Saturday, October 5, 2024

Articles

 బుద్ధ ధమ్మం ఒక పరిచయం

బుద్ధ ధమ్మం అంటే గౌతమ బుద్ధుడి బోధనలు, ఆచారాలు, మరియు తత్వశాస్త్రం. బుద్ధుడు జీవితం, బాధ, విముక్తి (నిర్వాణం) పై తన అవగాహనను ధర్మంగా ప్రచారం చేశారు. బాధ గురించి అవగాహన, బాధకు కారణాలు, బాధ నుంచి విముక్తి సాధ్యమని, మరియు విముక్తి మార్గాన్ని సూచిస్తాయి. అష్టాంగిక మార్గం సమ్యక్‌ దష్టి, సమ్యక్‌ సంకల్పం, సమ్యక్‌ వాక్కు, సమ్యక్‌ కర్మ, సమ్యక్‌ ఆజీవం, సమ్యక్‌ వ్యాయామం, సమ్యక్‌ స్మతి, సమ్యక్‌ సమాధి వంటి అంశాలను కలిగివుంటుంది.

అమెరికా చరిత్ర కారుడు, తత్త్వవేత్త మరియు మతాల చరిత్ర గురించి అవగాహన కలిగిన విల్‌ డ్యురాంట్‌ భగవాన్‌ బుద్ధుని గురించి ఇలా పేర్కొన్నారు ''ప్రపంచం పుట్టటం నిజమైతే ప్రపంచం పుట్టిన తర్వాత ఈ నేలపై నడిచిన వారిలో బుద్ధుడు వంటి మహాత్ముడు మరి ఎవరూ లేరు.'' ఆంగ్ల నవలా రచయిత, పాత్రికేయుడు, సామాజిక శాస్త్రవేత్త మరియు చరిత్రకారుడు హెచ్‌.జి.వెల్స్‌ రచించిన 'చరిత్రలో ముగ్గురు మహనీయులు' అనే పుస్తకంలో బుద్ధుని గురించి ఇలా వ్రాశారు : ''మనం బుద్ధునిలో వెలుతురును అన్వేషించే ఒక సుస్పష్ట మానవమూర్తిని, ఒక సరళ ధార్మిక నిష్టా గరిష్టు, ఒక మానవుని చూస్తాం. ఆయన మానవాళికి సార్వజనీనమైన సందేశాన్ని ఇచ్చారు. అత్యంత ఆధునిక భావాలకు అది చాలా వరకూ దగ్గరగా ఉంది. మన జీవితంలో అసంతప్తులు, కష్టాలు, మన స్వార్థం కారణంగానే వచ్చాయనీ ఆయన చెప్పారు. ఒకడు ప్రశాంత చిత్తులు కావాలంటే ముందుగా, తనకోసం, తన ఇంద్రియ సుఖాల కోసం జీవించటం మానేయాలి. క్రీస్తుకు 500 సంవత్సరాలకు ముందే బౌద్ధం మనుషులకు క్షమాగుణం తెలిపింది. ఒక రకంగా చెప్పాలంటే మనకూ, మన కార్యకలాపాలకు ఆయన చాలా దగ్గరగా వస్తారు .క్రీస్తు కంటే కూడా ఆయన సేవలో వ్యక్తి ప్రాముఖ్యాన్ని, వ్యక్తి అమరుడుగా ఉండాలన్న విషయాన్ని స్పష్టంగా దర్శించారు.''

''నేను జైలులో ఉన్నప్పుడు బుద్ధ ప్రతిమను (విగ్రహాన్ని) గుర్తుకు తెచ్చుకొనేవాణ్ణి. నాకు అది ఒకఉత్తేజక మూలం.'' అని భారతదేశ తొలి ప్రధానమంత్రి అని జవహర్‌ లాల్‌ నెహ్రూ అన్నారు. చాలామంది భగవాన్‌ బుద్ధుని ప్రతిమను చూసి మంచి అనుభూతికి లోనవుతారు. ప్రశాంతతను పొందుతారు. మానవ సమాజ నిర్మాణ శాస్త్రజ్ఞుడైన క్లాడ్‌ లెవి స్ట్రాస్‌ (ఈయన బౌద్ధుడు కానేకాడు) ఈ విధంగా చెప్పారు: ''నేను గురువుల వద్ద నేర్చుకున్నది, చదివిన తత్వ శాస్త్రాలు, సమాజం గురించి చేసిన పరిశోధనలనే కాక పాశ్చాత్య ప్రపంచం గర్వంగా చెప్పుకునే సమస్త శాస్త్రాలనూ, చెట్టుకింద కూర్చొని ఈ మహాముని చేసిన ఆలోచనలతో పోలిస్తే అవి చాలా స్వల్పమైనవి.''

