దళిత విద్యావంతుల సాంఘిక బహిష్కరణ
''ఎంత చదివినా సరే, కులం చెప్పిన పని చేయాల్సిందే'' అనే వారి భావ జాలాన్ని అవమానించినట్టుగా భావించి, ఆత్మగౌరవాన్ని అణగదొక్కేందుకు కుట్ర పన్నారు. ఈ సంఘటన కేవలం ఒక గ్రామంలో జరిగిన సంఘటన మాత్రమే కాదు, ఇంకా భారత సమాజంలో దళితులపై కొనసాగుతున్న కులవివక్ష, కులాధిపత్య భావాలు ఏ స్థాయికి చేరుకున్నాయో గుర్తు చేస్తోంది.
వైవిధ్యమైన ప్రపంచంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మనం ఎంత ముందుకు వెళ్లినా, మనుషుల మధ్య ఉన్న కులభేదాలు, కులాధిపత్య భావజాలం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇది మారుమూల పల్లెపురాల్లో మాత్రమే కాదు, మహా నగరాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో కూడా కనిపిస్తున్నది. కులవివక్షకు గురైన సంఘటనలు అందులోని వాస్తవాన్ని తెలియజేస్తున్నాయి.
హైదరాబాద్‌కి కూతపెట్టు దూరంలో ఉన్న మెదక్ జిల్లా, మనోహరాబాద్ మండలంలోని గౌతోజిగూడ గ్రామంలో జరిగిన ఈ ఘటన దళితులపై కొనసాగుతున్న కులవివక్షను మళ్లీ చూపించింది. స్థానిక గ్రామ పెద్దలు డప్పు కొట్టాలని ఆదేశించడం, దళిత యువకులు ఆ పనిని నిరాకరించడం, సాంఘిక బహిష్కరణ జరగడం వంటి సంఘటనలు దళితులపై ఎంత ఘోరమైన దురాగతాలు జరుగుతున్నాయో తెలియజేస్తున్నాయి.
గ్రామంలో జరిగిన ఘటన
ఈ గ్రామంలో నివసిస్తున్న దళిత కుటుంబానికి చెందిన పంచమి శంకరయ్య కుటుంబం గతంలో గ్రామానికి సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో డప్పు కొట్టడాన్ని ఆచరిస్తూ వచ్చేది. శంకరయ్య మరణానంతరం, అతని పెద్ద కొడుకు చంద్రం కొంతకాలం ఈ పని కొనసాగించాడు. కానీ, ఉన్నత చదువులు పూర్తి చేసి, హైదరాబాద్‌లో ఉద్యోగంచేయడం వల్ల, ఆత్మగౌరవంతో పాటు, వత్తి పనుల వల్ల డప్పు కొట్టడం ఆయనకు కష్టంగా మారింది. ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్న శంకరయ్య చిన్న కొడుకు అర్జున్ కూడా, తనను ఈ పని చేయడానికి ఇష్టపడటం లేదని స్పష్టంగా ప్రకటించాడు.
2024 సెప్టెంబర్ మొదటి వారంలో, గ్రామంలోని ఒక వ్యక్తి మరణించాడు. ఈ అంత్యక్రియలకు డప్పు కొట్టమని ఆ కుటుంబాన్ని పిలిచారు. అయితే, వారు ఈ పనిని చేయలేమని చెప్పడంతో, గ్రామ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 10న, గ్రామంలో జరిగిన పంచాయితీ సమావేశంలో పెద్దలు, చంద్రం, అర్జున్ లను ''డప్పు కొట్టకపోతే ఊరిలోంచి బహిష్కరించబడతారు'' అని హెచ్చరించారు.
సాంఘిక బహిష్కరణ
గ్రామ పెద్దలు తమ కులాధిపత్యాన్ని ప్రదర్శిస్తూ, దళిత కుటుంబాన్ని సాంఘికంగా బహిష్కరించారు. ''మీ కుటుంబంతో ఎవ్వరూ మాట్లాడకూడదు, సహాయం చేయకూడదు'' అంటూ తీర్మానం చేశారు. గ్రామంలోని బీసీ, ఎస్సీ కులస్తులు, ఇతర కులాల వ్యక్తులు కూడా ఈ తీర్మానానికి మద్దతు ప్రకటించారు. ఆ కుటుంబంతో ఎవరైనా మాట్లాడితే 25 చెప్పు దెబ్బలు మరియు రూ.5 వేల జరిమానా విధిస్తామని తీర్మానించారు. ఇది కేవలం ఓ కుటుంబాన్ని దూరంగా చేయడమే కాదు, దళితులను కులవివక్షతో అణగదొక్కడానికి చేసిన ప్రయత్నం.
