నది బ్రాహ్మణ వాదం. అందుకే దానికి వ్యతిరేకంగా అంబేడ్కర్‌ పోరాటం చేయటం జరిగింది.
కులం పుట్టుక చెప్పిన తర్వాత దానిని ఎలా నిర్మూలించాలో చెప్పాడు. ఈ ఆలోచన అంతా ''ఎన్హిలేషన్‌ ఆఫ్‌ కేస్ట్స్‌'' అనే గ్రంథంలో మనకు దొరుకు తుంది. కులాన్ని ఎలా బద్దలు గొట్టాలో ఎందుకు బద్దలు గొట్టాలో చెప్పిన పుస్తకం అది. ''ప్రపంచంలో శ్రమ విభజన ఉన్నది. కాని భారత దేశంలో శ్రామికుల విభజన ఉన్నది'' అని అంటాడు అంబేడ్కర్‌. శ్రామికులను కులం పేరుమీద విభజన చేసి ఈ దేశంలో మనుషులు ఒకరినొకరు కలవ కుండా చేయటానికి ఎటువంటి కుట్ర జరిగిందో ఆయన ఆ పుస్తకంలో చెప్తాడు. అంతే కాకుండా కుల నిర్మూలనకు ఒక పథకం తయారు చేశాడు. ఆ పథకాన్ని అమలు చేసిన నాడే కులనిర్మూలన జరుగుతుందని, సామ్యవాదాన్ని ఈ దేశంలో ప్రవేశపెట్టటం సాధ్యమవు తుందని ఆయన చెప్పాడు. కులనిర్మూలన కోసం డా.అంబేడ్కర్‌ ప్రవేశపెట్టిన సిద్దాంత గ్రంథం అది. ఈ సిద్ధాంతానికి భూమికగా ''శూద్రులంటే ఎవరు?'' ''అంటరానివారు అంటే ఎవరు?'' అనే గ్రంథాలను రాశాడు.
ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ''కులం'' ఉన్నంత వరకూ ప్రవేశ పెట్టలేము అని స్పష్టంగా చెప్పా డాయన.  అదే విధంగా కులాన్ని నిర్మూలించకుండా సామ్యవాదాన్ని తీసుకు రాలేము అని కూడా చెప్తాడాయన. ఈ కులవ్యవస్థ ఉండటం వలన ఈ అసమానతలు ఉండటం వలన, హెచ్చుతగ్గులు ఉచ్ఛనీచ భేద భావాలు ఉండటం వలన ఈ సమాజం నిండా తేడాలు ఉన్నాయి, ఇది ప్రధానంగా అప్రజాస్వామికమైన సమాజంపైన కప్పుతున్న గుడ్డ మాత్రమే అని అంటాడాయన. కాబట్టి ఉన్న లోపాన్ని గుడ్డతో కప్పి ఉంచుతున్నారు తప్ప దానిని సవరించటం లేదు, తొలగించటం లేదని ఆయన అంటాడు. ఆ లోపాలు తొలగించనంత వరకూ దేశంలో ప్రజాస్వామ్యం రాదని ఆయన నమ్మకం. అదే విధంగా సామ్యవాదం తీసుకురావటం గురించి కూడా. శ్రామికులను కలవనీయ కుండా చేస్తున్న కులవ్యవస్థను నిర్మూలించకుండా, అంటే శ్రామికు లలో విభజన తీసుకువచ్చిన కులాన్ని నిర్మూలించకుండా నిజమైన సామ్య వాదాన్ని ఈ దేశంలో నెలకొల్ప లేము అని ఆయన అభిప్రాయం. ఇది అనుభవంలో నిజమని రుజువయ్యింది కూడా.
మూలంలోకి వెళ్ళి, వేర్లు పట్టుకొని వాటిని పెకలించటానికి ప్రయత్నం చేశాడు కాబట్టే డాక్టర్‌ అంబేడ్కర్ని సాంఘిక విప్లవకారునిగా మనం గుర్తిస్తాము. మౌలికమైన మార్పు దేని ద్వారా సాధ్యమో దానిని ఆయన చెప్పాడు. కాబట్టి సామాజిక విప్లవాన్ని తీసుకురావటానికి ఆయన సంఘర్షించాడు అని చెప్పటం. ఆయన ముందు వచ్చిన వారంతా సమాజంలో మార్పులు చేయాలన్నారు, మరమ్మత్తులు చేయాలన్నారు. ఒకటి తీసి మరొకటి పెట్టాలన్నారు. మెరుగు పరచండి అన్నారు. కాని డాక్టర్‌ అంబేడ్కర్‌ మాత్రం ఈ వ్యవస్థ కుళ్ళి పోయింది, దీనిని సమూలంగా నిర్మూలించండి, అప్పుడు కొత్త సమాజం ఆవిర్భవిస్తుంది అని చెప్పాడు. అందుకే ఆయన ప్రపంచ దేశాలలో సామాజిక విప్లవ కారులలో అగ్రగణ్యుడిగా నిలిచిపోతాడు.
- బొజ్జా తారకం

దేశంలో నెంబర్‌-1 లీకుల కమిషన్‌?


 దేశంలో నెంబర్‌-1 లీకుల కమిషన్‌?

లక్షలాది మంది నిరుద్యోగులు ఏండ్ల తరబడి నగరానికి వచ్చి ఎన్నో ఇబ్బందులు పడుతూ లైబ్రరీలో, కోచింగ్‌ సెంటర్లలో కష్టపడి చదువుతూ లక్షల రూపాయాలు ఖర్చు పెట్టారు. అయితే వీరి పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సింది పోయి నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు టిఎస్‌పిఎస్సీపై నిరుద్యోగులు, విద్యార్ధులు నమ్మకం కోల్పోయారు.

Dalithashakthi - 2025 - Magazines