భారతదేశాన్ని గురించి చెప్పేటప్పుడు చరిత్రకారులు బౌద్ధం గురించి పూర్తిగా వివరాలు ఇవ్వలేదు. భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా గౌరవించబడటానికి కారణం బౌద్ధం. సామ్రాట్‌ అశోకుడు బౌద్ధ చక్రవర్తి. భారతదేశం యొక్క రాజముద్ర సారనాథ్‌లో ఉన్న నాలుగు ముఖాలు గల సింహస్తూపం, అశోక ధమ్మచక్రం. సత్యమేవ జయతే అని వ్రాసి ఉన్న ముద్ర. మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముద్రను విధికుడు అనే చర్మకారుడు క్రీ.శ.1-2 శతాబ్దాలలో అమరావతి స్తూపంపై దానం చేసిన పూర్ణ ఘట శిలాఫలకం కూడా బౌద్ధ ప్రతీక గలది.

అశోకుడు గొప్ప బౌద్ధ చక్రవర్తి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన చక్రవర్తి. ఈనాడు మనం ఉప యోగిస్తున్న ధర్మం అనే మాట బుద్ధుని ధమ్మ నుండి వచ్చింది. శ్రీకష్ణుడు భగవద్గీత వ్రాసారని చెబుతారు కానీ బుద్ధుడు ధమ్మపదం బోధించారు అని చెప్పరు. శ్రీకష్ణుడు బోధ అంతా బుద్ధుని ధమ్మ పద నుండి తీసుకుని అటూ ఇటూ మార్చి వ్రాసింది. బుద్ధుని జీవిత కథనే రాముడు కథ అంటూ చెప్పారు. ప్రపంచ దేశాలకు బౌద్ధం విస్తరించింది. నేటికీ విస్తరిస్తోంది. ఆత్మ రక్షణ కోసం కుంగ్‌ పూ, జుడో, కరాటే, మార్షల్‌ ఆర్ట్స్‌లను ఆనాడు బౌద్ధ భిక్షువులు నేర్పారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన బౌద్ధ మహా విశ్వ విద్యాలయాలు ఆప్ఘనిస్తాన్‌లోని తక్షశిల, బీహార్‌లోని నలంద, ఒదంతపురి, విక్రమశిల, బంగ్లాదేశ్‌ లోని సోమపుర, బెంగాల్‌లోని జగద్దల, ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జున కొండ, కాశ్మీర్‌లోని శారదా పీఠం, గుజరాత్‌ లోని వలభ, ఉత్తరప్రదేశ్‌లోని వారణాశి/కాశీ, కర్ణాటకలోని మన్యఖేతర, తమిళనాడులోని కంచి, ఒరిస్సాలోని పుష్పగిరి, రత్నగిరి, శ్రీలంకలోని సునేత్రాదేవి పరివెనలు. ఈ విశ్వవిద్యాలయాల ద్వారా నాడు ప్రపంచానికి జ్ఞానం, సద్ధమ్మాన్ని బోధించారు బౌద్ధులు. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ధర్మాసుపత్రులను నిర్మించిన బౌద్ధ చక్రవర్తి అశోకుడు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం అనే భావనను మొట్టమొదటి సారిగా ఆచరించడం ద్వారా ప్రచారం చేసింది గౌతమ బుద్ధుడు, బౌద్ధులు. డా.బి.ఆర్‌ అంబేడ్కర్‌ కూడా ఈ మూడింటినీ భారత రాజ్యాంగంలో పొందు పరిచారు. మనసు గురించి మొట్ట మొదటి సారిగా చెప్పినది తథాగత బుద్ధుడు. ఈ శరీరం మట్టి, నీరు, నిప్పు, వాయువుతో ఏర్పడుతుంది అని ఇవి వేటికవి విడిపోవడాన్నే మరణం అంటారని చెప్పినది బుద్ధుడు.

ధమ్మ చక్ర ప్రవర్తన ఐదుగురు భిక్షువులతో ప్రపంచానికి శాంతి, అహింస, నైతిక జీవన విధానాన్ని అలవరిచినది బుద్ధుడు. ఈ మానవ జీవితంలో దుఖ: నిర్మూలన చేసుకుని సంతప్తికరమైన జీవితాన్ని సాగించ డానికి, పంచశీలాలను, అరియ అష్టాంగ మార్గాన్ని బోధించినది బుద్ధుడు. మధ్యేమార్గాన్ని ప్రవేశ పెట్టి రాగ, ద్వేష, మోహాలను జయించాలని బోధించినది బుద్ధుడు. నెరవేరని కోరికలు వలన దుఖ:ం కలుగుతుంది అని దుఖ్ఖాన్ని గురించి, దుఖ:నిర్మూలన గురించి మొట్టమొదటి సారిగా చెప్పినది బుద్ధుడు. ఉచిత వైద్యం, ఉచితవిద్య బౌద్ధచక్రవర్తులు అందించారు. బౌద్ధ భిక్షువులు అంటే నిజానికి సమాజం కోసం కషి చేసేవారని, కేవలం కాషాయం ధరించి ఒక భవనంలో ఉంటూ తన ధ్యానం, తన ప్రవచనాలను మాత్రమే బోధించడం భిక్షు లక్షణాలు కాదు. భిక్షువులు ప్రజలలోకి వెళ్ళి బౌద్ధాన్ని నిరంతరం ప్రచారం చేయాలి. ఎందుకంటే ప్రజలు దేవుడు, మాయలు అనే భ్రమలో ఉన్నారు వాళ్ళని నిరంతరం ఎడ్యుకేట్‌ చేసే బౌద్ధ భిక్షువులు లేకపోవడం వలన కూడా బౌద్ధం ప్రజలలోకి వెళ్ళడం లేదు.