బాధితుల ఫిర్యాదు
ఈ ఘటనను ఎదుర్కొన్న చంద్రం, అర్జున్‌లు తమపై జరిగిన దౌర్జన్యంపై మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. స్థానిక అధికారులు, తహసీల్దార్ చంద్రశేఖర రెడ్డి, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, తూప్రాన్ సీఐ రంగారావు, ఎస్‌ఐ సుభాష్ గౌడ్‌లు గ్రామంలో విచారణ జరిపారు. అయితే, ఈ ఫిర్యాదును అధికారుల తీరు అంత సీరియస్‌గా తీసుకోలేదు. వారు కేవలం పంచాయితీతో సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కౌన్సెలింగ్ పేరుతో బాధితులను సర్దిచెప్పే ప్రయత్నం చేయడం, బహిష్కరణను సీరియస్‌గా తీసుకోకపోవడం దళితుల ఆవేదనను మరింత పెంచింది.
అట్రాసిటీ కేసు నమోదు
విషయం హద్దులు దాటడం తో, చంద్రం, అర్జున్ ఆ కుటుంబంపై జరిగిన అన్యాయాన్ని అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. 18 మంది వ్యక్తులపై కేసు నమోదైంది, ఇందులో గ్రామంలో అధిపత్యం చెలాయించే పెద్దలు మరియు కొందరు ఎస్సీ వ్యక్తులు కూడా ఉన్నారు. కేసు నమోదైనప్పటికీ, నిందితులు ఇప్పటి వరకు పోలీసుల కళ్లుచూపించకుండా పరారీలో ఉన్నారు. ఈ సంఘటనపై జేఎన్టీయూ ఎస్సీ, ఎస్టీ ప్రొఫెసర్ల ఫోరం, హైకోర్టు ఎస్సీ లాయర్ల ఫోరం, కేవీపీఎస్ వంటి ప్రజాసంఘాలు తీవ్రంగాస్పందించాయి. బాధితులకు న్యాయం జరగాలని, నిందితులు శిక్షించబడాలని ఈ సంఘాలు ఉద్యమించాయి. ఆగ్రహంతో ఈ సంఘటనపై పోరాడుతూ, పోలీసులు కేసు విచారణ చేయాలని ఒత్తిడి చేశారు. ఈ సంఘటన కేవలం ఒక గ్రామంలో జరిగిన సంఘటన మాత్రమే కాదు, ఇంకా భారత సమాజంలో దళితులపై కొనసాగుతున్న కులవివక్ష, కులాధిపత్య భావాలు ఏ స్థాయికి చేరుకున్నాయో గుర్తు చేస్తోంది.
ప్రభుత్వం, చట్టాల వైఫల్యం
ఈ సంఘటనలో ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, గ్రామ పెద్దలు చట్టాలు, న్యాయవ్యవస్థ ను పక్కనబెట్టి తమ ఆదేశాలను బలవంతంగా అమలు చేయడమే కాదు, ప్రభుత్వం ఇచ్చిన ఇనాం భూమిని కూడా వాపస్ ఇవ్వాలని కులవివక్షతతో డిమాండ్ చేయడం. ఈ తీర్మానాలను అమలుచేయడంలో చట్టాలు నిర్లక్ష్యంగా మారడం, సమాజంలో కులాధిపత్య భావజాలం ఇంకా కొనసాగుతుందనే సంకేతాలను ఇస్తోంది.
ఈ సంఘటన కులవివక్ష ఇంకా సమాజంలో ముడిపడి ఉందని గుర్తుచేస్తోంది. డప్పు కొట్టడం వంటి పాతకాలపు వెట్టి వత్తిని నిరాకరించినందుకు, ఒక దళిత కుటుంబం సాంఘికంగా బహిష్కరించ బడటమే కాకుండా, వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయడం, సామాజికంగా ఎంత దారుణ స్థితి నెలకొందో తెలుపుతోంది. సామాజిక న్యాయం కోసం, ఇటువంటి సంఘటనలకు బాధ్యత వహించే పెద్దలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని, చట్టాలు కులవివక్షను అరికట్టడంలో మరింత బలంగా ఉండాలని ప్రజా సంఘాలు, న్యాయవ్యవస్థలు చర్చించాల్సిన అవసరం ఉంది.
కులాధిపత్యానికి చెమట పట్టించిన విద్య
గ్రామంలో ఉన్న పెత్తందారులు లేదా గ్రామ పెద్దలు, చంద్రం, అర్జున్‌లు జేఎన్టీయూ వంటి ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఉన్నత విద్య చదివి, హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకోవడం, ఆత్మగౌరవంతో బతుకు తుండడం తమకిష్టం లేకపోవడం ఈ వివక్షకు మౌలిక కారణం. ఆధిపత్య భావజాలంలో, దళితులు కేవలం వెట్టి వత్తులు లేదా తక్కువ స్థాయి పనులకే అనుకూలంగా ఉండాలని పెత్తందారులు భావిస్తారు. విద్యా అభివద్ధి దళితులకు సమాజంలో ఒక కొత్త గుర్తింపునిచ్చింది. ఇది కేవలం ఆ వ్యక్తుల వ్యక్తిగత పురోగతికే పరిమితం కాకుండా, కులవాదానికి ఎదురుదెబ్బ గా మారింది.