''బౌద్ధ మతం మతాలన్నింటి లోకి గొప్పది మాత్రమే గాక గొప్ప సాంఘిక సిద్ధాంతము కల్గినది.'' అని డా.బి.ఆర్‌ అంబేడ్కర్‌ అన్నారు. బుద్ధుడు అహింసా సిద్ధాంతాన్ని, పంచసీల ప్రవచనాన్ని మన భారత ఖండం వారికి మాత్రమే కాకుండా ఈ విశాల అనంత విశ్వానికీ, అనంత కాలాలకు అందించారు. నేటి అణ్వస్త్ర కాలంలో సైతం తథాగత బుద్ధ దేవుని అమత ప్రబోధాలు తప్పితే ఇంకేమీ ఈ ప్రపంచంలో శాంతి, సోదరభావాలను నెలకొల్పడానికి ఉపకరించవు. బుద్ధుడు ఈ విశాల విశ్వంలో గల మానవాళికి వెలుగుబాట వేసిన ప్రజ్ఞాననిధి.

మానవునిలో తన మానసిక, శారీరక ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకు బుద్ధుడు తన ధర్మాన్ని ఉపదేశించారు. మానవులలో మానసిక, శారీరక స్థితికి సంబంధించిన సత్యాన్ని సశాస్త్రీయంగా తెలుసుకోవడమే బౌద్ధ ధర్మం యొక్క ధ్యేయం. మనిషి నిరంతరం సాధన చేయడం ద్వారా మాత్రమే బుద్ధుని యొక్క ధర్మం, సత్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం.

బౌద్ధులుగా మారడం అంటే భిక్షువులు అయిపోవాలా? అలా భిక్షువులుగా మారాలని బుద్ధుడు చెప్పలేదు. అలాగే గహాన్ని విడిచిపెట్టి బంధాలను పూర్తిగా వదులుకుని అడవులకు పోవాల్సిన పనిలేదు. మజ్జిమనికాయలో తథాగత బుద్ధుడు ఏం చెప్పారంటే ఒకడు అడవులకువెళ్ళి, సమణ జీవితం గడుపుతూ తన మనసులోని క్లేశాలను (ణవళశ్రీవఎవఅ్‌ర) కలిగి ఉంటాడు. మరొకరు అయితే గహంలో ఉంటూనే నగరంలో రణగొణ ధ్వనులు మధ్య ఉంటూనే సమణుడుగా కాకుండా మామూలు జీవితాన్ని కొనసాగిస్తూ క్లేశాలను వదులుకుని శుద్ధమనస్సుతో వుంటారు. మొదటి వ్యక్తి కంటే రెండో వ్యక్తి గొప్ప అని తథాగత బుద్ధ భగవాన్‌ అన్నారు.

మజ్జిమనికాయ-1 లో వచ్చగత్త అనే ఒక పర్యాటక సమణుడు ఒకసారి భగవాన్‌ బుద్ధునితో ఇలా అడుగుతాడు.''భగవాన్‌ అడవులకు వెళ్ళకుండా నిత్యకత్యాల నుండి విరామం తీసుకోకుండా బుద్ధుని బోధనలను ఆచరణలో పెట్టి నిర్వాణం పొందిన వారు ఎవరైనా ఉన్నారా?'' అందుకు బుద్ధుడు ''ఉన్నారు... ఒకరు కాదు ఇద్దరు కాదు, వందమంది, రెండు వందల మంది కాదు ఐదు వందలు కాదు అనేక మంది గహస్థ జీవితం గడుపుతూ బుద్ధుని బోధనలు విజయవంతంగా ఆచరణలో పెడుతున్నారు. ఉన్నతమైన ఆదర్శ జీవితాన్ని గడుపుతున్న వారు ఉన్నారు. కొందరికి విశ్రాంతి జీవితం అనుకూలంగా ఉండొచ్చు. మరి కొందరికి గహస్థ జీవితం గడుపుతూనే ఉన్నత ఆధ్యాత్మిక స్థితులను పొంద గలిగినప్పుడు భిక్షుసంఘంతో పనేమిటి? అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. భిక్షు సంఘం ఒక ఆదర్శ సంఘం. వీరు తమ విహార జీవితం ద్వారా తాము ఉన్నత స్థితులను చేరడమే గాక గహస్థులకు ఆదర్శంగా ఉండాలి. గహస్థుల సందేహాలను తొలగించాలి. సమాజానికి మార్గనిర్దేశంచేయగలగాలి.

భారతదేశంలో ఉన్న నిరు పేదలకు ఈతిబాధలు ఉన్నాయి. మధ్య తరగతి ప్రజలకు, ప్రైవేటు, కార్పొరేట్‌ రంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ ఒత్తిడి, మానసిక అశాంతి ఎక్కువగా ఉంది. పీడనకు గురైన వాళ్ళందరిలో దుఖఃం ఉంటుంది. నిరుపేదలకు, మధ్య తరగతి ప్రజలకు తమంతట తాముగా అభివద్ధి చెందడానికి అవకాశాలు కానరావడం లేదు. బోధిసత్త్వ అంబేడ్కర్‌ బాటలో బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించి బుద్ధుని బోధనలు మనఃస్ఫూర్తిగా ఆచరించడం మొదలు పెట్టినట్లు అయితే మనలో నెలకొన్న దుఖా:న్ని పారద్రోలి స్వయం అభివద్ధి చెందడానికి అవకాశం ఉంది.

డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ క్రైస్తవం, ఇస్లాం, జైన, సిక్కు, హిందూ మాతాలను చాలా లోతుగా అధ్యయనం చేశారు. ఈ మాతాలను నిరాకరించారు కూడా. కోట్లాది మంది తన అనుయాయులను బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించాలని సలహా ఇచ్చారు. భారతదేశంలో ఉన్న పేద, మధ్య తరగతి ప్రజలకు బౌద్ధం ఎంతగానో మేలు చేయగలదు. మార్క్స్‌ వర్గ పోరాటం, క్రైస్తవం, హిందూ మతం వంటివి పీడిత ప్రజలకు ఎలాంటి మేలు చేయలేవు. ఒక్క బౌద్ధ ధమ్మం మాత్రమే మేలు చేయగలదు.' బుద్ధుడు సమస్త ప్రాణులు కొరకు అమితమైన ప్రేమానురాగాలు అలవరచుకున్నారు. ఆయన ప్రేమకు, కరుణకు, దయకు, సమత భావాలకు అవధులు లేవు. ఒక తల్లి తన బిడ్డను రక్షించుకొనేందుకు తన ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుందో అదేవిధంగా బుద్ధుడు కూడా సకల ప్రాణుల కోసం ఎంత గానో త్యాగం చేశారు. బుద్ధుని ఉప దేశాలు శత్రుత్వం లేకుండా ప్రపంచ మంతటా వ్యాప్తి చెందాయి.' బుద్ధుడు ఈ జీవితంలో ఈ భూమిమీదనే ముక్తి (మోక్షం) పొందడం ఎలా అనేది బోధించారు. మనిషి మరణించిన తరువాత స్వర్గం లేదా పరలోకంలో ముక్తి ఉంటుంది అని నమ్మించలేదు. ప్రపంచ దేశాలన్నింటికీ బౌద్ధం సరణ్యం.

మనిషి పుట్టిన వంశం లేదా కులం (వర్ణం) వలన గొప్ప వాళ్ళు అవుతారు అనేది నిజం కాదు. జన్మను బట్టి గౌరవించడం కాదు. మనిషిలో ఉన్న సుగుణాలను బట్టి గౌరవించాలి. బుద్ధుడు తన శిష్యులు అందరికీ ఇదే చెప్పారు. మీరందరూ సమానమే అని అన్నారు. వశిష్టుడు అనే బ్రాహ్మణునితో బుద్ధుడు ఇలా అన్నారు ''ఉన్నతమైన ఆదర్శాలు ముఖ్యం కాని ఉన్నతమైన కులంలో జన్మించడం కాదు.'' ఈ ప్రపంచంలో మనుషులకు మహత్యాలు, మానవాతీత శక్తులు ఉండవు అని బుద్ధుడు స్పష్టం చేశారు.'' ఎదుటివారు ఎలా ఉన్నారో నీవు అలా ఉండాలని, నీవు ఎలాఉండాలని అనుకుంటున్నావో నీ ఎదుటి వారు కూడా అలా ఉండాలని భావించు'' అని బుద్ధుడు అన్నారు.

''తన ధర్మాన్ని మాత్రమే గౌరవిస్తూ ఇతర ధర్మాలను తూలనాడటం కూడదు. కారణానేకాల వల్ల యితర ధర్మాలను సైతం గౌరవించాలి. ఈవిధంగా ప్రవర్తించే వాడు తన ధర్మాన్ని వికసింపజేసు కోవడం మాత్రమే కాక ఇతరుల ధర్మాలకు సైతం సాయపడతాడు. వేరుగా ప్రవర్తించినవాడు తన ధర్మానికి తానే గోతిని త్రవ్వడమే కాక యితరుల ధర్మాలకూ హాని కల్గిస్తాడు. తన ధర్మాన్ని గౌరవించి యితర ధర్మాలను తూలనాడే వాడు తన ధర్మం పట్ల గల శ్రద్ధాభక్తుల వల్ల అలా చేస్తున్నానని అనుకొంటాడు. ''నేను నా ధర్మానికి పేరు తెస్తాను.'' కానీ ఈ ప్రవర్తన వల్ల అతడు తన ధర్మానికి గొప్పహాని చేసిన వాడవుతాడు. అందువల్ల ఒదిగి ఉండటమే గొప్పది (సమవాయ ఏవ సాధు). అందరూ వినండి! యితరులచే ప్రవచితమైన ధర్మాలను వినడానికి సిద్ధంగా ఉండండి.'' (అశోక శిలా శాసనం, సంఖ్య.12)