చంద్రం, అర్జున్ తమ కుటుంబ సంప్రదాయమైన డప్పు కొట్టడం మానేసి, ఉద్యోగం చేసుకుంటూ ఆత్మగౌరవంతో బ్రతకాలనే సంకల్పం పెట్టుకున్నారు. అయితే, ఇది గ్రామంలోని కులాధిపత్య భావాల పెద్దలకి దురవస్థను తెచ్చింది. ''ఎంత చదివినా సరే, కులం చెప్పిన పని చేయాల్సిందే'' అనే వారి భావ జాలాన్ని అవమానించినట్టుగా భావించి, ఆత్మగౌరవాన్ని అణగదొక్కేందుకు కుట్ర పన్నారు.
కక్షపూరిత చర్య
గ్రామ పెద్దలు డప్పు కొట్టమని ఆదేశించినప్పటికీ, దళిత యువకులు ఆ పనిని తిరస్కరించడం, దీనిపై ఘోషిస్తూ పెత్తందార్లు సాంఘిక బహిష్కరణ విధించడం స్పష్టంగా కనిపిస్తున్న కక్షపూరిత చర్య.పెత్తందార్లు చంద్రం, అర్జున్‌లను ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయడం తమ కులాధిపత్యానికి ఓ సవాల్‌గా భావించారు. ఒకవేళ, వారు తమ నియంత్రణ నుంచి బయటకు పోయారనే భయం కారణంగా, కులాల ఆధిపత్యం నిలుపుకోవడానికి పెద్ద మనుషులు ఈ కుట్ర పన్నారు.
పెత్తందారులు కేవలం సాంఘిక బహిష్కరణకే పరిమితం కాలేదు, వారిని ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో, వారి కుటుంబాన్ని బహిష్కరించడం మాత్రమే కాకుండా, ఇనాం భూమిని తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా అణచివేతకు పూనుకున్న పద్ధతిగా కనిపిస్తోంది. దళితులు ఆర్థికంగా బలపడితే, వాళ్లు ఆత్మగౌరవంతో బ్రతకాలనే ప్రేరణ కలిగిస్తుందని తెలుసుకున్న పెత్తందార్లు, వారి భూములను తీసుకోవాలనే కుట్ర పన్నారు. భూములు కోల్పోతే, వారు మళ్లీ వెట్టి వత్తులకే పరిమితమవు తారని భావించడం వారి ప్రేరణ.
పెత్తందార్లకు నచ్చని దళితుల అభివద్ధి
ఈ ఘటనలో ప్రధానంగా విద్య ద్వారా దళితులు సాధిస్తున్న అభివద్ధి కులపెత్తందార్ల ఆధిపత్యాన్ని గండికొట్టడం. ఈ కారణంగా, వారు ఒక కుట్ర పన్నడం ద్వారా దళిత కుటుంబాన్ని బహిష్కరించడమే కాకుండా, గ్రామంలోని ఇతర కులస్తులపై కూడా ఒత్తిడి పెట్టి, ఆ కుటుంబాన్ని ఏకాకి చేయడం, సామాజికంగా దెబ్బతీయాలని ప్రయత్నించడం జరిగింది. కుల పెత్తందార్లకు ఉన్నత చదువులు సాధించిన దళిత యువకులు తమ ఆధిపత్యానికి భయంకరమైన దాడిగా భావించి, ఇలా కక్షతోవ్యవహరించారు. అధికారులు ఈ ఘటనపై తీవ్రతతో స్పందించక పోవడం, కౌన్సెలింగ్ పేరుతో బాధితులను సర్దిచెప్పడం, ఈ కుట్రలో పెత్తందార్ల ఉనికి ఎంత గాఢంగా ఉందో తెలియజేస్తుంది. ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం, పెత్తందార్లకు ప్రోత్సాహం అందినట్లుగా కనిపిస్తోంది.
ఈ ఘటన దళితులపై కొనసాగుతున్న కులవివక్షను మాత్రమే కాదు, దళితులు విద్యతో, ఆత్మగౌరవం తో బ్రతకడం ఇంకా కులాధిపత్య భావాల వారికి ఇష్టపడటం లేదనే విషయాన్ని తెలియజేస్తుంది. కుల ఆధిపత్యాలను సమాజంలో నిలిపి ఉంచడానికి దళితులను అణగదొక్కేందుకు కుట్రలు పన్నడం జరుగుతూనే ఉంది.
సబ్‌ఎడిటర్, తెలంగాణ
దళితశక్తి మాసపత్రిక

No comments:
Post a Comment