హింస చేయవద్దని బౌద్ధం చెబుతోంది. బౌద్ధమతం ఆసియా ఖండ మంతటా వ్యాప్తి చెందింది. ప్రపంచ వ్యాప్తంగా నేడు బౌద్ధం శాంతియుతం గా విస్తరిస్తోంది. చాలామంది నేను హిందువును, నా మతం కోసం, నా ధర్మం కోసం నేను ఇతర మతాలలోని లోపాలను ఎత్తి చూపుతాను అంటూ బూతులు తిడుతూ సోషల్‌ మీడియాలో కనబడుతున్నారు. కొంతమంది అయితే దాడులు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇది సరైన పద్ధతి కానేకాదు. ఇలాంటి మత ఉన్మాదుల వలన వాళ్ళ ధర్మానికి మతానికి ఎక్కువ నష్టం జరుగుతుందని వారికి అర్థం కావడం లేదు. ఇలాంటి వారిని చూసి అంబేడ్కరిస్టులు మరియు బౌద్ధులు అని చెప్పుకొనే కొంతమంది మిడిమిడి జ్ఞానం గలవాళ్ళు నిజానికి వీళ్ళు ఈ సిద్ధాంతాలను ఆచరించడం లేదు. ఏదో సోషల్‌ మీడియాలో వ్రాతలకు పరిమితమైపోతున్నారు. వీళ్ళు అసలు ధర్మం గురించి అధ్యయనం చేయకుండా, అంబేడ్కరిజాన్ని కూడా అర్థం చేసుకో కుండా హిందువులపై పదేపదే విరుచుకుపడుతున్నారు. మరి అంబేడ్కరిజాన్నీ, బౌద్ధాన్ని ఈ దేశంలో లేకుండా చేస్తూ దళితులలో క్రైస్తవ మతం ముసుగులో ఏసుక్రీస్తు ముసుగులో అజ్ఞానాంధకారాన్ని మరియు మూఢనమ్మకాలు చొప్పిస్తుంటే మాత్రం దానిని ప్రశ్నించడం లేదు. కానుకలు పేరుతో పరాన్నభుక్తులు పెరిగిపోతూ సమాజంలో మతం ముసుగులో చేస్తున్న పనులను ప్రశ్నించవద్దని అలా ప్రశ్నిస్తే మనకు వాళ్ళుదూరం అవుతారని అంటున్నారు. ఎవరైనా సహేతుకంగా ప్రశ్నిస్తే దళిత క్రైస్తవ వ్యతిరేకి అంటూ ముద్ర వేస్తున్నారు. అసలు నిజమైన అంబేడ్కరిస్టు క్రైస్తవుడు అసలే కాడు.

బౌద్ధం మనుషులకు మత పిచ్చిని తలకెక్కించి సంకుచిత చట్రాలలో బంధించి ఉంచేది కాదు. అది సత్య ధర్మాల, జ్ఞాన భావాల విప్లవం. అడవిలోని అన్ని జంతువుల పాదముద్రలు ఏనుగు పాదముద్రలో ఇమిడి పోయినట్టు - లోకంలోని అన్ని కుశల ధర్మాలు గౌతమ బుద్ధుని ధమ్మంలో ఇమిడి పోతాయి. ఒకసారి సారిపుత్ర భిక్షువు, గౌతమ బుద్ధుని ప్రశంసించుతూ... భగవాన్‌ మీ అంతటి మహాజ్ఞాని ఈ లోకంలో ఇంతకు ముందు పుట్టలేదు, ప్రస్తుతం లేరు, ఇకపై పుట్టబోరు. అని ఉదానం చేశాడు. ఆ ప్రశంసను గౌతమ బుద్ధుడు ఖండించి... సారిపుత్రా... అలా అనవద్దు. ఈ లోకంలో గొప్ప జ్ఞానులు నాకు పూర్వం ఉన్నారు, నా తర్వాత కూడా పుడతారు అని చెప్పాడు. బౌద్ధం అంటే మానవత్వం. బౌద్ధాన్ని ప్రేమించటమంటే మానవత్వాన్ని ప్రేమించటం. మానవత్వాన్ని ప్రేమించకుండా బౌద్ధాన్ని ప్రేమించటంలో అర్థం లేదు.

మానవత్వాన్ని, నైతిక విలువలను, జీవకారుణ్యాన్ని, సంఘ సమైక్యతను ఎవరు ప్రబోధించినా, ఏ మతం సూచించినా, ఏ సిద్ధాంతం వాటిని ప్రతిపాదించినా వాటి వరకు మనం వాటిని స్వాగతించాలి, గౌరవించాలి. బుద్ధుని కాలం నుండి మత సామరస్యాన్ని పాటించటమనేది బౌద్ధుల సుసాంప్రదాయంలో ఒకటిగా వస్తుంది. మీ మతం మీదే - మా మతం మాదే అంటూ బౌద్ధులు మత వాదులులాగా దడులు (గీరి గిసుకుని) కట్టుకుని జీవించరు. దేశంలో మత విద్వేషాలు పెచ్చరిల్లుతున్న నేటి తరుణంలో పలు మతాల మధ్య సామరస్యం, సహౌదర భావం నెలకొలిపే ఏ చిన్న ప్రయత్నమైనా కుశలమైనదే. అది సమాజానికి శ్రేయోదాయకమైనదే.

మంచిని పెంచు - చెడును త్యజించు

''దేశాధినేత లేక రాజు అతని మంత్రులు అధికార గణం అధర్మ పరులు, అవినీతిపరులు అయినప్పుడు, దేశం మొత్తం అవినీతి మయమై పతనమై దుఖఃలో కూరుకు పోతుంది.'' అని తథాగత గౌతమ బుద్ధుడు హెచ్చరించారు. ఈనాటి సమాజంలో రాజకీయ నాయకులు, ఆ నాయకుల కు అనుచరులుగా ఉన్న చిన్న చిన్న నాయకులు దాదాపుగా అధర్మపరులు, పదవులు కోసం, డబ్బులు కోసం, భూములు, స్థలాలు కోసం, కార్లలో తిరగాలని, ఖరీదైన బట్టలు ధరించాలని, ఖరీదైన భోజనం తినాలని, విలాసవంతమైన జీవితం సాగించాలని, తమ పిల్లలకు ఆస్తులు, పదవులు, ఉద్యోగాలు, వ్యాపారం అప్పజెప్పాలని తాపత్రయంతో 'నీతి' అనే దాన్ని మరచిపోతున్నారు. బుద్ధుని కాలంలో కూడా అధర్మపరులు అయిన పాలకులు ఎక్కువగా ఉండేవారు. ఆ కాలంలో ప్రజలుదోపిడీకి గురయ్యారు. అణచివేత కూడా ఎక్కువగా ఉండేది. శిక్షలు కఠినంగా ఉండేవి. మరణ దండనలు కూడా ఉండేవి. ప్రజలపై పాలకులు ఎక్కువగా పన్నుల భారం వేసి హింసించేవారు. మానవత్వం అనేది లేకుండా రాజరిక పరిపాలన నాడు నడిచింది. ఇలాంటి అమానుషత్వాన్ని చూసి బుద్ధ భగవాన్‌ చలించిపోయారు. బుద్ధుడు సుపరిపాలన కోరుకున్నారు. ఒక దేశం సుఖశాంతులతో విలసిల్లుతూ తుల తూగాలంటే న్యాయబద్ధమైన ప్రభుత్వం ఉండాలి అని బుద్ధ దేవుడు చెప్పారు. ఆయన దశరాజ ధమ్మను ఉప దేశించారు. రాజకీయ నాయకులు, పాలకులు ఈ పది రాజ విధులు ఆచరించాలని సూచించారు.

బౌద్ధంపై మనువాదుల దాడులు, కుట్రలు

మౌర్య సామ్రాజ్యాన్ని పాలించిన చివరి రాజు బహద్రదుడు. ఇతని కాలంలో సేనానిగా ఉన్న పుష్యమిత్ర శుంగుడు అనే బ్రాహ్మణుడు మౌర్య కడపటి రాజు బహద్రదుని హత్య చేసి భారతదేశాన్ని తమ గుప్పిట్లోకి తీసుకోనారంభించారు. పుష్యమిత్ర శుంగుడు కాలం నుంచే భారతదేశంలో మనుస్మతి పాలన మొదలైంది. బౌద్ధులను అత్యంత దారుణంగా హింసించి, హత్యలు చేశారు. బౌద్ధారామాలను కూల గొట్టించారు. సమానత, మానవత, దయ, కరుణ, జ్ఞానం పునాదులు గల బౌద్ధ ధమ్మాన్ని ధ్వంసం చేయాలని శుంగులు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అందుకోసం ఎందరి ప్రాణాలను సైతం తీయడానికి వెనుకాడలేదు. ఒక్కో బౌద్ధ భిక్షువు తలను నరికి తీసుకుని వచ్చిన వారికి 100 బంగారు నాణాలు వెలకట్టి ఇస్తామని ప్రకటించారు. దీంతో 100 బంగారు నాణాలు బహుమతి పొందడానికి ప్రతి ఒక్కరూ బౌద్ధ భిక్షువులను హతమార్చడం వారి తలలు నరికి బంగారు నాణాలు పొందారు. ఈనాడు మనకు దేవుళ్ళ గుళ్ళ ముందు కనిపించే బలిపీఠాలు నాడు బౌద్ధ భిక్షువులు తలలు నరకడానికి ఉపయోగించినవే.

మనల్ని సష్టించిన వాడు దేవుడు అయితే మళ్ళీ ఆ దేవుడు మనల్ని ఎందుకు బలి కోరతాడు? లేదా జంతువులను ఎందుకు బలి ఇవ్వమని అడుగుతాడు? దేవుళ్ళ గుళ్ళు ముందు బలిపీఠాలు ఏంటి? అని మనం ఆలోచన చేయాలి కదా! కానీ మనం ఏ మాత్రం చారిత్రక స్పహ లేకుండా ఉంటున్నాం. ఆనాడు దేవుని విగ్రహాలు ముందు బౌద్ధ భిక్షువులను తీసుకుని వచ్చి తలలు నరకారు. బౌద్ధులను నాడు బ్రాహ్మణీయ శుంగులు అత్యంత దారుణంగా వెంటాడి, వేటాడి మరీ చంపారు. చరిత్రలో అత్యంత దారుణంగా, కిరాతకంగా బౌద్ధ భిక్షులను హింసించి తలలు నరికిన చరిత్ర శుంగులది. శాంతిని కాంక్షించే బౌద్ధ భిక్షువులు శుంగుల దాడి నుండి తట్టుకోలేక ప్రాణాలు కాపాడుకోవడానికి నేపాల్‌, సిలోన్‌ మొదలైన దేశాలకు వలసలు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక శుంగులు చేసేది లేక బౌద్ధ భిక్షువులను తరిమిన తరువాత భిక్షువులు లేరు కాబట్టి దేవునికి బలి ఇవ్వడానికి ఏదోకటి కావాలి కదా అందుకే కొబ్బరి కాయను కొట్టడం ప్రారంభించారు. దీనినే ఒక ఆచారంగా ఇప్పుడు పాటిస్తున్నారు చాలామంది. అసలు విషయం తెలియక ఇదొక ఆచారంగా పాటించడం జరుగుతుంది. బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ తన రచనలో ఈ విధంగా వ్రాశారు 'చాలామంది బౌద్ధ భిక్షువులు పుష్యమిత్ర శుంగుడు అంటే ఈనాటికీ మండిపడతారు. తిట్టడానికి తప్ప మరోరకంగా పుష్యమిత్ర శుంగుని పేరు ఉచ్చరించరాదని చైనా పండితులు వల్ల తెలిసింది అని పేర్కొన్నారు. క్రీ.శ.528లో పంజాబ్‌లోని సియాల్‌ సియాల్‌ కోటగా పిలువబడే సాకాల రాజధానిగా గల ఉత్తర భారతదేశంలో రాజ్యాన్ని పాలించిన వాడు మిహిరకులుడు. ఇతను కూడా బౌద్ధులపై వ్యతిరేకతతో బౌద్ధ స్థూపాలను, ఆరామాలను ధ్వంసం చేయించాడు. హర్ష చక్రవర్తిని మోసం చేసి, హేయమైన పద్ధతిలో హత్య చేసినట్లుగా చెప్పబడుతున్న అతని సోదరుడు శశాంకుడు కూడా బౌద్ధ వ్యతిరేకత ప్రదర్శించాడు. గుప్త వంశానికి చెందిన శశాంకుడు శివభక్తుడు. బౌద్ధాన్ని నాశనం చేయాలని తన శక్తియుక్తులను వినియోగించాడు. సామ్రాట్‌ అశోకుడు బౌద్ధం పట్ల భక్తితో ఆరాధించిన బుద్ధ గయలోని బోధి వక్షాన్ని కూకటి వ్రేళ్ళతో పెకలించి వేశాడు. పాటలీపుత్రంలోని బుద్ధుని పాదముద్రలు గల రాయిని పగుల గొట్టించాడు. బౌద్ధ విద్యాలయాలను నాశనం చేశాడు. భిక్షువులను చెల్లాచెదురుగా చేశాడు. హిమాలయ పర్వతం వరకూ అతను క్రూరమైన పనులు కొనసాగించాడు అని అంబేడ్కర్‌ బుద్ధుడు-కార్ల్‌ మార్క్స్‌ వ్యాసంలో పేర్కొన్నారు. బుద్ధుడి పేరును కూడా ఆఖరికి ఈ మనువాదులు వదలలేదు. మౌర్యుల కాలం తరువాత ''బుద్ధు'' అని బుద్ధుణ్ణి పిలిచారు. ''బుద్ధు'' అంటే తెలివిలేనివాడు అని అర్థంలో ఉప యోగించడం మొదలు పెట్టారు. క్రీ.శ.7వ శతాబ్ధంలో అశోకుడు నిర్మించిన బౌద్ధ గుహలను మనువాద హిందువులు ఆక్రమించారు. బౌద్ధుల కేంద్రం రాజగృహ, దీనిని కూడా ధ్వంసం చేశారు. రాజగృహలో ఉన్న త్రిపీఠకాల శిలాఫలకాలను హిందూ దేవాలయాల నిర్మాణంలో ఉప యోగించు కున్నారు. క్రీ.శ.9 వ శతాబ్ధంలో శంకారాచార్య నాగార్జున కొండ వద్ద గల బౌద్ధ భిక్షువులను హింసించి తరిమి వేయించాడు. అక్కడ గల బౌద్ధ కట్టడాలను ధ్వంసం చేయించాడు. ఆచార్య నాగార్జునుడి మరణం కూడా ఒక కుట్రతో జరిగింది. అతని మరణం తరువాత శ్రీ పర్వతంలో బౌద్ధులకు హిందూ మను వాదులకు తీవ్రమైన ఘర్షణ జరిగింది. చైనా యాత్రికుడు హుయాన్‌ త్సాంగ్‌ వ్రాసిన ''సీయూకీ'' గ్రంథం వలన మనకు ఆనాడు అంతర్జాతీయంగా బౌద్ధానికి విశేషంగా పేరు తెచ్చిన నాగార్జున కొండ గురించి అక్కడి నుండే హిందూ దేవాలయాల నిర్మాణం ఎందుకు జరిగింది అనేది కూడా అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. క్రీ.శ. 7వ శతాబ్ధంలో అమరావతి అనే బౌద్ధుల విహార్‌ను కూడా హిందూ మనువాదులు హిందూ దేవాలయాలు గా మార్చుకున్నారు. హుయాన్‌ త్సాంగ్‌ రచనల వలన అమరావతి బౌద్ధ విహార్‌ అని దానిని క్రీ.శ.9వ శతాబ్ధం లో ధ్వంసం చేసి అమరలింగేశ్వర స్వామి ఆలయంగా మార్చారు అని తెలుస్తుంది. అంతేకాదు పంచారామాలు కూడా బౌద్ధులవే. బౌద్ధుల స్థూపాలపై శైవ ఆలయాలను కట్టారు. పంచారామాలలో మూడు ఆరామాలపైన శైవాలయాలు రెండు అంతస్థులు కలిగి ఉన్నాయి. మొదటి అంతస్థు కింద బౌద్ధస్థూపం ఉంటుంది. ఆ బౌద్ధ స్థూపం మూసివేయబడి రెండవ అంతస్థులో శైవ దేవాలయ నిర్మాణం చేపట్టారు. రాష్ట్ర పురావస్తు శాఖ కూడా 1980లో అమర లింగేశ్వర స్వామి ఆలయం కోసం పునరుద్ధరణ సందర్భంలో దేవాలయ పునాదులలో నుంచి, కప్పుల్లో నుంచి బయల్పడిన బౌద్ధ స్థూపాలు, ప్రశాసనాల ఆధారంతో ఇవి ఒకప్పటి బౌద్ధ స్థూపాలు అని రిపోర్టులో పేర్కొన్నారు. శివుని లింగం ఎక్కడా పొడవుగా ఉండదు.ఈ ఆరామాలలో ఉన్న స్థూపాలనే హిందువులు శివుని లింగం అని చెబుతుంటారు. వాస్తవానికి ఇవి బౌద్ధ స్థూపాలు. బసవపురాణంలో కూడా కాకతీయ రాజులు బౌద్ధులను హింసించినట్లు చెబుతుంది. కాకతీయ రాజు గణపతి దేవుడు అనేక బౌద్ధ ఆరామాలను ధ్వంసం చేయించాడు. ఆంధ్రాలో వీరశైవ మతాన్ని స్థాపించిన మల్లికార్జున పండితుడు కూడా చంరోలు వద్ద బౌద్ధ భిక్షువు చంపించాడు. పల్లి, గుంటుపల్లిలలోని బౌద్ధ క్షేత్రాలు లింగ క్షేత్రాలుగా మార్చేశారు. ఇవే కాదు మహా బలిపురం, బుద్ధ గయ, మధుర దేవాలయాలు, గ్యాలియర్‌, గుజరాత్‌ లోని విమాలాలయం, అజంతా-ఎల్లోరా ,ఆళ్వార్‌, బీహార్‌, మైసూర్‌, కాశ్మీర్‌, ఒరిస్సా వరకూ చాలా బౌద్ధ ఆరామాలు, కట్టడాలు ఉన్నాయి. ఇవన్నీ హిందూ మనువాదులు హిందూ ఆలయాలుగా మార్చేసారు. భారతదేశంలో చాలా ఆలయాలు బౌద్ధ ఆరామాలే. వాటిలో హిందూ దేవుళ్ళవి చెక్కించి పెట్టారు.''భారతదేశ చరిత్ర అంటే బౌద్ధులకు - బ్రాహ్మణులకు మధ్య జరిగిన సంఘర్షణే.'' అని డా.బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ అన్నారు.


- అరియ నాగసేన బోధి
ధమ్మ ప్రచారకులు & న్యాయవాది

No comments:

Post a Comment

Dalithashakthi - 2025 - Magazines